ఇండియా అణుపరిహార చట్టం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదు -అమెరికా


గత సంవత్సరం భారత పార్లమెంటు ఆమోదించిన “అణు ప్రమాద నష్టపరిహార చట్టం” అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని అమెరికా పెదవి విరిచింది. అంతర్జాతీయ ప్రమాణంగా చెబుతున్న “కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కాంపెన్సేషన్” (సి.ఎస్.సి) కు అనుగుణంగా భారత చట్టం లేదనీ, ఈ విషయంలో ఇండియా తన నిర్ణయాలను స్పష్టం చేయడానికి ఐ.ఎ.ఇ.ఎ ను వేదికగా ఎంచుకోవాలని అమెరికా హిత బోధ చేసింది.

మూడేళ్ళ క్రితం అమెరికా భారత్ ల మధ్య “పౌర అణు ఒప్పందం” కుదిరింది. ఇందిరాగాంధి పాలనలో ఇండియా అణు బాంబు పరీక్ష జరపడంతో పశ్చిమ దేశాలు అణు పరిజ్ఞాన వాణిజ్యానికి సంబంధించి ఇండియాపై ఆంక్షలు విధించాయి. నలభైకి పైగా దేశాలతో కూడిన న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు (ఎన్.ఎస్.జి) ఇండియాకు ఎటువంటి అణు పరిజ్ఞానం అందకుండా నిషేధం విధించాయి. ఫలితంగా ఇండియా అణు రంగంలో దేశీయంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంది. వాడిన యురేనియం, ధోరియం ఇంధనాలను రీసైకిల్ చేయడం ద్వారా తిరిగి వినియోగానికి వీలుగా మార్చే టెక్నాలజీలో సొంత పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంది. రీసైకిలింగ్ టెక్నాలజీలో ఒక విధంగా ప్రపంచంలోనే ఇండియా పురోగతి సాధించిందని చెప్పవచ్చు.

ఈ నేపధ్యంలో సోవియట్ రష్యా కూలిపోవడంతో ఇండియా కూడా అమెరికా పంచన చేరింది. ఐ.ఎ.ఇ.ఎ లో ఇండియా సభ్యురాలు కాదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై (ఎన్.పి.టి) ఇండియా సంతకందారు కాదు. వివిధ దేశాలు తమ రక్షణ కోసం అణు పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవడంలో తప్పు లేదనీ, అందులో ఎన్.ఎస్.జి దేశాల పెత్తనం తగదని ఇండియా చాలా కాలంగా విధాన పరమైన అవగాహన కలిగి ఉంది. దీనితో పశ్చిమ దేశాలతో పాటు, ఎన్.ఎస్.జి దేశాలు అణు పరిజ్ఞానానికి సంబంధించి దూరంగా పెడుతూ వచ్చాయి.

ఈ పరిస్ధితుల్లో 2005 లో అమెరికా ఇండియాలు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా 2008లో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇండియా ఇంతకాలంగా అనుభవిస్తూ వచ్చిన “అణు ఒంటరితనం” నుండి అమెరికా బైటపడేసిందని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు నమ్మబలుకుతూ ఒక ప్రచార కార్యక్రమం చేపట్టాయి. పౌర అణు ఒప్పందం కుదిరడానికి ముందూ, వెనకా జరిగిన అనేక అనుబంధ ఒప్పందాల పర్యవసానంగా ఎన్.ఎస్.జి దేశాలు తాము ఏర్పరుచుకున్న నిబంధనలను ఇండియా విషయంలో సడలించుకోవడానికి అవకాశం కల్పించబడిందని సదరు ప్రచారంలో చెప్పాయి.

ఎన్.పి.టి పైన సంతకం చేయని దేశాలకు అణు సాంకేతిక పరిజ్ఞానం గానీ, అణు పరికరాలు గానీ, అణు ఇంధనంగానీ సరఫరా చేయరాదని ఎన్.ఎస్.జి దేశాలు నిబంధన విధించుకున్నాయి. ఇండియా ఎన్.పి.టిపై సంతకం చేయనందున ఇన్నాళ్లూ ఇండియాను అవి దూరంగా ఉంచాయి. అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదిరాక ఎన్.పి.టి పైన సంతకం చేయకపోయినా ఇండియాతో అణు వ్యాపారాన్ని ఎన్.ఎస్.జి దేశాలు చేయవచ్చని నిర్ణయం తీసుకున్నారు. ఇండియాతో అణు వ్యాపారం వలన అమెరికా, యూరప్ దేశాలు లబ్ధి పొందడం ఖాయం కనుక ఈ సడలింపును ఇతర దేశాలు కూడా ఆమోదం వేశాయి.

ఇక్కడ తమవద్ద మిగిలి పోయిన అణు ఇంధనం, అణు రియాక్టర్లు తదితర అణు పరికరాలను అమ్ముకోవడానికి తగిన మార్కెట్ సృష్టించుకోవడంలో భాగంగానే ఇండియాపై ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేశారు తప్ప ఇండియాను ఉద్ధరించడానికి మాత్రం కాదు. అయితే ఇండియాపై ఎన్.పి.టి నిబంధనను ఎత్తివేస్తున్నందుకో ఏమో తెలియదు కానీ, అణు ప్రమాద పరిహార బిల్లును కూడా ఇండియా ఆమోదించి తీరాలని ఒప్పందంలో నిర్దేశించారు. ఎన్.ఎస్.జి దేశాలు నాసిరకం అణు పరికరాల సరఫరా చేయడం వలన ఇండియాలోని అణు కర్మాగారాలలో అణు ప్రమాదాల జరిగినప్పటికీ అణు కర్మాగారాలను నిర్వహించే ఆపరేటర్ దేశమైన ఇండియాయే నష్టం మొత్తం చెల్లించాలనీ, అణు పరికరాలు సరఫరా చేసిన దేశాలు ఏమీ చెల్లించనవసరం లేదనీ నిబంధన విధిస్తూ “అణు ప్రమాద పరిహార బిల్లుని” భారత పార్లమెంటు ఆమోదించాలని అమెరికా ఆజ్ఞాపించింది.

ఆమేరకు బిల్లు తయారు చేసి పార్లమెంటులో యు.పి.ఎ ప్రభుత్వం గత సంవత్సరం “న్యూక్లియర్ లయబిలిటీ బిల్లు” ప్రవేశ పెట్టింది. సరఫరాదారులపై భారం వేయకుండా పూర్తిగా ఆపరేటర్ దేశాలే నష్టం చెల్లించాలన్న నిబంధనను వామ పక్షాలు, బి.జె.పి తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇందులో ఎన్నికల ప్రయోజనాలే ప్రధానంగా ఉన్నప్పటికీ ప్రజల్లో పరువు కోసం ప్రతిపక్షాలు బిల్లులో సవరణలు చేయాలని ఒత్తిడి తెచ్చాయి. బిల్లు చట్టం కావాలంటే ప్రతిపక్షాల మద్దతు తప్పని సరి. దానితో అణు ప్రమాదం జరిగినట్లయితే సరఫరా కంపెనీలు సైతం నష్ట పరిహారం చెల్లించాలని సవరణలు చేస్తూ చట్టం ఆమోదించారు. సరఫరాదారు చెల్లించవలసిన మొత్తం అత్యంత తక్కువ మొత్తంలో నిర్దేశించారు.

సరఫరాదారు చెల్లించవలసిన నష్టపరిహారం అత్యంత తక్కువ స్ధాయిలో నిర్ధారించినప్పటీకీ ఈ నిబంధన పట్ల అమెరికా తీవ్ర అసంతృప్తితో ఉన్నది. కనీసం అమెరికా కంపెనీల వరకైనా ఈ నిబంధన నుండి మినహాయింపు ఇవ్వాలని కోరింది. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి మందబలం లేకపోవడంతో తనకు తోచిన చట్టం ఆమోదించడానికి వీలు లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో ఇండియా అణు పరిహార చట్టం అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా మార్పులు చేయడానికి ఐ.ఎ.ఇ.ఎ వేదికగా చర్చలు చేపట్టాలని అమెరికా విదేశాంగ శాఖ “ది హిందూ” చేసిన విచారణకు బదులిస్తూ చెప్పింది.

అయితే, అణు ప్రమాద పరిహార మొత్తానికి సంబంధించి గతంలో ఏ దేశం విషయంలోనైనా ఐ.ఎ.ఇ.ఎ వేదికగా నిర్ణయిం తీసుకున్నారా అన్న ప్రశ్నకు అమెరికానుండి సమాధానం రాలేదు. ఒక దేశం చేసిన అణు పరిహార చట్టం సి.ఎస్.సి నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిధీ ఐ.ఎ.ఇ.ఎ నిర్ధారించిన ఉదాహరణ ఉన్నదా అన్న ప్రశ్నకు అమెరికా స్టేట్ డిపార్ట్‌‌మెంట్ మౌనం దాల్చింది. అంటే గతంలో అటువంటి ఉదాహరణ ఏదీ లేదని అర్ధం. ఎలాగైనా ఇండియా చేత ప్రమాద పరిహార భారాన్ని ఎత్తివేయించాలన్న దృష్టితో అమెరిక అప్పటికప్పుడు ఓ కొత్త సూత్రం చెప్పి ఇండియాను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

అమెరికా డెప్యుటి సెక్రటరీ విలియం బర్న్స్ ఈ వారం బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్ లో ఉపన్యాసం ఇస్తూ ఇండియా ప్రమాద పరిహార చట్టం సి.ఎస్.సి నిబంధనలకు లోబడి ఉన్నదా లేదా చర్చించడానికి ఐ.ఎ.ఇ.ఎ సరైన వేదిక అని చెప్పాడు. అంటే ఐ.ఎ.ఇ.ఎ లో ఇండియాను సభ్యత్వం తీసుకోవాలని బర్న్స్ ఒత్తిడి చేస్తున్నాడన్నమాట. కాని ఐ.ఎ.ఇ.ఎ లో సభ్యత్వం తీసుకోవడం అంటె ఐ.ఎ.ఇ.ఎ చేసే అడ్డదిడ్డమైన తనిఖీలను ఇండియా అనుమతించవలసి ఉంటుమ్ది. అది జాతీయ ప్రభుత్వం పైనే పెత్తనం చేస్తుంది. భారత దేశానికి అత్యున్నతమైన చట్ట సంస్ధ పార్లమెంటే “అణు పరిహార బిల్లు”ని ఆమోదించినప్పటికీ అది కూడా ఐ.ఎ.ఇ.ఎ చర్చలకు లోబడి ఉండాలని అమెరికా, పశ్చిమ దేశాలు షరతు విధిస్తున్నాయి. అంటె భారత పార్లమెంటు అణు ప్రమాద పరిహార చట్టం రూపొందించేటప్పుడు భారత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా పరమ దగుల్బాజీ సంస్ధ ఐ.ఎ.ఇ.ఎ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలన్నమాట. అంటే ఇండియాకి ఉన్న నామ మాత్రపు స్వాతంత్ర్యాన్ని కూడా ఇండియా వదులుకోవాలన్నమాట!

ఈ విషయాన్నే విలియం బర్న్స్ గానీ, హిల్లరీ క్లింటన్ గానీ, ఒబామా గానీ పదే పదే ఇండియాకు చెబుతున్నారు. అణు ప్రమాదం జరిగిన తమ కంపెనీలపై నష్టపరిహారం భారం పడకుండా చట్టాని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. భారత పాలకులు ఎలా స్పందించి పౌర అణు ఒప్పందాన్ని ఆచరణలోకి తెస్తారో తెలియవలసి ఉంది.

One thought on “ఇండియా అణుపరిహార చట్టం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదు -అమెరికా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s