
హక్కాని గ్రూపుని మట్టుబెట్టాలని అమెరికా ఎప్పటినుండో పాకిస్ధాన్ ను డిమాండ్ చేస్తొంది. ఆ గ్రూపుతో పాక్ ఆర్మీ సత్సంబంధాలు నెరుపుతూ ఆఫ్ఘనిస్ధాన్‌లో తన అనుకూల సంస్ధగా తీర్చి దిద్దుకుంటున్నదని ఆరోపిస్తొంది. ఈ ఆరోపణలను పాకిస్ధాన్ తిరస్కరిస్తోంది. తమ వద్ద ఉన్న వనరులన్నింటినీ ఇప్పటికే వినియోగిస్తున్నామనీ, అమెరికా చెబుతున్నట్లుగా హక్కానీ గ్రూపుపై దాడులు చేయడానికి అవకాశం లేదని పాకిస్ధాన్ ఆర్మీ పేర్కొంటున్నది.
హక్కానీ గ్రూపుతో శతృత్వం పెట్టుకుంటే పాకిస్ధాన్ కోలుకోవడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. హక్కానీ గ్రూపుకి పాకిస్ధాన్ ఆఫ్ఘనిస్ధాన్ సరిహద్దు కొట్టిన పిండి అనీ, అనేక ఇతర ముస్లిం గ్రూపులతో దానికి సత్సంబంధాలు ఉన్నాయనీ, అటువంటి గ్రూపుని అణచివేయాలని పాకిస్ధాన్ తలపెడితే అది చాలా దెబ్బతినవలసి ఉంటుందని, నష్టాలు మూటగట్టుకుంటుందని వారు తేల్చి చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే పాక్ ప్రభుత్వం, ఆర్మీలు హక్కాని గ్రూపుపై అమెరికా కోరినట్లుగా దాడులు చెయడానికి వెనకడుగు వేస్తున్నాయి.
పాకిస్ధాన్ ఆర్మీ ఛీఫ్ అష్ఫక్ కయాని ఆదివారం తన కమేండర్లతో ఎమర్జన్సీ సమావేశం ఏర్పాటు చేసి పాకిస్ధాన్ భద్రతా విషయాలపై సమీక్ష చేసాడు. హక్కానీ గ్రూపును ఐ.ఎస్.ఐ సంస్ధ పెంచి పోషిస్తున్నదని అమెరికా ఆరోపిస్తున్న నేపధ్యంలోనే ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. హక్కానీ గ్రూపు ఆశ్రయం పొందుతున్నట్లుగా అమెరికా అనుమానిస్తున్న ఉత్తర వజీరిస్తాన్‌పై పాకిస్ధాన్ ఆర్మీ దాడులు చేయాలంటున్న అమెరికా డిమాండ్లను ప్రతిఘటిస్తామని పాక్ కమేండర్లు అంగీకరించినట్లుగా ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రికను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. “ఇప్పటివరకూ చేసినదానికంటె ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళేది లేదని అమెరికాకి ఇప్పటికే స్పష్టం చేశాము” అని పాకిస్ధా ఆర్మీ అధికారి తెలిపినట్లుగ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది.
హక్కాని గ్రూపు నాయకుడు సిరాజుద్ధీన్ హక్కానీ తమకు పాకిస్ధాన్‌లో ఆశ్రయం పొందవలసిన అగత్యం ఇపుడు లేదనీ నిజానికి పాక్‌లో కంటే ఆఫ్ఘనిస్ధాన్‌లోనే తమకు ఎక్కువ భద్రత ఉందనీ ప్రకటించాడు. హక్కానీ గ్రూపు చేతిలో అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు అనేకసార్లు చావుదెబ్బ తిన్నాయి. దానితో హక్కాని గ్రూపు పేరు చెబితేనే దురాక్రమణ సేనలకు వణుకుపుడుతోంది. తమ వల్ల కాక పాకిస్ధాన్ పైన ఒత్తిడి తెస్తూ హక్కానీ గ్రుపుకి మద్దతు ఉపసంహరించాలని ప్రయత్నిస్తొంది. ఒత్తిడిలో భాగంగా అమెరికా జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కూడా హక్కాని గ్రూపుతూ ఐ.ఎస్.ఐకి సంబంధాలున్నాయని సెనేట్ కమీటీ ముందు ఆరోపించాడు. కాని అమెరికా ఒత్తిడిని పాకిస్ధాన్ అంతే తీవ్రంగా ప్రతిఘటిస్తోంది.
