ఆ తర్వాత మరో అధికారి నరమేధం సాగిన కాలంలో రికార్డు చేసిన వివిధ ప్రముఖుల మధ్య ఫోన్ సంభషణలను స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీం కు అంద జేసి మోడి రాజకీయ జీవితంపై చావు దెబ్బ కొట్టాడు. ఈ నేపధ్యంలో నరేంద్ర మోడిపై కేసు దాఖలు చేయాలా లేదా అన్నది ట్రయల్ కోర్టే తేల్చాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో దానిని మోడి అమాయకత్వాన్ని సుప్రీం కోర్టు నమ్మిందంటూ బి.జె.పి, మోడిలు ప్రచారం చేసుకుంటున్న తరుణంలో సంజీవ్ భట్ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అమాయక ముస్లింలను ఒక పద్ధతి ప్రకారం టార్గెట్ చేయడానికీ, పధకాలను రూపొందించి అమలుకావడానికి దోహదపడ్డాడని సంజీవ్ భట్ తన లేఖలో ఆరోపించాడు. 2002లో గుజరాత్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పచ్చి ద్వేషం మృత్యు రూపంలో కరాళ నృత్యం చేస్తున్నపుడు తాను మోడి లాంటి వ్యక్తి కింద పోలీసు అధికారిగా పని చేయవలసి రావడం తన దురదృష్టమని ఆయన పేర్కొన్నాడు.
గుజరాత్ ప్రజలనుద్దేశించి నరేంద్ర మోడి రెండు రోజుల క్రితం ఒక బహిరంగ లేఖను విడుదల చేసిన తరహాలోనే సంజీవ్ భట్ కూడా తానొక లేఖను విడుదల చేశాడు. జాకియా జాఫ్రీ పిటిషన్‌పై సుప్రీం ఇచ్చిన తీర్పుపై మోడి సంతృప్తి వ్యక్తం చేయడంపై సంజీవ్ హెచ్చరిక చేశాడు. అందులో మోడి సంతోషించడానికేమీ లేదని తేల్చి చెప్పాడు. నిజానికా తీర్పు, గుజరాత్ మారణకాండకు పాల్పడ్డావారిని, వారిని ప్రోత్సహించినవారిని ఫలితం అనుభవించే రోజుకు మరింత దగ్గరకు తీసుకెళ్ళిందని సంజీవ్ హెచ్చరించాడు.
నరేంద్ర మోడి సుప్రీం కోర్టు తీర్పుకు తప్పుడు భాష్యం చెబుతున్నాడని సంజీవ్ తెలిపాడు. తనపైనా, తన ప్రభుత్వంపైన చేస్తున్న ఆరోపణలు తప్పుడివి అనీ, సాక్ష్యాలు లేవనీ తీర్పు తెలిపిందంటూ ప్రచారం చేయడం తగదని పేర్కొన్నాడు. నిజానికి, 2002నాటి గుజరాత్ మారణ కాండలో బలైన అనేకమంది బాధితులకు న్యాయం చేకూరే వైపుగా సుప్రీం తీర్పు ఒక పెద్ద ముందడుగు అనీ ఆయన తెలిపాడు.
గుజరాత్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి బూటకపు ధైర్యం ప్రకటించడానికి తెలివిగా ప్రయత్నిస్తున్నారనీ, దానితో పాటు వారి పార్టీ కార్యకర్తలలో తప్పుడు నమ్మకాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారనీ ఆయన ఆరోపించాడు. మోడిలాంటివారు ఉద్దేశ్య పూర్వకంగా తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించడం, ఆరు కోట్ల గుజరాత్ ప్రజల్లో ఒకడిగా తనను తీవ్రంగా బాధిస్తున్నదనీ మోసానికి గురైన భావన కలుగుతునదని భట్ పేర్కొన్నాడు.
మహాత్ముడు పుట్టిన గడ్డపైన శాంతి సామరస్యాలను బలీయం కావడానికోసం సధ్భావనను పెంపొందించాలంటే, నిజం బైటికి రావడానికీ, న్యాయం పరిఢవిల్లేలా తోడ్పడమే అందుకు గొప్ప మార్గమని భట్ తెలిపాడు. రాష్ట్రం ఇప్పుడు ప్రశాంతంగా ఉందంటే కారణం మోడి పాలనా సామర్ధ్యం వలన ఎంతమాత్రం కాదనీ, రాష్ట్రంలో ఇప్పటికే మత విభజన పూర్తయ్యింది కనుక ఆ అంశంపై ఇక రాజకీయ లబ్ది పొందడం సాధ్యం కాదని పాలకులు గ్రహించడం వల్లనే రాష్ట్రం ప్రశాంతంగా కనిపిస్తున్నదని సంజీవ్ భట్ తన లేఖలో పేర్కొన్నాడు.
“ఏ రాజకీయ పార్టీకయినా మత హింస వలన చేకూరగల రాజకీయ లబ్ది సంబంధిత పరిమితిని ఇప్పటికే దాటిపోయింది. మత ప్రాతిపదికన ప్రజలు చీలిపోవడం, పునరేకీకరణ కావడం లాంటి ప్రక్రియలు గుజరాత్ లో దాదాపుగా పూర్తయినందునే ఈ పరిస్ధితి తలెత్తింది. గుజరాత్ ప్రయోగశాలలో ద్వేషంపై ఆధారపడిన విభజిత రాజకియ రాజకీయాల విషయంలో జరిగిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. ఇక మరింతగా మత హింస రేపవలసిన అవసరం తలెత్తదు.” అని సంజీవ్ భట్ పేర్కొన్నాడు.
మొత్తం మీద నరేంద్ర మోడి, బి.జె.పి నాయకులూ ఎన్ని నాటకాలు వేసినా సంజీవ్ భట్ లాంటివారు ఆ నాటకాల గుట్టుని రట్టు చెయడం సంతోషకర పరిణామం. ఇదే విధంగా ఇతర రాజకీయ పార్టీల నాయకులు వేసే వేషాలు కూడా ఎప్పటికప్పుడు వెల్లడి అయితే భారత రాజకీయ రంగం మరీ అసహ్యంగా కనపడకుండా ఉండడానికి దోహదం చేయగలదు.

అద్భుతమైన కథనం. ఏ రాజకీయ పార్టీకయినా మతహింస వలన చేకూరగల రాజకీయ లబ్ది సంబంధిత పరిమితిని ఇప్పటికే దాటిపోయింది అంటూ గుజరాత్ పోలీసు అధికారి చేసిన ఈ మహద్విశ్లేషణ నిజాయితీపరులైన ప్రభుత్వాధికారుల్లోని మరోకోణాన్ని అద్వితీయంగా చాటి చెబుతోంది.
రాజ్యవ్యవస్థ చేతి పనిముట్టుగా పోలీస్ యంత్రాంగాన్ని సకల ప్రజారాసులూ ద్వేషిస్తున్న నేపధ్యంలో సంజయ్ భట్ అనే ఈ అధికారి తన అసాధారణ నిజాయితీ ద్వారా మొత్తం తన శాఖ ప్రతిష్టనే అమాంతంగా పైకి లేపారు. నిజంగా ఈయనది ప్రాణాలకు తెగించిన తత్వమే.
నిజజీవితంలో అవినీతి మకలికి నూటికి నూరుశాతం దూరంగా ఉంటే తప్ప ఇంతటి అపర సత్యసంధత, సాహస గుణం ప్రభుత్వాధికారులకు ఉండదు.
ఈ సందర్భంగా కార్ల్ మార్స్ పెట్టుబడి గ్రంధంలో 19వ శతాబ్ది బ్రిటిష్ పారిశ్రామిక లేబర్ అధికారుల్లోని నిజాయితీకి జోహార్లు అర్పిస్తూ వ్యాఖ్యానించడం గుర్తుకొస్తోంది. పెట్టుబడిదారీ విధానం బాల్యదశలో బ్రిటిష్ పరిశ్రమల్లో కార్మికులు, మహిళలు, బాలల పట్ల కొనసాగుతున్న అమానుష దోపిడీ గురించి అత్యంత నిజాయితీగా గణాంకాలతో సహా నివేదికల్లో ప్రస్తావించిన అప్పటి బ్రిటిష్ లేబర్ అధికారుల నీతి వర్తనను మార్క్స్ ప్రశంసించాడు. మన పోలీసు అధికారిని సమాజం కాపాడుకోవాలని ఆశించడం తప్ప ఏం చేయగలం?
చాలా మంచి కథనం. నాణానికి రెండోవైపు దాగి ఉన్న సమాచారాన్ని బయటకి తీసుకురావడంలో, తెలుగు పాఠకులకు అందించడంలో అపూర్వ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న మీకు అభినందనలు.