భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -2


కనపడేవీ, కనపడనివీ అన్నీ గ్రహించాలి

వ్యవస్ధల మార్పులు మనిషి కంటికి కనపడే పరిధిలోనివి కావు. వ్యవసాయంలో ఒక పంట కాలం కొద్ది నెలలు ఉంటుంది. దుక్కు దున్నడం, నాట్లు వేయడం, పంటకు రావడం, కోత కోసి పంట అమ్ముడుబోయి డబ్బులు చేతికి రావడం వరకూ మన కళ్లెదుటే జరిగే పరిణామం. కనుక మనిషి విత్తుదశనుండి పంట చేతికి వచ్చేవరకు జరిగే పరిణామాలను గుర్తించగలుగుతాడు. అలాగే మనిషి పుట్టుక, పెరుదల, చదువు సంధ్యలు, పెళ్ళి, పునరుత్పత్తి, సంతానం సాకడం, వయసు మీరాక చనిపోవడం.. ఈ పరిణామాన్ని కూదా మనిషి తన జీవితకాలాల్లో చూడగలుగుతాడు. నాట్లు వేశాక వరి మొక్క పెరుగుతున్న క్రమాన్ని మనిషి చూడ లేడు. కానీ వివిధ కాలాల వద్ద పెరుగుతున్న క్రమాన్ని గ్రహించగలుగుతాడు. ఇక్కడ రెండు అంశాలు పరస్పర విరుద్ధంగా కనపడతాయి. ఒక రోజులో ఉదయం నుండి సాయంత్రం వరకూ కూర్చుని వరిమొక్కను చూస్తూ గడిపినా మనిషి దాని పెరుగుదలను గుర్తించలేడు. కనుక వరి మొక్క పెరగడం లేదని గ్రహించే అవకాశం ఉంటుంది. అలా రెండు మూడు రోజూల పాటు చూసినా వరిమొక్క పెరుగుతున్నట్లు కనపడదు. కాని వారం రోజుల తర్వాత వరి మొక్క ఎత్తును కొలిచినట్లయితే అది పెరిగినట్లు స్పష్టంగా గుర్తించ గలుగుతాడు. అంటే వరిమొక్క ఈ వారం రోజులలో పెరుగుదల సాధించిందని నిర్ణయానికి వస్తాము.

అయితే మొదటి రెండు రోజులూ దగ్గరుండి గమనించినా పెరగడం కనపడలేదు కనుక ఆ రెండు రోజులు అది పెరగలేదనీ మిగిలిన ఐదు రోజుల్లో మాత్రమె మొక్క పెరిగిందని బుద్ధున్నవాడేవ్వడూ అనుకోడు. కంటికి బౌతికంగా కనిపించే అంశాలకూ వాస్తవాలకు మధ్య వ్యత్యాసం ఉన్నంతమాత్రాన ఆ వ్యత్యాసం నిజానికి వ్యత్యాసం కాదనీ కనపడిన అంశాల ఆధారంగా, కనపడని అంశాలను కూడా మానవ మస్తిష్కం గ్రహించి, అంతిమ వాస్తవం ఏమిటో గుర్తించడంలోనే అసలు వ్యత్యాసం ఉంటుందనీ చెప్పడానికే ఈ ఉదాహరణ.

పై విధంగా జరిగే మార్పులు భౌతికంగా జరుగుతుంటాయి. అయితే సామాజిక మార్పులు బౌతికంగా జరిగేవి కావు. సమాజంలో నివసిస్తున్న ప్రజల జీవితాలలో ఆ మార్పులు ప్రతిఫలిస్తుంటాయి. వివిధ వర్గాల ప్రజల మధ్య ఉండే సంబంధాలలో ప్రధానంగా ఆ మార్పులు ప్రతిఫలిస్తుంటాయి. ఈ విధంగా జీవితాలలో, జీవన విధానాలలో సంభవించే మార్పులు కంటికి కనిపించేవి కాదు. అవి కొన్ని దశలలో మాత్రమె మన కంటికి గుర్తించగలిగేవిగా ఉంటాయి. సమాజంలో అంతర్గతంగా జరిగే మార్పులు కాకుండా మొత్తం సమాజమే మారిపోయే ప్రక్రియ మానవ జీవిత కాలాన్ని కూడా కొన్ని సార్లు మించి జరుగుతుంటుంది. ఆదిమ కమ్యూనిస్టు సమాజం బానిస సమాజంగా మారడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. బానిస సమాజం ఫ్యూడల్ సమాజంగా మార్పు చెందడానికి అనేక వందల సంవత్సరాలు పట్టింది. ఫ్యూడల్ సమాజం పెట్టుబడిదారీ సమాజంగా మారడానికి కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే పట్టింది. కారల్ మార్క్స్ కమ్యూనిస్టు మానిఫెస్టో ప్రకటించిన అరవై, డెబ్భై ఏళ్లకే రష్యాలో సోషలిస్టు విప్లవం సంభవించింది. ఆ తర్వాత చైనాలో కమ్యూనిస్టు పార్టీ స్ధాపించిన ముప్ఫై అయిదేళ్లకు నూతన ప్రజాస్వామిక విప్లవం వచ్చింది. కానీ భారత దేశంలో విప్లవం గగనంగా మారింది.

బ్రిటిష్ వారి సాహచర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న భూస్వాములు, పెట్టుబడిదారులు అధికారంలో ఎలా కొనసాగాలో, తిరుగుబాటు శక్తులను ఎలా అణచివేయాలో బాగా తర్ఫీదు పొందారు. కార్మిక వర్గం సోషలిస్టు భావజాలం నుండి తిరుగుబాట్లు ఎలా సంభవిస్తాయో నేర్చుకుంటే దోపిడీ వర్గాలు కూడా సోషలిస్టు భావాజాలాన్ని ఎలా తప్పుదారి పట్టించాలో, ఎలా తొక్కి పెట్టాలో కూడా నేర్చుకున్నారు. నెహ్రూ సారధ్యంలోని భారత పాలక వర్గాలు సోషలిస్టిక్ పేట్రన్ ఆఫ్ సొసైటీ, మిశ్రమ ఆర్ధిక విధానం మున్నగు ఆకర్షణియ పధబంధాల మాటున కమ్యూనిస్టు పార్టీల అవసరం లేకుండా తానే సోషలిజాన్ని తెస్తున్నట్లు నమ్మించడంతో కమ్యూనిస్టు పార్టీ నెహ్రూకి తోకగా మారిపోయింది. ఆ తోకగా మారిన ఫలితం ఇంకా కొనసాగుతూనే ఉండడం మనం చూస్తున్నాము. విప్లవపార్టీలు సైతం తమ కార్యక్రమం, పంధాలను పక్కనబెట్టి పాలకవర్గాల వైరుధ్యాలను ఉపయోగించుకోవడం లాంటి సెకండరీ అంశాలపైన మల్లగుల్లాలు పడుతూ సంవత్సరాలు గడిపేస్తున్నాయి. అసలు పార్టీ పంధా, కార్యక్రమాల వెలుగులో, వ్యవసాయక విప్లవ పంధాలో ప్రజలను పోరాటాల్లోకి సమీకరించి ఉద్యమాలు నిర్మించడం ప్రధాన కర్తవ్యమనీ, ఆ కార్యక్రమం ప్రధానంగా జరుగుతుండగా మాత్రమే పాలక వర్గాల మధ్య వైరుధ్యాలను శక్తివంతంగా ఉపయోగించుకోగలమనీ విప్లవ పార్టీలుగా చెప్పుకుంటున్నవారు మరిచిపోయినట్లు కనిపిస్తున్నది.

ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి పెట్టుబడిదారీ వ్యవస్ధ వరకూ జరిగిన పరిణామాలని క్లుప్తంగా చూశాము. ఈ వ్యవస్ధలు వరుసగా ఆదిమ కమ్యూనిస్టు వ్యవస్ధ, బానిస వ్యవస్ధ, భూస్వామ్య లేదా ఫ్యూడల్ వ్యవస్ధ, పెట్టుబడిదారీ వ్యవస్ధ, సోషలిస్టు వ్యవస్ధలుగా పైన చూశాము. ఈ సమాజాలన్నింటిలో ప్రజలంతా సమానంగా లేరు. అనేక వర్గాలుగా విడిపోయి ఉన్నారు. ప్రధాన వర్గాలు రెండు కాగా ఇతర వర్గాలు అప్రధానంగా ఉంటూ ప్రధానంగా ఉండే వర్గానికి సహాయకారిగా ఉంటూ వచ్చాయి. ఆదిమ కమ్యూనిస్టు సమాజం తప్ప తరువాత వచ్చిన వ్యవస్ధలన్నీ వర్గ వ్యవస్ధలే. ఈ వ్యవస్ధలలో ఆధిపత్య వర్గం ప్రభుత్వంతో పాటు సైనిక, పోలీసు, న్యాయ, అధికార వ్యవస్ధలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని పాలన సాగించాయి. వివిధ సామాజిక వ్యవస్ధలన్నీ తమకంటూ కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాయి. బానిస వ్యవస్ధ నుండి పెట్టుబడిదారీ వ్యవస్ధ వరకూ గూడా ప్రజాస్వామ్య పాలన లక్షణంగా ఉన్నదా? లేదా? ఇది సోషలిజం, ప్రజాస్వామ్యం ల మధ్య సంబంధాన్ని అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడే కీలక ప్రశ్న.

ప్రజాస్వామ్యం అనేది ఒక వ్యవస్ధ లక్షణమే తప్ప తనకు తానే వ్యవస్ధ కాదు.

ఒక వస్తువు లక్షణాలను మరొక లక్షణాలతో పోల్చగలం. కాని ఒక వస్తువుని వేరొక వస్తువు లక్షణాలతో పోల్చగలమా? అలా వీలుకాదు. సోషలిజాన్ని, ప్రజాస్వామ్యాన్నీ పోల్చడం కూడా అలాంటిదే. పత్రికలు, పాఠ్యపుస్తకాల ద్వారా అందుతున్న పైపై జ్ఞానం ప్రకారం అమెరికా, ఇండియా, బ్రిటన్ తదితర దేశాల్లో కనిపిస్తున్నదే ప్రజాస్వామ్యంగా అందరూ భావిస్తుంటాము. రోజువారీ వ్యవహారాలలో ఆ అర్ధం నడుస్తూ ఉంటుంది. కానీ ఈ అంశాలను సైద్ధాంతికంగా ప్రస్తావించుకుంటున్నపుడు ఆ పదాల సైద్ధాంతిక నిర్వచనాలను మాత్రమే పరిగణించాలి తప్ప రోజువారి అర్ధాలను కాదు. ఎందుకంటే కొన్ని పదాలు సైద్ధాంతికంగా ఒక నిర్ధిష్ట అర్ధాన్ని కలిగి ఉంటే వ్యావహారికంలో వేరే అర్ధాన్ని కలిగి ఉంటాయి. సోషియాలజీలోగానీ, ఆర్ధిక, రాజకీయ శాస్త్రాలలోగానీ కొద్ది పాటి పరిజ్ఞానం ఉన్నవారెవరైనా ఈ సంగతిని అంగీకరిస్తారు. మానన శాస్త్రాలలో కొద్ది పరిజ్ఞానం కూడా లేకుండా, అమెరికా, ఇండియా, బ్రిటన్ లలో ఉన్నది ప్రజాస్వామ్య వ్యవస్ధలుగా పత్రికలలోనో, రోజువారీ సంభాషణలలో చెప్పుకుంటున్నదానినే మక్కికి మక్కీగా స్వీకరించి ఆ పరిమిత జ్ఞానంతో ప్రజాస్వామ్యం, సోషలిజం ల మధ్య సంబంధాలను తేల్చేస్తానంటూ బయలుదేరితే ఒలికేది అజ్ఞానమే తప్ప విజ్ఞానం కాదు.

మళ్ళీ ఒకసారి ప్రస్తావించుకుందాం! బానిస, భూస్వామ్య, పెట్టుబడిదారీ, సోషలిస్టు వ్యవస్ధలు లాంటి పదజాలం సమాజ స్వభావాన్ని తెలిపే పదబంధాలు. వాటికీ ప్రజాస్వామ్యం అన్న పదబంధానికీ పోలిక తేవడం సరైంది కాదు. బానిస వ్యవస్ధ, భూస్వామ్య వ్యవస్ధ, పెట్టుబడిదారీ వ్యవస్ధ, సోషలిస్టు వ్యవస్ధ, ప్రజాస్వామిక వ్యవస్ధ… ఈ ఐదింటిలో మొదటి నాలుగూ పోల్చదగినవే కాని చివరిదానిని మొదటి నాలుగింటితో పోల్చకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్నది వ్యవస్ధల లక్షణంగా ఉండగలదు తప్ప తానే వ్యవస్ధగా ఉండదు. దాని నిర్వచనం వ్యవస్ధకు సంబంధించింది కాదు. వ్యవస్ధ లక్షణానికి సంబంధించినదే. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తెరగాలి. తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకోవలసిందే తప్ప ఇది చర్చాంశం కాదు. నీరు ఆక్సిజన్, హైడ్రోజన్ పరమాణువుల సమ్మేళనం అని ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేనట్లే ప్రజాస్వామ్యం అన్నది, వ్యవస్ధల లక్షణమే అన్న దానిని కొత్తగా చర్చంచవలసిన అవసరం లేదు.

వివిధ సామాజిక వ్యవస్ధలలో ప్రజాస్వామ్యం

ప్రజలు తమను తాము పరిపాలించుకోవడం ప్రజాస్వామ్యం అంటారు. ఇది బానిస వ్యవస్ధలో అమలు జరుగుతుందా? జరగదు. ఎందుకంటే ప్రజలలో అత్యధికులు బానిస వ్యవస్ధలో బానిసలుగా, బానిస యజమానులు చెప్పిన మాటను జవదాటనివారుగా ఉంటారు. వారి భావాలూ, అభిప్రాయాలకు విలువ లేదు. వారి భావ వ్యక్తీకరణ హక్కునే గుర్తించరు కనుక ప్రజాస్వామ్యం బానిస వ్యవస్ధలకు లక్షణంగా మనజాలదు. అత్యధికులని బానిసలుగా అణచివేస్తూ వారి శ్రమను ఉచితంగా, అత్యంత తీవ్ర స్ధాయిలో కొల్లగొట్టడమే బానిస వ్యవస్ధ లక్షణం.

భూస్వామ్య వ్యవస్ధలో అత్యధికులు రైతాంగంగా ఉన్నారు. వారు తమ శ్రమ కాలంలో మెజారిటీ భాగాన్ని జమీందారు లేదా రాజుల భూముల్లో ఉచితంగా పని చేసి మిగిలిన శ్రమకాలాన్ని తమ పొలాల్లో వినియోగించవచ్చు. అంటే వారి శ్రమ ఫలితం మెజారిటీ భాగం జమీందారుకో, ఫ్యూడల్ ప్రభువుకో చెందుతుంది. కాని బానిసవలే కాకుండా రైతుకు సొంతానికి కొంత భూమి ఉంటుంది. కొద్దిపాటి హక్కులు మాత్రమే ఉంటాయి. భూస్వామి గానీ, రాజుగారు గానీ శిస్తు వేసినట్లయితే కట్టి తీరవలసిందే. కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఉండదు. కాని ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు అనేక ప్రజాస్వామిక హక్కులు ఉండాలి. తమ శ్రమనంతటినీ తనకోసం, తన కుటుంబం కోసం మాత్రమే వినియోగించగల పూర్తి హక్కులు శ్రామికునికి ఉండాలి. అది భూస్వామ్య లేదా ఫ్యూడల్ వ్యవస్ధలోని రైతుకు ఉండదు గనుక భూస్వామ్య వ్యవస్ధలోని రైతును అర్ధ బానిస అని సోషియాలజీ నిర్వచించింది. అర్ధ బానిస వ్యవస్ధలో ప్రజాస్వామ్యం మనగలిగే అవకాశం ఉండదని వేరే చెప్పనవసరం లేదు.

ఇక పెట్టుబడిదారీ వ్యవస్ధ. ఇది ప్రాధమిక దశలొ దానికి ముందున్న సమాజాలన్నింటిలోకి ఉన్నత వ్యవస్ధే కానీ, పరిపక్వ దశలో మాత్రం అశేష శ్రామిక ప్రజానీకం అభివృద్ధికి పెద్ద ఆటంకంగా పరిణమిస్తుంది. దీనిలో ప్రజాస్వామ్యంగా కనిపించే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎన్నికల ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకొని ప్రభుత్వంలో కూర్చోబెట్టే అవకాశం ఇక్కడ ప్రజలకు లభిస్తుంది. పెట్టూడిదారీ వ్యవస్ధలో ప్రజా ప్రాతినిధ్యం అన్నది కేవలం ఇండియాలో ఉన్న రూపంలోనే అన్నింటా లేదు. అమెరికా, ఇండియాల మధ్య ఎన్నికల వ్యవస్ధ, పాలనా వ్యవస్ధ వేరు వేరుగా ఉన్నాయి. అమెరికాలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం అన్నారు. ఇండియాలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నారు. ఫ్రాన్సులో కూడా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యమే కానీ అక్కడ అమెరికాలాగా కాకుండా ప్రధాన మంత్రి కూడా ఉంటాడు. జర్మనీలో అధ్యక్షుడు, ప్రధాని ఎవరూ కాకుండా ఛాన్సలర్ ఉంటారు. బ్రిటన్ పాలన వ్యవస్ధలోని కొన్ని లక్షణాలు భారత దేశానికి లేవు. బ్రిటన్ ఇప్పటికీ నామ మాత్రంగానైనా రాచరికాన్ని గుర్తిస్తున్నది. భారతదేశం ఆ విషయంలో ఒకడుగు ముందున్నట్లే లెక్క. అయితే ఈ తేడాలున్నప్పటికీ అమెరికా, ఇండియా, బ్రిటన్, ఫ్రాన్సు జర్మనీ దేశాలన్నింటిలోనూ ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్ధలేనన్నది గమనార్హం.

ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెబుతున్న దేశాలన్నింటిలో ప్రధానంగా ఎన్నికలను ప్రజాస్వామ్యం ఉన్నదనడానికి గుర్తుగా చూపిస్తున్నారు. అత్యధికులు అదే నిజమనుకుని నమ్ముతున్నారు. చిత్రం ఏమిటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం కావాలని ఆందోళనలు జరిగిన, జరుగుతున్న దేశాలలో దాదాపు అన్నింటిలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈజిప్టులో జనవరిలో కూలిన ముబారక్ పాలనలో క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగాయి. బహ్రెయిన్, యెమెన్, సిరియా దేశాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కాని ఆ ఎన్నికల్లో ప్రతిసారీ నియంతలుగా పేరుపడినవారే మళ్ళీ మళ్ళీ గెలుస్తూ వచ్చారు. అంటే ఇక్కడ రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ నియంతలు పాలన చేసే అవకాశాలు పుష్కలంగానే ఉండొచ్చు. రెండు, ఎన్నికలు జరుగుతున్నంత మాత్రానే అక్కడ ప్రజాస్వామ్యం ఉందని భావించనక్కర్లేదు. రెండవ అంశం నుండి మరొక అంశం పరోక్షంగా తొంగి చూస్తోంది. అదేమంటే, ఎన్నికలు జరగనంత మాత్రాన ప్రజాస్వామ్యం లేదని భావించనక్కర్లేదు అని.

ప్రజాస్వామ్యం అర్ధం ప్రజలు తమను తాము పాలించుకోవడం అని గుర్తుంచుకుంటే ఇప్పుడు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా భావించబడుతున్న దేశాలలో నిజంగా ప్రజాస్వామ్యం ఉన్నదీ లేనిదీ అర్ధం అవుతుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు ఉన్న హక్కులన్నింటినీ సర్వ కాల సర్వావ్యస్ధలలోను గుర్తింపు ఉండాలి. గుర్తింపు ఉండడమే కాక ఆచరణలో అమలు కావాలి. ప్రభుత్వాలలో ఉన్నవారి మూడ్ కి అనుగుణంగా ఆ ప్రజాస్వామ్య లక్షణాలు మారిపోవడమో లేదా ప్రభుత్వాల దయా దాక్షిణ్యలాపై హక్కులు ఆధారపడిఉండడమో జరగకూడదు. ఉదాహరణకి చెన్నారెడ్డి, రాజశేఖర రెడ్డి లు తాము అధికారంలోకి వచ్చినవెంటనే మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తి వేశారు. చెన్నారెడ్డి హయాంలోని ప్రజాస్వామ్య పాలనలో హైద్రాబాద్‌లో అత్యంత దారుణంగా ఏర్పాటు చేయబడిన జరిగిన మత కల్లోలాల దెబ్బకు చెన్నారెడ్డి ప్రభుత్వం కూలిపోయింది. మత కల్లోలాల వెనుక ఉన్నది రాజశేఖర రేడ్డి అని బహిరంగ రహస్యంగా మారినా ఆయన పైన ఈగ వాలలేదు. కనీసం దర్యాప్తు జరగ లేదు. మత కల్లోలాలకు బాధ్యులైనవారిని శిక్షించాలన్న కనీస బుద్ధి మన ప్రజాస్వామిక ప్రభుత్వాల్కు లేకపోయింది. అంటే హైద్రాబాద్ లో మత కల్లోలాలకు గురైనవారికి ప్రజాస్వామిక హక్కులు ఉన్నట్లా, లేనట్లా? ఒక మతం వారికి స్వేచ్ఛగా జీవించే అవకాశం లేని వ్యవస్ధలో ప్రజాస్వామ్యం ఉన్నట్లేనా?

సోకాల్డ్ ప్రజాస్వామ్యాల అప్రజాస్వామిక లక్షణాలు

నరేంద్రమోడి బహిరంగంగా ‘చర్యకు ప్రతి చర్య’ అంటూ ముస్లింల నరమేధాన్ని ప్రోత్సహించి అనేక మంది ముస్లింల మరణానికి ప్రత్యక్షంగా బాధ్యుడిగా నిలిచాడు. ఆయన చర్యకు ప్రతి చర్య ఉపన్యాసం దాదాపు అన్ని ఛానెళ్ళు రికార్డు చేశాయి. కాని దాదాపు పది సంవత్సరాలుగా ఇప్పటికీ గుజరాత్ సి.ఎంగా నరేంద్రమోడి కొనసాగుతున్నాడు. పైగా సుప్రీం కోర్టు ఒక అంశాన్ని కింది కోర్టు నిర్ణయించాలి అని రూలింగ్ ఇవ్వడం తోనే మోడి నిర్దోషి అని సుప్రీం కోర్టు గుర్తించిందని ప్రధాని పదవికి పోటీ పడుతున్న అద్వానీ చంకలు గుద్దుకుంటున్నాడు. అద్వానీ రామజన్మభూమిలో ఆలయం నిర్మించాలంటూ చేసిన రధయాత్ర పొడవునా మత కల్లోలాలు జరిగినా ఆయన్ని శిక్షించే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఈ దేశంలో లేకపోయాయి.

ముస్లిం మతస్ధులపై మారణ కాండ సాగించినా ప్రజా ప్రతినిధిగా అందులోనూ సమానులలో ప్రధముడుగా ముఖ్యమంత్రిగా నరేంద్రమోడి కొనసాగుతున్నాడు. ముస్లింలపై నరమేధానికి ప్రజాస్వామ్య వ్యవస్ధలలో శిక్షలు అనుభవించవలసి ఉండగా అది జరగలేదు. పైగా మత పిచ్చిలో ఉన్న కొంతమంది వాస్తవాలను పరిశీలించకుండా మోడి లాంటివారి విద్వేషపూరిత ప్రసంగాలను నమ్మి ముస్లింలను చంపవలసిందే అని కితాబిస్తున్నారు. ఆ భావాలు ప్రజాస్వామిక భావాలు కాదు. మోడి చేసిందంతా కరెక్టే అని పక్కా ప్రజాస్వామిక వ్యతిరేక భావాలను వ్యక్తం చేస్తున్నారు. చిత్రం ఏమిటంటే వీళ్ళే ఇండియా, అమెరికాలలో ఉన్నది ప్రజాస్వామ్యమెనంటూ ప్రజాస్వామిక భావాలు గుప్పించడం. ఒకవైపు గొప్ప ప్రజాస్వామ్యం అంటూ ప్రజావామ్యానికి విలువ ఇస్తున్నవారిగా ఫోజులు పెట్టడం, మరోవైపు వాళ్లే పరమ కిరాతకంగా ముస్లింలను మోడీ ఆధ్వర్యంలో వేటాడి చంపడం సరైందే అని కితాబు ఇవ్వడం. వీరు ప్రజాస్వామ్య సమర్ధకులా? లేక నియంతృత్వ ఆరాధకులా?

“ఔర్ ఏక్ ధక్కా మారో” అంటూ బాబ్రీ మసీదు కూల్చివేతను ప్రత్యక్షంగా దగ్గరుండి ప్రోత్సహించిన అద్వాని, లిబర్హాన్ కమిషన్ ముందు అసలు నేనక్కడ లేను అని కటిక అబద్ధం చెప్పినా ఆయనకి శిక్ష పడలేదు. అబద్ధమే నిజంగా చెలామణి అయ్యింది. ఇందిరాగాంధి మరణించిన తర్వాత ఢిల్లీలో సిక్కులపై జరిగిన మారణ హోమానికి బాధ్యులైనవారిపైన పాతిక సంవత్సరాలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం కావాలన్నది చాలా చిన్న కోరిక. మొత్తం ప్రజలంతా ఉద్యమిస్తున్నారు. అది ప్రజల కోరిక అని వివిధ రూపాల్ళొ గత రెండు సంవత్సరాలుగా రుజువవుతున్నా పార్టీలు తమ ఎన్నికల ప్రయోజనాల కోసం చూస్తున్నాయి తప్ప ప్రజల కోరికను నెరవేర్చడానికి ముందుకు రాలేకపోతున్నాయి. ఆరువేలమంది మరణానికి దారితీసిన భోపాల్ యూనియన్ కార్బైడ్ కంపెనీ అధిపతి యాండర్సన్ ను భారత ప్రభుత్వం ప్రభుత్వ విమానంలో ముంబై తరలించి అక్కడినుండి అమెరికాకి సగౌరవంగా సాగనంపారు.

భారత పాలకులు తాము ప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయరనీ తమకు కమిషన్లు ఇస్తున్న విదేశీ కంపెనీల ప్రయోజనాలే నెరవేరుస్తారని ఇటువంటి ఘటనలు అనేకం నిరూపించాయి. ప్రజాస్వామికమని చెలామణి అవుతున్న ప్రభుత్వాలు ఆ విధంగా ప్రజల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించగల అవకాశాలు, ఏర్పాట్లూ ప్రస్తుత వ్యవస్ధలో పుష్కలంగా ఉన్నాయి. ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు ఐదు సంవత్సరాల పాటు నెరవేర్చడం కోసం, పాలక  రాజకీయ పార్టీలు ఐదు సంవత్సరాలకోసారి ప్రజల వద్దకు ఓట్ల కోసం వస్తున్నారు. ఒక రోజులో లేదా ఒక నెలరోజుల వ్యవధిలో మొదలై ముగిసిపోయే ప్రక్రియ ప్రజాస్వామ్యానికి చిహ్నంగా చూడాలా లేక అటువంటి ఒకే ఒక్క ప్రక్రియ ద్వారా అధికారం సంపాదించిన పార్టీల ప్రభుత్వాలు ఐదు సంవత్సరాల పాటు అమలు చేసే విధానాలు, వాటి ప్రాధామ్యాలను ప్రజాస్వామ్యానికి చిహ్నంగా చూడాలి. రెండవదే ప్రజాస్వామ్యానికి చిహ్నమని ఎవరైనా అంగీకరిస్తారు.

ఆంద్ర ప్రదేశ్ లో పాలక పార్టీలు తమ ఎన్నికల ప్రయోజనాల కోసం తెలంగాణ సమస్యను నాన్చుతున్నారు. అంటే పాలక పార్టీల ఎన్నికల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఒకటి కాదన్నమాట. పోనీ పార్టీలు అధికారంలోకి వచ్చాకయినా ప్రజల కోరికలను నెరవేరుస్తున్నారా? అదీ లేదు. శ్రీకాకుళంలో ధర్మల్ వ్యతిరేక పోరాటం నుండి ఒరిస్సాళో పోస్కో పోరాటం వరకూ, ఉత్తర ప్రదేశ్ లో ఎక్సప్రెస్ వే వ్యతిరేక పోరాటం వరకూ అన్నీ ప్రజావ్యతిరేక చర్యలే. కంపెనీలకి నష్టం వస్తున్నదని చెప్పి ప్రజలపైన పెట్రోలు, డీజెల్, వంటగ్యాసు రేట్లు నెలకొకసారి పెంచుతున్నారు. కంపెనీలకి నష్టం వస్తే దానిని ఇన్నాళ్లు ప్రభుత్వం భరించింది. ఇప్పుడెందుకు భరించనట్లు? డీ కంట్రోల్ చేసింది కనుక. ఎందుకు డీ కంట్రోల్ చేసినట్లు? సంస్కరణ విధానాలను అమలు చేస్తానని ప్రపంచ బ్యాంకు షరతు విధించింది గనక. వీళ్లని అధికారంలోకి తెచ్చింది ప్రపంచ బ్యాంకా, భారత ప్రజలా? వీళ్ళు ఎన్నికల్ళో  పోటీ చేసేటప్పుడు మేము అధికారంలోకి వస్తే ప్రపంచ బ్యాంకు విధించిన షరతులను అమలు చేస్తాం. అది ప్రజలకు భారమైనా  మేము ఆ విధానాలను అమలు చేస్తాం, వాటిని ప్రజలు భరించవలసిందే అని చెప్పారా? ఎన్నికల్లో ఒకటి చెప్పి అధికారంలోకి వచ్చాక చెప్పినవి చేయకుండా చెప్పనవి చేస్తూ ప్రజల ఉసురు తీసుకుంటున్నాయే ఈ ప్రభుత్వాలు! ఇవి ప్రజాస్వామిక ప్రభుత్వాలు అంటే నమ్మగలమా?

అవినీతిపైన ఉద్యమాలు నిన్నటివరకూ ఉధృతంగా సాగాయి. కాని స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారి పేర్లు ప్రభుత్వానికి తెలిసినా ఆ జాబితా వెల్లడించడానికి ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. ప్రజల డబ్బుని దొంగతనంగా విదేశాలకు తరలించినవారి గౌరవానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది తప్ప ప్రజాస్వామ్య వ్యవస్ధలో జరగాల్సిన విధంగా వారిని అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయడానికి ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నించవు? “అప్పటివరకూ సి.ఎం గా ఉన్న చంద్రబాబు ఎన్నికలు జరిగాక ఒక్క రోజుతో సాధారణ ఎం.ఎల్.ఎ గా మారాడు. పాద యాత్ర చేసిన రాజశేఖర రెడ్డి ఒక్క రోజుతో సి.ఎం అయ్యాడు. ఎంతలో ఎంత మార్పు. ప్రజల ఓటు హక్కుకి ఉన్న మహత్యం అది. ప్రజాస్వామ్యం మహత్వం అది. భారత దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నది” అని తలచుకుంటూ చాలామంది మురిసిపోతుంటారు. కాని అధికారంలోకి వచ్చాక వీళ్ళు అయిదేళ్ల పాటు చేసె ప్రజావ్యతిరేక పనులను ఎత్తి చూపుతూ, ప్రజలపైన చేసిన పోలీసు దాడుల్నీ, ప్రజాందోళనలపై జరిపిన అణచివేతనూ ఎత్తి చూపుతూ ఇవి ప్రజాస్వామ్య ప్రభుత్వాల లక్షణాలు కాదు అని పత్రికలు ఎందుకు చెప్పవు? ఎందుకంటే వారికీ ఈ మేడి పండు ప్రజాస్వామ్యంలో జరుగుతున్న దోపిడిలో వాటా దక్కుతున్నది కనుక. ఈ మేడిపండు ప్రజాస్వామ్యాన్ని నిజమైన ప్రజాస్వామ్యంగా చూపించి నమ్మించడంలో వారి ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయి కనుక.

1947 వరకూ పాక్, బంగ్లాదేశ్ లు భారత దేశంలో భాగమే. ఇప్పటికి కూడా అవకాశం వస్తే వీరి దృష్టిలో, అవి అఖండ భారత్ లో భాగం కావాలి కూడా. అక్కడ నివసిస్తున్న కోట్లాదిమంది ప్రజానీకానికి భారతీయులకు మల్లే భాష, సంస్కృతి, జీవన విధానం, కష్టాలు, కన్నీళ్లు అన్ని ఉన్నాయి. వారినీ, వారి దేశాన్ని హీనంగా చూస్తూ వారు మనుషులే కానట్లుగా ఇష్టం వచ్చినట్లు నిరభ్యంతరంగా మాట్లాడడం, అమెరికా చేస్తున్న సామూహిక హత్యలను చేయవలసిందేనని మద్దతునివ్వడం ఏ కోవలోకి వస్తుంది? వారు మానసిక వికలాంగులైనా అయి ఉండాలి లేదా ఏమీ తెలియని అమాయకులైనా అయి ఉండాలి. సముద్రాల ఆవల ఉన్న అమెరికా ఆయుధాలతో వచ్చి ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లపై దాడులు చేయగలిగినప్పుడు తన మాట వినని పక్షంలో ఇండియాకి కూడా అదే గతి పట్టిస్తుందని ఈ మానసిక వికలాంగులకు ఎప్పుడు అర్ధమవుతుంది? ఎలా చెబితే అర్ధం అవుతుంది? బహుశా నరేంద్ర మోడి భాషలోనే చెబితే అర్ధం అవుతుందా?

ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐ.ఎం.ఎఫ్), ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యు.టి.ఓ) లాంటి జేబు సంస్ధల ద్వారా అమెరికా ప్రపంచవ్యాపితంగా నూతన ఆర్ధిక విధానాలను అమలు చేయుస్తోంది. అందులో భారత దేశంపైన అమెరికా ప్రత్యేక దృష్టి పెట్టింది. భారత దేశంలో ఉన్న మానవవనరులు అతి చౌక ధరలకు దానికి అందుబాటులో ఉండాలి. కాని ఆ మానవవనరుల అవసరాలు తీర్చడానికి మాత్రం దానికి ఆసక్తి ఉండదు. భారత దేశ పాలకులకు లేని ఆసక్తి దానికి ఉంటుందనుకోవడం అత్యాశ. ఈ నిజాన్ని భారతీయ అమెరికా భక్తులు గుర్తించవలసిన అవసరం ఉంది. అమెరికాపై ఈగవాలకుండా చూడడం కాదు వీళ్ళు చేయవలసింది. అమెరికాలో ఉంటూ భారతీయుల ప్రయోజనాలను ఎలా కాపాడాలో దానిపైన దృష్టిపెడితే వారి దేశ భక్తి దేశానికి ఉపయోగపడుతుంది. ముస్లింలపైన యుద్ధం చేస్తున్నది కాబట్టి అమెరికాని ఇష్టపడుతూ ఉంటే, అవసరమని భావిస్తే అది హిందువులపైన కూడా యుద్ధం చేస్తుందని గుర్తెరగాలి.

లిబియా అధ్యక్షుడు గడ్డాఫీతో లిబియాపైన దాడి జరగక ముందు రోజువరకూ సత్సంబంధాలను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు కలిగి ఉన్నాయని బిబిసి, రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్ లాంటి సంస్ధలు వెల్లడిస్తున్నాయి. గూఢచార సంబంధాలు, ఆల్-ఖైదా వ్యతిరేక ఆపరేషన్లు, మిలట్రీ ట్రైనింగ్ అంశాల్లో కూడా ఈ దేశాలు గడ్డాఫీతో సహకారం అందించాయని ఆ పత్రికలు వెల్లడించాయి. కాని గడ్డాఫీకి వ్యతిరేకంగా, తాను, జంట టవర్లపై దాడిని చూపుతూ ప్రపంచ యుద్ధం ప్రకటించిన ముస్లిం టెర్రరిస్టు సంస్ధ ఆల్-ఖైదా తో కూడా అమెరికా, యూరప్ లు జట్టుకట్టడం చూస్తే ఆ దేశాల పరమ నాసిరకం విధానాలను గ్రహించవచ్చు. ముస్లింలపైన యుద్ధం చేస్తున్నదని అమెరికాకు భావదాసులుగా అంట కాగుతున్న ఈ అవకాశవాద దేశ భక్తి పుంగవులు అదే ఆల్-ఖైదాతో కలిసి లిబియాలో గడ్డాఫీకి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అమెరికా, యూరప్‌లు మద్దతు నిస్తున్నాయని వీరు గమనించవలసి ఉంది. అది గమనించాక కూడా వీరి అమెరికా భావదాస్యం కొనసాగితే, ముస్లింలకు అమెరికా వ్యతిరేకమని నమ్మడం కొనసాగితే ఇక వారి గురించి పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటె వారు వ్యక్తపరుస్తున్న దేశ భక్తి, హిందూ భక్తి కూడా బూటకమే నని దానితో రుజువయినట్లే.

అప్రజాస్వామిక బ్లాగర్ల ప్రజాస్వామిక చింతన

ప్రజాస్వామ్య భావజాలం ప్రజలందరినీ సమానులుగా చూస్తుంది. మతాలు, కులాలు, ప్రాంతాలు, దేశాలకు అతీతంగా అన్ని రకాల ప్రజల విశ్వాసాలను సమానంగా గౌరవిస్తుంది. ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఎంచుతుంది. ప్రజాస్వమిక హక్కులు ప్రజలందరికి సమానంగా వర్తింపజేయాలని భావిస్తుంది. పౌరుల మధ్య ఉన్న వివిధ వ్యత్యాసాలను, అంతరాలను తిరస్కరిస్తుంది. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రజాస్వామ్యం గుర్తిస్తుంది. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడాన్ని తిరస్కరిస్తుంది. అలా జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకించడమే కాక ఆ జోక్యందారీ విధానాలపైన అంతర్జాతీయంగా దేశాలను సమీకరించి తిప్పికొడుతుంది. బడుగు దేశాల అభివృద్ధికి తోడ్పడుతుంది. దేశంలోని ప్రజలను ఎలా గౌరవిస్తుందో ప్రపంచంలోని మరే ఇతర దేశాలన్నింటిలోని పౌరులను గౌరవంచి వారి హక్కులను గుర్తిసుంది. స్వార్ధప్రయోజనాల కోసం బలహీన దేశాలపైకి దురాక్రమణ యుద్ధాలకు తెగబడడాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించడమే కాక అందుకు వ్యతిరేకంగా అంతర్జాతీయ శక్తులను కూడగట్టి ఓడించడానికి ప్రయత్నిస్తుంది.

ఈ లక్షణాలేవయినా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, ఇండియాలలో ఉన్న సామాజిక వ్యవస్ధలకు ఉన్నాయా? పెట్టుబడిదారీ వ్యవస్ధకు ప్రజాస్వామిక లక్షణం ఉందని వాదించదలిస్తే, పైన ఉదహరించిన ప్రజాస్వామ్య లక్షణాలను ఆ వ్యవస్ధ కలిగి ఉండాలి. కాని ప్రజాస్వామిక దేశాలుగా చెప్పుకుంటున్న ఈ దేశాలకు పై లక్షణాలేవీ లేవని ఇప్పటివరకూ చర్చించిన అంశాల ద్వారా తెలుస్తున్నది. ఈ దేశాలలోని వ్యవస్ధలకు  ప్రజాస్వామిక లక్షణాలు లేకపోవడమే కాక అవి ప్రజాస్వామ్య వ్యవస్ధలేనని గుడ్డిగా (హేతుబద్ధంగా నమ్ముతున్నవారితో హేతుబద్దంగా చర్చించి రుఫువులతో వారి భావాలను మార్చడమో లేదా మన భావాలనే మార్చుకోవడమో చెయ్యవచ్చు) నమ్ముతూ వాదిస్తున్నవారికి కూడా ప్రజాస్వామిక లక్షణాలు లేని సంగతి మనం గమనించవచ్చు.

ఇలాంటివారు ప్రజాస్వామిక భావజాలాన్ని గురించి చర్చించడమే గొప్పవింత. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ భావజాలం గురించి సరిగ్గా చర్చచేయలేని వీరు ప్రజాస్వామ్యం గురించి చర్చిస్తూ ప్రజాస్వామ్యం కాని దానిని గుర్తించబూనుకోవడం సాహసంగానె చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళు మతపరమైన భారత దేశ ఆత్మ గురించి మాట్లాడతారు గాని, సజీవమైన భారత దేశ ఆత్మ అయిన గ్రామీణ భారతాన్ని గురించి వీరు చర్చించలేరు. నాలుగు అంకెల్ని చూపి అభివృద్ధి అని గుడ్డిగా నమ్మడం తప్ప దానివెనుక ఛిద్రమవుతున్న కోట్లాది ప్రజానీకఫు ఆకలి దరిద్రాలను చూడలేరు. భారత దేశంలో ఆకలి, దరిద్రం తాండవిస్తున్నాయి కనుక వీరికి భారతీయులమని చెప్పుకోవడానికి పరమ నామోషి. కాని కన్నతల్లి లాంటి జన్మభూమిని వదిలి డాలర్ల కోసం అమెరికాకు చేరి దాని దురహంకారానికీ, దోపిడికీ, దుర్మార్గమైన దాని విదేశాంగ విధానానికి పోలో మని మద్దతు వస్తున్న వీరికి ప్రజాస్వామ్యం గురించిన అవగాహన ఉంటుందని భావించడం నేతి బీరలో నెయ్యిని వెతకడమే. అమెరికా విదేశాంగ విధానాలతో పాటు అది, ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల ద్వారా భారత దేశంపై బలవంతంగా అమలు చేయిస్తున్న నూతన ఆర్ధిక విధానాల వలన దేశంలో అనేక వృత్తులలో ఉన్న కోట్లాదిమంది ప్రజలు జీవనాధారం కోల్పోయి ఆకలికి మలమల మాడుతున్న పరిస్ధితిని తొంగిచూడనైనా లేరు.

వీళ్ళు పుట్టింది ఇండియాలో. చదివింది ఇండియాలో. వీళ్ళు చదవడానికి ఉపయోగించబడిన వనరులన్నీ ఇండియావే. భారతీయుల కష్టంతో తయారు చేసినవే. కానీ వీళ్ళు సేవలు చేయాల్సి వచ్చేసరికి అమెరికా, ఇంగ్లండ్ వీటివైపే చూస్తారు. అమెరికా పౌరులు కావడానికి అదే పనిగా వెంపర్లాడతారు. అమెరికా వెళ్ళడానికి అవకాశం రావడమే జీవితంలో సాధించిన పెద్ద విజయంగా మురిసిపోతారు. అమెరికా పౌరుడుగా హోదా లభిస్తే ఇక వారు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినంతగా సంతోషిస్తారు. పుట్టిన దేశాన్ని వదిలిపెట్టి డాలర్ల కోసం అమెరికా చేరి అక్కడ గుళ్ళూ గోపురాలు తిరిగినంత మాత్రానే తమను తాము భారత దేశ వీరాభిమానులుగా ముద్ర వేసుకుని ఆ ముద్రతో భారత దేశంలో నివసిస్తున్నవారిని దేశాభిమానం లెదని ఆక్షేపించడానికి సిద్ధపడడం ఏ కోవలోకి వస్తుంది? మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కడం కాదా ఇది? బతుకంతా అమెరికాకి సేవచేయడానికి అంకితం చేసినవారు దేశ భక్తి గురించి మాట్లాడే అర్హత ఉంటుందా? అమెరికాలో భావదాస్యంలో బతుకుతూ అమెరికా దురాక్రమణ పూరిత విదేశాంగ విధానాన్ని విమర్శిస్తున్న భారతీయులను దేశ భక్తి లేదని ఆక్షేపించడానికి అర్హత ఎక్కడినుండి వస్తుంది? ఒక మతాన్ని నమ్ముతున్న కోట్లాదిమంది ప్రజానికాన్ని కేవలం ముస్లింలు అయినందుకు అకారణంగా ద్వేషించే వారు సోషలిజంపైనా ప్రజాస్వామ్యంపైన చర్చ చేయగల అర్హతను కలిగి ఉంటారా? మొత్తంగా ఒక మతాన్నే ద్వేషిస్తున్నవారు ప్రజలందరి హక్కులను గౌరవించే ప్రజాస్వామిక భావాజాలాన్ని గురించిన చర్చ  నిష్పాక్షికంగా చేయగలరా?

తాము వ్యతిరేకించే భావాలు వ్యక్తం చేసే బ్లాగర్లను వేధించడానికి ప్రయత్నించడం, దూషిస్తూ కామెంట్లు పెట్టడం, తమ భావాలు మాత్రమే బ్లాగర్లు వ్యక్తం చేయాలని నమ్ముతూ భిన్నమైన భావాలు వ్యక్తం చేస్తే ఒక్కరే అనేక పేర్లు మార్చుకుని ప్రాక్సీ ఐ.పి నంబర్లతో సంస్కారహీనంగా దూషించడం వీరు చేస్తున్నారు. తాము ద్వేషిస్తున్న సిద్ధాంతాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియకుండానే ద్వేషిస్తుంటారు. పుక్కిటి పురాణాలు నమ్మి వివిధ సంప్రదాయాల తంతులను పాటిస్తున్న తరహాలోనే పెద్దలు కాని పెద్దలు చేసే విద్వేషపూరిత ప్రసంగాలను ఎక్కించుకుని వాదించడమే వీరికి తెలిసింది. ముస్లింలపై మారణ కాండ సాగించిన మోడీ చేసిన పనులు సరైనవేనని వాదిస్తున్న వీరు ఆ మోడీయే ప్రధానమంత్రి పదవి అందుబాటులో కనిపించడంతో తాను చేసినవి తప్పులేననీ, చూసి చూడనట్లు పోవాలనీ వేడుకుంటున్న సంగతిని గుర్తిస్తున్నారో లేదో తెలియదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారినుండీ, ప్రజాస్వామిక లక్షణాలు ఉన్నవారినుండి ఈ విధమైన ప్రవర్తనను ఆశించలేము.

వీరు చర్చించే పద్ధతీ, భిన్నమైన అభిప్రాయాలను గౌరవించే పద్ధతే అప్రజాస్వామికం కాగా వీరు ప్రజాస్వామిక భావజాలం కలిగి ఉంటారని నమ్మడం అసాధ్యం. ఎటొచ్చీ వారు తమను తాము తెలుసుకోవల్సిన అవసరమే మిగిలి ఉంది. అది కూడా సరైన పద్ధతుల్లో చేయగలిగితేనే వారిని వారు తెలుసుకోగలరు. లేదా వారి ధోరణి కొనసాగుతుంది. బ్లాగర్లు వారిని తిరస్కరించే కొద్దీ ఏకాకులుగా మిగలడం తప్ప వారు చేసేదేమీ ఉండదు.

……ఇంకా ఉంది

5 thoughts on “భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -2

  1. “మానవ శాస్త్రాలలో కొద్ది పరిజ్ఞానం కూడా లేకుండా, అమెరికా, ఇండియా, బ్రిటన్ లలో ఉన్నది ప్రజాస్వామ్య వ్యవస్ధలుగా పత్రికలలోనో, రోజువారీ సంభాషణలలో చెప్పుకుంటున్నదానినే మక్కికి మక్కీగా స్వీకరించి ఆ పరిమిత జ్ఞానంతో ప్రజాస్వామ్యం, సోషలిజం ల మధ్య సంబంధాలను తేల్చేస్తానంటూ బయలుదేరితే ఒలికేది అజ్ఞానమే తప్ప విజ్ఞానం కాదు.”

    సమాజం పట్ల, చరిత్రపట్ల, సామాజిక జ్ఞానం పట్ల నిజంగా ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోదగిన మెరుపు వాక్యం. ప్రజాస్వామ్యంపై ఎవరయినా అంచనా వేయడానికి ముందు బానిసత్వం, భూస్వామ్యం, పెట్టుబడిదారీ విధానాల చరిత్ర క్రమాన్ని పరిణామక్రమంలో అర్థం చేసుకోవలసిందే. మనిషి ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కనీసపాటి స్వేచ్ఛ వెనుక సమాజం ఎంత కష్టభూయిష్ట దశల గుండా పయనించి వచ్చిందో తెలుసుకోవలసిన అవసరం ఉంది. దీన్ని తెలుసుకోవాలంటే అధ్యయనం పట్ల నిజాయితీ, అవతలివాదం పట్ల కనీసపాటి సహన భావం ఉండాలి. బురదజల్లడం, గుడ్డి ద్వేషం ఒక్కటే మార్గంగా పెట్టుకుంటే ఎవరికి పడాల్సిన బురద వారిమీద తప్పకుండా పడుతుంది. బురద చల్లుకోవడం ద్వారా, చల్లించుకోవడం ద్వారా వ్యక్తులకీ, సమాజానికీ కూడా ఎవరికీ ఏ ప్రయోజనం కలగదు.

    తెలుగు బ్లాగులలో ఎంత గొప్ప సైద్ధాంతిక అంశాలను చర్చకు పెట్టవచ్చో తెలిపేందుకు, ఏవి రాయాలో తెలుసుకునేందుకు కూడా మీ బ్లాగు ఒక చక్కటి ఉదాహరణ.

    నడమంత్రపు సిరితో, చదువుతో అమెరికా అందలాలు ఎక్కుతున్న వారిలో అత్యధిక భాగం దేశభక్తి గురించి, స్వదేశంలో ఉన్న బ్రతుకులు కూడా పోగొట్టుకుంటున్న వారికి పాఠాలు చెప్పడానికి సాహసిస్తున్నారు.

    అమెరికా రెస్టారెంట్లలో, క్లబ్బుల్లో, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ నాలుగు డాలర్లు సంపాదించుకోగానే భూమ్మీదినుంచి కాళ్లు పైకి లేపుతున్న వారు రష్యా మానసపుత్రులు, చైనా మానసపుత్రులు అంటూ ఒక భావజాలాన్ని ఆచరించే, విశ్వసించే వారిపై దుమ్మెత్తి పోస్తున్నారు. జీవితం కోసం వలసపోతున్న వారిని అవమానించవలసని పనిలేదు కాని దేశం దాటిన తర్వాతే మనవారిలో చాలామందికి దేశభక్తీ, బూర్జువా భక్తీ కూడా కాస్త హద్దుమీరుతోందనిపిస్తోంది. దేశభక్తి అంటే భారతమాతకు, తెలుగుతల్లికి మొక్కడం అనే అర్థం తప్ప దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ సారం వీరికి అంతగా తలకెక్కుతున్నట్లు లేదు.

    మీ బ్లాగు రూపకల్పనకు సంబంధించి చిన్న సలహా.. దాదాపు ప్రతిరోజూ నాలుగైదు కథనాలతో బ్లాగును నిత్యం అప్‌డేట్ చేస్తూ వస్తున్నారు కనుక నాలుగు రోజుల ముందటి కథనాలు ఇవ్వాళ కనిపించలేదు. భాష,సోషలిజం, ప్రజాస్వామ్యం, మరియు మానవసారం వంటి కథనాలు మీ బ్లాగ్ హోమ్ పేజీలో శాశ్వతంగా ఉండేలా బ్యాక్ ఎండ్‌లో మార్పులు చేయండి. సైద్ధాంతిక, తాత్విక స్థాయి కలిగిన కొన్ని కథనాలను దీర్ఘకాలంపాటు అందరికీ అందుబాటులో ఉంచేలా చేయండి. లేకుంటే పాపులర్ పోస్టులు అనే కేటగిరీలో ఆటోమేటిక్‌గా వచ్చే కథనాల సంఖ్యను కాస్త పెంచండి. వర్డ్‌ప్రెస్ వారి బ్లాగులలో అలాంటి సౌకర్యం ఇస్తున్నారో లేదో తెలియదు.

    అభివందనలు.

  2. రాజశేఖర్ రాజుగారూ, మీరు చెప్పినట్లు మార్పులు చేయడానికి ఈ ధీమ్ లో అవకాశం లేదు. ఒకవేళ ఉందేమో నాకు తెలియదు. కాని ముప్ఫై ప్రీవియస్ పోస్టులు కనపడేలా మార్చాను. అదొక్కటే చేయగలిగాను.

    ఈ బ్లాగ్‌కు teluguvartalu.com అనే డొమెయిన్‌ను రిజిస్టర్ చేసి పెట్టాను. కాని దానిని ఈ బ్లాగ్‌కి లింక్ చెయ్యాలంటే కొంత సొమ్ముని అడుగుతోంది వర్ద్ ప్రెస్. క్రెడిట్ కార్డు లేనందున ఆ పని చేయలేకపోయాను. క్రెడిట్ కార్డ్ తప్ప మరొక పద్దతి అనుమతించడం లేదు.

    ఇంకేదయిన పద్ధతుల ద్వారా నేను కొన్న డొమెయిన్ నేమ్ తో మంచి ధీమ్‌ని రూపొందించి ఎవరైనా ఇవ్వగలిగితే ఉపయోగం ఉంటుంది. కాని ఎవరిని, ఎలా అడిగి సంపాదించాలో నాకు తెలియదు. మీకెవరయినా తెలిస్తే చెప్పండి.

    అడ్వాన్స్ కృతజ్ఞతలు.

  3. ఇప్పుడే చిలక్పేట్ కేడీ గారి బ్లాగ్‌లో ఒక టపా చూశాను. సుకర్ణో కమ్యూనిస్ట్ అని ఎవరో చెపితే నమ్మేశాడట! చైనా నుంచి దేశ బహిష్కరణకి గురైన కొందరు మావో జెడాంగ్ కోట్ల మందిని చంపాడని చేసిన ప్రోపగాండానీ నమ్మేశాడట! ఎద్దు ఈనింది అంటే దూడని కట్టెయ్యడం చూసి నవ్వుకోలేక చచ్చాను.

  4. విశేఖర్ గారూ! తక్షణ వార్తాంశాల అప్ డేట్స్ ఆ రోజు గడిస్తే పాతబడిపోతాయి. కానీ ఇలాంటి సమాచారయుక్త, ఆలోచనాత్మక విశ్లేషణా వ్యాసాల స్వభావం వేరు. రెఫరెన్స్ గా ఉపయోగపడతాయివి. అందుకే ఇలాంటి వ్యాసాల కోసం థీములూ, డొమెయిన్ నేముల ప్రమేయం లేకుండా మరో బ్లాగును మొదలుపెట్టొచ్చు కదా!

  5. వేణు గారు, మీ సూచన అమలు చేయడం గురించి ఆలోచిస్తాను. దానితో పాటు ఒకే బ్లాగ్‌లొ తేలికగా అందుబాటులో ఉండే ధీమ్ కోసం కూడా ప్రయత్నిస్తాను. ఏది ఆచరణీయంగా ఉంటే అది అమలు చేస్తాను. మార్పులు చేసే ముందు మీలాంటి వారిని సంప్రదిస్తాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s