రోజుకి రు.32/- లతో కుక్కలు, జంతువులు మాత్రమే బతగ్గలవు


ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఇటీవల సుప్రీం కోర్టుకి దారిద్ర్య రేఖ ప్రమాణాలపై సమర్పించిన అఫిడవిట్ ప్రకంపనలు సృష్టించడం కొనసాగుతోంది. సోనియా గాంధి నేతృత్వంలోని జాతీయ సలహా కమిటీ సభ్యుడు ఎన్.సి.సక్సేనా అహ్లూవాలియా, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని లెక్కించడానికి విధించిన ప్రమాణంపై నిరసనపూరితమైన వ్యాఖ్యలు చేశాడు. “రోజుకి 32 రూపాయల ఆదాయంతో కుక్కలు, జంతువులు మాత్రమే బతగ్గలవని ఆయన ‘మెయిల్ టుడే’ పత్రికతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. “మనిషనేవాడెవ్వడూ రోజుకు రు.32/-తో బతకడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించాడు.

ప్రభుత్వం నుండి ‘ప్రణాళికా సంఘం తన అఫిడవిట్ లో మార్పులు చేయడానికి అవకాశం ఉందని’ సూచనలు అందిస్తున్నట్లుగా ‘ది ఏసియన్ ఏజ్’ పత్రిక తెలిపింది. ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకి సమర్పించిన అఫిడవిట్ లో గ్రామీణ ప్రాంతాలలో రోజుకి రు.25/- పట్టణ ప్రాంతాల్లో రోజుకి రు.32/- కంటె అధిక ఆదాయం ఉన్నట్లయితే వారు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లేనని పేర్కొన్న సంగతి విదితమే. ఈ కొత్త దారిద్ర్య రేఖ ప్రమాణం అత్యంత దారుణంగా ఉందని జాతీయ సలహా కమిటీలో అత్యధికులు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. జాతీయ సలహా కమిటీ సామాజిక విధానాలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది.

“రోజుకి రు.32/- లేదా అంతకంటె తక్కువ మాత్రమే ఖర్చుచేయగలుగుతున్నవారు పేదలలో కెల్లా అత్యంత పేదలు మాత్రమే. వారికి బతకడానికి ఏమీ లేదనే చెప్పాలి. కనీస మానవ జీవనం కంటే తక్కువ స్ధాయి జీవనం గడుపుతున్నవారిగా పరిగణించాలి” అని సక్సేనా పేర్కొన్నాడు.

ప్రముఖ సామాజిక కార్యకర్తలు అరుణా రాయ్, హర్ష్ మందర్ లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుదు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా కు బహిరంగ లేఖ రాస్తూ ఆఫిడవిట్ విశ్వసనీయతపై ప్రశ్నలు సంధించారు. రోజుకు రు.32/- లతో ఒక్కరోజు బతికి చూపించాలని వారు అహ్లూవాలియాకు సవాలు విసిరారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సైతం ప్రణాళికా సంఘం అఫిడవిట్ లో మార్పులు చేయాలని సూచించినట్లుగా వార్తలు వచ్చాయి.

వాస్తవానికి అహ్లూవాలియా సమర్పించిన అఫిడవిట్ లోని ప్రమాణాలు 1977లో రూపొందించినవని మాజి కేంద్ర మంత్రి, ప్రముఖ ఆర్ధికవేత్త వై.కె.అలఘ్ అసలు గుట్టు విప్పాడు. “అప్పట్లో మా కేంద్రీకరన అంతా ప్రజలకు ఆహారం ఇవ్వాలన్నదే. ఇప్పుడు మన ఆకాంక్షలు ఇంకా ఉన్నత స్ధాయిలో ఉన్నాయి. అందుకే టెండూల్కర్ కమిటీ విశ్లేషణపై (పేదల సంఖ్యను నిర్ధారించడానికి రూపొందించిన సూత్రం) ఆధారపడి వేస్తున్న లెక్కలను నేను విమర్శించాను” అని ఆయన పేర్కొన్నాడు.

ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కావాలనీ, వార్షిక ఆర్ధిక వృద్ధి రేటు చైనాను అధిగమించి రెండంకెల వృద్ధి రేటుకు చేరుకోవాలనీ, అగ్రరాజ్యాలతో సమానంగా హోదాను పొందాలని భారత పాలకులు కంటున్న కలలను బహుశా అలఘ్ ప్రస్తావించి ఉండవచ్చు. భారత పాలకులకు సమితిలో శాశ్వత సభ్యత్వం, రెండంకెల జిడిపి వృద్ధి లపై ఉందే శ్రద్ధ, ఆసక్తి, నిబద్ధతలు భారతదేశా సామాన్య మానవుడి జీవన ప్రమాణాలను పెంచడం పైన ఉండదన్నది అహ్లూవాలియా అఫిడవిట్ మరొకసారి రుజువు చేసింది.

మాంటెక్ సింగ్ అహ్లూవాలియా మార్కెట్ శక్తులకు అత్యంత ఇష్టుడు. ముఖ్యంగా అమెరికా పాలకుల ఫేవరెట్ ఆర్ధికవేత్త. రెండోసారి యు.పి.ఎ అధికారంలోకి వచ్చాక ‘కేంద్ర ఆర్ధికమంత్రి పదవికి నియమితుడైన ప్రణబ్ ముఖర్జీ ఎవరనీ, ఎక్కడనుండి వచ్చాడనీ, ఆయన ఆలోచనా విధానం ఏమిటనీ, అసలు అహ్లూవాలియాను ఆర్ధిక మంత్రిగా ఎందుకు నియమించలేదనీ’ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ దూకుడుగా ఎంక్వైరీ చేసిందని వికీలీక్స్ వెల్లడించిన ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా బహిర్గతమయ్యింది.

అటువంటి అహ్లూవాలియా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా భారత ప్రభుత్వం నియమించుకుంది. ఆయన ఆ పదవిలో ఉండడం అంటే భారత దేశ ఆర్ధిక నిర్ణయాలలో అమెరికా ప్రయోజనాలను కాపాడే వ్యక్తి భారత ప్రభుత్వంలో ఉన్నట్లే లెక్క. ఆమాట కొస్తే ప్రధాని మన్మోహన్ సైతం ప్రపంచ బ్యాంకు, ఐ.ఎమ్.ఎఫ్ లకు ముద్దు బిడ్డడు. భారత దేశంలో నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశ, విదేశాల్లో లబ్ద ప్రతిష్టను పొందాడు.

మన్మోహన్, అహ్లూవాలియా, కౌశిక్ బసు, చిదంబరం, కపిల్ సిబాల్, ఆనంద్ శర్మ తదితరులతో కూడిన బృందం స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు అనుకూలమైన విధానాలను రూపొందించడానికి ఎన్నికోబడింది. వీరు నూతన ఆర్ధిక విధానాలలో భాగంగా భారత దేశ ప్రభుత్వరంగ కంపెనీలను అయినకాడికి అమ్మడానికీ, ప్రజలకు అంతో ఇంతో మేలు చేస్తున్న ప్రభుత్వరంగాన్ని నాశనం చేసి, పూర్తిగా ప్రవేటురంగ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికీ కంకణం కట్టుకుని అందుకు చర్యలు తీసుకుంటారు. యు.పి.ఎ ప్రభుత్వం ప్రవేటు కంపెనీలకు, వ్యాపారాలకు, విదేశీ పెట్టుబడులకు అనుకూలమని చెప్పడానికి వీరి విధానాలు దోహదపడతాయి.

మరొకవైపు సోనియా, రాహుల్ గాంధి, రమేష్, ప్రణబ్ తదితరుల నేతృత్వంలో సమాచార హక్కు చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం, ఉపాధి హమీ పధకం మొదలైన పాపులర్ పధకాలను ప్రవేశపెడుతూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వం పేదలకు అనుకూలమనీ, పేదరికం అంతం చేయడానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వమనీ, మన్మోహన్ నేతృత్వంలోని కోటరీ ప్రవేశపెడుతున్న ధనిక అనుకూల విధానాలను తిప్పికొట్టడానికి ఉన్నామని ఒక బిల్డప్ ఇస్తూ ఉంటారు.

“అఫిడవిట్ మార్చమని రాహుల్ గాంధీ కోరాడు” అన్న వార్త వెనుక ఆయన చుట్టూ ఏర్పరుస్తున్న ఇమేజి లో ఒక భాగం. నిజానికి ఆయన అలా కోరాడో లేదో ఎవరికీ తెలియదు. ఆ ప్రకటన వచ్చాక రాహుల్ అందుకు అనుగుణమైన ముఖాన్ని పత్రికలముంది పెడుతుంటాడు. అయితే అటు నూతన ఆర్ధిక విధానాలను గానీ సోనియా, రాహుల్ లకి చెందినవని చెబుతున్న పాపులర్ సంక్షేమ పధకాలను గానీ… రెండింటినీ కేబినెట్ మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తుంటారు. ఏవో కొద్ది చిన్న చిన్న అంశాల్లో విభేధాలు ఉన్నట్లు బైటికి వార్తలు వస్తున్నప్పటికీ ఈ రెండు బృందాలూ మొత్తం కాంగ్రెస్ నాయకుల వ్యూహాత్మక నిర్మాణంలో ఒక భాగంగానే చూడాల్సి ఉంటుంది.

విదేశీ, స్వదేశీ పెట్టుబడుల నుండి అందే కమిషన్ల కోసం, నూతన ఆర్ధిక విధానాలను అనుసరించేవారిగా ముద్రపడిన మంత్రుల బృందం, ఉపయోగపడుతుంది. ఐదేళ్ళకొకసారి వచ్చే ఎన్నికలలో ఓట్లు సంపాదించిపెట్టే నాయకులుగా పాపులర్ పధకాల సమర్ధకులైన సోనియా, రాహుల్, ప్రణబ్ లు వారి విధానాలు ఉపయోగపడతాయి. కాని ఈ రెండు బృందాలూ కాంగ్రెస్ పార్టీలో, యు.పి.ఎ ప్రభుత్వంలో పరస్పరం సహకరించుకుంటూ వ్యవహారాలు చక్కపెడుతుంటారు.

ప్రజలను మోసం చెయ్యడానికి కాంగ్రెస్ అమ్ముల పొదిలో ఇటువంటి అస్త్రాలు ఎన్నో, ఎన్నెన్నో.

One thought on “రోజుకి రు.32/- లతో కుక్కలు, జంతువులు మాత్రమే బతగ్గలవు

  1. మాంటెక్ సింగ్ అహ్లువాలియా పక్కా గ్లోబలైజేషన్‌వాది. దేశం ఏమైపోయినా ఫర్వాలేదు, ప్రజలు ఎలా చచ్చినా ఫర్వాలేదు, సామ్రాజ్యవాదుల మోచేతి నీళ్ళు తాగే ఎలైట్ క్లాస్ వర్గం బతికి ఉంటే చాలు అనుకునే నీచనికృష్టపు మనిషి అతను. పట్టణ ప్రాంతాలలో గుడిసె అద్దె నెలకి 500 రూపాయలు ఉంటుంది. అటువంటప్పుడు నెలకి వెయ్యి రూపాయలు సంపాదించేవాళ్ళు పట్టణ ప్రాంతాలలో ఎలా బతుకుతారు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s