పునరుద్భవిస్తున్న కార్మికవర్గం – చైనా విప్లవం భవిష్యత్తు -(2)


(ఈ భాగాన్ని ఆగష్టు 12న పోస్ట్ చేసినప్పటికీ ఆ లింక్ పని చేయనందున మళ్లీ పోస్ట్ చేస్తున్నాను. -విశేఖర్)

ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్ధలలో ఉపాధి పొందుతున్నవారిలో అనేకమంది “పాత కార్మికుల” పిల్లలు; లేదా పాత కార్మికులతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్నవారు; లేదా పాత కార్మికుల నివాసాలకు పక్కనో దగ్గర్లోనో నివసిస్తున్నవారు. ఆ విధంగా ప్రస్తుతం ప్రభుత్వరంగ పరిశ్రమలలో పని చేస్తున్నవారు పాత కార్మికులు జరిపిన ఉద్యమాలతోనూ, వారి రాజకీయ అనుభవాల తోనూ ప్రభావితమై ఉన్నారు. ఈ విషయం,  2009లో తోంఘువా ఉక్కు పరిశ్రమలో జరిగిన  ప్రవేటీకరణ వ్యతిరేక పోరాటం ద్వారా వెల్లడయ్యింది.

తోంఘువా ఉక్కు ఫ్యాక్టరీ, జిలిన్ రాస్ట్రంలో తోంఘువా పట్టణం లో గల ఒక ప్రభుత్వ రంగ ఉక్కు ఫ్యాక్టరీ. 2005లో దీనిని ప్రవేటీకరించారు. 10 బిలియన్ యువాన్ల ఖరీదు చేసే ప్రభుత్వ ఆస్తులు కేవలం 2 బిలియన్ల యువాన్ల ఖరీదు గలవని అంచనా వేశారు. బీజింగ్‌లో అధికారంలో ఉన్నత స్ధానాలలోని అధికారులతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న జియాన్ లాంగ్ అనే శక్తివంతమైన ప్రవేటు కంపెనీ చెల్లింపుల దగ్గరికి వచ్చే సరికి ఆ రెండు బిలియన్ యువాన్లు (2000 మిలియన్ యువాన్లు) కూడా చెల్లించకుండా 800 మిలియన్ యువాన్లు మాత్రమే చెల్లించి కంపెనీని స్వాధీనం చేసుకుంది. జియాన్ లాంగ్ కంపెనీ స్వాదీనమ్ చేసుకున్నాక తోంఘువా ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న 36,000 మంది కార్మికులలో 24,000 మందిని తొలగించారు. “ప్రమాదకరమైన పరిస్ధితులలో” పనిచేసే కార్మికులకు చెల్లించే వేతనాలను మూడింట రెండొంతులు తగ్గించి, ఒకవంతే మిగిల్చారు. కార్మికులపైన మేనేజర్లు వారిష్టం వచ్చినట్లుగా అపరాధ రుసుములను విధించడం, శిక్షలు వేయడం ప్రారంభించారు.

2007లో తోంఘువా ఉక్కు పరిశ్రమ కార్మికులు ఆందోళన చేయడం ప్రారంభించారు. ఈ ఆందోళనల కాలంలో మావోయిస్టు కాలంలోని కార్మికుడు, “మాస్టర్ వు” పోరాటాలకు నాయకుడుగా అవతరించాడు. ‘మాస్టర్ వు’, ‘ప్రవేటీకరణకు సంబంధించిన రాజకీయ అవగాహాన’ నిజమైన సమస్య తప్ప ఏదో ఒక నిర్దిష్ట సమస్య కాదని కార్మికులకు స్పష్టం చేశాడు.

2009 జులైలో, కార్మికులు సాధారణ సమ్మె ప్రారంభించారు. కార్మికులందరినీ తొలగిస్తామని జియాన్ లాంగ్ కంపెనీ జనరల్ మేనేజర్ బెదిరించడంతో కోపోద్రిక్తులయిన కార్మికులు అతనిని చచ్చేదాకా చితగ్గొట్టారు. రాష్ట్ర ప్రభుత్వ గవర్నరు, వేలమంది సాయుధ పోలీసుల అక్కడ ఉన్నప్పటికీ వారిని ఆపే సాహసం ఎవరూ చేయలేకపోయారు. మేనేజర్ తన్నులు తిన్నాక అన్నివర్గాలనుండి వచిన ఒత్తిడితో, జిలిన్ రాష్ట్ర ప్రభుత్వం తోంఘువా ఫ్యాక్టరీ ప్రవేటీకరణను రద్దు చేసుకోక తప్పలేదు. ఇతర రాష్ట్రాలలోని కార్మికు వర్గ కార్యకర్తలు తోంఘువా ఫ్యాక్టరీ ఘటనను తమదిగా భావించారు. ఆ ఘటన అనంతరం “మరీ తక్కువమంది పెట్టుబడిదారులను చంపగలిగాము” అని వారు గుణపాఠం తీసుకున్నారు.

అనేక సంవత్సరాలపాటు పెద్ద ఎత్తున ప్రవేటీకరణ జరిగాక, చైనాలోని పారిశ్రామిక ఉత్పత్తిలో ప్రభుత్వరంగ భాగం 30 శాతం కంటే తక్కువకు పడిపోయింది. అయినప్పటికీ ప్రభుత్వరంగం అనేక కీలక రంగాలలో ఆధిక్యతను కలిగి ఉంది. 2008 నాటికి, ప్రభుత్వరంగ సంస్ధలు కానీ లేదా ప్రభుత్వం వాటాలు కలిగి ఉన్న సంస్ధలు కానీ, బొగ్గు ఉత్పత్తి, శుభ్రం చేసే పరిశ్రమలలో 59 శాతం ఉత్పత్తిని తీశాయి. అలాగే పెట్రోలియం, సహజ వాయువు ల ఉత్పత్తిలో 96 శాతం; పెట్రోలియం, వంటవాయువుల ప్రాసెసింగ్ పరిశ్రమలలో 72 శాతం; ఇనుము, ఉక్కు లోహాలను కరిగించి వివిధ రూపాలలో ఒత్తే పరిశ్రమల ఉత్పత్తిలో 42 శాతం, రవాణా పరికరాల ఉత్పత్తిలో 45 శాతం, విద్యుత్ శక్తి, వేడి (చలి కాచుకునేందుకు వినియోగించే వేడి ఉత్పత్తి) ఉత్పత్తిలో 92 శాతం లను ప్రవేటు రంగ సంస్ధలు ఉత్పత్తి చేశాయి.

పారిశ్రామిక రంగంలో దొరుకుతున్న ఉపాధిలో ఇప్పుడు ప్రభుత్వ రంగం అందింస్తున్న ఉపాధి భాగం 20 శాతం మాత్రమే. అయినప్పటికీ, వారి సంఖ్య ఇప్పుడు 20 మిలియన్లు లేదా 2 కోట్లవరకూ ఉంది. వీరు చైనా పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన శక్తి (ఎనర్జీ) మరియు భారీ పారిశ్రామిక రంగాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు. చైనా కార్మికవర్గం, ముఖ్యంగా ప్రభుత్వ రంగ కార్మిక వర్గం, భవిస్యత్తులో జరిగే ఉద్యమాలలో, కీలకరంగాలలో తమకు ఉన్న పట్టు ద్వారా, తమ సంఖ్యతో సంబంధం లేని విధంగా అత్యధిక ఆర్ధిక, రాజకీయ శక్తిని ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి.

మరీ ముఖ్యంగా ప్రభుత్వరంగ కార్మికులు, తమకే పరిమితమైన చారిత్రక, రాజకీయ అనుభవం ద్వారా లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయి. విప్లవకర సోషలిస్తు మేధావుల సహాయంతో, చైనా ప్రభుత్వరంగ కార్మికులు, మొత్తం చైనా కార్మికవర్గానికి నాయకులుగా ఎదిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. తద్వారా భవిష్యత్తులో చైనా కార్మిక ఉద్యమాలకు స్పష్టమైన విప్లవకర సోషలిస్టు మార్గదర్శకత్వాన్ని వాళ్ళు అందించగలుగుతారు.

చైనా పెట్టుబడిదారీ వర్గం అక్రమ సంపద

మూడు దశాబ్దాల పెట్టుబడిదారీ పరివర్తన అనంతరం, ఆర్ధికంగా ప్రపంచంలోనే అత్యంత సమానతలు కలిగిన దేశంగా ఉన్న చైనా, ఇప్పుడూ ప్రపంచంలోనే అత్యధిక అసమానతలు కలిగి ఉన్న దేశంగా పరివర్తన చెందింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, 2005లో అత్యంత ఉన్నత స్ధాయిలో ఉన్న 10 శాతం దనికులు, మొత్తం చైనా ఆదాయంలోని 31 శాతాన్ని తమ ఆదాయంగా కలిగి ఉన్నారు. అత్యంత కింది స్ధాయిలో ఉన్న పది శాతం మంది పేదవారు కేవలం 2 శాతం ఆదాయాన్ని మాత్రమే తమ భాగంగా కలిగి ఉన్నారు.

సంపదలో అసమానతలు మరింత తీవ్రంగా ఉన్నాయి. 2006 నాటి “ప్రపంచ సంపదల నివేదిక” ప్రకారం చైనాలో కేవలం 0.4 శాతంగా ఉన్న అత్యధిక సంపన్నులు చైనా జాతీయ సంపదలోని 70 శాతానికి యజమానులుగా ఉన్నారు. 2006 నాటికి 3200 మంది సంపన్నులు సంపద ఒక్కొక్కొరు 100 మిలియన్ యువాన్ల (15 మిలియన్ డాలర్లు) కు పైగా సంపదను కలిగి ఉన్నారు. వీరిలో 90 శాతం లేదా 2900 మంది ప్రభుత్వంలోని సీనియర్ అధికారుల పిల్లలు లేదా పార్టీ ఉన్నత స్ధానాల్లో ఉన్న అధికారుల పిల్లలు. వారి సంపదను మొత్తం కలిపితే 20 ట్రిలియన్ యువాన్లు (3 ట్రిలియన్ డాలర్లు లేదా దాదాపు 135 లక్షల కోట్ల రూపాయలు) ఉంటుందని అంచనా వేశారు. ఇది 2006 నాటి చైనా జిడిపితో సమానం.

చైనా పెట్టుబడిదారీ వర్గం పునాదుల స్వభావం కారణంగా, దాని సంపందలో అత్యధిక భాగం, సోషలిస్టు కాలంలో పోగుబడిన  ప్రభుత్వ రంగ ఆస్తులు, ఉమ్మడి సహకార రంగ ఆస్తులను కొల్లగొట్టడం ద్వారా సంపాదించినదే. సాధారణ ప్రజానీకం వారి సంపదను చట్ట విరుద్ధంగా సంపాదించినది గానే పరిగణిస్తారు. ఒక అంచనా ప్రకారం, ప్రవేటీకరణ, మార్కేట్ సరళీకరణ ఊపందుకున్న కాలంలో ప్రభుత్వ మరియు ఉమ్మడి సహకార రంగ ఆస్తులు 30 ట్రిలియన్ యువాన్ల వరకు పెట్టుబడిదారుల జేబులకు బదిలీ అయ్యిందనీ, వీరంతా ప్రభుత్వంతో గట్టి సంబంధ బాంధవ్యాలు ఉన్నవారేననీ తేలింది. ఇటీవల సమర్పించబడిన ఒక నివేదిక ప్రకారం, 2008లో ‘గ్రే ఇంకమ్’ గా చెప్పబడుతున్న ఆదాయం (ప్రభుత్వం గుర్తించిన ఉద్యోగాలు కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం. ఉదా: యూనివర్సిటీ లెక్చరర్ బైట ఇచ్చిన లెక్చర్ కు పొందిన్ ఆదాయం, టీచర్ కు తమ పిల్లవాడి పట్ల అదనపు ఆసక్తిని కనపరిచినందుకు ఇచ్చిన బహుమతి లాంటివి. బ్లాక్ మనీ లక్షణాలే దీనికి ఉన్నా, తమ బ్లాక్ మనీ ప్రత్యెకమైనది అని చెప్పుకోవడానికి చైనా పాలకులు పెట్టుకున్న పేరుగా భావించవచ్చు -అనువాదకుడు)  5.4 ట్రిలియన్ యువాన్లుగా తేలింది. ఇది చైనా జిడిపిలో 18 శాతానికి సమానం. గ్రే ఇంకమ్ (Grey Income)లో అత్యధిక భాగం, అవినీతి ద్వారా గానీ లేదా ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడం ద్వారాగానీ సంపాదించినదేనని నివేదిక రచయితలు పేర్కొన్నారు.

చైనా ప్రధాని వెన్ జియా బావో, ప్రపంచంలోనే అత్యంత సంపన్న ప్రధాన మంత్రులలో ఒకరని పరిగణిస్తారు. ఆయన కుమారుడు చైనాలోని అత్యంత పెద్ద ఈక్విటీ సంస్ధకు యజమాని. చైనా ఆభరణాల పరిశ్రమకు ఆయన భార్య ఇన్ ఛార్జి గా వ్యవహరిస్తున్నది. వెన్ కుటుంబం దాదాపు 30 బిలియన్ యువాన్లు లేదా 4.3 బిలియన్ డాలర్ల సంపదను కూడగట్టిందని అంచనా వేశారు. చైనా మాజీ అధ్యక్షుడూ, పార్టీ ప్రధాన కార్యదర్శీ అయిన జియాంగ్ జెమిన్ ఏడు బిలియన్ యువాన్లు, మాజి ప్రధాని ఝు రాంగ్జీ ఐదు బిలియన్ యువాన్లు సంపదును కూడగట్టారని అంచనా వేస్తున్నారు.

సర్వవ్యాపితమైన అవినీతి, చైనా పెట్టుబడిదారీ విధానం చట్టబద్ధతను తీవ్రంగా ప్రశ్నించేదిగా తయారవ్వడమే కాక, పాలకవర్గాలు తమ వర్గ ప్రయోజనాలను సంరక్షించడానికి చర్యలు తీసుకోగల శక్తి బలహీనపడడానికి కూడా దారితీసింది. “చైనా సమాజం అత్యంత వేగంగా క్షీణిస్తున్నది” అని ప్రముఖ ప్రధాన స్రవంతి సోషియాలజిస్టు ‘సన్ లిపింగ్’ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఆయన ప్రకారం, చైనా పాలకవర్గంలోని ఉన్నత వర్గాలు వ్యక్తిగత, స్వల్పకాలిక ప్రయోజనాలను నెరవేర్చుకోవడంలో మునిగిపోయారు. ఎంతంగా మునిగిపోయారంటే, చైనా పెట్టుబడిదారీ విధానం దీర్ఘకాలిక ప్రయోజనాలను వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అవినీతి, నియంత్రణ పరిదులనుండి దాటిపోయి, పాలనాతీత స్ధాయిలకు చేరుకుంది.

పెట్టి బూర్జువాల “వేతన శ్రామికీకరణ” (Proletarianization)

1980లు మరియు  90లలో, పెట్టీ బూర్జువాలు (వృత్తిగత, సాంకేతిక ఉద్యోగులు), పెట్టుబడిదారీ అనుకూల ‘సంస్కరణల విధానాలూ, మార్కెట్‌ను బహిరంగ పరచే విధానాలకూ’ గణనీయమైన పునాదిగా ఉపయోగపడ్డారు. అయితే పెట్టుబడిదారీ అసమానతలు వేగంగా పెరగడంతో, వందల మిలియన్ల సంఖ్యలోని కార్మికులు దరిద్రులుగా మారడమే కాక పెట్టీ బూర్జువాల లోని అనేక మంది వ్యక్తుల మధ్యతరగతి  కలలు కూడా విధ్వంసానికి గురయ్యాయి.

అధికారిక లెక్కల ప్రకారం 2010లో గ్రాడ్యుయేట్లు అయిన విద్యార్ధులలో నాలుగో వంతు మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అంతకు ముందు సంవత్సరం గ్రాడ్యుయేషన్ పూర్తయినవారిలో 15 శాతం నిరుద్యోగులుగా మిగిలారు. ఉపాధి పొందిన కాలేజి గ్యాడ్యుయేట్లు తరచుగా, నైపుణ్యం లేని వలస కార్మికుడికి ఇచ్చేదాని కంటే ఎక్కువ కాని వేతనంతో సరిపెట్టుకోవలసి వస్తుంది. ఒక మిలియన్ గ్రాడ్యుయేట్ల వరకూ (ప్రస్తుతం ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేలవుతున్న వారి సంఖ్య ఆరు మిలియన్లు) అలాంటి ‘చీమ తెగ’ కు చెందినవారుగా పరిగణిస్తున్నారు. అంటే వారు చైనాలోని పెద్ద పెద్ద పట్టణాల శివార్లలో ఉండే మురికివాడల లాంటి పరిస్ధితులలో జీవిస్తుంటారు. ఇళ్ళ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, విద్య తదితరాల ఖరీదు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రస్తుతం చైనాలో ఉన్న పెట్టి బూర్జువాల ‘మధ్య తరగతి జీవన ప్రమాణాలను అందుకోవాలన్న’ కలలను బలవంతంగా వదులుకోవలసి వస్తున్నది.

ఒక కాలేజి గ్రాడ్యుయేటు తన “కస్టాల జీవితం” గురించిన తన భావాలను ఇంటర్నెట్ లో పోస్ట్ చేశాడు. అనేక సంవత్సరాల పాటు పనిచేసినప్పటికీ అతను స్వంతానికి ఒక ఫ్లాట్ కొనుగోలు చేయలేకపోయాడు.  పెళ్ళి చేసుకుని ఒక బిడ్డను పెంచాలన్న కలను నిజం చేసుకోలేకపోయాడు. సదరు యువకుడు తనను తాను ఇలా ప్రశ్నించుకున్నాడు:

నాకొక స్నేహితురాలు (గర్ల్ ఫ్రెండ్) ఉండవలసిన అవసరం ఏముంది? నాకొక బిడ్డ ఉండవలసిన అవసరం ఏముంది? నేను నా తల్లిదండ్రులను సంరంక్షించాల్సిన అవసరం ఏముంది? మన ఫిలాసఫీని మార్చేద్దాం! తలిదండ్రులను సంరక్షించకపోతే, పెళ్ళి చేసుకోకపోతే, పిల్లల్ని కనకపోతే, ఫ్లాట్ కొనకపోతే, బస్సులు అందుకోవలసిన పని లేకపోతే, ఎప్పటికీ ఆనారోగ్యానికి గురికాకపోతే, ఆనందం పొందకపోతే, మధ్యాహ్నం భోజనం ఎప్పటికి కొనకపోతే, సంతోషకరమైన జీవనానికి సంబంధించిన నిజాన్ని మనం తెలుసుకుని ఉందుము! సమాజం మనల్ని పిచ్చోళ్ళుగా చేస్తోంది. కొన్ని సాధారన మౌలిక అవసరాలకు కూడా మనం తీర్చుకోలేక పోతున్నాం. మనం తప్పు చేస్తున్నామా? కనీసం జీవించాలనే కదా మనం అనుకుంటున్నది?

తమ ఆర్ధిక, సామాజిక పరిస్ధితుల నేపధ్యంలో పెట్టి బూర్జువా వ్యక్తులు మరింత సంఖ్యలో వేతన శ్రామికులుగా మారేకొద్దీ, యువకులు అంతకంతకూ అధిక సంఖ్యలో రాజకీయంగా సమూల మార్పులకు లోనవుతున్నారు.

1990లలో రాజకీయంగా వామపక్షం అసలు ఉనికిలోనే లేదు. కాని తాజా శతాబ్ది మొదటి దశాబ్ధంలో చైనాలో వామపక్షం అనూహ్యం స్ధాయిలో విస్తరించింది. మూడు వామ పక్ష భావాల వెబ్‌సైట్లు – వు యు ఝి గ్జియాంగ్ (ద యుటోపియా), ద మావో జెడాంగ్ ఫ్లాగ్, ద చైనా వర్కర్స్ నెట్‌వర్క్- జాతీయ స్ధాయిలో బహుళ ప్రాచుర్యం పొందాయి. “స్ట్రెంగ్తనింగ్ ద కంట్రీ ఫోరం” (దేశాన్ని శక్తివంతం చేయడానికి వేదిక) అన్న వెబ్ సైటు, పార్టీ అధికారిక వార్తా పత్రిక ‘పీపుల్స్ డెయిలీ’ కి అనుబంధంగా ఉండే పత్రిక. అది కరెంట్ ఎఫెయిర్స్ అందిస్తుంది. అలాంటి కొన్ని ప్రధాన స్రవంతి వెబ్ సైట్లు వామపక్ష రాజకీయ భావాల ధోరణులు కలిగిన పోస్టులతో నిండిపోతున్నాయి.

2010, సెప్టెంబరు 9, డిసెంబరు 26 తేదీల్లో దేశ వ్యాపితంగా ఉన్న వందల నగరాలకు చెందిన కార్మికులు, 80కి పైగా గల యూనివర్సిటీలు, కాలేజీలకు చెందిన విద్యార్ధులు మావో జెడాంగ్ ను స్మరిస్తూ అప్పటికప్పుడు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించారు. స్ధానిక ప్రభుత్వాల వ్యతిరేకత, ఇబ్బందుల మధ్య ఈ సమావేశాలను నిర్వహించారు. 2011లో చైనా నూతన సంవత్సరం (ఫిబ్రవరి 9) సందర్భంగా దాదాపు 700,000 మంది ప్రజలు మావో జన్మ స్ధలం హూనాన్ రాష్ట్రంలోని షావోషాన్ పట్టణాన్ని సందర్శించి మావోపట్ల గౌరవం వ్యక్తం చేసారు. ఇప్పటి చైనా రాజకీయ సందర్భంలో మావో జెడాంగ్ ను అప్పటికప్పుడు స్మరించుకోవడం అన్నది సారాంశంలో పెట్టుబడిదారీ వ్యతిరేక ప్రజా నిరసనగా మారిపోయింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s