నూతన ఎత్తులను తాకుతున్న అమెరికా దరిద్రం -సెన్సస్ బ్యూరో


అమెరికా సెన్సస్ బ్యూరో తన వార్షిక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఇప్పుడు అమెరికాలో ప్రతి ఆరుగురిలోనూ ఒకరు దరిద్రుడు. బ్యూరో విడుదల చేసిన 2010 గణాంకాల ప్రకారం అమెరికాలో 46.2 మిలియన్ల మంది (4.62 కోట్లు) దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్నారు. అంటే మొత్తం జనాభాలో 15.1 శాతం మంది దరిద్రులుగా బతుకులీడుస్తున్నారు. ఇది 2009 సంవత్సరంలో 14.3 శాతంగా ఉంది. ఒక సంవత్సరంలో 0.8 శాతం (2.5 మిలియన్లు లేదా 25 లక్షలు) దరిద్రులు పెరిగారన్నమాట! ఇంకా ఘోరం ఏమిటంటే మొత్తం జనాభాలో 49.9 మిలియన్లకు (ఐదు కోట్ల మంది) ఆరోగ్య భీమా సౌకర్యం లేదు. భారత దేశంలో ఆరోగ్య భీమా లేకపోవడం ఒక అంశం కాదు. కాని అమెరికాలో ఆరోగ్య భీమా అన్నది అత్యవసరం.

1983 సంవత్సరం తర్వాత అమెరికాలో ఇంత దరిద్రం ఎప్పుడూ రికార్డు కాలేదని సెన్సస్ బ్యూరో నివేదిక తెలిపింది. దరిద్ర అమెరికన్ల సంఖ్య పెరగడం ఇది వరుసగా నాలగవ సంవత్సరం. అమెరికా ప్రభుత్వ నిర్వచనం ప్రకారం, నలుగురు సభ్యులున్న కుటుంబం ఆదాయం సంవత్సరానికి 22,314 డాలర్లు లేదా అంతకంటె తక్కువ ఆదాయం ఉంటే ఆ కుటుంబం దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అదే ఒకే వ్యక్తి ఉన్న కుటుంబం అయితే వార్షిక అదాయం 11,139 డాలర్లు, అంతకంటే తక్కువ ఉన్నవారు దరిద్రంలో ఉన్నట్లు. అమెరికా దారిద్ర్య రేఖ ప్రమాణాలను నేరుగా ఇండియాకి వర్తించడానికి వీలు లేదు. అమెరిక సామాజిక ఆర్ధిక పరిస్ధితులకూ, ఇండియాలోని సామాజిక ఆర్ధిక పరిస్ధితులకు చాలా తేడా ఉన్నందున ఆ తేడా దారిద్ర్య రేఖ ప్రమాణాలకు కూడా వర్తిస్తుంది.

దరిద్రంలో కూడా జాతి భేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. నల్ల జాతి, హిస్పానిక్ జాతి ప్రజల్లో దరిద్రం అమెరికా సగటు దరిద్రం కంటె చాలా ఎక్కువగా ఉంది. ముందు చెప్పుకున్నట్లు అమెరికా మొత్తంగా దరిద్రం 15.1 శాతం ఉండగా, నల్ల జాతి ప్రజల్లో అది 27.4 శాతంగానూ, హిస్పానిక్ ప్రజల్లో 26.6 శాతంగానూ నమోదయ్యింది. దారిద్ర రేఖకు ఎగువ ఉన్నవారి ఆదాయాలు గత సంవత్సరం 2.3 శాతం, అంటే, 49,445 డాలర్లకు తగ్గిపోయాయి. అయినప్పటికీ ఈ ఆదాయం దరిద్ర రేఖగా పరిగణించే ఆదాయం కంటే రెట్టింపు కంటె ఎక్కువగా ఉండడం గమనార్హం. కాగా, ఆదాయం 2.3 శాతం పడిపోవడం అంటే ఆ మేరకు సొమ్ములు కంపెనీల జేబుల్లోకి వెళ్ళిందని భావించవచ్చు.  

యువకులు, పిల్లలు చాలా మంది దరిద్రంలో ఉండడం ఆందోళన కలిగుస్తున్నదని వివిధ సంస్ధలు చెబుతున్నాయి. 18 సంవత్సరాల కంటె తక్కువ వయసు ఉన్నవారిలో దరిద్రం  22 శాతానికి పైనే ఉన్నదని సెన్సస్ బ్యూరో తెలిపింది. అంతకు ముందు సంవత్సరం (2009) లో ఇది 20.7 శాతం నమోదయ్యింది. అంటే యువకులు, పిల్లలలో దరిద్రం ఒక సంవత్సరంలో 1.3 శాతం పెరిగిందన్నమాట. ఛిల్డ్రన్స్ లీడర్‌షిప్ కౌన్సిల్ సంస్ధ “బాలల ప్రయోజనాలను బిలియనీర్ల ప్రయోజనాలతో పోటీ పెట్టే రాజకీయ నాయకులు తాము ఎన్నుకున్న ప్రాధామ్యాల ప్రభావం నేరుగా పిల్లలపై పడుతుంది. దాని ఫలితమే ఈ అంకెలు. అమెరికా పిల్లలే మనకు ప్రధమ ప్రాధామ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది” అని ప్రకటించింది.

ప్రాంతాల వారీగా చూసినట్లయితే దక్షిణ ప్రాంతాలు ఎక్కువగా దరిద్రం బారిన పడ్డాయి. అక్కడ దరిద్రం 16.9 శాతం ఉండగా, ఆరోగ్య భీమా లేనివారు 19.1 శాతం ఉన్నారు. మిస్సిసిపు రాష్ట్రంలో 22.7 శాతం మంది పేదలే. దాని తర్వాత లూసియానా, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, జార్జియా, న్యూ మెక్సికో, అరిజోనా రాష్ట్రాలు వరుసగా పేదరికం తీవ్రతలో అగ్ర స్ధానంలో ఉన్నాయి. మరొ వైపు న్యూ హ్యాంప్ షైర్ రాష్ట్రంలో అత్యల్ప దరిద్రం, 6.6 శాతం నమోదైంది. గత సంవత్సరం ఉపాధికల్పనాదారులు ఎక్కువమంది ఆరోగ్య భీమాను తమ ఉద్యోగులు కల్పించకపోవడంతో, ఆరోగ్య భీమా లేనివారు ఒక మిలియన్ మందికి పైగా పెరిగారని బ్యూరో తెలిపింది. ఉద్యోగాలు దొరకడం కూడా గగనంగా మారింది. 9.1 శాతం నిరుద్యోగం అని ప్రభుత్వం చెబుతుండగా వాస్తవ సంఖ్య అందుకు రెట్టింపు ఉంటుందని ఆర్ధిక విశ్లేషకులు అనేకులు చెబుతున్నారు.

అగ్ర రాజ్య హోదా అటుంచి అసలు అభివృద్ధి చెందిన దేశంగా కూడా అమెరికా ఒక్కొక్క అర్హతను కోల్పోతున్నది.

6 thoughts on “నూతన ఎత్తులను తాకుతున్న అమెరికా దరిద్రం -సెన్సస్ బ్యూరో

  1. నూతన ఎత్తులేంటండి బాబూ ? ఇంగ్లీషులో ఆలోచిస్తూ తెలుగులో రాయాలనుకుంటే ఇలాగే ఉంటుంది. మరింత పరాకాష్ఠకి చేరుకుంటున్న అనాలి. లేకపోతే దారిద్ర్యపు శిఖరాగ్రాలను అందుకుంటున్న అమెరికా అనాలి.

    తెలుగు పుస్తకాలు చదవండి. తెలుగులో ఆలోచించండి.

  2. ఓబుల్ గారు నూతన ఎత్తులు అనడంలో నాకేమీ తప్పు కనిపించడం లేదు. ‘దారిద్ర శిఖరాగ్రాలను’ అన్నది ఇంకా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది నాకు. ఇంగ్లీషులో ఆలోచించేంత ఆంగ్ల పరిజ్ఞానం నాకైతే లేదు. ఆ మాటకోస్తే నా బ్లాగ్‌లో సరిగ్గా చూస్తే ఇంకా చాలా తప్పులు కనపడతాయి. టైపింగ్ తప్పులు చాలా దొర్లుతున్నాయి. విషయం అందితే చాలని నా అవగాహన. ఏదో ఈ బ్లాగుకిలా కానిచ్చెయ్యండి.

  3. తెలుగులో ఆలోచించడమే సరైంది అనుకుంటే మీరు ‘కొత్త ఎత్తులు’ అని ఉపయోగిస్తే ఇంకా సులభంగా ఉండేది. పరాకాష్ట, దారిద్ర్య శిఖరాగ్రాలు వంటి డాంబిక పదాలను నాకు తెలిసి ఏ తెలుగు పల్లెవాసి కూడా వాడరు. తమిళులకు శతాబ్దాలుగా చేతనైంది, మనకు ఈనాటికీ చేతకాకుండా పోతున్నది ఇదే. సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీషు.. ప్రస్తుతం తెలుగు వాక్యంలో 70 శాతం పైగా పదాలు ఈ భాషల పదాలే అయి ఉంటున్నప్పుడు తెలుగులో ఆలోచించడం అనే భావనకు అర్థం లేదేమో…

    పల్లె వాసులు చాలా సులభంగా వాడే పదాలను కూడా మనం రాయలేం. ఉపయోగించలేం… ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా ఒకటి మాత్రం నిజం. మనం రాస్తున్న భాష, ఉపయోగిస్తున్న పద వ్యవహారాలు సజీవభాషకు చెందినవి కావు. ఇంగ్లీషులో ఆలోచిస్తూ, తెలుగులో రాయటం, తెలుగులో ఆలోచించడం వంటి వ్యంగ్య ప్రయోగాలు ఈ వ్యాస సందర్భానికి సముచితమైనవి కాదనుకుంటున్నాను.

    ఈ చర్చ వ్యాస సారాంశానికి దూరంగా పోతున్నట్లుంది. అమెరికాలో నాలుగు కోట్లకు పైగా ప్రజలు దరిద్రపు కోరల్లో చిక్కుకున్నారనే వార్త అమెరికా సంపద వ్యతిరేక కోణాన్ని ఎత్తి చూపుతోంది. మన దేశంలోని ఆదివాసులు, గిరిజన జాతులూ, దళితులు, అన్ని కులాల్లోని నిరుపేదలు అమెరికాలో కూడా మరోరూపంలో ప్రధానంగా నల్లవారి రూపంలో ఉన్నారన్నమాట. ఈ కథనం లోని రెండు ఫోటోలు నిజమైన అమెరికాను అద్దంలో చూపిస్తున్నాయి. దోపిడీ చేస్తున్న అమెరికా, దోపిడీకి గురవుతున్న అమెరికా రెండూ కనపడుతున్నాయిక్కడ.

    ఈ నిజమైన అమెరికా ప్రతినిధులు పై ఫోటోల్లో ధరించిన దుస్తుల కంటే వారు కప్పుకున్న అమెరికా జాతీయ పతాక వస్త్రమే కాస్త ఎక్కువ నాణ్యతతో ఉంటున్నట్లుంది. నిజంగా దయనీయ దృశ్యం ఇది.

    “అగ్ర రాజ్య హోదా అటుంచి అసలు అభివృద్ధి చెందిన దేశంగా కూడా అమెరికా ఒక్కొక్క అర్హతను కోల్పోతున్నది” అమెరికా వీరాభిమానులకు పిచ్చెక్కించేటంత శక్తివంతమైన వ్యక్తీకరణ.

  4. రాజ శేఖర గారూ, మీరన్నది నిజం. మాతృ భాషను గౌరవిద్దాం అన్న నినాదంతో పాటు వాడుక భాషనే రాద్దాం అని కూడా నినాదం ఇవ్వవలసి ఉంది. సాంకేతిక పదాలకు, వాడుక భాషలో లేని పదాలకు సంస్కృతం, ఆంగ్లం ల నుండి అరువు తెచ్చుకోవడం తప్పదేమో గాని, వాడుక భాషలో బోల్డన్ని పదాలు ఉన్నప్పటికీ మనం ఆ వైపుకి వెళ్ళడం లేదు. వాడుక భాషను గ్రాంధీకరించి గ్రాంధిక, వాడుక భాషల మధ్య వైరుధ్యాన్ని పరిష్కరించవచ్చునేమో!

  5. గూగుల్ సెర్చ్‌లో panhandling in usa అని వెతకండి. మనం ఇక్కడ భిక్షగాళ్ళు అనబడేవాళ్ళని అమెరికాలో panhandlers అంటారు. అమెరికాలో పేదరికమే లేదని ఢంకా దండోరా వేసేవాళ్ళు panhandling గురించి ఏమి చెప్పగలరు?

  6. చిలకపేట కేడీ గారు వ్రాసిన టపా చదివాను. అతని వాదం ఎలా ఉందంటే “ఇద్దరు భిక్షగాళ్ళు ఉన్నారు. ఒకడు అల్యుమినియం బొచ్చె పట్టుకున్నాడు. ఇంకొకడు జెర్మన్ సిల్వర్ బొచ్చె పట్టుకున్నాడు. అల్యుమినియం కంటే జెర్మన్ సిల్వర్ ఖరీదైనది కనుక జెర్మన్ సిల్వర్ బొచ్చె పట్టుకున్న భిక్షగాడు ధనవంతుడు అని అన్నాడట!”. ఒరిస్సాలో కూలీ పనులు చేస్తే ఇరవై రూపాయలు వస్తాయి, ఆంధ్రాలో కూలీ పనులు చేస్తే డబ్బై రూపాయలు వస్తాయి కనుక ఆంధ్రా కూలీవాళ్ళు డబ్బున్నవాళ్ళు అని అంటే ఎలా ఉంటుందో అమెరికాలో రెస్టారెంట్లలో వెయిటర్లుగా పని చేసే హిస్పానిక్‌లు పేదవాళ్ళు కాదు అంటే అలాగే ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s