
మరే ఇతర దేశం కన్నా అమెరికాకి అత్యధిక అప్పు ఇచ్చిన చైనాను ఇటలీ కూడా అప్పు అడిగింది. తన సావరిన్ అప్పు బాండ్లను కొనుగోలు చేయవలసిందిగా ఇటలీ చైనాను కోరింది. ఇటలీ బాండ్లను పెద్ద ఎత్తున చైనాచేత కొనుగోలు చేయించడం ద్వాగా గాడి తప్పుతున్న తన ఆర్ధిక వ్యవస్ధను దారిలో పెట్టాల్ని ఇటలీ భావిస్తున్నది.
పెట్టుబడిదారీ ప్రభుత్వాలు, నిర్ధిష్ట కాల పరిమితితో ‘సావరిన్ డెట్ బాండ్లు’ జారీ చేయడం ద్వారా అప్పు సేకరిస్తాయన్న సంగతి తెలిసిందే. అప్పు సేకరించేటప్పుడు ప్రభుత్వాలు సావరిన్ బాండ్లను వేలం వేస్తాయి. తక్కువ ధరకు (వడ్డీ లేదా యీల్డ్) కోట్ చేసిన వారికి బాండ్లను అమ్మడం ద్వారా మార్కెట్ నుండి ప్రభుత్వాలు అప్పు సేకరిస్తాయి. ఆరు నెలల కాల పరిమితి నుండి పాతిక సంవత్సరాల పరిమితి వరకూ బాండ్లను రూపొందించవచ్చు. ప్రధానంగా పది సంవత్సరాల పరిమితితో అప్పు బాండ్లను జారీ చేస్తారు.
ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ బలహీనపడినప్పుడు, ఆ దేశం తీసుకున్న అప్పును తిరిగి సమయానికి చెల్లించగలదా లేదా అన్న అనుమానాలు తలెత్తుతాయి. దానితో ఆ దేశ సావరిన్ బాండ్ల కొనుగోలుదారులు తగ్గిపోతారు. ఫలితంగా ఎక్కువ వడ్డీ ఇవ్వాలని మార్కెట్ డిమాండ్ చేస్తుంది. ఇది బాండ్లను అధిక వడ్డీ రేట్లకు అమ్ముకోవలసిన పరిస్ధితికి దారి తీస్తుంది. ఇక ఏ మాత్రం చెల్లించలేని మొత్తానికి వడ్డీ రేటు చేరుకున్నపుడు సదరు ప్రభుత్వం మార్కెట్ నుండి అప్పు సేకరించలేని పరిస్ధితి తలెత్తుతుంది. దానినే ‘రుణ సంక్షోభం’ అనీ, “సావరిన్ డెట్ క్రైసిస్’ అనీ అంటున్నారు.
గత సంవత్సరం ప్రారంభంలో మొదట గ్రీసుతో ప్రారంభమైన యూరప్ రుణ సంక్షోభం, ఆ తర్వాత ఐర్లండు, పోర్చుగీసులకు పాకింది. ఈ మూడు దేశాలూ మార్కెట్ నుండి చెల్లించగల వడ్డీ రేట్లకు అప్పు సేకరించలేక పోవడంతో ఐ.ఎం.ఎఫ్, ఇ.యు లు వాటికి బెయిలౌట్ ప్యాకేజి ప్రకటించాయి. ప్యాకేజీతో పాటు విషమ షరతులు విధించి కఠినమైన పొదుపు విధానాలను అమలు చేయిస్తున్నాయి. దానితో సంక్షుభిత దేశాలు సంక్షోభం నుండి బైటపడడం బదులు మరింతగా అందులో కూరుకుపోతున్నాయి. గ్రీసు ప్రస్తుతం అప్పు చెల్లించలేని స్ధాయికి చేరుకుంటున్నది. అంటే డిఫాల్టర్ గా మిగలనున్నది. త్వరలోనే గ్రీసు యూరోజోన్ నుండి బైటికి పోవచ్చని కూడా భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో తదుపరి బలహీన దేశాలు స్పెయిన్, ఇటలీలుగా భావిస్తున్నారు. ఆ పరిస్ధితి రాకుండా చూసుకోవడానికి ఈ దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. స్పెయిన్, ఇటలీలు యూరోప్ లో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలు. వీటికి బెయిలౌట్ సమకూర్చడం కష్టమైన సమస్య. అందుకే ఇటలీ చైనాను తన రుణ బాండ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నది. చైనా గత సంవత్సర కాలంగా యూరోజోన్ సంక్షోభంలో పడకుండా ఆదుకుంటానని హామీ ఇస్తూ వచ్చింది. అమెరికా ఎక్కువగా బాకీ పడ్డ దేశం చైనాకే. ఆ తర్వాత జపాన్ అత్యధిక మొత్తంలో అమెరికాకి అప్పు ఇచ్చింది.
గత వారం చైనా ఇన్‌వెస్ట్‌మెంట్ కార్ప్ (సి.ఐ.సి) సంస్ధ ఛైర్మన్ లో జివీ, ఒక ప్రతినిధి బృందంతో రోమ్‌ను సందర్శించినట్లుగా ఇటలీ అధికారులు ఫైనాన్సియల్ టైమ్స్ పత్రికకు తెలిపారు. వారు ఇటలీ ఆర్ధిక మంత్రి గియులియో ట్రెమోంటిని కలిసారనీ వివిధ అంశాలపై చర్చలు జరిగాయనీ అధికారులు తెలిపారు. అంతకుముందు రెండు వారాల క్రితం ఇటలీ అధికారులు బీజింగ్ ను సందర్శించారు. బీజింగ్‌లో సి.ఐ.సి తో పాటు స్టేట్ ఆడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్ఛేంజ్ (ఎస్.ఎ.ఎఫ్.ఇ) సంస్ధ అధికారులను కూడా కలిసారు. ఈ సంస్ధ చైనా విదేశీ మారక ద్రవ్య నిల్వలను నిర్వహిస్తుందని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. ఈ రాకపోకలలోనే ఇటలీ చైనాను తమ సావరిన్ బాండ్లలో పెట్టుబడులు పెట్టవలసిందిగా చైనాను కోరినట్లు తెలుస్తోంది.
