కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం, మరిన్ని సెటిల్‌మెంట్ల నిర్మాణానికి ఆమోదం


ఓవైపు ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో పాలస్తీనా దేశ ప్రకటనపై తీవ్రమైన చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా నుండి ఆక్రమించుకున్న భూభాగంలో ఇజ్రాయెల్ దేశస్ధులకు కొత్త సెటిల్‌మెంట్లు నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. అంతర్జాతీయ సమాజాన్ని పరిహసించడం ఇజ్రాయెల్ కు ఇది కొత్త కాదు. ఐక్యరాజ్య సమితితో ఇజ్రాయెల్ వ్యవహారం అంతా మొదటినుండీ జాత్యహంకార పద్ధతుల్లోనే ఉంటూ వచ్చింది. 1967 యుద్ధంలో పాలస్తీనా నుండి ఆక్రమించుకున్న భూభాగంపై ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్లు నిర్మించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అమెరికా నుండి శ్రీలంక వరకూ అన్ని దేశాలు తీర్మానించినప్పటికీ వారందరి తీర్మానాలను గేలి చేస్తూ అప్పటినుండి సెటిల్‌మెంట్ల నిర్మాణాన్నీ, పాలస్తీనియుల ఇళ్ల కూల్చివేతనూ కొనసాగిస్తోంది.

ఐక్యరాజ్య సమితి సమావేశాల నేపధ్యంలో అమెరికా, యూరప్ లు ఇజ్రాయెల్ తాజా ప్రకటనని ఖండించాయి. 1100 కొత్త ఇళ్లను జెరూసలేం లో నిర్మించడానికి ఆమోదం తెలుపుతూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. శాంతి యత్నాలకు భగ్నం అని అమెరికా స్టేట్ సెక్రటరీ హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించగా, ఇజ్రాయెల్ ఆమోదాన్ని రద్దు చేసుకోవాలని ఇ.యు కోరింది. అయితే అమెరికా, యూరప్ ల ప్రకటనలు నామ మాత్రమే తప్ప పాలస్తీనాకు మద్దతు విషయంలోనూ, ఇజ్రాయెల్ చర్యల ఖండన విషయమ్లోనూ అవి తమ ప్రకటనల అర్ధాన్ని అవి ఎన్నడూ ఉద్దేశించవు.

కొత్త ఇళ్ళు తూర్పు జెరూసలేం లోని ‘గిలో’ లో నిర్మిస్తున్నట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది. తూర్పు జెరూసలేం ను పాలస్తీనీయులు భవిష్యత్తులో ఏర్పడబోయే పాలస్తీనా దేశానికి రాజధానిగా ఉండాలని కోరుకుంటుండగా జెరూసలేం విషయంలో తూర్పు, పశ్చిమ అంటూ ఏమీ లేదనీ జేరుసలేం మొత్తం ఇజ్రాయెల్‌కి చెందినదేననీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజెమెన్ నెతన్యాహూ అనేక సార్లు వ్యాఖ్యానించాడు. తూర్పు జెరూసలేంలో ఇప్పటికె అనేక చోట్ల సెటిల్‌మెంట్లు కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్మించింది కూడా. పాలస్తీనా నుండి ఆక్రమించుకున్న ప్రాంతంలో ఇజ్రాయెల్ నిర్మించిన సెటిల్‌మెంట్లలో దాదాపు 5 లక్షలకు పైగా యూదులు నివసిస్తున్నారు. ఈ సెటిల్‌మెంట్లన్నీ పాలస్తీనీయులను తరిమి, వారి ఇళ్లను కూలగొట్టి, ఆ స్ధలంలో నిర్మించినవే.

ఇజ్రాయెల్ అక్రమంగా నిర్మిస్తున్న సెటిల్‌మెంట్ల కారణంగా గత సంవత్సరం నవంబరులో ఇజ్రాయెల్, పాలస్తీనా చర్చలు ముగిసాయి. ఈ నామమాత్రపు చర్చలు జరగాలంటే సెటిల్‌మెంట్ల నిర్మాణాన్ని ఆపాలని వెస్ట్‌బ్యాంక్ అధ్యక్షుడు అబ్బాస్ డిమాండ్ చేసినప్పటికీ ఇజ్రాయెల్ వినిపించుకోలేదు. అమెరికా, యూరప్ లు కూడా సెటిల్‌మెంట్ల నిర్మాణానికి తాము వ్యతిరేకం అని చెప్పినప్పటికీ నిర్మాణాన్ని ఆపడానికి ఏ చర్యలు తిసుకోవు. పైగా సెటిల్‌మెంట్లు పాలస్తీనా శాంతికి భంగకరమని గత సంవత్సరం ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనీయులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. పాలస్తీనా దేశ ప్రకటన కోసం ఐక్యరాజ్యసమితిలో తీర్మానాన్ని పాలస్తీనీయులు రెండు రోజుల క్రితం ప్రవేశపెట్టారు. దీనిపై నిర్ణయాన్ని కూడా అమెరికా వీటో చేస్తానని ప్రకటించింది.

“నమ్మకాన్ని చెడగొట్టేలా ఎటువంటి చర్యలకూ పాల్పడరాదని ఇరుపక్షాలను మేము చాలా కాలంగా కోరుతున్నాం. మరీ ముఖ్యంగా జెరూసలేంలో ఎటువంటి చర్యలు చేపట్టకూడదనీ, లేనట్లయితే ఆ చర్యలు పరస్పరం రెచ్చగొట్టుకోవడానికి దోహదం చేస్తాయనీ చెబుతూ వచ్చాం” అని హిల్లరీ క్లింటన్ ప్రకటించింది. ఇటువంటి ప్రకటనలలో ఇజ్రాయెల్, పాలస్తీనాలను ఒకే గాటన కడుతూ అమెరికా, పాలస్తీనా ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించి జాత్యహంకారాన్ని అమలు చేస్తున్న విషయాన్ని కప్పి పుచ్చడానికి ప్రయత్నించడం సర్వ సాధారణంగా జరుగుతుంటుంది. ఆచరణలోకి వచ్చేసరికి ఇజ్రాయెల్ అణచివేత విధానాలకి పూర్తి మద్దతు ఇస్తుంది.

“ఈ పధకాన్ని రద్దు చేసుకోవాలి. అంగీకరించబడ్డ రెండు రాజ్యాల ఒప్పందాన్ని ఇది పూర్వపక్షం చేస్తుంది. చర్చలు తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నామంటు ఇజ్రాయెల్ చేసే ప్రకటనలకు ఇది విరుద్ధం కూడా” అని ఇ.యు విదేశీ విధాన ఛీఫ్ కేధరిన్ ఏష్టన్, ఇ.యు పార్లమెంటులో ప్రకటించింది. ఇ.యు ప్రకటనల చూడడానికి అమెరికా ప్రకటన కంటె శక్తివంతంగా కనిపించినప్పటికీ అవి ఆచరణ రూపం దాల్చడం జరగదు. తదుపరి తాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ను కలిసినప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా ప్రస్తావిస్తానని ఆమె పేర్కొన్నది. “సెటిల్‌మెంట్ల నిర్మాణం ప్రకటించడం ఆయన అపాలి. మరీ ముఖ్యంగా వాటి నిర్మాణాన్ని ఆపాలి. చర్చల ద్వారా రానున్న పరిష్కారం దరిమిలా తాము ఎలాగూ ఖాళీ చేయవలసిన ప్రాంతాలలో సెటిల్మెంట్లు నిర్మించడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు” అని కేధరిన్ ప్రకటించింది. బ్రిటన్ విదేశాంగ మంత్రి విలియం హేగ్ కూడా ఇజ్రాయెల్ ప్రకటన రద్దు చేసుకోవాలని కోరాడు.

నిర్మాణంలో ఇళ్లతో పాటు ప్రభుత్వ బిల్డింగ్ లు, ఒక పాఠశాల, పారిశ్రామిక ప్రాంతం మున్నగు నిర్మాణాలు జరుగుతాయని ఇజ్రాయెల్ పత్రికలు తెలిపాయి. తాజా ప్రకటనతో కలుపుకుంటే ఇజ్రాయెల్ ఒకక్ గిలో లోనే గత రెండేళ్ళలో ఇప్పటివరకూ మూడు వేల ఇళ్లు నిర్మించినట్లవుతుంది. జెరూసలేం లోపల నిర్మాణాలను సెటిల్ మెంట్లుగా పరిగణించమని ఇజ్రాయెల్ చెబుతుంది. తాము చేసే ప్రతి చెత్త పనికీ ఒక విధానాన్ని జోడించడం ఇజ్రాయెల్ కి అలవాటు. దురాంకార పూరిత ప్రకటనలు, జాత్యహంకార నిర్మాణాలే తమ విధానంగా ఇజ్రాయెల్ పదే పదే ప్రస్తావిస్తుంటుంది.

2 thoughts on “కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం, మరిన్ని సెటిల్‌మెంట్ల నిర్మాణానికి ఆమోదం

 1. మరి ముస్లిం లది జాత్యహంకారం కాదా?
  ఎప్పటి నుంచో యూదులు ఉన్న భుమి లో ప్రజాస్వామ్యం ఉంది
  మరి పలెస్తీనా లో ప్రజాస్వామ్య బద్దం గా ఎప్పుడైనా ఎన్నికలు జరిగాయా ..ఒక్క యుదుడైనా ప్రాణాలతో పలెస్తీనా లో బతికే స్వేచ్చ ఉందా ?
  ఇజ్రాయేలు ది జాత్యహంకారం కాదు వాళ్ళు తమ ప్రాణాలు తాము రక్షించుకొంటున్నరు చుట్టూరా ఉన్న మ్రుగాల లాంటి ఇస్లామీ రాక్షసుల నుండి

 2. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీండి, పాలస్తీనాలో ఎన్నికలు జరగడం పూర్తిగా ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉంది. వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ ఆమోదించిన ‘మహమ్మద్ అబ్బాస్’ అధ్యక్షుడుగా ఉండబట్టి వెస్ట్ బ్యాంక్ పైన ఇజ్రాయెల్ ప్రభుత్వం బహిరంగంగా దాడులు చెయ్యడం లేదు. దీనర్ధం అంతర్గతంగా ప్రపంచానికి తెలియకుండా, వివిధ సాకులతో అనేక రకాలుగా దాడులు చేయడం సర్వసాధారణం అనే.

  గాజాలో హమాస్ పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల్లో నెగ్గింది. అయినా హమాస్ పార్టీని ఇజ్రాయెల్ ఇష్టపడదు గనక (హమాస్ ఇజ్రాయెల్ కు లొంగి ఉండదు కాబట్టి ఇజ్రాయెల్ కి అది తీవ్రవాద సంస్ధగా కనిపిస్తుంది.) దాన్ని అదికారంలోకి రానీయకుండా పెద్ద ఎత్తున దాడులు చేసింది. అబ్బాస్ పైన ఒత్తిడి తెచ్చి గాజా ప్రజలపైనా, హమాస్ పార్టీపైనా దాడులు చేయించింది. అనేక మంది గాజా ప్రభుత్వ అధికారులను తన గూఢచార సంస్ధ మొస్సాద్ చేత చంపించింది. అటువంటి ఇజ్రాయెల్ లొ ప్రజాస్వామ్యం ఉందనడం నిజం కాదు. ఇజ్రాయెల్ లో కూడా పాలస్తీనా అరబ్బులు ఉన్నారు. వారిని అక్కడ రెండో తరగతి పౌరులుగానే చూస్తారని ప్రపంచం ఎరిగిన సత్యం. నేను కాదు, ఐక్యరాజ్యసమితి అలా అని చెబుతూ అనేక నివేదికలు వెలువరించింది.

  గాజా ప్రజలు తమకు నచ్చని హమాస్ ని ఎన్నుకున్నారని కక్ష గట్టి ఇజ్రాయెల్ అప్పటినుండి (2006) గాజాని దిగ్బంధం చేసింది. అక్కడికి నిత్యావసర వస్తువులు సైతం చేరకుండా హింస పెడుతోంది. అమెరికా మద్దతును అడ్డుపెట్టుకుని ప్రపంచంలో అమెరికా ఎలా ఐతే రౌడీయిజం చేస్తుందో, ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో అలా రౌడియిజం చేస్తోంది. గాజా ప్రజలని ఆర్ధికంగా, బౌతికంగా దిగ్బంధం చేస్తే వాళ్ళు తమ తప్పు తెలుసుకుని హమాస్ ని దూరం చేసుకుంటారన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దిగ్బంధం చేసింది. ఇది నేను కనిపెట్టింది కాదు. ఇజ్రాయెల్ స్వయంగా ఈ మేరకు అంగీకరించిన డాక్యుమెంట్ల వెల్లడి కావడంతో లోకానికి తెలిసిన సత్యం.

  పాలస్తీనాలో యూదులు బ్రతికే స్వేచ్ఛ లేకపోవడం అన్నది వాస్తవాలు తెలియకుండా ఏర్పరుచుకున్న అభిప్రాయం. పేరుకు వెస్ట్ బ్యాంకుకి అబ్బాస్ అధ్యక్షుడైనా అది మొత్తం ఇజ్రాయెల్ సైన్యం కంట్రోల్ లోనే ఉంటుంది. అక్కడ ఎన్నికలు జరగాలా వద్దా అన్నది ఇజ్రాయెల్ నిర్ణయిస్తుంది తప్ప నామ మాత్రపు పాలస్తీనా ప్రభుత్వం కాదు. కనుక అక్కడ ఎన్నికలు జరగనందుకు పాలస్తీనా ను నిందించి లాభం లేదు. ముస్లింల పైన గుడ్డి ద్వేషంతో పాలస్తీనాపై కొందరు చెప్పే అబద్ధాలను నమ్మడానికి బదులు మీరు మరిన్ని వాస్తవాలు తెలుసుకోగలిగితే ఎన్నికలు జరగకపోవడానికి మీరు పాలస్తీనాను నిందించలేరు.

  అసలు పాలస్తీనా అన్నది ఇప్పుడు ఒక దేశంగా లేనేలేదని మీకు తెలిసినట్లులేదు. ఒక దేశంగా గుర్తించమని రెండు మూడురోజుల క్రితం అబ్బాస్ ఐక్యరాజ్యసమితి ని కోరాడు. పాలస్తీనాను దేశంగా గుర్తించడానికి ప్రపంచం అంతా సిద్దంగా ఉంది. ఒక్క అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తప్ప. పాలస్తీనా ఎక్కడ దేశంగా గుర్తింపబడుతుందోనన్న భయంతో సమితి నిర్ణయాన్ని వీటో చేస్తానని అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించాడు కూడా. మీరు ఈ సంగతిని గమనించారా?

  ఇజ్రాయెల్ లో నివసిస్తున్నవారందరికీ హక్కులు ఉంటెనే ప్రజాస్వామ్యం ఉన్నట్లు లెక్క. యూదులకు అన్ని హక్కులు కల్పిస్తూ, పాలస్తీనా అరబ్బులకు హక్కులన్నింటిని నిరాకరిస్తూ రెండో రకం పౌరులుగా చూస్తున్నపుడు అది ప్రజా స్వామ్యం ఎలా అవుతుంది మూర్తిగారూ? ఇజ్రాయెల్ లో యూదులు ఉపయోగించే రోడ్లను పాలస్తీనా అరబ్బులు వాడకూడదు. యూదులకు తారు సిమెంటు రోడ్లుంటె పాలస్తీనీయులకు మట్టి బాటలు ఉంటాయి. కాని శ్రమపై ఆధారపడి ఉన్న పనులన్నింటినీ పాలస్తీనా వాళ్లే చేయాలి. వాళ్ళు యూదుల కాలనీల్లోకి రావలసిన చొట పెద్ద ఎత్తున చెక్ పోస్టులు పెట్టి కింది నుండి మీది దాకా చెక్ చేసి పంపిస్తారు. ఇది ప్రతిరోజూ పాలస్తీనీయులు ఎదుర్కొంటున్న వివక్షత. ఒక్క చిన్న మాట నచ్చనిది మాట్లాడినా పాలస్తీనీయులని జైల్లో కుక్కుతారు. వీటన్నింటినీ అమెరికా, బ్రిటన్ లకు కొమ్ము కాసే మానవ హక్కుల సంఘాలే అనేక సార్లు రిపోర్టు చేసాయి. అవేవీ ప్రపంచంలో ఇతర దేశాల ప్రజలకు అందకుండా కార్పొరేట్ పత్రికలు జాగ్రత్తలు తీసుకుంటాయి.

  “మ్రుగాల లాంటి ఇస్లామీ రాక్షసుల నుండి” అన్న మీ వ్యాఖ్యలోనే మీ పాక్షిక దృక్పధం తెలుస్తోంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ లకు సంబందించిన కనీస విషయాలు తెలిసినవారెవరైనా ఈ మాటల్ని అనలేరు. అసలు ఒక మతం మొత్తం రాక్షసులే అని ఎలా అనగలరండీ? ఇప్పటికీ దళితుల్ని ఊరిబయట పెడుతున్న హిందూ మతం గురించి కూడా చెప్పగలరా ఆ విధంగా? మాలా మాదిగలతో పెళ్ళిళ్ళు నిరాకరిస్తున్నారే, అది ఏ తత్వమో చెప్పగలరా? అది రాక్షసత్వం ఎందుకు కాదో చెప్పగలరా మీరు?

  ఇంత అన్యాయంగా అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం భావ్యం కాదు. పాలస్తీనా ముస్లింలది జాత్యహంకారం అనగలవాఅరిని మిమ్మల్నే చూస్తున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s