హక్కానీ గ్రూపు నాయకుడు పట్టివేత, అమెరికా అబద్ధాల సీరియల్‌లో మరొక పేజీ


ఆఫ్ఘన్ టెర్రరిస్టు సంస్ధల్లో హక్కానీ గ్రూపుకు అమెరికా అధికంగా భయపడుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్ధాన్‌ను సోవియట్ రష్యా ఆక్రమించుకున్న కాలంలో ఈ గ్రూపును అమెరికా పాకిస్ధాన్ దేశాలు అత్యంత ఇష్టంగా సాకాయి. జలాలుద్దీన్ హక్కానీ నాయకత్వంలొని హక్కానీ గ్రూపుతో పాటు ఆల్-ఖైదాను కూడా అమెరికా పెంచి పోషించింది. రోజులు మారాయి. సోవియట్ రష్యా మొదట ఆర్ధికంగా అనంతరం రాజకీయంగా కూడా కుప్పకూలడంతో అది తన ప్రభావిత ప్రాంతాలనుండి సైన్యాలను ఉపసంహరించుకుంది. రష్యా సైన్యాలు వెళ్ళాక ఆఫ్ఘనిస్ధాన్‌పై నియంత్రణ కోసం ఆఫ్ఘన్ యుద్ధ ప్రభువుల మధ్య భీకరమైన అంతర్యుద్ధం కొనసాగింది. పాకిస్ధాన్ మద్దతుతో తాలిబాన్లు ఆఫ్ఘనిస్ధాన్‌లో జైత్రయాత్ర చేసి ఉత్తరాన ఉన్న కొద్ది ప్రాంతం మినహా ఆఫ్ఘనిస్ధాన్‌పై పట్టు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది.

సోవియట్ రష్యా వెళ్ళిపోతే దాని స్ధానంలో ఆఫ్ఘన్ ను తన ప్రభావిత ప్రాంతంగా చేసుకోవాలన్నది అమెరికా దుష్ట ఎత్తుగడ నెరవేర లేదు. శతాబ్ధాలుగా ఆఫ్ఘన్ ఆక్రమితులను తరిమి కొట్టిన ఆఫ్ఘన్ పష్తూన్లు మెరికాకి తమ దేశంలో చోటివ్వడానికి నిరాకరించారు. దానితో అమెరికా స్వయంగా పెంచి పోషించిన హక్కాని గ్రూపు, ఆల్-ఖైదా, తాలిబాన్ సంస్ధలపైన అమెరికాయే కత్తి గట్టింది. ఇటు దక్షిణాసియా చైనాలనూ, రష్యా ఏలుబడిలో ఉన్న మధ్య ఆసియానూ అటు మధ్య ప్రాచ్యాన్నీ (పశ్చిమాసియా) కూడా పర్యవేక్షించడానికి కీలకమైన వ్యూహాత్కక ప్రాంతంలో ఉన్న ఆఫ్ఘనిస్ధాన్‌ను తన తొత్తు రాజ్యంగా మలుచుకోవాలన్న ఎత్తుగడ బెడిసికొట్టడంతో బలవంతంగానైనా తన కలను సాకారం చేసుకోదలుచుకుంది అమెరికా. జంట టవర్లపై దాడి అనుకూలించగా 18 నెలల వ్యవధిలో రెండు దురాక్రమణ యుద్ధాలకు తెగబడింది అమెరికా.

జంట టవర్లపై దాడుల్లో బిన్ లాడెన్ పాత్ర ఉందనడానికి సాక్ష్యాధారాలు చూపించినట్లయితే అతన్ని అప్పగించడానికి సిద్ధమని తాలిబాన్ చెప్పినప్పటికీ మా బాంబు దాడులు ఆగవంటూ హుంకరించిన అమెరికా ఇప్పుడు తాలిబాన్ తో చర్చలకు సిద్ధం అంటోంది. ఆల్-ఖైదా తమ బద్ద శత్రువనీ ప్రపంచంలో దానిని నామరూపాలు లేకుండా చేయడమే తమ కర్తవ్యమని డంబాలు పలికిన అమెరికా, అదే ఆల్-ఖైదాతో లిబియా అధ్యక్షుడు మౌమ్మర్ గడ్డాఫీ కి వ్యతిరేకంగా స్నేహం కలిపింది. గడ్డాఫీ దేశం వదిలి వెళ్ళాక ఆల్-ఖైదా మిలిటెంట్లతో ప్రభుత్వం ఏర్పరచడంలో అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు బిజిగా ఉన్నాయి. నీతిమాలిన ఈ సోకాల్డ్ అభివృద్ధి చెందిన రాజ్యాలు సంపదల కోసం ఏ గడ్డైనా కరవడానికి సిద్ధమని ఆల్-ఖైదాతో స్నేహం చేయడం ద్వారా నిరూపించుకున్నాయి.

ఆఫ్ఘనిస్ధాన్ ఆక్రమణకు పాకిస్ధాన్ ను భాగస్వామిగా ఎంచుకున్న నాటో రాజ్యాలు అదే పాకిస్ధాన్‌కు హక్కాని, ఆల్-ఖైదా, తాలిబాన్ లతో బొడ్డు పేగు సంబంధాలున్న సంగతిని విస్మరించాయి. నిస్సిగ్గుగా హక్కానీ, తాలిబాన్, ఆల్-ఖైదాలతో పాత సంబంధాలను అమెరికా తెంచుకుని పగ, ద్వేషాలు పెంచుకున్న తేలికగా పాకిస్ధాన్ స్నేహం తెంచుకుని ద్వేషం పెంచుకోలేకపోయింది. ఒక దేశంగా పాకిస్ధాన్‌కు కూడా ప్రయోజనాలున్నా అవి తమ ప్రయోజనాలకు లొంగి ఉండాలన్నది అమెరికా రూలు. దగ్గరి బంధువులైన ఆఫ్ఘన్ మిలిటెంట్లకు అమెరికాతో కలిసి ఆయుధాలు, గూఢచర్య సహాయం తదితర అన్ని రకాల సహాయాలనూ అందించిన పాకిస్ధాన్ అమెరికా మార్చుకున్నంత తేలికగా మిత్రులను శత్రువులుగా మార్చుకోలేక పోయింది. ఫలితంగా అమెరికాకు సాయం చేస్తూనే హక్కానీ, తాలిబాన్ లతో స్నేహబంధం కొనసాగించింది. దక్షిణాసియాలో తన ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికీ, ఇండియా ప్రాబల్యాన్ని అడ్దుకోవడానికీ ఆ బంధాన్ని రిజర్వుడులో పెట్టుకుంది.

ఇది అమెరికాకి నచ్చలేదు. సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా హక్కానీ గ్రూపుకి తాను ఇచ్చిన శిక్షణ ఇపుడు తనపైనే ప్రయోగించబడడంతో హక్కానీని అంతం చేయాలని పాకిస్ధాన్ ని శతపోరుతున్నా సఫలం కాలేకపోతోంది. తనకసలు హక్కానీతో సంబంధాలే లేవు పొమ్మంటోంది. తాము ఇప్పుడు పాక్ లో లేమనీ ఆఫ్ఘన్ లోనే తమకు రక్షణ ఉందనీ హక్కానీ గ్రూపు చేత ప్రకటనకూడా చేయించింది. ఇదిలా ఉండగానే రెండు వారాల క్రితం ఆఫ్ఘనిస్ధాన్ రాజధాని కాబూల్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే హై సెక్యూరిటీ జోన్ లోకి మిలిటెంట్లు జొరబడి అమెరికా ఎంబసీపై రాకెట్ దాడి జరపడంతో అమెరికాకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. మిలిటెంట్ల గెరిల్లా ఎత్తుగడలను తిప్పికొట్టలేని తన చాతకానితనం భరించలేక పాకిస్ధాన్ పైన గుడ్లురిమింది. పాకిస్ధాన్ మిలట్రీ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ సహాయ సహకారాలతోనే హక్కానీ గ్రూపు ఈ దాడి చేయగలిగిందని అమెరికా ఛీఫ్ ఆఫ్ స్టాఫ్స్ మైక్ ముల్లెన్ సెనేట్ కమిటీ ముందు ఆక్రోశించాడు. పర్యవసానంగా పాకిస్ధాన్ కు సహాయాన్ని పూర్తిగా ఆపేయాలని అమెరికా కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టారు.

పాకిస్ధాన్, అమెరికా ఆరోపణలను తిప్పికొట్టింది. అదేపనిగా పాకిస్ధాన్ పై ఆరోపణలు చేస్తే అమెరికా ఓ మిత్రుడిని పోగొట్టుకోవలసి ఉంటుందని పాక్ విదేశాంగ మంత్రి హైనా రబ్బాని సాహసోపేతమైన ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో ఎంత నాటకీయత ఉన్నప్పటికీ అమెరికాకు ఎదురొడ్డి కనీసం ప్రకటన చేయగలగడం సాహసం గానే చెప్పుకోవలసి ఉంటుంది. ఆమాట కొస్తే హక్కానీ గ్రూపుని పెంచి పోషించింది సి.ఐ.ఏ యేకదా కని ఎత్తిపొడిచింది. సి.ఐ.ఎ సరఫరా చేసిన ఆయుధాలతోటే హక్కానీ గ్రూపు బలీయమైన సంగతిని గుర్తు చేసింది. పాక్ ప్రధాని రజా గిలానీ కూడా తన వంతు అమెరికాకి సుతిమెత్తగానే అయినా వడ్డించాడు. ఈ సందర్భంలో ఒక అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది.

సెప్టెంబరు 27 తేదీన అమెరికా ఒక ప్రకటన చేసింది. హక్కాని గ్రూపుకి చెందిన అతి ముఖ్యమైన నాయకుడిని పట్టుకున్నామన్నదే ఆ ప్రకటన. అది కూడా ఆఫ్ఘనిస్ధాన్ గడ్డపైనే అతనిని అరెస్టు చేశామని ప్రకటించింది. హక్కాని గ్రూపు పాకిస్ధాన్ లో తలదాచుకుంటున్నదని చేసిన ప్రచారానికి విరుద్ధంగా ఉంటుందని హక్కానీ నాయకత్వం అతనిని పాక్ నుండి ఆఫ్ఘన్ కు పంపిందని అప్పటికప్పుడు ఒక కధ సృష్టించింది. టెర్రరిస్టు వ్యతిరేక యుద్ధంలో హాజీ మాలి ఖాన్ హక్కాని అరెస్టు ఒక ముఖ్యమైన అడుగు అని గొప్పగా చెప్పుకుంది. జలాలుద్ధీన్ హక్కానికి హాజీ మాలి ఖాన్ స్వయాన కజిన్ సోదరుడని తెలిపింది. హక్కాని గ్రూపుకి ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న జలాలుద్ధీన్ కొడుకు సిరాజుద్ధీన్ హక్కానీకి బాబాయేననీ తెలిపింది. జలాలుద్ధీన్ ఎల్లప్పుదూ హాజీ మాలీ ఖాన్ ను అత్యంత ఉన్నతమైన బాధ్యతలు అప్పజెప్పాడనీ, అత్యంత నమ్మకస్తుడుగా చూసుకున్నాడనీ తెలిపింది. అసలు హక్కానీ గ్రూపు వెనక బ్రెయిన్ అంతా అతనిదేననీ తెలిపింది. అటువంటి ముఖ్యమైన హక్కానీ గ్రూపు నాయకుడిని పట్టుకున్నందుకు అనేక విధాలుగా సంతోషాన్ని వ్యక్తం చేసింది.

హాజీ మాలి ఖాన్ అరెస్టు జరిగిన మూడు రోజుల తర్వాత సెప్టెంబరు 30 తేదీన పాక్, అమెరికాల సంబంధాలు దిగజారుతున్న నేపధ్యంలో ఒబామా రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ తో సంబంధాలపై మాట్లాడాడు. పాక్‌తో సంబంధాలను మరమ్మతు చేసుకునే విధంగా ఆ ప్రకటన ధ్వనించింది. వ్యక్తిగత దౌత్యాన్ని ఒబామా వినియోగించే ప్రయత్నం చేశాడు. మైక్ ముల్లెన్ ఆరోపించినట్లుగా పాకిస్ధాన్ కి నేరుగా హక్కానితో స్నేహ సంబంధాలు ఉన్నాయని తమ ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చుకున్నాడు. హక్కానితో ఐ.ఎస్.ఐకి లింక్ ఉందన్న గూఢచార సమాచారం అంత స్పష్టంగా లేదని తెలిపాడు. పాకిస్ధాన్ లో ఉన్న టెర్రరిస్టుల స్వర్గధామాలపైన నిస్పృహతో కూడిన భావోద్వేగంతో మైక్ ముల్లెన్ ఆ ఆరోపణలు చేశాడని చెప్పుకున్నాడు.

ఐ.ఎస్.ఐ, హక్కానీల సంబంధం తాము భావించిన పద్ధతిలో లేదని రేడియో ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. “అయినప్పటికీ నా వైఖరి ఏమిటంటే, పాకిస్దాన్ కు హక్కానితో చురుకైన సంబంధం ఉన్నా లేకున్నా లేదా తమకు తెలియకుండానే పరోక్షంగానే హక్కానీ కార్యకలాపాలను అనుమతిస్తున్నా, ఆ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత పాక్ దే” అని ముక్తాయించాడు. అంటే మైక్ ముల్లెన్ మర్యాద పూర్తిగా తీయకుండా, అతని ప్రకటనలో ఎంతో కొంత నిజం ఉందన్న అర్ధాన్ని ధ్వనింపజేస్తూ, అదే సమయంలో పాకిస్ధాన్ ఆగ్రహాన్ని తగ్గించేందుకు పాక్ కి హక్కానితో సంబంధాలు లేకుండాకూడా ఉండవచ్చు అన్న అర్ధాన్ని కొద్దిగా అద్దాడు. అదే సమయంలో మిలిటెంట్లను కట్టడి చేయడానికి పాకిస్ధాన్ పై ఒత్తిడి తెస్తూనే ఉంటామని కూడా తెలిపాడు. అది వేరే వ్యవహారం.

అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని ఒబామా దాచి పెట్టాడు. అమెరికా అప్పటికే హక్కానీ గ్రూపు వ్యక్తితో సంబంధాలు కలుపుకున్న విషయాన్ని దాచి పెట్టాడు. ఆయన ఎవరో కాదు, తాము పట్టుకున్నామని అమెరికా ప్రకటించిన హాజీ మాలి ఖాన్. రేడియో ఇంటర్వ్యూకు మూడురోజుల క్రితమే పట్టుకున్నామని చెప్పిన హాజీ మాలి ఖాన్‌ను నిజానికి అమెరికా పట్టుకోలేదనీ, హజీయే స్వయంగా అమెరికా కు లొంగిపోయాడనీ ఈ కధనం ద్వారా స్పష్టమవుతున్నది. హాజీ మాలీ ఖాన్ ను ఇప్పుడు అమెరికా హక్కానీ గ్రూపుతో చర్చలు జరపడానికి వినియోగించాలని చూస్తున్నది. ఇక్కడ అంతుబట్టని విషయం ఒకటుంది. హాజీ మాలీ ఖాన్ అరెస్టు అయ్యే ఏర్పాట్లు పాకిస్ధాన్ పూనుకుని చేసిందా లేక హక్కానీ గ్రూపే అమెరికాతో సంబంధాలు నెలకొల్పుకోవడానికి అతనిని పంపిందా  లేక రెండు అంశాలూ ఇమిడి ఉన్నాయా అన్నదే ఆ విషయం.

బహుశా పై రెండు అవకాశాలు ఉమ్మడిగా పనిచేయడంతోనే హాజీ మాలి ఖాన్ అరెస్టు సాధ్యపడి ఉండవచ్చని దక్షీణాసియా రాజకీయాల స్పెషలిస్టు, మాజీ భారత రాయబారి భద్ర కుమార్ అభిప్రాయపడుతున్నాడు. దాని ఫలితంగానే ఒబామా తన రేడియో ఇంటర్వ్యూలో పాకిస్ధాన్ తో సంబంధాల మెరుగుకోసం పాకిస్ధాన్ అనునయిస్తున్నట్లుగా మాట్లాడాడన్నది సుస్పష్టం. ఐ.ఎస్.ఐ సారధ్యంలో హక్కానీ గ్రూపే తమ ఎంబసీపై దాడులు చేసిందని ఆరోపణలను తీవ్రంగా గుప్పిస్తూ పాకిస్ధాన్ పై అమెరికా తెచ్చిన తీవ్రమైన ఒత్తిడి చివరికి హాజీ మాలి ఖాన్ లొంగుబాటుకు దారితీసిందని ఇక్కడ స్పష్టమవుతున్నది. హక్కానీ గ్రూపుతో సంబంధాలు నెలకొల్పడానికి హాజీ రూపంలో లింకు సంపాదించగలగడంతో అమెరికా శాంతించిందనీ స్పష్టమవుతున్నది. అప్పటివరకూ అత్యంత క్రూరమైన టెర్రరిస్టు సంస్ధగా అమెరికాతో మన్ననలు అందుకున్న హక్కానీ గ్రూపు చర్చలకు తమ మనిషిని పంపడంతోనే స్నేహ పూరిత సంబంధాలు ఏర్పరుచుకోవడానికి తగిన సంస్ధగా మారిపోయింది. ఇదింకా బహిరంగం కాకపోవచ్చు. హాజీ మాలి ఖాన్ ను పట్టుకున్నామని ప్రకటించిన అమెరికా క్రమంగా హాజీ తమకు సహకరిస్తున్నాడనీ అతని సాయంతో హక్కాని గ్రూపుతోనో లేక  (మంచి) తాలిబాన్ తోనో చర్చలు జరుపుతామనో లేదా జరుపుతున్నామనో కొద్ది కాలం తర్వాత అమెరికా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికా, పాక్ ల మధ్య సాగిన ఈ ఆటలో ఫూల్ గా మిగిలినవాళ్ళలో హమీద్ కర్జాయ్ కూడా ఒకరు. అమెరికా, పాకిస్ధాన్ ల మధ్య ప్రకటనల యుద్ధ కొనసాగుతుండగానే హమీద్ కర్జాయ్ ఎన్నడూ లేనిది పాకిస్ధాన్ కి వ్యతిరేకంగా మాట్లాడాడు. తాలిబాన్ తో చర్చలు జరపడం ఇక దండగ వ్యవహారమనీ, మాట్లాడవలసిందీ చర్చలు జరిపవలసిందీ నిజానికి మిలిటెంట్లతో కాదనీ వారి వెనక ఉన్న పాకిస్ధాన్ తోనే ననీ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఈ ప్రకటనను పాకిస్ధాన్ కూడా అంతే ఆగ్రహంతో ఖండించింది. ఇంత వ్యవహారానికి కారణమైన అమెరికా మాత్రం హక్కానీ గ్రూపుతో సంబంధాలను ఫలప్రదం చేసుకునే ప్రయత్నాలలో మునిగిపోయింది.

2 thoughts on “హక్కానీ గ్రూపు నాయకుడు పట్టివేత, అమెరికా అబద్ధాల సీరియల్‌లో మరొక పేజీ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s