భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -3


పెట్టుబడిదారీ, సోషలిస్టు వ్యవస్ధలలో ప్రజాస్వామ్యం

ఒక వ్యవస్ధలో ప్రజాస్వామ్యం ఉన్నదని ఎలా చెప్పగలం? ప్రజాస్వామ్యం అన్నదానికి నిర్వచనాన్ని పరీక్షించి అందులో వివరించినట్లుగా దాదాపు అన్ని లక్షణాలు సదరు వ్యవస్ధలో ఉన్నట్లయితే, ఆ వ్యవస్ధలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పవచ్చు.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, ఇండియాలలో ప్రజాస్వామ్యం ఉందని చెబుతున్నారు. సొషలిస్టు రష్యాలో గానీ, సొషలిస్టు చైనాలో గానీ అక్కడి ప్రజలకు కూడా తెలియని అంశాలను ప్రస్తావించి ఇదే సోషలిజం అని చెప్పి దీనికంటె అమెరికాలో బాగుంది కదా, అందువలన సోషలిజం కంటే ప్రజాస్వామ్యం మంచిది అని వారు చెబుతుంటారు. రష్యా, చైనాల్లో సోషలిజం ఉన్న కాలంలో ఉత్పత్తి వ్యవస్ధలు ఎలా పని చేసిందీ వీళ్ళు చెప్పరు. పెట్టుబడుల పేరుతో దోచుకునే స్వేచ్ఛ ఉండదనీ, శ్రమ చేయకుండా పారాసైట్లలాగా బతికె స్వేచ్ఛ అక్కడ ఉండదనీ వారు చెప్పరు. వారి స్వేచ్ఛా పిపాస అంతా పెట్టుబడులు పెట్టి కార్మికుల శ్రమపై ఆధారపదే దగుల్బాజీ బతుక్కి స్వేచ్ఛ గురించే. ఏ పౌరుడైనా తనకు తెలిసిన, తోచిన రంగంలో శ్రమ చేస్తుంటే అతని కుంటుంబానికి కావలసిన సమస్త అవసరాలు సమాజం చూస్తుందన్న నిజాన్ని వారు చెప్పరు.

సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని, వనరులనీ చేతుల్లో పెట్టుకున్న కొద్దిమంది కులీన వర్గ ప్రముఖులు ఏ సమాచారం ఎవరికి ఎంత అందాలి అన్న దాన్ని నిర్ణయిస్తున్న రోజుల్లో సమాచార స్వేచ్ఛ ఉందని బొంకుతారు. అందవలసిన సమాచారాన్ని తొక్కిపెట్టి తమకు అనుకూలమైన అబద్ధాలను జనం మీదికి వదిలే సమాచార స్వేచ్ఛ పెట్టుబడిదారీ వ్యవస్ధల్లో పుష్కలంగా ఉంది. ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా యుద్ధాలు చేయడానికి రాయిటర్స్, బిబిస్, న్యూయార్క్ టైమ్స్, టైమ్, స్టార్, ఐ.బి.ఎన్, సి.ఎన్.ఎన్ లాంటి ప్రఖ్యాతి గాంచిన సంస్ధలు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసిందీ కాలక్రమంలో వెల్లడయ్యాయి. అదీ పెట్టుబడిదారీ వ్యవస్ధలోని పత్రికా స్వేచ్ఛ.

ఈ సో కాల్డ్ ప్రజాస్వామ్య దేశాలలోని సామాజిక వ్యవస్ధలను పరిశీలించినట్లయితే మనకు కనపడేది ఏమిటి? అశేష ప్రజానీకం దరిద్రంలో పడి దొర్లుతుంటారు. వారి దరిద్రం అతి కొద్దిమందికి సంపదలను సృష్టించి పెడుతూ ఉంటుంది. అయినా అది స్వేచ్ఛా సమాజంగా కీర్తిని అందుకుంటుంది. ప్రజలకు దరిద్రంలో బతకటానికి స్వేచ్ఛ ఉంది మరి. దానితో పాటు ధనికులకి ఆస్తులను పోగేసుకోవడానికి కూడా స్వేచ్ఛ ఉందన్నది తర్వాత సంగతి.

మహిళలు, కార్మికులు, కూలీలు, కొండొకచో అడుక్కొనేవారు ఇలా తేడాలేకుండా 18 ఏళ్ళు దాటిన అందరికీ ఎన్నికలలో వినియోగించుకోవడానికి ఓటు హక్కు ఉంటుంది. పోలింగ్ బూత్ లో తనకిచ్చిన జాబితాలో తనకు నచ్చినవారికి స్వేచ్ఛగా ఓటు గుద్దే హక్కు అందరికీ ఉంటుంది. దానితో పాటు భారత దేశం లాంటి చోట్ల ఎన్నికల ముందు ఓటర్లకు సారా, మద్యాలను తాపించే గొప్ప స్వేచ్ఛ కూడా పోటీదారులకు ఉంటుంది. బైబిల్, భగవద్గీత లాంటి పుస్తకాలపై ప్రమాణం చేయించి మరీ డబ్బులు పంచే రహస్య స్వేచ్ఛ కూడా ఆ ప్రజాస్వామ్య వ్యవస్ధలలో ఉంటుంది. భారత దేశంలోనైతే డబ్బు, సారాలు, పశ్చిమ దేశాల్లోనైతే ఇతర ప్రలోభాలు, లేదా ప్రలోభాల లెక్కన పని చేసే శుష్క వాగ్దానాలు.

ఇండియాలో చాలా చోట్ల దళితుల ఓట్లను తామే గుద్దుకునే స్వేచ్ఛ పెత్తందారులకు పూర్తిగా ఉంటుంది. పెత్తందారులే ఓట్లు గుద్దుకునే ప్రాంతాలు ఎన్ని ఉన్నా ఆ వార్తలు బైటికి రావు. వస్తే ఘనత వహించిన మన భారత ప్రజాస్వామ్య ప్రతిష్టకు భంగం అని మన పత్రికలకు బాగానే తెలుసు. ఐక్యరాజ్యసమితి దర్బన్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో దళితులు హాజరై భారత దేశంలో కుల వ్యవస్ధ గురించి చెబితే భారత ప్రభుత్వం హర్షించలేక పోయింది. అధికారికంగా దళితుల ప్రాతినిధ్యాన్ని పంపించడానికి నిరాకరించింది. అటువంటి గొప్పది భారత ప్రజాస్వామ్యం.

కార్మికులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. నాలుగేళ్లకో, ఐదేళ్లకో లేదా ఆరేళ్లకో దేశాన్ని బట్టి ఆ హక్కు వచ్చి మనది ప్రజాస్వామ్యమే సుమా అని గుర్తు చేస్తూ ఉంటుంది. కార్మికులు తాము ఉన్న చోటును వదిలిపెట్టకుండా ఉన్నట్లయితే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులలో కూడా ఓటు హక్కు బద్రంగా ఉంటుంది. కాని తాము రోజూ పనిచేసే ఫ్యాక్టరీల్లో, కంపెనీల్లో, సంస్ధల్లో కార్మికులకు నిర్ణయాలు చేసే హక్కు ఉండదు. ఈ మాట ఫ్యాక్టరీల్లో, ఆఫీసుల్లో ఓ సారి అని చూస్తే “లేబర్ వెధవలకి నిర్ణయ హక్కా” అని ఛీదరించుకునే గొంతులెన్నో. అంటే లేబర్ వెధవలకి, గుమాస్తా గాళ్ళకి, కూలీ వాళ్లకి తాముంటున్న ప్రజాస్వామ్య వ్యవస్ధల్లో ఉత్పత్తుల విషయంలో ఎటువంటి నిర్ణయ హక్కూ ఉండదు.

కార్మికుడి చేయి పడకుండా యంత్రం నడవదు. యంత్ర నడవకుండా ఉత్పత్తి రాదు. ఫ్యాక్టరీ వద్ద పెద్ద లాకర్ నిర్మించుకుని అందులో పెట్టుబడిదారుడు తన ఆస్తినంతా డబ్బుగా మార్చుకుని పెట్టి తాళాలు వేయవచ్చు. తన ఆస్తితో పాటు బ్యాంకు దగ్గర తెచ్చిన అప్పుని కూడా తెచ్చి అదే లాకర్ లో పెట్టవచ్చు. లాకర్ కి తాళాలు వేసి ఊరుకుంటే ఫ్యాక్టరీ నుండి ఉత్పత్తి వస్తుందా? పెట్టుబడి, పెట్టుబడిదారుడిదే, కాదనం. పెట్టుబడిని లాకర్ లో పెట్టి ఉంచితే ఫ్యాక్టరీ  నడుస్తుందా? నడవదు. ఒక కార్మికుడు పోతే మరొక కార్మికుడు వస్తాడు అని అతి తెలివికి పోవచ్చు. కాని అది అతితెలివి మాత్రమే. కార్మిక వర్గం అంతా పనికి నిరాకరిస్తే ఉత్పత్తి వస్తుందా? రాదు. తమ డబ్బుని వేతనం కింద కార్మికులకి ఇచ్చి పని చేయించుకుంటే తప్ప ఉత్పత్తి
రాదు. మరి ఉత్పత్తిపైన పెట్టుబడికి ఉండే నిర్ణయాల హక్కు కార్మికుడి శ్రమకి ఎందుకు ఉండదు? ఇది
మౌలిక ప్రశ్న.

పెట్టుబడి లేకుండా ఫ్యాక్టరీ రాదు కదా? అని మరో ప్రశ్న రావచ్చు. వస్తుందన్నదే సమాధానం. ప్రకృతిలో ఉండే వనరులు ఎవరికీ సొంతం కాదు. ప్రభుత్వాలు అక్రమంగా ధనికులకు వనరులను అప్పగించకుండా ఉన్నట్లయితే కార్మిక వర్గం ఆ ప్రకృతి వనరులపై శ్రమ చేసి డబ్బు అవసరం లేకుండానే ఉత్పత్తి చేయగలడు. కాని కార్మికుడు లేకుండా ఒట్టి డబ్బుతో పెట్టుబడి, ఉత్పత్తిని తీయలేరు. కనుక పెట్టుబడి కంటే శ్రామికుడి శ్రమ గొప్పది. నిజానికి కార్మికుడి శ్రమ లేకుండా పెట్టుబడి కూడా పోగుపడదు. కాని ఆ శ్రామికుడికి పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంపదలపైన నిర్ణయ హక్కు ఉండదు. ఏ వ్యవస్ధలోనైనా సకల రకాల ఉత్పత్తులే కీలకం. అటువంటి కీలకమైన ఉత్పత్తులు ఎవరికి ఎంత పంపిణీ కావాలి అన్న అంశంపైన శ్రామికుడికి, ప్రజాస్వామ్యంలో ఉండవలసిన సహజ హక్కు పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఉండదు.

పెట్టుబడిదే ఉత్పత్తిలో కీలకం అని పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు మొత్తం వ్యవస్ధలోని శ్రామికవర్గాలందర్నీ మోసంతో నమ్మించి సమస్త ఉత్పత్తులపైన యాజమాన్య హక్కును పెట్టుబడిదారుడికి దక్కించారు. నిజానికి పెట్టుబడి లేకున్నా ఉత్పత్తి సాధ్యమే కాని శ్రామికుడు లేకుండా ఏ ఉత్పత్తీ ఫ్యాక్టరీ బైటికి రాదు. సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికులు, ఉద్యోగుల చేస్తున్న సమ్మెతో ఒక్క బొగ్గు పెళ్లకూడా లేవనప్పుడు దక్షిణాది మొత్తం కరెంటు కోతలతో అల్లల్లాడుతున్న పరిస్ధితి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. బస్సు నడిపే డ్రైవర్ లేకుండా బస్సులు నడవని స్ధితి చూస్తున్నాం. డిపోలనిండా బస్సులున్నై. కాని డ్రైవింగ్ శ్రమ చేసే వాడు లేకుంటే బస్సు నడవదు. ప్రవేటు బస్సు నడిపినా ప్రవేటు డ్రైవర్ శ్రామికుడు ఉండవలసిందే.

ఇదే విషయం రైతు బాంధవుడికీ వర్తిసుంది. పొలాల్లో పడి దొర్లే మోటు రైతులకు వాళ్ళు కష్టించి తీసిన పంటకు గిట్టుబాటుధర నిర్ణయించుకునే హక్కు ఉండదు. ఒక ఫ్యాక్టరీ స్ధాపించి లేబర్ ని పెట్టుకుని ఉత్పత్తి తీసిన పెట్టుబడిదారుడికి తన ఉత్పత్తికి ధరను నిర్ణయించే అధికారం, హక్కు ఉంటాయి గానీ… దుక్కి దున్ని, చాంతాడంత క్యూల్లో నిలబడి సంపాదించిన ఎరువులు వేసి, పురుగు మందు జల్లి, కలుపు తీసి, నీళ్ళు పట్టి, రాత్రింబవళ్ళు కాపలా కాసి పంట తీసి దేశానికిచ్చే రైతుకి తన పొలంలో తీసిన పంటకు ధర నిర్ణయించుకునే హక్కు లేదు. తాను దుక్కి దున్నడానికి ఖర్చెంతయ్యిందీ, పురుగు మందులు, ఎరువులకు ఎంత ఖర్చు పెట్టిందీ, ఇంటిల్లిపాదీ పొలంపైన పెట్టుకున్న ఆశలు ఏమిటన్నదీ రైతుకి తెలుస్తుంది తప్ప ఆఫీసుల్లో కూర్చున్న అధికారులకి ఎలా తెలుస్తుంది? తెలిసినా ఉపయోగించరు. అయినా సరే. రైతు పంట ధరని అధికారి నిర్ణయిస్తాడు. పెట్టుబడిదారుడి ఉత్పత్తి ధరను మాత్రం పెట్టుబడిదారుడే నిర్ణయిస్తాడు. ఏమిటీ అంతరం? అంతరాల దొంతరల మడతల్లో ఇరుక్కుపోయిన శ్రామిక జీవులకు పెట్టుబడిదారీ వ్యవస్ధలలోని ప్రజాస్వామ్యం ఏ విధంగా దక్కినట్లు?

పెట్టుబడిదారీ వ్యవస్ధలలో కొద్ది మంది ధనిక స్వాములు సమస్త వనరులను, అధికారాలను గుప్పిట్లో పెట్టుకుని వ్యవస్ధను నడిపిస్తుంటే అత్యధిక మెజారిటీ ఉన్న శ్రామికులు శ్రమలు చేస్తూ, శ్రమకు తగిన వేతనం కూడా పొందకుండా ధనికులను మరింత ధనికులను చేస్తున్న పరస్ధితి నెలకొని ఉంది. ఆ పరిస్ధితుల్లో కార్మికులను విముక్తి చేసే పనిని ఇంకెవరో చేపట్టరనీ వారు తమను తాము విముక్తి చేసుకోవలసి ఉంటుందనీ కమ్యూనిస్టు మానిఫెస్టోలో కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంజెల్స్ లు నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పారు.

శ్రమను వెచ్చించడం తప్ప జీవనానికి మరొక తావు లేని కార్మికులు వ్యవస్ధలో అత్యధిక సంఖ్యలో ఉన్నపుడు, వారు పూనుకొని తమను తాము విముక్తం చేసుకోవడానికి సోషలిస్టు విప్లవాన్ని తెచ్చుకున్నపుడు, అంతకంటె ప్రజాస్వామ్యం ఇంకెక్కడ ఉంటుంది? సమాజంలో అత్యధిక మెజారిటీ సంఖ్యలో ఉన్న కార్మికులు సోషలిస్టు విప్లవంలో పాల్గొని పెట్టుబడిదారీ వ్యవస్ధను రద్దు చేసి సోషలిస్టు రష్యాను స్ధాపించుకున్నారు. ఆ విధంగా మెజారిటీ వర్గ ప్రజలు శ్రమించి త్యాగాలు చేసి తెచ్చుకున్న సోషలిజం ప్రజాస్వామిక లక్షణాలను సంతరించుకున్నది కాదా?

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వందమందిలో యాభై ఒక్క మంది కేవలం ఓటేసి గెలిపిస్తేనే అది ప్రజాస్వామ్యం అంటున్నారు. వ్యవస్ధలో వందకి తొంబై మంది కార్మికులు సంవత్సరాల తరబడి శ్రమించి, వందల వేలమంది త్యాగాలు చేసి తెచ్చుకున్న సోషలిస్టు వ్యవస్ధ ప్రజాస్వామిక వ్యవస్ధ కాకుండా మరేది కాగలదు? సోషలిస్టు వ్యవస్ధను తెచ్చుకోవడమే కాక కార్మికులే ప్రతి అంగంలోనూ నిర్ణయాత్మక పాత్రను పోషించారు. పెట్టుబడిదారీ వర్గం ఆధిపత్యం వహించే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పెట్టుబడిదారీ వర్గానికి మాత్రమే ప్రజాస్వామ్యం అమలవుతుంది వారి సంఖ్య నూటికి ఒకరో ఇద్దరో. కార్మిక వర్గం ఆధిపత్యం వహించే సొషలిస్టు ప్రజాస్వామిక వ్యవస్ధలో కార్మికవర్గానికే సమస్త అధికారాలు ఉంటాయి. సోషలిస్టు వ్యవస్ధలోని సమస్త ప్రాధమిక ఉత్పత్తి యూనిట్లలోనూ కార్మికులదే అంతిమ నిర్ణయాధికారం.

ఆ సూత్రం రష్యా, చైనాలలో ఎంతవరకు అమలైతే అంతమేరకూ అవి కార్మికవర్గ ప్రజాస్వామ్య వ్యవస్ధలుగా వెల్లివిరిసాయి. వైరివర్గమయిన పెట్టుబడిదారీ వర్గం నెమ్మదిగా పైచేయి సాధించి వ్యవస్ధను చేతుల్లోకి తీసుకోగలిగిననాడు కార్మికవర్గం అక్కడ ఓటమిని ఎదుర్కొంది. కుట్రలు, హత్యలతో పెట్టుబడిదారీ వర్గం చైనా, రష్యాలను మళ్లీ చేతుల్లోకి తీసుకుని స్వల్పవర్గ ప్రజాస్వామిక వ్యవస్ధలుగా మార్చగలిగాయి. స్వల్పవర్గ ప్రజాస్వామ్యం అంటే మరేం లేదు. స్వల్ప సంఖ్యలో ఉన్న ధనికవర్గాలను పూర్తి స్వేచ్ఛ. అధిక సంఖ్యలో ఉండి తమ శ్రమను అయిన కాడికి అమ్ముకుంటూ బతికే కార్మికవర్గానికి కష్టాలూ కన్నీళ్లూ.

కొద్దిమంది ధనికుల ఇష్టానుసారం నడిచే పెట్టుబడిదారీ వ్యవస్ధలొని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామిక వ్యవస్దా? లేక అత్యధిక సంఖ్యలోని కార్మికులకు పూర్తి స్వేఛ్ఛ కలిగి ఉండి తమ శ్రమ ఫలితంపై తామే నిర్ణయాధికారం కలిగి ఉండే సోషలిస్టు వ్యవస్ధలోని ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యమా?

దోపిడీకి తావులు లేని సోషలిస్టు వ్యవస్ధలో నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లా? లేక సమస్త దరిద్రాలకూ నెలవై, మానవాజాతి సాధించిన సమస్త చెడుగులకూ నిలయమై, మానవజాతి సాధించిన ప్రగతి మొత్తం కేవలం ధనికులకే సొంతమై, ఆశేష శ్రామ్నిక జనం అంతా చాలీ చాలని బతుకులు గడిపే పెట్టుబడిదారీ వ్యవస్ధలో నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లా?

తమ శ్రమ ఫలితానికి చివరికంటా తామే యజమానిగా ఉండే సోషలిస్టు వ్యవస్ధలొ నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లా? కేవలం పెట్టుబడిదారుడు నిర్ణయించే వేతనానికి మాత్రమే తమ శ్రమనంతటినీ అమ్ముకోవలసిన అనివార్య పరిస్ధితిని కార్మికుడు ఎదుర్కొనే పెట్టుబడిదారీ వ్యవస్ధలో నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లా?

తాగుడు, వ్యభిచారం, డబ్బులతో కొన్న ఓట్లతో ప్రజా పతినిధులు నెగ్గి, అసెంబ్లీ, పార్లమెంటుల్లో దోపిడీ సొమ్ము పంపిణీకి వాటాలు కుదరక కొట్టుకు చచ్చే పెట్టుబడిదారీ వ్యవస్ధలో నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుదా? లేక ఉదాత్తమైన కార్మికవర్గ సైద్ధాంతిక వెలుగులో సమాజంలోని ప్రతి ఒక్కరికీ బాధ్యత వహించే రాజ్య వ్యవస్ధ ఉండే సోషలిస్టు వ్యవస్ధలో నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లా?

ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక ప్రజలకు నిజంగా అధికారం ఉన్నదా లేదా అన్నదా? లేక ఐదారు సంవత్సరాలకు వెయ్యి రూపాయల నోటు, మందు బాటిళ్ళు సంపాదించి పెట్టే పార్లమెంటరీ ఓటింగ్ ఉందా లేదా అన్నదా ప్రాతిపదిక?

అశేషజన కార్మిక వర్గం పాలకవర్గంగా ఉండే వ్యవస్ధలొ ప్రజాస్వామ్యం ఉన్నట్లా లేక దోపిడీ దొంగలు పాలకవర్గంగా ఉండే పెట్టుబడిదారీ వ్యవస్ధలో ప్రజా స్వామ్యం ఉన్నట్లా? కొద్దిమంది పెట్టుబడిదారులు పాలకవర్గంగా ఉంటే అది నిజమైన ప్రజాస్వామ్యమా? అశేష శ్రామిక వర్గ జనం పాలకవర్గంగా ఉంటే అది నిజమైన ప్రజాస్వామ్యమా?

కేవలం ఉత్పత్తి శక్తులన్నింటినీ (ఫ్యాక్టరీలు, పొలాలు) జాతీయకరణ చేసినంత మాత్రానే సోషలిజం అవుతుందనీ, జాతీయకరణే సోషలిజం అనీ మార్క్స్, ఎంగెల్స్ లు ఎక్కడా, ఎన్నడూ చెప్పలేదు. జాతీయ కరణ అనేది సోషలిజం లోకి మారడానికి అవసరమైన ఆర్ధిక పునాదులను ఏర్పరుస్తుందని మాత్రమే మార్క్స్, ఏంగెల్సులు “కమ్యూనిస్టు మేనిఫెస్టో”లో చెప్పారు. కార్మిక వర్గానికి స్వేచ్ఛ లేకుండా, సమానత్వం లేకుండా జాతీయకరణ ఒక్కటే సోషలిజం తెస్తుందని వారు చెప్పలేదు. దయారహిత బూర్జువా వర్గ నియంతృత్వ ఆధిపత్యంలొ జాతీయకరించపడిన ఉత్పత్తి, ప్రణాళికా బద్ధ ఆర్ధిక వ్యవస్ధలే సోషలిజం తెస్తాయని వారు చెప్పలేదు. సోషలిజాన్ని వర్గ రహిత వ్యవస్ధగా వారు పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ చాలినంత ఉత్పత్తి, స్వేచ్ఛ, సమానత్వం సోషలిజంలో ఉంటాయని వారు తమ మేనిఫెస్టోలో చెప్పారు. ఇంకా ఖచ్చితంగా మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని కూడా రాజ్యం ఉన్న వ్యవస్ధగానే లెనిన్ పేర్కొన్నాడు. “పాత బూర్జువా వ్యవస్ధ స్ధానంలో, దాని వర్గాలు, వర్గ వైరుధ్యాల స్ధానంలో ఒక అసోసియేషన్ ఏర్పర్చుకుంటాము” అని కారల్ మార్క్స్ “కమ్యూనిస్టు మానిఫెస్టో” లో చెప్పాడు. సోషలిస్టు వ్యవస్ధ అన్నది “ప్రజలందరూ స్వేచ్చగా అభివృద్ధి పొందడానికి, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా అభివృద్ధి చెందడం ఒక షరతుగా ఉండే అసోషియేషన్” అని కారల్ మార్క్స్ వివరించాడు.

కాట్స్కీ పై విమర్శలో లెనిన్ ఇలా అంటాడు “ఉదారవాది సాధారణంగా సహజంగానే ‘ప్రజాస్వామ్యం’ గురించి మాట్లాడతాడు; కాని మార్క్సిస్టు తప్పనిసరిగా ఓ ప్రశ్న వేస్తాడు: ఏ వర్గానికి? అని. ఉదాహరణకి ప్రతి ఒక్కరికీ తెలుసు (చరిత్రకారుడు కాట్స్కీకి కూడా బాగానే తెలుసు) పురాతన కాలంలో బానిసల తిరుగుబాట్లు లేదా అంతకంటే బలవత్తరమైన మార్పులు సైతం ఓ వాస్తవాన్ని విప్పి చూపాయి ‘పురాతనకాలంలోని రాజ్యం అత్యవసరంగా బానిసయజమానుల నియంతృత్వమే’నని. ఈ నియంతృత్వం బానిస యజమానుల మధ్య, బానిసయజమానుల యొక్క ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చేసాయా? ప్రతి ఒక్కరికీ తెలుసు రద్దు చేయలేదని” అని లెనిన్ పేర్కొన్నాడు. “పాత చారిత్రక ఉద్యమాలన్నీ మైనారిటీల ఉద్యమాలే. లేదా మైనారిటీల ప్రయోజనాల కోసం తలెత్తిన ఉద్యమాలే. కార్మికవర్గ ఉద్యమం అనేది అత్యధిక మెజారిటీ ప్రజానీకం స్వచేతనతో, స్వతంత్రతతో అత్యధిక మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం నిర్వహించబడే ఉద్యమం” అని కమ్యూనిస్టు మానిఫెస్టో పేర్కొన్నది. అత్యధిక మెజారిటీ ప్రజలు తమ కోసం తమ ప్రయోజనాల కోసం పోరాడి సాధించుకునే సోషలిస్టు వ్యవస్ధ నిజమైన ప్రజాస్వామిక వ్యవస్ధ కాకుండా ఎలా ఉంటుంది?

అమెరికా, ఇండియా, బ్రిటన్, ఫ్రాన్సుల్లో ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు ప్రజాస్వామిక హక్కులు ఉన్నాయా? ఉత్పత్తిని నియంత్రించే వరకూ చూసినట్లయితే ఆ హక్కులు కేవలం పారాసైట్ల లాంటి ఫ్యాక్తరీల యజమానుల చేతుల్లోనే రిజర్వ్ చేయబడి ఉంటాయి. కాని ఆ యజమానులు ఎప్పుడైనా పొరబాటునైనా కార్మికుడు పని చేసే స్ధలం వద్దకు తొంగిచూడనైనా చూస్తారా? దేశానికి కీలకమైన ఉత్పత్తి స్ధలాలు ఫ్యాక్టరీలు, పొలాల్లో శ్రమ చేసేవాడికి స్వేచ్ఛ లేనపుడు, మరొక విధంగా చెప్పుకుంటే  మెజారిటీ ప్రజలకు స్వేచ్ఛ లేనపుడు అదిక ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?

ఇవన్నీ ఒక వ్యవస్ధ ప్రజాస్వామ్యంగా ఉన్నదా లేదా అని ప్రశ్నించుకున్నపుడు చూడవలసిన అంశాలు.

కనిక పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఉన్నదని చెప్పుకునే ప్రజాస్వామ్యం ఒక వర్గానికే పరిమితమై ఉంది. అది కూడా జనాభాలో అత్యంత తక్కువ మందిగా ఉండే ధనిక (పెట్టుబడిదారీ) వర్గానికి మాత్రమే ఉంది. మెజారిటీ సంఖ్యలో ఉండే అశేష శ్రామికజనానికి అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఉన్నవన్నీ దరిద్రం, రోగాలు, ఆకలి, అర్ధాకలి, కష్టాలు, కన్నీళ్లూ మాత్రమే.

సోషలిస్టు వ్యవస్ధలో కార్మికవర్గమే పాలకవర్గంగా మారుతుంది. శ్రమ చేయకుండా పరుల శ్రమపై ఆధారపడి బతకాలనుకున్నవారికి స్వేచ్ఛ ఇవ్వదు. అంటె పెట్టుబడి తెచ్చి యంత్రాలు కొని ఫ్యాక్టరీ పెట్టి “నేను యజమానిని నాకింద పని చేయడానికి కొంతమంది ఎంత తక్కువ వేతనానికైనా తలవందుకుని పనిచేసే దరిద్రులైన కార్మికులు కావాలి. నేను ఉత్పత్తి తీసి అది అమ్ముకుని మరింత పోగేసుకుంటాను” అంటే వారికి స్వేచ్ఛ ఉండదు. అందుకే సోషలిస్టు వ్యవస్ధలో స్వేచ్ఛ ఉండదు అని పెట్టుబడిదారీ పత్రికలు గావు కేకలు వేసేది. తమ వర్గానికి లేని స్వేచ్ఛను అందరికీ లేని స్వేచ్ఛగా ప్రచారం చేసుకుని కార్మిక వర్గ ప్రజానీకాన్ని కూడా వీరు భయపెడుతుంటారు. కాని వీరు ఎల్లకాలం అందర్నీ నమ్మించలేరు. నిజం బైటికి వస్తుంది. కార్మికవర్గమే తిరుగుబాటు చేయక తప్పని పరిస్ధితులకు పెట్టుబడిదారీ సమాజం నెడుతుంది. ఆ విధంగా తమ సమాదిని తాము ముందుగానే డిజైన్ చేసిపెట్టుకుంటున్నారు. అందులో వారికి సుఖమైన దీర్ఘనిద్ర ఖాయం.

…..(అయిపోయింది)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s