మూలిగే నక్కపై తాటికాయ, ఇటలీ క్రెడిట్ రేటింగ్ తగ్గించిన ఎస్&పి


చరిత్రలో మొదటిసారిగా అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించిన స్టాండర్డ్ & పూర్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ రుణ సంక్షోభంతో తల్లడిల్లుతున్న యూరో జోన్‌ను బండరాయితో మోదినంత పని చేసింది. మంగళవారం, యూరోజోన్ లో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలలో ఒకటైన ఇటలీ క్రెడిట్ రేటింగ్‌ను ఒక అడుగు తగ్గించింది. ఎవరూ ఊహించని ఈ చర్యతో యూరోజోన్ రుణ సంక్షోభాన్ని మరింత తీవ్రం కానుంది. యూరోజోన్ దేశాల ప్రభుత్వాలపై సమస్య పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకొనేలా ఈ చర్య ఒత్తిడి పెంచనున్నది.

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఇటలీ డౌన్ గ్రేడ్ ఆశనిపాతం లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం జరిగిన కొన్ని సానుకూల పరిణామాలను ఇది పూర్వ పక్షం చేసిందని భావిస్తున్నారు. కొద్దివారాలలో ఖర్చులకు డబ్బు లేని పరిస్ధితిలోకి జారబోతున్న గ్రీసుకి తదుపరి సాయం నిరాటంకంగా అందించడానికి ఒప్పందం దగ్గర్లో ఉందని ఒక వార్త వెలువడగా, యూరప్‌ను ఆదుకోవడానికి ఐ.ఎం.ఎఫ్ ద్వారా 10 బిలియన్ డాలర్ల సాయం అందించడానికి బ్రెజిల్ నిర్ణయించిందన్నది రెండవ సానుకూల వార్త. ఈ వార్తలతో వాస్తవానికి యూరోజోన్ రుణ సంక్షోభం పరిష్కారమయ్యే దిశలో సానుకూల అడుగులుగా భావించవలసి ఉండగా రెండింటినీ పూర్వపక్షం చేస్తూ ఎస్&పి సంస్ధ, ఇటలీ రేటింగ్ ను తగ్గించింది.

గ్రీకు అప్పుకంటే ఇటలీ అప్పుతో చాలా దేశాలు, చాలా బ్యాంకులు సంబంధం కలిగి ఉన్నాయనీ అందువలన గ్రీసుకంటే ఇటలీ పరిణామానికి ఎక్కువ ప్రభావం ఉంటుందని విశ్లెషకులు చెబుతున్నారు. నిజానికి గ్రీసు రుణ సంక్షోభం దానికదే పెద్ద ఆందోళనకరం కాదనీ ఆ తర్వాత దాని ప్రభావం పెద్ద ఆర్ధిక వ్యవస్ధలైన స్పెయిన్, ఇటలీలపై పడుతుందన్నదే అసలు భయం అనీ వారు చెబుతున్నారు. ఇపుడు అనిశ్చితి మరింత విస్తృతమయ్యిందని వారు భావిస్తున్నారు.

గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ తర్వాత ఇటలీ, స్పెయిన్ లు రుణ సంక్షోభానికి గురవుతాయని మార్కేట్లు కొన్ని నెలలుగా ఆందోళనలో ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు మంగళ, బుధవారాల్లో సమావేశం కానున్నది. అలాగే జి20, ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల సమావేశాలు కూడా ఈ వారంలో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో విధాన రూపకర్తలు చర్యలు తీసుకుంటారని మార్కేట్లు, మదుపుదారులు ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా జి20 సమావేశాలపైన ఆశలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటలీ డౌన్ గ్రేడ్‌తో అమెరికా ఫెడరల్ రిజర్వు క్యూ.ఇ-3 (క్వాంటిటేటివ్ ఈజింగ్) ప్రకటించే అవకాశాలు మరింత పెరిగాయని భావించవచ్చు. డౌన్ గ్రేడ్ ప్రకటించాక యూరో విలువ అరశాతం పడిపోయింది. యూరో విలువ మరింత క్షీణించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇటాలియన్ బాండ్లపైన యీల్డ్ పెరగడం, యూరో విలువ మరింత పడిపోవడం అనివార్యంగా కనిపిస్తోంది. యూరోపియన్ బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లను శక్తివంతం చేసుకోవాలని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అధిపతి జీన్-క్లాడ్ ట్రిఛెట్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిలుపునిచ్చాడు. తద్వారా సంక్షోభానికి ప్రతిఘటన ఇవ్వాలని సూచించాడు.

జర్మన్ పారిశ్రామిక దిగ్గజం సీమన్స్ కంపెనీ కొన్ని రోజుల క్రితం ఒక పెద్ద ఫ్రెంచి బ్యాంకునుండి అర బిలియన్ యూరోల వరకూ డబ్బుని ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది. ఫ్రాన్సు బ్యాంకులపై నమ్మకం సడలుతున్నపరిస్ధితిని ఇది సూచిస్తున్నది. యూరోజోన్‌ను రుణ సంక్షోభం నుండి బైటపడడానికి యూరో బాండ్లను కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చిన చైనా, అనేక యూరోపియన్ బ్యాంకులకు సంబంధించిన ద్రవ్య వ్యాపారాలను ఆపివేసింది. రుణ సంక్షోభం దానికి కారణంగా చూపింది.

ఇదిలా ఉండగా గ్రీసుకు ఐ.ఎం.ఎఫ్, ఇ.యు లనుండి రానున్న నెలలో అందవలసిన బెయిలౌట్ రుణం వాయిదాకు ఆటంకాలు తొలగిపోయే దిశలో ఒప్పందం కుదరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గ్రీసు ప్రభుత్వం ఖర్చు తగ్గించడానికి తగిన చర్యలను ప్రకటించలేదని చెబుతూ తదుపరి రుణం వాయిదా విడుదలపై అనుమానాలు వ్యాపించి ఉన్న దశలో ఈ వార్తలు వెలువడ్డాయి. గ్రీసు ప్రభుత్వం మరింతగా తన ప్రజలపై పొదుపువిధానాలను రుద్ధుతానని హామి ఇవ్వడంతో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు మెత్తబడ్డాయని చెబుతున్నారు.

గ్రీసు ఆర్ధిక సంక్షోభానికి కారకులు యూరప్ లో ఉన్న బడా బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్ధలు కాగా, ఆ భారమంతా ఆ దేశ ప్రజలపై పొదుపు చర్యలరూపంలో మోపుతున్నారు. ఇంకా ఇంకా గ్రీసు ప్రజలను కష్టాల పాలు చేస్తున్నారు. గ్రీసు ప్రజలపైన బాదడానికి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లతో గ్రీసు పాలకులు దుర్మార్గపు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే వేతనాలు కత్తిరించి సదుపాయాలు రద్దు చేసినా ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు శాంతించడం లేదు. ప్రభుత్వ రంగ కంపెనీలన్నింటినీ ప్రవేటీకరించి, అమ్మేసి ప్రవేటు గుత్త సంస్ధలకు వశం చేయడానికి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నాయి.

గ్రీసు రుణ సంక్షోభం తీవ్రం పేరుతో గ్రీసు కార్మికులు అనేక ఏళ్లపాటు కష్టించి సంపాదించిన ప్రభుత్వరంగ కంపెనీలను ఇపుడు ప్రవేటు గుత్త సంస్ధలతోడేళ్లకు వశపరుస్తున్నారు. అందుకు వీలుగా రుణ సంక్షోభాన్ని రహాదారిగా చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఇటలీ కార్మికవర్గం ఈ ఎత్తుగడలకు బలికానుంది. యూరోజోన్ లో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన ఇటలీ అప్పు జిడిపిలో 120 శాతం పైగా ఉంది. ఈ అప్పంతా ఇటలీకి చెందిన బహుళజాతి కంపెనీలు, ఇతర యూరప్ కంపెనీలతో పాటు అమెరికా కంపెనీలకు దోచిపెట్టిన సొమ్ముకాగా అప్పు తీర్చవలసివచ్చేసరికి కార్మికులు, ఉద్యోగులను బలి చేస్తున్నారు.

మే నెలలోనే డౌన్ గ్రేడ్ చేస్తానని హెచ్చరించిన ఎస్&పి, ఇటలీ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోవడం వలన తన హెచ్చరికను నిజం చేస్తున్నట్లు ప్రకటించింది. గత వారంలోనే ఇటలీ ప్రభుత్వం 59.8 బిలియన్ యూరోల మేరకు బడ్జెట్ ఖర్చులు తగ్గించే పధకం ప్రకటించినా అది ఎస్&పి కి సరిపోలేదు. 2013 నాటికి సమతూక బడ్జెట్ సమర్పిస్తానని ఇటలీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. అంటే రెవిన్యూ వసూళ్ళు ఎంత ఉంటే ఖర్చుకూడా అంతే ఉంటుందని హామీ ఇవ్వడం అన్నమాట. బడ్జెట్ ఖర్చు పెట్టే సమయంలో కేవలం కంపెనీలు, ధనికులు మాత్రమే లెక్కలోకి వస్తారు. కాని బడ్జెట్ ఖర్చు తగ్గించడానికి వచ్చేసరికి ప్రభుత్వాలకు కార్మికులు, ఉద్యోగులు, వారికి ఇచ్చే వేతనాలు, సదుపాయాలు మాత్రమే గుర్తుకు రావడం యాదృచ్ఛికం కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s