ఇంటికి 323 టెలిఫోన్ లైన్లు వేసుకున్న మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్


డి.ఎం.కె మంత్రులు టెలికం మంత్రిత్వ శాఖను తమ సొంత సొమ్ము కింద జమకట్టి వాడుకున్న విషయాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. స్పెక్ట్రం కేటాయింపుల విషయాన్ని మంత్రుల బృందం పరిశీలనకు అప్పగించకుండా మొత్తం టెలికం శాఖకే వదిలిపెట్టాలని ప్రధాని మన్మోహన్ కు లేఖ రాసిన దయానిధి మారన్ గారి మరొక నిర్వాకాన్ని సి.బి.ఐ విచారణ చేయడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. దయానిధి మారన్ టెలికం మంత్రిగా ఉన్న కాలంలో ఆయన తన చెన్నై నివాసానికి 323 టెలిఫోన్ లైన్లు వేయించుకున్న ఆరోపణలపై సి.బి.ఐ తాజా విచారణకు నిర్ణయించింది.

ఈ విషయంలో సి.బి.ఐకి నాలుగు సంవత్సరాల క్రితమే ఫిర్యాదులు అందుకున్నప్పటికీ, సి.బి.ఐ విచారణను ముందుకు సాగనీయకుండా అడ్డుకున్నారు. 2007లోనే ఈ విషయమై చర్యలు తీసుకోవాలని టెలికం సెక్రటరీకి సిఫార్సు చేసినప్పటికీ టెలికం డిపార్ట్‌మెంటు అందుకు ఆమోదం తెలపలేదు. దానితో అది అక్కడితో ముగిసిపోయింది. సి.బి.ఐ ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులపై ప్రాధమిక విచారణ దాఖలు చేయడానికి నిర్ణయించుకున్నదని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.

దయానిధి మారన్‌ ఇంటికి వేసిన 323 టెలిఫోన్ లైన్లు వాస్తవానికి ఆయన ఇంటికి ఉద్దేశించినవి కావనీ, అవి చట్ట విరుద్ధంగా ఆయన సోదరుడు యజమానిగా ఉన్న టెలివిజన్ ఛానెల్ వినియోగానికి ఉద్దేశించినవని సి.బి.ఐ వెల్లడించింది. 323 టెలిఫోన్ లైన్లన్నీ బి.ఎస్.ఎన్.ఎల్ జనరల్ మేనేజర్ పేరుమీద ఉన్నాయని సి.బి.ఐ కనుగొంది. దయానిధి మారన్ కి చెందిన బోట్ హౌస్ నివాసం నుండి సన్ టివి కార్యాలయానికి కలుపుతూ కూడా లైన్లు వేశారని కనుగొంది. కేవలం సన్ టి.వి వినియోగం కోసమే అండర్ గ్రౌండ్ కేబుల్ వేశారని వెల్లడించింది.

దయానిధి మారన్ బి.ఎస్.ఎన్.ఎల్ నుండి తన ఇంటికీ, అక్కడి నుండి టి.వి కార్యాలయానికి వేయించుకున్న కేబుల్స్ సాధారణమైనవి కావనీ, అత్యంత ఖరీదైన ఐ.ఎస్.డి.ఎన్ కేబుల్స్ అనీ ఇవి భారీగా డేటాను మోసుకెళ్లగల సామర్ధ్యం కలిగి ఉన్నవనీ సి.బి.ఐ కనుగొంది. వాటి ద్వారా సన్ టి.వి అందజేసే వార్తా ప్రసారాలు, ఇతర కార్యక్రమాలు అత్యంత వేగంగా అన్ని దేశాలకు ప్రసారం కావడానికి ఏర్పాట్లు చేసుకున్నారని సి.బి.ఐ ప్రాధమిక విచారణలో కనుగొన్నది.

ఈ కేబుల్స్ ను సాధారణంగా మధ్య తరహా నుండి భారీ వాణిజ్య సంస్ధల ప్రత్యేక అవసరాల నిమిత్తం వాడతారని సి.బి.ఐ తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్, పెద్ద మొత్తంలో డిజిటల్ డేటాను ప్రసారం చేయడం లాంటి ముఖ్యమైన అవసరాలకు ఈ కేబుల్స్ వినియోగిస్తారని అందువలన పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించవలసి ఉంటుందనీ సి.బి.ఐ పేర్కొంది. కాని మారన్ సిఫారసులతో సన్ టి.వికి ఉచితంగా ఇవి లభించాయని సి.బి.ఐ ఆరోపించింది.

అధికారాలు అప్పగించబడిన పరిమిత బి.ఎస్.ఎన్.ఎల్ సిబ్బంది తప్ప ఈ కేబుల్స్ కనుగొనలేని విధంగా ఈ కేబుల్స్‌తో కూడిన ఎక్ఛేంజ్ ను ప్రోగ్రాం చేయించారని, టెలికం కంపెనీలో ఇంకెవరూ వీటి ఉనికిని కనుగొనడానికి వీలు లేకుండా చేసుకున్నారని సి.బి.ఐ తెలిపింది. మంత్రిగారి నివాసాన్నీ, సన్ టెలివిజన్ కార్యాలాయాన్ని కలుపుతూ స్టెల్త్ కేబుల్ వేయించుకున్నారని సి.బి.ఐ ఆరోపించింది. తద్వారా మంత్రికోసమే ఈ కేబుల్స్ వేయించుకున్నట్లుగా అభిప్రాయం కలుగజేయడానికి ప్రయత్నించారని వాస్తవానికి ఇవి టి.వి ఛానెల్ వినియోగానికే వేశారని తెలిపింది.

దీనిని బట్టి కరుణానిధి, దయానిధి మారన్ ల కుటుంబాలు తమ ఇస్టానుసారంగా దేశ ప్రజలకు చెందిన టెలికం వనరులను వాడుకుని సొమ్ము చేసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. ఈ దురాగతాలన్నింటినీ కూటమి ధర్మం మాటున ప్రధాని తదితరులు కొనసాగడానికి అనుమతినిచ్చారని సి.బి.ఐ దర్యాప్తులోనూ, ఆర్.టి.ఐ చట్టం ద్వారానూ వెలుగులోకి వస్తున్నది. అయితే ఆర్.టి.ఐ చట్టాన్ని ఉపయోగించి ప్రణబ్ ముఖర్జీ, పి.చిదంబరం, దయానిధి మారన్ లాంటి పెద్ద తలకాయలు రాసిన నోట్ లను బైటపెట్టగలగడం అంత తేలికగా జరిగే పని కాదు. ప్రభుత్వంలోనే మంత్రుల మధ్య తలెత్తే విభేదాలు ఒకరినొకరు కుత్తుకులు ఉత్తరించుకునే స్ధాయికి చేరుకోవడంతోనే ఈ మాత్రం వెల్లడి అవుతున్నాయని భావించవచ్చు.

One thought on “ఇంటికి 323 టెలిఫోన్ లైన్లు వేసుకున్న మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్

  1. ఇంటి కోసం వేసుకునే టెలీఫోన్ లైన్‌కి వేరే టారిఫ్ ఉంటుంది, ఆఫీస్ కోసం వేసుకునే టెలీఫోన్ లైన్‌కి వేరే టారిఫ్ ఉంటుంది. డబ్బులు మిగుల్చుకోవడానికి ఇంటి పేరుతో ఆఫీస్‌కి లైన్‌లు వెయ్యించుకుని ఉంటాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s