రేమాండ్ ఖైదు, ఒసామా హత్యలతోనే అమెరికా-పాకిస్ధాన్‌ల సావాసం చెడింది -ఒబామా


పాకిస్ధాన్‌కు చెప్పకుండా పాక్ లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా కమెండోలు హత్య చేయడం వల్లనే పాకిస్ధాన్, అమెరికాల సంబంధాలు చెడిపోయాయని ఇప్పటిదాకా బిబిసి, రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్ లాంటి పశ్చిమ కార్పొరేట్ పత్రికలు వాదిస్తూ వచ్చాయి. వాస్తవానికి ఒసామా బిన్ లాడెన్ హత్య కోసం అమెరికా హెలికాప్టర్లు పాక్ గగనతలంలోకి చొరబడడం పాకిస్ధాన్ కు తెలియకుండా జరగదనీ, పాక్, అమెరికాల సంబంధాలు చెడడానికి ఒసామా హత్య కారణం కాదనీ ఈ బ్లాగర్ రెండు మూడు పోస్టులలో వాదించడం జరిగింది. జనవరి నెలలో సి.ఎ.ఐ కాంట్రాక్టర్ రేమాండ్ ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపాక అతనిని అరెస్టు చేయడం వల్లనే పాకిస్ధాన్‌తో అమెరికా గొడవ పెట్టుకుందనీ ఈ బ్లాగర్ వివరించడం జరిగింది.


అదే అంచనాను అధ్యక్షుడు ఒబామా, కాంగ్రెస్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అంశాలు సరైనదిగా స్పష్టం చేస్తున్నాయి. లాడెన్ హత్యతో పాకిస్ధాన్‌లోనే ఒసామా ఉన్నట్లు రుజువైందనీ, పాకిస్ధాన్ లో లాడెన్ ఆశ్రయం పొందడం పట్ల అమెరికా ఆగ్రహంగా ఉందనీ లాడెన్ పాక్ లో ఆశ్రయం తీసుకోవడం వెనుక ఐ.ఎస్.ఐ హస్తం ఉందని అమెరికా ఆరోపించిందనీ దానితో అమెరికా పాక్ ల సంబంధాలు చెడిపోయాయని పశ్చిమ దేశాల పత్రికలు పేర్కొన్నాయి. కాని అది నిజం కాదు. జనవరిలో రేమండ్ డేవిస్ అనే సి.ఐ.ఏ కాంట్రాక్టర్, ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపి దొంగతనానికి వస్తే ఆత్మ రక్షణ కోసం కాల్చానని బొంకాడు. సంఘటనా స్ధలంలోనే డేవిస్ ను ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. విషయం ప్రజల చేతుల్లోకి పోవడంతో పాక్ ప్రభుత్వం డేవిస్ ను వెంటనే విడుదల చేయలేకపోయింది.

ప్రజలను సంతృప్తి పరచడానికి డేవిస్ విషయం కోర్టులు నిర్ణయిస్తాయని పాక్ ప్రభుత్వం ప్రకటించక తప్పలేదు. పోలీసులు డేవిస్‌ను నిర్బంధంలోకి తీసుకుని విచారణ కూడా నిర్వహించడంతో అమెరికా అహం దెబ్బతిన్నది. ప్రపంచంలో దేశాలపై పడి బాంబులతో దాడులు చేసి అక్కడి ప్రజల ప్రాణాలను అత్యంత తేలికగా హరించే అమెరికా దుర్మార్గ పాలకులకు తమ గూఢచారి పాక్ పౌరులను ఇద్దరిని ఉత్తి పుణ్యానికి చంపినా అతనిని అరెస్టు చేయకూడదని డిమాండ్ చేసింది. డేవిస్ కు ఎటువంటి హాని తలపెట్టకుండా రాయబారికి ఇచ్చే మర్యాదలు ఇచ్చి కేసులు రద్దు చేసి అమెరికా పంపాలని అమెరికా డిమాండ్ చేసింది. పాక్ పాలకుల చేతిలోనే విషయం ఉన్నట్లయితే పాక్ ప్రభుత్వమ్ అలానే చేసి ఉండును. కాని ప్రజల్లో అప్పటికే అమెరికా గూడచారులకు (సి.ఐ.ఎ) వ్యతిరేకంగా తీవ్రమైన ఆందోళనలు వ్యాపించాయి. దానితో అనివార్యంగా పాక్ ప్రభుత్వం రేమండ్‌ను కోర్టు విచారణ జరిగేదాకా నిర్బంధంలో ఉంచక తప్పలేదు.

దీనితో అమెరికా తీవ్రంగా ఆగ్రహించింది. పాకిస్ధాన్ పైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. రేమాండ్ కు డిప్లొమేటిక్ ఉద్యోగులకు ఇచ్చే రాయితీని కల్పించి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా పాకిస్ధాన్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయడానికి సాహసించలేదు. దానికి బదులుగా ఒక ఎత్తు వేసింది. చనిపోయిన పాక్ దేశస్ధుల బంధువలను కోర్టుకు రప్పించింది. వారి చేత హంతకుడు రేమండ్ ను క్షమిస్తున్నట్లుగా పత్రాలు తీసుకుని కోర్టుకు దఖలు పరిచింది. ముస్లిం షరియా చట్టాల ప్రకారం నిందుతులకు బాధితులు క్షమా భిక్ష ప్రసాదిస్తే వారిని కోర్టులు విచారణ లేకుండా విడుదల చేయవచ్చు. ఈ నిబంధనను పాకిస్ధాన్ ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. అమెరికా చేత బాధితులకు కొన్ని మిలియన్ల డాలర్ల నష్టపరిహారం ఇప్పించింది. ఆ వెంటనే కోర్టు డేవిస్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

కాని ఆ ప్రకటన బహిరంగం కాలేదు. కోర్టు తీర్పు బహిరంగం కాకముందే పాక్ మిలట్రీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఎవరికీ కనపడకుండా రేమండ్ ను దేశం దాటించింది. దానితో పాటు బాధితుల బంధువులందరికీ అమెరికా పౌరసత్వం కల్పించి రాత్రికి రాత్రి అమెరికా తరలించింది. లేనట్లయితే రాజీ పడినందుకు పాక్ ప్రజలు బంధువులపై దాడి చేస్తారేమోనని అమెరికా పాక్ ప్రభుత్వాలు అనుమానించాయి. ఆ విధంగా ఏ ముస్లిం చట్టాలనైతే అమెరికా మానవ హక్కులను హరిస్తాయంటూ ప్రచారం చేస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చిందో, అవే చట్టాలవలన అమెరికా గూఢచారి పాకిస్ధాన్ కోర్టులో శిక్షపడకుండా తప్పించుకుని సొంతూరికి చేరుకోగలిగాడు.

రేమాండ్ ను నిర్బంధంలోకి తీసుకుని విచారణ కూడా చేయడం అమెరికా అహాన్ని తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఎంతగా నచ్చజెప్పినప్పటికీ ఏడు వారాల పాటు డేవిస్ ను నిర్బంధంలో ఉంచుకోవడాన్ని అమెరికా తప్పు పట్టింది. ఒబామా నివేదిక ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. “డేవిస్ నిర్బంధం అమెరికా పాక్ ల సంబంధాలనూ, పాక్ పౌర ప్రభుత్వాన్ని బలీయం కావడానికి చేస్తున్న ప్రయత్నాలనూ క్షీణింపజేయడానికి కారణమైంది” అని ఒబామా నివేదిక పేర్కొంది. అయితే ఒబామా నివేదిక, డేవిస్ ను పాక్ కు అమెరికా సహాయం అందించే కార్యక్రమానికి కాంట్రాక్టర్ గా ఒబామా పేర్కొన్నప్పటికీ వాస్తవనికి ఆయన సి.ఐ.ఎ గూఢచారి.

రేమండ్ నిర్బంధం పాకిస్ధాన్ పౌర ప్రభుత్వంలోనే అంతర్గతంగా విభేధాలు తలెత్తడానికి కారణమయిందనీ, అమెరికా పాక్ ల మధ్య కూడా సంబంధాలు బలహీనపడ్డాయని ఒబామా నివేదిక పేర్కొన్నది. ఈ నేపధ్యంలోనే అబ్బోత్తాబాద్ దాడిలో లాడెన్ చనిపోయాడని అమెరికా ప్రకటించింది. దాడి విషయం పాకిస్ధాన్ కు తెలియదని అమెరికా ప్రకటించింది. నిజానికి పాక్ కు తెలియకుండా అమెరికా దాడి జరగడం అసంభవం. అంత పెద్ద ఆపరేషన్, కొన్ని గంటలపాటు విస్తరించి ఉన్న ఆపరేషన్ ప్రభుత్వానికి తెలియకుండా జరగదు. కాకుంటే ఆపరేషన్ కు పాక్ అనుమతించిందని ప్రజలు భావించినట్లయితే వారు తమ ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం చెందడం ఖాయం. పాక్ ప్రభుత్వాన్ని ప్రజాగ్రహం నుండి కాపాడడానికే పాక్ కి చెప్పకుండా దాడి చేశామని అమెరికా ప్రకటించింది.

అయితే అబ్బొత్తాబాద్ దాడి ప్రభావం అమెరికా పాకిస్ధాన్ ల సంబంధాలపైన అసలు ప్రభావం చూపలేదా అంటే చూపిందని చెప్పాలి. కాని ఆ ప్రభావం అమెరికాపై పాకిస్ధాన్ ప్రజల ఆగ్రహం పెంచేలా ప్రభావం చూపింది తప్ప మరొక విధంగా కాదు. పశ్చిమ దేశాల పత్రికలు అబ్బొత్తాబాద్ దాడితో ఒసామా బిన్ లాడెన్ పాక్ లోనే ఉండేలా ప్రభుత్వం సహకరించిందని పాక్ ప్రజలకు అర్ధమైందనీ దానితో ప్రజలు పాక్ ప్రభుత్వంపై కోపం పెంచుకున్నారని ప్రచారం చేసాయి. అది నిజంకాదు. ప్రభుత్వానికి తెలియకుండా అమెరికా హెలికాప్టర్లు అబ్బొత్తాబాద్ పై దాడి చేశాయని పాక్ ప్రజలు నమ్మలేదు. పాక్ ప్రభుత్వం వారిని పాక్ గగన తలంలోకి రావడానికి లోపాయకారిగా అనుమతిచ్చాయనే వారు అనుమానించారు. అంటే అమెరికా ఆజ్ఞలకు లొంగి వాటిని పాక్ పాలకులు అమలు చేశారన్నదే పాక్ ప్రజల ఆగ్రహానికి కారణం.

లాడెన్ హత్య ఇరు దేశాల మిలట్రీల మధ్య సహకారానికి నష్టపరిచిందని ఒబామా నివేదిక పేర్కొంది. డేవిస్ అరెస్టు తో తలెత్తిన వ్యతిరేకత నేపధ్యంలో అమెరికా దాడి సంబంధాలను మరింత సంక్లిష్టం కావించిందని ఒబామా నివేదిక పేర్కొన్నది. ఈ రెండు ఘటనల తర్వాత సి.ఐ.ఎ గూఢచారులను మూడింట రెండువంతుల మందిని వెనక్కి వెళ్లిపోవాలని పాక్ మిలట్రీ డిమాండ్ చేసింది. పాక్ మిలట్రీకి నచ్చజెప్పడానికి అమెరికా ప్రయత్నించి విఫలం కావడంతో తొంభైమందికి పైగా సి.ఐ.ఎ గూఢచారులను వెనక్కి పిలిపించుకుంది. మళ్లీ వారిని పాక్ కు రప్పించడానికి అమెరికా మిలట్రీ పెద్దలు ప్రయత్నించినా పాక్ మిలట్రీ ససేమిరా అని చెప్పింది. దీనితో అమెరికా అహం మరొకసాతి తీవ్రంగా దెబ్బతిన్నది. సైనిక శిక్షణ పేరుతో పాక్ లో ఉన్న గూఢచారులు నివాస గృహాల మధ్య కూడ స్ధావరాలు ఏర్పరచుకుని, కొన్ని చోట్ల పాక్ యువతులని వివాహం కూడా చేసుకుని గాఢచర్యం నిర్వహించడంతో పాక్ ప్రజలు వారిని పంపించాలని పెద్ద ఎత్తున ఆందోళలను నిర్వహించారు. దానితో ఆ విషయంలో పాక్ మిలట్రీ నిర్ణయాత్మకంగా వ్యవహరించక తప్పలేదు.

శిక్షణా కార్యక్రమం పేరుతోనే అమెరికా పాక్ కి సయాయం ఇస్తూ వచ్చింది. అది రద్దయింది కనుక పాకిస్ధాన్ కి సహాయం ఇచ్చేది లేదని అమెరికా ప్రకటించింది. పాకిస్ధాన్ మిలట్రీ అమెరికా సహాయంపై చాలా వరకు ఆహారపడి ఉంది. అయినప్పటికీ అమెరికా పాక్ తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటిస్తుండడంతో పాకిస్ధాన్ చైనా, ఇండియాలతో స్నేహ సంబంధాలను అభివృద్ధి చేసుకోవడంలో నిమగ్నమయ్యింది. అమెరికాతో బేరసారాలు పెంచుకోవడానికి వీలుగా చైనాను అదే పనిగా పొగడం ప్రారంభించింది. ఇండియాతో వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి చర్యలను ప్రారంభించింది. అమెరికా దాష్టీకాన్ని పరోక్షంగానైనా ప్రశ్నించేలా పాక్ చర్యలు ఇటీవల కాలంలో ఉంటున్నాయి. ఇది ఒక మేరకు ఆహ్వానించదగ్గ పరిణామమే. కాని అది ఎంతకాలం నిలుస్తుందన్నదే ప్రశ్న. అసలు నిలుస్తుందో లేదో కూడా అనుమానమే. వారి దళారీ స్వభావం అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడగల స్వభావం కాదు. బేరసారాలు చేయగలగడంలో పాక్ పాలకులు చూపిస్తున్న చొరవ పైకి స్వతంత్రతగా కనిపిస్తున్నదని భావించవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s