
ఈ హెచ్చరికను పాక్ అధికారులు అంగీకరించలేదు. ఆఫ్ఘనిస్ధాన్ భూభాగంపై జరుగుతున్న తప్పులకు తాము బాధ్యులం కాదని తెలిపారు. అమెరికాకి చెందిన నేవీ సీల్ కమెండోలు మే నెలలో పాకిస్ధాన్ గగన తలంలోకి జొరబడి అబ్బోత్తాబాద్ లో స్దావరం ఏర్పాటు చేసుకున్న బిన్ లాడేన్ను చంపామని ప్రకటించాయి. జనవరిలో ఇద్దరు పాక్ పౌరులను సి.ఐ.ఎ గూఢచారి కాల్చి చంపిన ఘటన అనంతరం పాక్ ప్రజల్లొ అమెరికాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అనేక ప్రదర్శనల ద్వారా నిరసన తెలపడంతో సి.ఐ.ఎ గూఢచారులను పాక్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో దేశం నుండి వెళ్ళగొట్టింది. అమెరికా అధికారులు ఆ తర్వాత నచ్చజెప్పాలని ప్రయత్నించినా పాక్ ఆర్మీ వినలేదు. దానితో పాక్కి అందాల్సిన ఒక వాయిదా సహాయాన్ని అమెరికా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు మరికొన్ని ఘటనల అనంతరం పాక్, అమెరికాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని పత్రికలు కోడై కూస్తున్నాయి. అమెరికా, పాక్ ల అధికారులు కూడా తమ సంబంధాలు దెబ్బతిన్నాయని వివిధ సందర్భాలలో అంగీకరించారు.
ఈ నేపధ్యంలో తాజా మిలిటెంట్ల దాడి మరొకసారి అమెరికా, పాకిస్ధాన్ అధికారుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. పాకిస్ధాన్ వైపునుండి మిలిటెంట్లు ఆఫ్ఘనిస్ధాన్ లోకి చొరబడుతున్నారని చెప్పడం వాస్తవ విరుద్ధమనీ, తాము అటువంటి కార్యకలాపాలను కొద్ది కాలంగా చూడలేదని పాక్ అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్ధాన్ భూభాగంపైన మిలిటెంట్లను కట్టడి చేయవలసిన బాధ్యత అమెరికాదేనని తేల్చి చెప్పారు. “టెర్రరిజంపై పోరాటానికి మా వద్ద అందుబాటులో ఉన్న వనరులనన్నింటినీ వినియోగిస్తున్నాము. హక్కాని గ్రూపు పాకిస్ధాన్ భూభాగం నుండి వచ్చి ఆఫ్ఘన్ లో దాడులు చేయడానికి సంబంధించి మాకెప్పుడైనా సాక్ష్యాధారాలు ఇచ్చారా?” అని ఒక పాక్ మిలట్రీ అధికారి ప్రశ్నించాడని రాయిటర్స్ తెలిపింది. ఆఫ్ఘన్ వైపు అందరిని స్వేచ్ఛగా వదిలేస్తూ పాక్ భూభాగంపై కట్టడికి ఏమీ చేయడం లేదని ఆరోపించడం సరైంది కాదు అని వారన్నారు.
పాకిస్ధాన్ నుండి మిలిటెంట్లు ఆఫ్ఘనిస్ధాన్ లోకి రాకుండా తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని పాక్ సైన్యాధికారి చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. “కాని మిలిటెంట్లు ఆఫ్గన్ సరిహద్దుల పరిధిలో ఏమైనా చేస్తే దానికి బాధ్యత ఆఫ్ఘన్, అమెరికాల భద్రతా బలగాలదే. వారు ఆఫ్ఘన్ భూభాగంపై రాకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా వారిదే. సరిహద్దుకి ఆవల ప్రతి ఒక్కరినీ స్వేచ్ఛగా వదిలేస్తూ, పాకిస్ధాన్ చేయవలసినంత చేయడం లేదు అనడం సరికాదు” అని వారన్నారని రాయిటర్స్ తెలిపింది. హక్కాని గ్రూపుతో తమకు సంబంధాలు ఉన్నాయనడం కూడా నిజంకాదని పాక్ అధికారులు తెలిపారు. సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మెల్లగా ప్రయత్నాలు చేస్తుండగా తాజా ఘటన చోటు చేసుకోవడంతో ఆ ప్రయత్నాలకు బ్రేకులు పడ్డట్లయింది.
