
పాకిస్ధాన్కి అమెరికా తాజాగా హెచ్చరిక జారీ చేసింది. తాలిబాన్ మిలిటెంట్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నడిబొడ్డున ఉన్న అమెరికా ఎంబసీ, నాటో కార్యాలయం ఉన్న ప్రాంతంపైన రాకెట్లు, మెషిన్ గన్లతో దాడి చేసింది. మంగళవారం మధ్యాహ్నం నుండి బుధవారం ఉదయం వరకు ఇరవై గంటలపాటు సాగిన ఈ దాడిలో పెద్దగా నష్టం ఏమీ జరగనప్పటికీ, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ‘హై సెక్యూరిటీ జోన్’ లోకి రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, మెషిన్ గన్లతో సహా మిలిటెంట్లు జొరబడడం అమెరికా బలగాలు, అధికారుల భద్రతకు అవమానకరంగా మారింది. గట్టి భద్రత ఉన్న చోట్లకు గూడా తాలిబాన్ మిలిటెంట్లు జొరబడడం అమెరికాకి మింగుడు పడడం లేదు. దానితో తన అసమర్ధతను పాకిస్ధాన్ను హెచ్చరించడం ద్వారా కప్పిపుచ్చుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తున్నది. కాబూల్ పై జరిగిన దాడి పాక్లో ఉన్న హకాని గ్రూపు మిలిటెంట్ల పని అని అమెరికా భావిస్తోంది.
అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టా (సి.ఐ.ఎ మాజీ అధిపతి) బుధవారం పాకిస్ధాన్ ని హెచ్చరించాడు. పాకిస్ధాన్లో ఉన్న మిలిటెంట్ల నుండి ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న అమెరికా బలగాలను రక్షించుకోవడానికి చేయగలిగినదంతా చేస్తామని ఆయన హెచ్చరించాడు. అమెరికా ఎంబసీ కాంపౌండ్ లోకి మంగళవారం మిలిటెంట్లు రాకెట్లను ప్రయోగించడంతో ఎంబసీ రక్షణ కూడా సమస్యగా మారినట్లే. మంగళవారం దాడి మాత్రమే కాకుండా అంతకు ముందు శనివారం ట్రక్కు నిండా పేలుడు పదార్ధాలను నింపుకున్న మిలిటెంటు అమెరికా సైనికులను 77 మందిని గాయపరచడం కూడా అమెరికా మిలట్రీ, ఇంటలిజెన్సులకి మింగుడు పడడం లేదు.
“హక్కాని గ్రూపునుండి ఈ రకమైన దాడులు జరగకుండా తమ పలుకుబడిని వినియోగించాలని మేము చాలా సార్లు పాకిస్దాన్ను కోరాము. కాని ఈ విషయంలో ఎటువంటి పురోగతిని సాధించలేకపోయాము” అని పెనెట్టా ఆక్రోశించాడు. “మా బలగాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలనూ మేము చేపట్టబోతున్నాం. బహుశా పాకిస్ధానీయులకు ఇలా చెబితేనే అర్ధం అవుతుందనుకుంటా” అని మాజీ సి.ఐ.ఎ బాసు హుంకరించాడు. అసలు అమెరికా బలగాలు ఎక్కడినుండో వచ్చి ఇక్కడ ఎందుకు తిష్టవేశాయో పెనెట్టా చెప్పాల్సి ఉంది. దురాక్రమణకి వచ్చిన పరాయి సైన్యాన్ని ప్రతిఘటించ కుండా ఆహ్వానించడం ఆఫ్ఘన్ లకు చాతగాని పని. ఇటువంటి దురాక్రమణదారులను అనేకమందిని తిప్పి కొట్టి తరుముకున్న అనుభవాలు ఆఫ్ఘన్ పష్తూన్లకు చాలా ఉన్నాయి. ఆ నేపధ్యంలోనే వారు తమపై దాడులు చూడాలి తప్ప పాకిస్ధాన్ నుండే మిలిటెంట్లు వస్తున్నారని ఆరోపించడం తోడేలు, గొర్రె కధను గుర్తుకు తెస్తోంది.
ఈ మాజీ సి.ఐ.ఎ బాసు హక్కాని గ్రూపుని మట్టుపెట్టాలని పాకిస్ధాన్ ని శతపోరాడు. అమెరికా నాయకత్వంలోని నాటో బలగాలకు అత్యంత ప్రమాదకరంగా హక్కాని గ్రూపు మారడమే దానికి కారణం. అమెరికా దురాక్రమణపై పోరాడుతున్న గ్రూపులన్నింటిలో అమెరికా ఈ హక్కాని గ్రూపు అంటే దడ పుట్టుకొస్తుంది. అనేక సార్లు విజయవంతమైన దాడుల్ని ఆ గ్రూపు అమెరికా బలగాలపైన నిర్వహించింది. అమెరికా శతపోరినప్పటికీ పాకిస్ధాన్ నుండి హక్కానీ గ్రూపుపై దాడులు చేయడానికి సిద్ధపడలేదు. అందుకే పాకిస్ధాన్ పైన తన కోపాన్ని పెనెట్టా వెళ్ళగక్కుతున్నాడు. అసలు చేయగూడని యుద్ధం చేస్తున్నది అమెరికా తప్ప పాకిస్ధాన్ కాదు. దురాక్రమణకి దిగినప్పుడు ప్రతిఘటనను కూడా తానే ఎదుర్కోవాలి. అది మరిచి, పాకిస్ధాన్ చేయవలసింది చేయడం లేదని అమెరికా ఉక్రోషపడడం ఏమిటి?
అమెరికా సైన్యంపైన దాడి చేసి పాకిస్ధాన్లోకి వెళ్ళి తలదాచుకుంటుండడంతో తమకు సమస్యగా ఉంటోందని పెనెట్టా అంటున్నాడు. మాకది సమ్మతం కాదని కూడా పాకిస్ధాన్ కి చెబుతున్నాడు. ఈ దురాక్రమణ గుంపుకి సమ్మతం అసమ్మతం కూడా ఉండడమే విచిత్రం. ఒక పేద దేశం, అందునా అప్పటివరకూ రష్యా దురాక్రమణపై పోరాడి సర్వం పోగొట్టుకున్న దేశంపైన ‘బిన్ లాడేన్’ ను అప్పగించలేదన్న ఒకే ఒక్క కారణం చూపి, అత్యాధునిక ఆయుధాలు, బాంబర్లు, క్షిపణులతో సర్వనాశనం చేస్తూ దాడి చేసారు గదా! అది ఏ సూత్రం ప్రకారం చేశారు? ఏ పద్దతులను అప్పుడు అనుసరించారు? తాము ఎన్ని గూండాగిరీలు చేసినా కనీసం ప్రతిఘటించకుండ లొంగిపోవాలని కోరడం అమెరికా దురహంకారానికి పరాకాష్ట తప్ప మరొకటి కాదు.
మానవ రహిత డ్రోన్ విమానాలను పాక్ భూభాగం పైకి పంపి అనేక మంది పాకిస్ధాన్ పౌరులను అమెరికా చంపింది. ఆఫ్ఘనిస్ధాన్లో పౌరుల ఆవాసాలపై బాంబులు కురిపించి వందలవేల మందిని ఈ పది సంవత్సరాలలో అమెరికా హత్య చేసింది. వీటితో పాటు అక్రమంగా పాక్ గగనతలంలోకి జొరబడి ఒసామా బిన్ లాడెన్ ను చంపామని ప్రకటించింది. లాడెన్ ను చంపారో లేదో తెలియదు గాని అక్కడే ఆయుధాలు లేని పౌరులను ముగ్గుర్ని అమెరికా కమెండోలు చంపారు. వారినెందుకు చంపవలసి వచ్చిందో వివరణ ఇవ్వాలన్న జ్ఞానం కూడా అమెరికా అధ్యక్షుడు ఒబామాకి లేదు. లాడెన్ ఆపరేషన్ తర్వాత పాకిస్ధాన్ ప్రజల ఒత్తిడి మేరకు పాక్ ప్రభుత్వం సి.ఐ.ఎ గూఢచారులను అత్యధిక సంఖ్యలో వెనక్కి పంపడమే అమెరికాకి నచ్చలేదు. తాము చేస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిఘటనగానే తాలిబాన్ మిలిటెంట్లు స్పందిస్తున్నారు తప్ప వాళ్లేమీ విమానాల్లో అమెరికాకి వెళ్ళి దాడులు చేయడం లేదు. ఎదుటి వ్యక్తి దాడి చేస్తున్నపుడు చేతికి ఏది దొరికితే దానితో అత్మ రక్షణకు ఎవరైనా ప్రయత్నిస్తారు. ఏదీ దొరక్కపోతే చేతినయినా అడ్డు పెడతారు. అదీ చాతకాకపోతే తప్పించుకోవడానికి పరుగు పెడతారు. వీటిలో ఏదీ చేయకుండా కదలకుండా దెబ్బతిని పడిపోవాలని అమెరికా కోరుకుంటోంది.
ఇంత తీవ్రంగా పాక్ ని హెచ్చరించిన పెనెట్టా మంగళవారం మిలిటెంట్లు చేసిన దాడిని మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కొట్టీపారేయడానికి ప్రయత్నించాడు. ఒక్క అమెరికా అధికారులు తప్ప దాదాపు విశ్లేషకులంతా మంగళవారం జరిగిన మిలిటెంట్ల దాడి తీవ్రమైనదని పేర్కొన్నారు. అమెరికా, ఆఫ్ఘన్ లో అడుగు పెట్టాక కాబూల్ పైన అంత సమయం పాటు ఇంతవరకు ఎప్పుడూ దాడి జరగలేదని రాయిటర్స్ సంస్ధ పేర్కొంది. రాయిటర్స్ సంస్ధ అమెరికా, యూరప్ ల దురాక్రమణ చర్యలకు పూర్తిగా వత్తాసు వస్తుంది. అది కూడా మిలిటెంట్ల దాడిని తీవ్రమైనదిగా పేర్కొన్నది. చాలా తక్కువ మంది గాయపడ్డారని పెనెట్టా మంగళవారం దాడిపైన వ్యాఖ్యానించాడు. కాని దాడి చేసినవారు ధరించిన ఆయుధాలను బట్టి పెద్దగా నష్టం చేయడానికి వారు రాలేదనీ, కాబూల్ లో హై సెక్యూరిటీ ఉన్న చోట్లకి కూడా తాము రాగలమని చెప్పడానికీ, తద్వారా మానసికంగా అమెరికా బలగాలపై పై చేయి సాధించడానికీ వచ్చారనీ వివిధ వార్తా సంస్ధలు విశ్లేషకులు తెలిపారు.
దురాక్రమణకి వచ్చిన అమెరికా సైన్యానికి ఏమైనా చేయగల హక్కులుంటే ఆక్రమణలో ఉన్న దేశాల పౌరులు, వారి పొరుగు దేశాల ప్రజలు కూడా అందుకు పది రెట్లు చేయగల సహజ హక్కులని కలిగి ఉంటారని అమెరికా గుర్తించాలి.
