భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -1


సోషలిజం, ప్రజాస్వామ్యంల మధ్య సంబంధాల గురించి నేను గతంలో రాసిన కొన్ని అంశాలపై కొంతమంది బ్లాగర్లు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పటికే పలుమార్లు, పలుచోట్ల వారి సంస్కార రాహిత్యాన్ని బైట పెట్టుకున్నారు గనక వారి వ్యంగ్యాన్ని పక్కనబెడుతున్నా. వారి విమర్శనాంశాన్ని మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటూ దానికి మరికొంత వివరణ ఇవ్వడానికి ఈ టపాని ఉద్దేశించాను. ఈ అంశంపైన ఎక్కువమంది అయోమయానికి గురయ్యే అవకాశం ఉన్నందున ఈ ప్రయత్నం చేస్తున్నాను.

కమ్యూనిస్టు పదజాలం ఏ యిజానికీ సొంతం కాదు

ముందుగా ఒక విషయం స్పష్టం చేయాలి. కమ్యూనిస్టు అనగానే అది కమ్యూనిస్టులకు మాత్రమే సంబంధించిన అవగాహనగా చాలామంది పొరబడే అవకాశం ఉంది. కామ్రేడ్ అన్న పదం కూడా అలాగే కమ్యూనిస్టులకు మాత్రమే చెందిన పదంగా స్ధిరపడిపోయింది. కామ్రేడ్ అనగానే కమ్యూనిస్టులు ఒకరినొకరు సంబోధించుకునే పదం మాత్రమే అని ఇండియాలాంటి చొట్ల వాడుకలో ఉన్నప్పటికీ, నిజానికి పశ్చిమ దేశాల ఆంగ్ల పత్రికలు కానీ, అక్కడి జనం కానీ కామ్రేడ్ పదాన్ని ఇతర సందర్భాలలో కూడా విరివిగా వాడతారు. ముఖ్యంగా ఆ పదాన్ని సహచరుడు అని అర్ధం వచ్చేలా చాలా చోట్ల వాడతారు. ఉదాహరణకి ఈ రాయిటర్స్, బిబిసి వార్తా కధనాలను చూడవచ్చు. ఆఫ్ఘనిస్ధాన్ లో చనిపోయిన బ్రిటన్ సైనికుడిని బిబిసి కామ్రేడ్ గా సంబోధిస్తే, పాకిస్ధాన్ తాలిబాన్ నాయకుడిని కామ్రేడ్ గా సంబోధిస్తూ రాయిటర్స్ సంస్ధ వార్త ప్రచురించింది. కనుక కామ్రేడ్ అన్నది కమ్యూనిస్టుల పదం కాదు. కాకుంటే ఇండియాలో ఆ పదానికి విస్తృత అర్ధం, ప్రచారం తెచ్చింది కమ్యూనిస్టులే.

కమ్యూన్ అంటే ఉమ్మడి ప్రయోజనాలు గల ఒక చిన్న ప్రజా సమూహము ఉమ్మడి ఆస్తులను కలిగి ఉండి తమ ఆస్తుల నిర్వహణపై ఉమ్మడి నిర్ణయాలను తీసుకుంటున్నట్లయితే దానికి కమ్యూన్ అని పిలుస్తారు. పంచాయితీ, మున్సిపాలిటిల లాగా పాలనా పరంగా ‘కమ్యూన్’ పేరుతో ఫ్రాన్సు, ఇంగ్లండులలో కూడా ఏర్పాట్లు ఉండడం మనం గమనించవచ్చు. కాకుంటే అందులో ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకునే బదులు ప్రతినిధి బృందాన్ని ఎన్నుకుని వారి ద్వారా పని జరుపుతుంటారు. ఈ ఏర్పాటు వలన కమ్యూన్ యొక్క ప్రాధమిక అర్ధం మారిపోయింది. కమ్యూన్ అన్న పదం ఒక్క కమ్యూనిస్టులదే కాదని చెప్పడానికి ఈ వివరణ. అది ఆంగ్ల భాషలో ఒక పదం. దాని అర్ధం కమ్యూనిస్టులు చెప్పే సమాజంలోని ప్రాధమిక యూనిట్‌ సభ్యుల సంబంధాలకు సరిపోవడంతో ఆ పదాన్ని కమ్యూనిస్టు భావజాలాన్ని గుర్తించినవారు ఉపయోగిస్తున్నారు.

కనుక భాష, దాని అర్ధం ముందే ఏర్పడి ఉండగా ఆ భాషలోని కొన్ని పదాలకు ఉన్నతమైన అర్ధాలను కమ్యూనిస్టు సిద్ధాంతం విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. అది జరిగిన శతాబ్దం తర్వత భూమ్మీదకు వచ్చిన కొన్ని కుక్కమూతి పిందెలు ఆ సమున్నత భావాన్ని పరిగణలోకి తీసుకోవడానికి బదులు భాషలోని పదజాలాన్నే అవమానపరచడానికి, ఎగతాళి చేయడానికి పూనుకుంటున్నారు. ఏ భాష అయినా ఒక నిర్ధిష్ట ప్రజా సమూహానికి తల్లిలాంటిది. అందులో ఒక్కొక్క పదమూ, పదాల సమూహాలూ ఒక్కొక్క భావాజాలానికీ, ఒక్కొక నాగరికతా ఆవిష్కరణకూ, మానవజాతిలోని వివిధ దశలలోని ఉత్కృష్టమైన, సుసంపన్నమైన సంస్కృతులకు ఆలంబనగా నిలిచాయి. నాగరికత అభివృద్ధి అయ్యే కొద్దీ మరిన్ని పదాలు సృష్టించబడుతూ, ఇతర భాషలలోని పదజాలాలను కూడా స్వీకరించడం ద్వారా మరింత నాగరికతను సంపాదించుకుంటూ ప్రపంచంలోని సమస్త భాషలూ అభివృద్ధి అయ్యాయి.

పదజాలాన్ని హేళన చేయడం కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్లే

ప్రపంచ భాషలలో వివిధ భాషలు వివిధ అభివృద్ధి దశలలో ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా వివిధ భాషలు కొత్త పదజాలాన్ని సృష్టించుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఆయా భాషల ప్రజల అభివృద్ధిలోని వేగాన్ని బట్టి ఆయా భాషల అభివృద్ధి దశలు కూడా నిర్ణయించబడతాయి. ఆ విధంగా అభివృద్ధి చెందిన భాషలు అభివృద్ధి చెందని భాషలను వివిధ పేర్లతో అవమానం చేస్తూ, అణగదొక్కడానికి కూడా ప్రయత్నించడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ సంగతిని పక్కనబెడితే ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క భాష కూడా మరొక భాష కంటే ఎక్కువా కాదు, తక్కువా కాదని గుర్తించాలి. వివిధ ప్రాంతాలలో వివిధ జాతుల ప్రజలు వివిధ అభివృద్ధి దశలలో ఉన్నట్లుగానే, అభివృద్ధి క్రమంలో వివిధ భాషలు వివిధ దశలలో ఉన్నాయని గుర్తించాలి. అది తెలుసుకున్నపుడు భాషకు సంబంధించిన అవహేళనలు, అవమానాలు చెయ్యడంలోని అనౌచిత్యం మనకు అర్ధం అవుతుంది. భాషలోని తప్పొపులను ఎంచడం వెక్కిరించడం పూర్తిగా అర్ధం లేనిదిగా కనిపిస్తుంది. అలా వెక్కిరించడం కుసంస్కారంగా తేలిపోతుంది. భాషలోని తప్పొప్పులను పరస్పరం తెలియజేసుకుంటూ, భాషను మరింత సుసంపన్నం చేసుకోవడమే తప్ప తక్కువ ఎక్కువలపై చర్చలు జరపడం అర్ధరహితం అని తెలుస్తుంది.

పై అవగానతో చూసినప్పుడు సోషలిజానికి సంబంధించిన పదజాలమూ, వివిధ పద ప్రయోగాలూ ప్రస్తుతం ఉనికిలో ఉన్న పదజాలంపై ఆధారపడే ఆవిష్కరించబడతాయని ఇట్టే అర్ధం అయిపోతుంది. ఇప్పటి సమాజం, భాష, సంస్కతి, జీవన విధానాలు మొదలైనవాటినుండే రానున్న సమాజాల భాష, సంస్కృతి తదితరాలు కూడా ఉత్పన్నమవుతాయని గ్రహించగలుగుతాము. కనుక ఒక సిద్దాంతానికి చెందిన పదజాలాన్ని అవమానించడం అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న సమాజంలోని భాష, సంస్కృతులను కూడా అవమానించడమే అన్న సంగతిని గుర్తించాలి. లేనట్లయితే కుసంస్కారంతో, హ్రస్వ దృష్టితో మన తోటివారి భాషా ప్రయోగాలనూ, పదాలనూ చౌకబారు వ్యాఖ్యానాలతో అవమానించడానికి చాలా త్వరగా సిద్ధపడిపోతాము. అందులోని అనౌచిత్యాన్ని గ్రహించగలిగి ఉండి కూడా ఎదుటివారిలోని తప్పొప్పులను ఎంచడానికి లేదా అవమానించడానికి మనకు తెలియకుండానే మనం మాట్లాడుతున్న భాషను కూడా అవమానించడానికి సిద్ధపడిపోతాము. ఇది అంతిమంగా కూచున్న కొమ్మనే నరుక్కోవడంతో సమానంగా బయటపడుతుంది. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే స్వార్ధ జీవులుగా గుర్తించబడతాము.

మానవ సమాజ అబివృద్ధి క్రమం

మానవ సమాజం ఏర్పడినప్పటినుండీ వివిధ దశలను దాటుకుంటూ వచ్చింది. ఆదిమ కాలంలో అదిమ కమ్యూనిస్టు సమాజం రూపంలో మానవ సమాజం ఉండేది. ఆదిమ కమ్యూనిస్టు సమాజం అంటే పైన చెప్పినట్లుగా అది కమ్యూనిస్టులు కాల యంత్రంపైన వెనక్కి ప్రయాణించి ఆదిమ సమాజాన్ని కమ్యూనిస్టు సమాజంగా మార్చారని భావిస్తే అది కరెక్టు కాదు. ముందే చెప్పినట్లుగా భాష, సమాజం పరస్పరం ఒకరినొకర ప్రభావితం చేసుకుంటూ వచ్చాయని గుర్తించనట్లయితే అభివృద్ధి చెందిన భాషను ఉపయోగిస్తూ గడచిన సమాజాల లక్షణాలను అభివృద్ధి చెందిన పరిజ్ఞానం ద్వారా పరికించినప్పుడు ఆ సమాజాల లక్షణాలకు అనుగుణంగా తాజాగా పేర్లు పెట్టుకోవడం సంభవిస్తుంది. అలా పెట్టిన పేరే ‘ఆదిమ కమ్యూనిస్టు సమాజం’.

కమ్యూన్ అనగా ఏమిటో నిర్వచనం ముందు చూశాం. ఆదిమ కమ్యూనిస్టు సమాజంలో మనుషుల మధ్య ఎటువంటి తేడాలు లేవు. అప్పట్లో మిగులు ఉత్పత్తి జరగడానికి అనుగుణంగా ఉత్పత్తి సాధనాలు అభివృద్ధి చెందనందున, వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని సమంగా సమూహంలో ఉన్నవారికి పంచగా మిగులేవీ ఉండేది కాదు. ఆ విధంగా ఒక సమూహం వేటాది తెచ్చుకున్న ఆహారాన్ని అంతా సమానంగా పంచుకుంటూ సాగినందున ఆ సమాజాన్ని కమ్యూన్ లు ఉన్న సమాజంగా, కమ్యూనిస్టు సమాజంగా గుర్తించాము. ‘కమ్యూనిస్టు’ అన్న పదం ఇక్కడ ఒకరి ఇష్టా ఇష్టాలతోనో, లేదా పెట్టుబడిదారీ సమాజంలో నామకరణం జరిగినట్లుగా కొందరు వ్యక్తుల పేర్లను బట్టో పుట్టినది కాదు. కమ్యూన్ అన్న పదానికి అప్పటికే ఒక అర్ధం ఉన్నందున, ఆ ఆర్ధానికి ఆదిమ సమాజంలోని ప్రజల జీవన విధానం సరిపోయినందున మాత్రమే దానిని ‘కమ్యూన్ + ఇస్టు సమాజం’ గా నామకరణం చేశారని గుర్తించాలి.

ఆ తర్వాత క్రమంగా ఉత్పత్తి సాధనాలు అభివృద్ధి అయ్యాయి. వ్యవసాయం అభివృద్ధి చెంది భూమి ప్రధాన ఉత్పత్తి సాధనంగా మారిపోయింది. భూమిపైన అంతగా అభివృద్ధి చెందని ఉత్పత్తి సాధనాలపైన ప్రధానంగా మానవ శ్రమ పెద్ద ఎత్తున శ్రమ అవసరం అయ్యింది. మిగులు ఉత్పత్తి సమకూడుతున్న పరిస్ధితుల్లో ఆ మిగులుకు సొంతదారు ఎవరన్న ప్రశ్న ఉదయించింది. సహజంగానే ఒక సమూహాన్ని ముందుండి నడిపించే పెద్ద సదరు మిగులు ఉత్పత్తికి సొంతదారుగా గుర్తించబడ్డాడు. మిగులు ఉత్పత్తిపై యాజమాన్యం పెరిగే కొద్దీ అటువంటి యజమానిపైన గౌరవం, భయం లాంటి భావాలు క్రమంగా ఏర్పడ్డాయి. అవి కాస్తా తెగ పెద్ద పెత్తనానికి దారి తీసింది. అలా మిగులు ఉత్పత్తిపైన యాజమాన్యం ఉన్నవారికి తెగపైన పెత్తనం చేసే అధికారం సిద్ధించింది. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తెగలోని బలహీన సభ్యులను చెప్పుచేతల్లో ఉంచుకుంటూ వారి చేత శ్రమ చేయిస్తూ మరింత మిగులు ఉత్పత్తిని యజమాని సంపాదించగలిగాడు.

యజమాని వద్ద మిగులు ఉత్పత్తి పేరుకుపోయే కొద్దీ వారి పలుకుబడి, పెత్తనం, అధికారం కూడా పెరిగాయి. క్రమంగా యజమాని బానిస వ్యవస్ధ ఏర్పడింది. చరిత్రలో మొదటిసారిగా మానవ సమాజంలో వర్గాలు ఏర్పడ్డాయి. వర్గాలు ఏర్పడ్డాక ఆధిపత్యంలో ఉన్న వర్గం వ్యవస్ధను కొన్ని కట్టుబాట్ల మధ్య నిర్బంధించి ఉంచడానికి సాధనాలు అవసరం అయ్యాయి. ఆ అవసరం నుండే సైన్యం, పోలీసుల వ్యవస్దలు పుట్టుకొచ్చాయి. బానిస వ్యవస్ధలే పెద్ద పెద్ద సామ్రాజ్యాలని నిర్మించాయి. సమాజంలో మెజారిటీ ప్రజలు కట్టుబానిసలుగా విపరీతమైన శ్రమ చేస్తూ రోజులో అత్యధిక కాలం శ్రమలో మునిగి ఉన్న ఫలితంగా సంపదలు కూడా పెద్ద ఎత్తున కేంద్రీకృతమైనాయి. అయితే అణచివేట ఉన్న చోట తిరుగుబాటు ఏదో ఒక నాడు తప్పనట్లె బానిసలు బానిస యజమానుల పైన తిరుగుబాటు చేసి సమాజాన్ని మార్చుకోవడానికి నిర్ణయత్మక పోరాటాలు నిర్వహించడంతో క్రమంగా బానిస వ్యవస్ధ అంతరించి బానిసలు పరిమిత స్వతంత్రం ఉండే స్ధితి అమలులోకి వచ్చింది. దీనినే ఫ్యూడల్ వ్యవస్ధగా పిలుస్తున్నారు.

ఫ్యూడల్ వ్యవస్ధ

వ్యూడల్ వ్యవస్ధ లేదా భూస్వామ్య వ్యవస్ధలో అత్యధిక ప్రజానీకం చిన్న చిన్న కమతాలున్న రైతులుగా బతికారు. వారు ప్రధానంగా రాజుల భూముల్లోనో, జమీందారు భూముల్లోనో ఉచితంగా శ్రమ చేయవలసి ఉండేది. పరిమిత కాలం వరకే తమ సొంత భూముల్లో పని చేసి ఉత్పత్తి చేసే వారు. రాజులు, జమీందారుల పొలాల్లొ ఉచితంగా చేసిన శ్రమ ద్వారా జరిగిన ఉత్పత్తి రాజులకీ, జమీందారులకె పోయేది. అది కాక తమ భూముల్లో శ్రమ చేయడం ద్వారా జరిగిన ఉత్పత్తిలో అత్యధిక భాగం శిస్తులు కట్టమని రాజు సైనికులూ, భూస్వామి గూండాలు తీవ్ర ఒత్తిడి తెచ్చేవారు. మిగులు ఉత్పత్తిని సొంత చేసుకున్న కులీనులు శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. కనుక వారికి బోల్డంత సమయం తీరిక దొరికి ఇతర వ్యాపకాలను అభివృద్ధి చేసారు. అలా కొద్ది శాస్త్రాలు వృద్ధి చెందాయి. శాస్త్రాలు అభివృద్ధి చేసినవారిలో అత్యధికులు తమ కాలంలో ఉనికిలో ఉన్న సమాజాలకు అనుగుణంగా, ఆ సమాజాలలో ఆధిపత్యంలో ఉన్న వర్గాలకూ, వారి పాలనకూ అనుకూలంగా సిద్ధాంతాలు సృష్టించి వారి ఆధిపత్య కలకాలం కొనసాగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అనేక నమ్మకాలు, నిర్హేతుక సిద్ధాంతాలు సృష్టించి ప్రజలపై దోపిడి అనేది ఖర్మ ద్వారా సంభవించినదనో, దేవుడి శాసనాలనో, రాజే దేవుడనో ఇలా శ్రమ చేస్తున్న ప్రజలు తెలివి మీరి తిరుగుబాటు చేయకుండా చర్యలు తీసుకున్నారు.

ఎన్ని ఖర్మ సిద్ధాంతాలు సృష్టించినా ఎంతమంది దేవుళ్లను ఉనికిలోకి తెచ్చినా అంతిమంగా అణచివేయబడుతున్న ప్రజలు తిరుగుబాటు చెయకతప్పదు అన్నది సహజ సూత్రం. భూస్వామ్య సమాజంలో ఉత్పత్తి సాధనాలు అభివృద్ధి చెంది పారిశ్రామికీ విప్లవాలు సంభవించాయి. యంత్రాలతో ఉత్పత్తి, యంత్రాలతో రవాణా లాంటి సౌకర్యాలు అబివృద్ధి చెందాయి. అయితే ఆధునికి పారిశ్రామిక యుగంలో యంత్రాలతో ఉత్పత్తి చేయడానికి పెద్ద ఎత్తున మానవ శ్రమ అవసరమయ్యింది. యంత్రాల వద్ద పెద్ద ఎత్తున మనుషులు శ్రమ చేస్తే తప్ప ఉత్పత్తి రాని పరిస్ధితుల్లో పెట్టుబడులు పెట్టిన భూస్వామ్య సమాజాల్లోని ధనవంతులకు కార్మికుల అవసరం పడింది. కాని శ్రమ చేసే వారు అత్యధికసంఖ్యలో అర్ధ బానిసలుగా రాజులు, జమీందార్ల వద్ద శ్రమలు చేస్తూ గడుపుతున్నారు. వారేమో తమ వద్ద సంవత్సరం పొడుగూతా ఉచితంగా పని చేసి పెట్టే రైతులను కార్మికులుగా పట్టణాల్లోని పరిశ్రమల్లో పని చేయడానికి ఇష్టపడలేదు. దానితో పెట్టుబడిదారులుగా నూతనంగా అభివృద్ధి చెందిన ధనిక వర్గానికీ, మానవ శ్రమను అర్ధ బానిసలుగా తమ గుప్పిట్లో పెట్టుకున్న జమీందారీ భూస్వామ్య వర్గానికి (లేదా ఫ్యూడల శక్తులకూ) వైరుధ్యం తలెత్తింది. ఈ వైరుధ్యం క్రమంగా ప్రధాన వైరుధ్యంగా ముందుకొచ్చింది. అంటే ఈ వైరుధ్యాన్ని పరిష్కరిస్తే తప్ప మానవ సమాజం ముందుకు నడవని పరిస్ధితి తలెత్తింది.

పెట్టుబడిదారీ వ్యవస్ధ

భూస్వాములు తమ పొలాల్లొ ఉచితంగా పని చేస్తున్నందున రైతులను వదులుకోరు. పెట్టుబడిదారులేమో శ్రామిక వర్గం లేకుండా ఒట్ఠి పెట్టుబడితో పరిశ్రమలను నడపలేరు. జమీందారు భూముల్లో జరిగి ఉత్పత్తి విధానం పాతబడి పోయింది. దానివలన సమాజంలోని ప్రజానికానికంతటికీ సరిపోయినంత ఉత్పత్తి జరగని పరిస్ధితి. మరోవైపు పెట్టుబడిదారుల పరిశ్రమల్లో యంత్రాల వినియోగం వలన పెద్ద ఎత్తున ఉత్పత్తి సాధ్యమవుతున్న పరిస్ధితి. కనుక జమీందారీ వ్యవస్ధపైన పెట్టుబడిదారీ వర్గం నాయకత్వంలో కార్మికులు, రైతులు, ఇతర కులీన వర్గాలు తిరుగుబాటు జరిపాయి. అటువంటి తిరుగుబాట్లతోనే పెట్టుబడిదారీ వ్యవస్ధలు ఏర్పడ్డాయి. ఈ తిరుగుబాట్లను ప్రజాస్వామిక విప్లవాలు అని అన్నారు. ప్రజాస్వామిక విప్లవాలకు పెట్టుబడిదారీ వర్గం నాయకత్వం వహించింది. ఎందుకంటె పెట్టుబడిదారీ వ్యవస్ధలో అత్యధికంగా లబ్ది పొందేది ఆ వర్గమే. అత్యధిక సంఖ్యలో ఉన్న రైతాంగం వారికి సహకరించింది. ఎందుకంటె పెట్టుబడిదారీ వ్యవస్ధలో రైతుల అర్ధ బానిసత్వం నశించి తన శ్రమపైన పూర్తి స్వతంత్రతను కలిగి ఉంటాడు.

కార్మికుడికి తన శ్రమపైన స్వతంత్రత ఉండడం అంటే ఏమిటి? అంటే, తన శ్రమను తన ఇష్టం వచ్చిన పెట్టుబడిదారుడికి అమ్ముకునే స్వేచ్ఛ కార్మికుడికి వచ్చిందని అర్ధమే తప్ప కార్మికుడి జీవితం మొత్తంలో స్వతంత్రత వచ్చిందని కాదు. కార్మికుడు ఏ పెట్టుబడిదారుడికి తన శ్రమను అమ్ముకున్నా వచ్చే వేతనంలో తేడా ఉండదు. కాని కార్మికుడికి అమ్ముకోవడానికి శ్రమ తప్ప వేరే సాధనమేదీ ఉండదు. అటువంటి వారినే ప్రొలెటేరియన్ కార్మిక వర్గంగా మార్క్సు పేర్కొన్నాడు. ప్రొలెటేరియన్ కార్మిక వర్గమే సోషలిస్టు విప్లవంలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తారని గత విప్లవాలలో రుజువయ్యింది. ప్రొలెటేరియన్ కాని కార్మిక వర్గం అంటే ఎవరు? తమ శ్రమను అమ్ముకోవడం ద్వారా జీవనాన్ని నెట్టుకొస్తున్నప్పటికీ కార్మికులలో కొంతమందికి పొలాలు ఉండవచ్చు. లేదా శ్రామికవర్గంలోనే నైపుణ్యాన్ని బట్టి కొద్దిగా హెచ్చు వేతనం అంది ఆస్తులు పరిమితంగా పోగుబడవచ్చు. కొద్ది పాటి పెట్టుబడిని కూడబెట్టి మరొక చిన్నవ్యాపారమో చేస్తూ అదనపు ఉత్పత్తిని తీస్తూ ధనికుడు కావచ్చు. అలా కొద్ది పెట్టుబడి కల్గిన వీరిని పెట్టీ బూర్జువాలుగా వ్యవరిస్తున్నాము.

పెట్టీ బూర్జువాల వేతన శ్రామికీకరణ

వీరంతా ప్రధానంగా శ్రమమైన ఆధారపడుతున్నప్పటికీ ఇతర ఆస్తులున్నందు వలన ఉద్యమాలలో నిర్ణాయక పాత్రను పోషించలేరు. కార్మికుడిగా పని పోతే మరొక ప్రత్యామ్నాయం వారికి కొద్ది పెట్టుబడి, నైపుణ్యం రూపంలో కనపడుతూ ఉంటుంది. ఇతర మార్గాలలో కూడా బతకడానికి కనపడుతున్న అవకాశాలు అతనిని నిర్ణయాత్మక పోరాటం చేయగల తెగింపునుండి వెనక్కి గుంజుతుంటాయి. ఆ లక్షణమే అతనిని ప్రొలెటేరియన్ కార్మిక వర్గం నుండి దూరంగా పెడుతుంది. కొద్దీపాటి ఆస్తులనుండి ధనవంతులుగా పరిగణించదగిన వర్గాల వరకూ ఉన్న పెట్టీ బూర్జువా వర్గం, పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు తీవ్రమవుతున్న తరుణంలో, తమవద్ద అదనంగా పెట్టుబడి కలిగి ఉన్న లక్షణాలని కోల్పోవలసి వస్తుంది. అంటే పెట్టుబడిదారీ వర్గం అంతకంతకూ సంక్షోభంలొ కూరుకుపోతున్నపుడు క్రింది వర్గాల నుండి దోపిడి చేయడం తీవ్రం చేస్తాడు. ఇలా తీవ్రమయ్యే దోపిడి వలన పెట్టి బూర్జువాలు క్రమంగ తమ అధనపు ఆర్ధిక సామర్ధ్యాన్ని కోల్పోయి పని చేస్తే తప్ప తిండిగడవని పరిస్ధితికి చేరుకుంటాడు.

పరిపక్వమైన పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలు ఉన్న అమెరికా, యూరప్ దేశాలలో ప్రస్తుతం ఈ ప్రక్రియ నడుస్తోంది. పెట్టుబడిదారీ వర్గాలు తీవ్రమైన అధిక ఉత్పత్తి సంక్షోభంలో కూరుకుపోయి మార్కెట్లు క్రమంగా కుచించుకుపోతున్న పరిస్ధితిలో ఉన్నారు. పొదుపు విధానాలు అమలు చేస్తూ కార్మికులు, ఉద్యోగులు తదితర వర్గాలకు ఇస్తున్న సదుపాయాలను, సంక్షేమ పధకాలనూ రద్ధు చేయడమో, కోత పెట్టడమో చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం, సోషలిస్టు వ్యవస్ధల నుండి వివిధ భయాలు ఎదురవుతున్న నేపధ్యంలో అమెరికా యూరప్ లు పరిమిత స్దాయిలో అయినా సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టాయి. దానితో కార్మికులు, ఉద్యోగుల నుండి మధ్య తరగతి వర్గం పుట్టుకొచ్చింది. వీరిని పెట్టీ బూర్జువాలుగా పరిగణించాలి.

కాని తాము సంక్షోభంలో పడటం, పోటీగా సోషలిస్టు వ్యవస్ధలు కూడా లేనందున పెట్టుబడిదారులకు ఇక సంక్షేమ పధకాలు, సదుపాయాలు ఇవ్వవలసిన అవసరం తప్పింది. దానితో వారు తమ సంక్షోభాన్ని దేశ సంక్షోభాలుగా చూపుతూ సదరు భారాన్ని కార్మికులు ఉద్యోగులపైన వేస్తున్నారు. అంటే కార్మికులు, ఉద్యోగుల సదుపాయాలను రద్దు చేస్తున్నారు. దానివలన పెట్టీ బూర్జువాలుగా ఉన్న కార్మిక, ఉద్యోగ వర్గం శ్రమ తప్ప బతకాడానికి మరేమీ లేని స్ధితికి నెట్టబడుతున్నారు. అంటే పెట్టి బూర్జువా వర్గం ప్రొలెటేరియనైజ్ అవుతుందన్నమాట లేదా వేతన శ్రామికీకరణ చెందుతున్నదన్న మాట!

పెట్టీ బూర్జువా వర్గం “వేతన శ్రామికీకరణ” చెందే కొద్దీ ప్రొలెటేరియన్ కార్మిక వర్గం జనాభాలో అత్యధిక సంఖ్యకు చేరుకుంటుంది. వీరు సోషలిస్టు చైతన్యం పొందినట్లయితే నిర్ణయాత్మకమైన తిరుగుబాట్లకు నాయకత్వం వహించే పరిస్ధితి అభివృద్ధి చెందుతుంది. కార్మిక వర్గ ప్రొలెటేరియనైజేషన్ అధికంగా జరిగి సోషలిస్టు చైతన్యం పొందిన సామ్రాజ్యవాద దేశాల్లో సామ్రాజ్యవాద గొలుసు యొక్క లింకు బలహీనపడే అవకాశాలు పెరుగుతాయి. ఈ బలహీనతను కార్మికవర్గం సొమ్ము చేసుకోగలిగితే అక్కడ సోషలిస్టు విప్లవాలు బద్దలవుతాయి. లేనట్లయితే సమాజం మరింతగా క్షీణతకు గురవుతూ ఉంటుంది. ఈ లోగానే ఆ దేశాల్లో స్వీయాత్మక పరిస్ధితులు అభివృద్ధి చెందడానికి కార్మిక వర్గం విస్తృతమైన ప్రయత్నాలు చేపట్టాలి. మార్క్సిస్టు లెనిస్టు పార్టీ స్ధాపన, కార్మిక వర్గ సమీకరణ, అంతిమంగా విప్లవాన్ని విజయవంతం చేయడానికి కార్మిక వర్గం తగిన ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.

పెట్టుబడిదారులకు నిజాలు నచ్చవు

పెట్టుబడిదారీ వర్గం సమాజంలో జరిగే ఈ పరిణమాల పట్ల ఏ దృక్పధాన్ని కలిగి ఉంటుంది? పెట్టుబడిదారీ వ్యవస్ధలో ప్రభుత్వాలు సామాజిక పరిణామ క్రమంపైన ఒక దృక్పధాన్ని కలిగి ఉంటాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రయోజనాలను నెరవేర్చేవరకూ మాత్రమే ఆ దృక్పధం విజ్ఞానాన్ని ఆమోదించగలుగుతుంది. అంతకు మించి జ్ఞానం అభివృద్ధి చెందినప్పటికి అది పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రయోజనాలకు అనుగుణంగా లేనట్లయితే పెట్టుబడిదారీ వర్గం ఆ జ్ఞానాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తుంది. తాను వాస్తవాలను అణచివేస్తున్నాననీ, మానవ సమాజ వికాసాకి దోహదపడగల విజ్ఞానాన్ని తొక్కి పెడుతున్నానని తెలిసినప్పటికీ పెట్టుబడిదారీ వర్గం తన ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నట్లయితే దానిని వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడుతుంది. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్, లిబియాలలో వాస్తవాలను తొక్కిపెట్టి పరమ అబద్ధ కూతలను ప్రచారం చేసినట్లుగానే అది నిజాలను గొంతును కూడా తొక్కి ఉంచుతాయి.

కనుక పెట్టుబడిదారీ వ్యవస్ధ తన తదనంతరం ఏర్పడే వ్యవస్ధలను స్వాగతించడనికి సిద్ధంగా ఉండదు. సిద్ధమయినట్లయితే తాను పెట్టుబడిదారీ వర్గంగా నశించిపోవడానికి అంగీకరించినట్లే లెక్క. కనుక తాను ఆధిక్యత వహించే వ్యవస్ధ కుప్పకూలి సమసమాజ వ్యవస్ధ ఆవిర్భవిస్తుందన్న నిజాన్ని అది భరించలేదు. ఆ భావజాలాన్ని తొక్కి పెట్టడానికి దాని గురించిన జ్ఞానం ప్రపంచానికి అందకుండా చేస్తుంది. అందుకె పెట్టుబడిదారులు సోషియాలజీ సబ్జెక్టులో పెట్టుబడిదారీ వ్యవస్ధ ఏర్పాటు అయ్యేవరకూ వివిధ సామాజిక పరిణామాల చరిత్రను ఆమోదిస్తుంది కానీ పెట్టుబడిదారీ వ్యవస్ధ కూడా వైరుధ్యలాతో నిండి ఉన్నదనీ, అత్యధిక సంఖ్యలో ప్రజలు అనేక కష్టాలతో బతుకులు వెళ్లదీస్తున్నారనీ వారు తమ బతుకులు బాగు చేసుకోవడానికి అనివార్యంగా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటారనీ, ఆ వెతుకులాటలో భాగంగానే వారు పెట్టుబడిదారీ వర్గాన్ని కూలదోయడానికి సిద్ధపడతారనీ మాత్రం వారు గుర్తించరు. వారికి పెట్టుబడిదారీ వ్యవస్ధ ఏర్పడ్డాక కాల చక్రం తిరగడం ఆగిపోతుంది. పెట్టుబడిదారుల ప్రయోజనాలు అత్యున్నత స్ధాయిలో నెరవేరడం వరకే కాలం తిరిగి ఆ తర్వాత స్తంభించిపోతుంది. కాని స్తంభించిన సమాజాలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతాయి. మళ్ళీ ఊపిరి పీల్చడానికి ప్రయత్నిస్తాయి. ఆ ప్రయత్నాలే కార్మిక వర్గ విప్లవాలు.

పెట్టుబడిదారీ వ్యవస్ధ ఏర్పాటు అయ్యే వరకూ సామాజిక పరిణామాలన్నింటినీ పెట్టుబడిదారులు గుర్తిస్తారని ఇక్కడ విమర్శకులు గుర్తించాలి. ఇప్పటివరకు గుర్తించబడిన శాస్త్రాల వెలుగులో మాత్రమే ఏ చర్చయినా అర్ధవంతంగా ఉంటుంది. సోషలిజం అంటే ఏమిటో తెలియకుండానే గుడ్డి ద్వేషం ప్రదర్శిస్తున్న వాళ్లు కనీసం పెట్టుబడిదారీ వ్యవస్ధ ఆమోదించే జ్ఞానాన్నయినా గుర్తించవలసి ఉంటుంది. అదేమిటో తెలియకుండా, తెలుసుకోకుండా సోషలిజంపై యుద్ధం ప్రకటించిన సర్వ సైన్యాధికారిలా తనకు తాను భాధ్యతను నెత్తిమీద వేసుకుని తప్పులు కాని తప్పులను ఎంచుతూ అజ్ఞానాన్ని ఒలకబోయడం వలన ఒనగూరే ఫలితం గుండు సున్న అని గుర్తించాలి. తద్వారా వెల్లడయ్యేది అజ్ఞానమే తప్ప అర్ధవంతమైన చర్చ కాదని గుర్తించాలి.

3 thoughts on “భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -1

  1. ఈ విషయాలు కొందరు మేతావులకి అర్థం కావు. కమ్యూనిజం గురించి ఏమి అడిగినా మీ రష్యాలో కమ్యూనిజం ఎందుకు ఓడిపోయింది, మీ చైనాలో కమ్యూనిజం ఎందుకు ఓడిపోయింది అని అరిగిపోయిన రికార్డ్ తిప్పుతారు. ట్రైన్ గురించి అడిగితే ఆవు, విమానం గురించి అడిగితే ఆవు అనే విద్యార్థిలా ఉంటాయి వాళ్ళ మాటలు.

  2. మీరు విషయాలను వివరించే తీరు బాగుంది. సుదీర్ఘమైన ఇలాంటి వ్యాసాలను రాసేటపుడు ఉపశీర్షికలు ఉంచితే స్పష్టత పెరుగుతుంది!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s