కొత్త ఆయుధంతో అమెరికాకు దడ పుట్టిస్తున్న తాలిబాన్


ఇటీవలి కాలంలో తాలిబాన్ బలగాలు నాటోకి చెందిన హెలికాప్టర్లను కూల్చివేస్తున్న వార్తలు వరుసగా వెలువడ్డాయి. దానికి కారణం తాలిబాన్ కొత్త ఆయుధాన్ని సమకూర్చుకోవడమేనని తాలిబాన్ వర్గాలను ఉటంకిస్తూ ఏసియా టైమ్స్ పత్రిక తెలిపింది. భూమి మీది నుండి గాలిలోకి ప్రయోగించే మిసైల్ ద్వారా తాము గణనీయమైన సంఖ్యలో హెలికాప్టర్లను కూల్చివేశామని తాలిబాన్ ప్రతినిధి చెప్పాడు. అయితే నాటో, అమెరికా వర్గాలు మాత్రం తమ హెలికాప్టర్లు కూలినప్పుడల్లా సాంకేతిక లోపం వలన కూలిందని చెబుతున్నాయి. తాలిబాన్ ఇంతవరకూ ఒకటీ రెండు హెలికాప్టర్లను కూల్చినా అది పాత ఆయుధాలతోనేననీ, దానికి కొత్త ఆయుధాలు అందిన దాఖలాలేవీ లేవనీ వారు చెబుతున్నారు.

గత ఆరు నెలల్లో కనీసం 20 హెలికాప్టర్లు -నాటోకి కానీ, ఆఫ్ఘన్ బలగాలకు గానీ చెందినవి- కూలిపోవడమో, బలవంతంగా కిందికి దిగవలసి రావడమో జరిగింది. అన్నిటికంటే తీవ్రమైన ఘటన ఆగస్టు 6 న చోటు చేసుకుంది. ఆ ఘటనలో తాలిబాన్లు అమెరికాకి చెందిన చినూక్ హెలికాప్టర్ ను కూల్చివేశాయి. దానిలో ఉన్న 30 మంది అమెరికా సైనికులూ, 8 మంది ఆఫ్ఘన్ సైనికులూ మరణించారు. ఆఫ్ఘన్ నేలపై అడుగుపెట్టాక, అమెరికా గానీ నాటో గానీ ఒకే ఘటనలో అంతమంది చనిపోవడం అదే మొదటిసారి. వార్దాక్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో తాలిబాన్లు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్.పి.జి) ఉపయోగించి ఉండవచ్చని అమెరికా అధికారులు చెప్పారు. కాని తాలిబాన్ తమ కొత్త ఆయుధంతో చినూక్ ని కూల్చామని తెలిపారు.

ఇవి కాకుండా ఇంకా మరికొన్ని కూల్చివేతలు కూడా చోటు చేసుకున్నాయి. ఆగస్టు 8న దక్షిణ పక్తికా రాష్ట్రంలో, ఆగస్టు 6 న ఖోస్త్ రాష్ట్రంలో, ఆగస్టు 5 న కాందహార్ లోనూ తాలిబాన్లు అమెరికా హెలికాప్టర్లను కూల్చివేశాయి. జులై 25 తేదీన తూర్పు కూనార్ ప్రాంతంలో ఓ చినూక్ హెలికాప్టర్ ను తాలిబాన్ కూల్చింది. నాటో వివరాల ప్రకారం హెలికాప్టర్లు దాడికి గురయ్యాక భద్రంగానే కిందికి దిగాయి. ఎవరూ చనిపోలేదు కూడా. కాని తాలిబాన్ ప్రతినిధి జబీహొల్లా మొజాహిద్ ‘ఇనిస్టిట్యూడ్ ఫర్ వార్ అండ్ పీస్ (ఐ.డబ్య్లు.పి)’ తో మాట్లాడుతూ తమ కొత్త మిసైళ్ల ద్వారా గతం కంటె ఎక్కువగా విమానాలు, హెలికాప్టర్లను కూల్చివేయగలిగామని తెలిపాడు.

తమ కొత్త మిసైల్ ఏ దేశం సరఫరా చేసిందీ, మోడల్ ఏమిటి అన్నది మొజాహిద్ చెప్పడానికి ఆసక్తి చూపలేదు. కొత్త ఆయుధం తేలికగా మోసుగెళ్లగలిగినదేననీ, భుజంమీది నుండి ప్రయోగించవచ్చనీ చెబుతూ క్రమంగా ఆఫ్ఘన్ అంతటా ఈ ఆయుధాలను ప్రతిఘటనా దళాలకు పంపుతున్నామని పేర్కొన్నాడు. ఇప్పటికి సగం రాష్ట్రాలకు చేరవేశామని తెలిపాడు. “ఇది బాగా విజయవంతమైన ఆయుధం. అన్ని రాష్ట్రాల ముజాహిదీన్లు ఈ ఆయుధాన్ని త్వరలోనే పొందుతారు” అని మొజాహెద్ తెలిపాడు. ఎక్కడినుండి సంపాదించారన్న ప్రశ్నకు అమెరికా రాను రానూ కొత్త శత్రువులను తయారు చేసుకుంటున్నదనీ దేవుడి దయవల్ల మేము కోరుకున్నదల్లా సంపాదించుకోగలుగుతున్నామని తెలిపాడు.

“నాటో బలగాలు ప్రధానంగా తమ వాయు శక్తి పైన ఆధారపడి ఉన్నాయి. కాని ఈ పరిస్ధితి మారుతోంది” అని మొజాహెద్ పేర్కొన్నాడు. నాటో ప్రతినిధి బ్రిగేడియర్-జనరల్ కార్స్‌టెన్ జాకబ్‌సేన్ ఈ వాదనను కొట్టిపారేశాడు. తమ బలగాలకు సంబంధించి మూడు హెలికాప్టర్లను మాత్రమే ఇప్పటివరకూ కూల్చారని, మిగిలినవన్నీ సాంకేతిక సమస్యలతోనే కిందికి దిగాయనీ పేర్కొన్నాడు. వార్దాక్ ఘటనకు సంబంధించి తాలిబాన్ ఏ ఆయుధం వాడిందీ ఇంకా గుర్తించలేదని చెప్పాడు. కొత్త ఆయుధమైతే కాదని ఖచ్చితంగా చెప్పాడు. తాలిబాన్ కి కొత్త ఆయుధాలు అందుతున్నాయన్న వార్తను కూడా అమెరికా భరించలేకపోతున్నదని ఈ వార్తను బట్టి అర్ధమవుతోంది.

ఆఫ్ఘన్ సైన్యం కూడా హెలికాప్టర్ దళాలు కలిగి ఉన్నాయి. ఆఫ్ఘన్ సైన్యాధికారులు కూడా సాంకేతిక కారణాలవల్లనే తమ హెలికాప్టర్లు కూలాయని చెప్పారు. అటువంటివి యుద్ధంలో మామూలేననీ, దానర్ధం ప్రత్యర్ది పైచేయి సాధించినట్లు కాదని వారు అభిప్రాయం తెలిపారు. తాలిబాన్ కేడర్ల నైతిక స్ధైర్యాన్ని పెంచడానికి ఆ సంస్ధ ఇటువంటి వార్తలను ప్రచారం చేస్తుందని ఆఫ్గన్ వాయు శక్తికి కమాండర్-ఇన్-ఛీఫ్ అయిన జనరల్ అబ్దుల్ వహాబ్ వార్దాక్ తెలిపాడు. అయితే నాటో బలగాల నైతిక స్ధైర్యం తగ్గకుండా ఉండడానికి తాలిబాన్ కూల్చివేతను నాటో ప్రతినిధులు అబద్ధంగా కొట్టివేయడం కూడా జరుగుతుండవచ్చు. వార్దాక్ రాష్ట్రంలో జరిగిన ఘటన కూడా మొదట సాంకేతిక కారణాలతోనే కిందికి దిగిందని అమెరికా ప్రకటించింది. తర్వాత రెండు మూడు రోజులకు గాని అమెరికా నిజాన్ని అంగీకరించలేదు.

ఆఫ్ఘన్ పర్వతాలతో కూడిన ప్రాంతమనీ, ఈ దేశ పరిసరాలపై తెలివిడి లేని పైలట్లు తక్కువ ఎత్తులో హెలికాప్టర్లను నడిపి కొండలను డీకొట్టి కూలిపోతున్నాయని నాటో ప్రతినిధులు చెబుతున్నప్పటికీ హెలికాప్టర్లు నడిపే సమయంలో చూడకుండా తక్కువ ఎత్తులో ఎలా నడుపుతారన్నది అర్ధం కాని విషయం. అయితే తక్కవ ఎత్తులో నడపడంలో నడపడం వలన సాధారణ ఆయుధంతో కూడా కూల్చివేయవచ్చనీ మరో వివరణ ఇస్తున్నారు. 1986 నుండీ సోవియట్ సేనలపై పోరాటానికి అమెరికా ఆఫ్ఘన్ ముజాహిదీన్లకు కొన్ని వందల స్టింగర్ క్షిపణులను సరఫరా చేసింది. వాటిద్వారా తక్కువ ఎత్తులో ఎగిరే సోవియట్ గన్ షిప్ లను కూల్చివేయడానికి ఎక్కువగా వాడారు. 1989లో సోవియట్ సేనలు వెళ్ళిపోయాక స్టింగర్ క్షిపణులను అమెరికా చాలావాటిని వెనక్కి కొనుగోలు చేసింది. స్టింగర్ క్షిపణులు కొన్ని తాలిబాన్ వద్ద ఉన్నా ఆశ్చర్యం లేదు. ఆ అవకాశాన్ని నాటో కొట్టిపారేస్తోంది.

‘నూరుల్ హక్ ఒలూమి’ కాందహార్ లో ఒక రాజకీయవేత్త. ఒకప్పటి జనరల్. ఆయన నాటో అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఏసియా టైమ్స్ కు తెలిపాడు. “తమ హెలికాప్టర్లు సాంకేతిక కారణాలవల్లనే అత్యవసరంగా దిగుతున్నాయని చెబుతున్నట్లయితే, నాటో జనరళ్ళు నిజం చెప్పడం లేదు. అవి తక్కువ ఎత్తులో తిరగడం వల్ల శతృవులు వాటిని కూల్చివేస్తున్నారు.” అని ఆయన చెప్పాడు. “తాలిబాన్ ఇప్పటికే కొత్త ఆయుధాలను సమకూర్చుకోకపోతే ఇకముందు సమకూర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇరాన్ నుండి గానీ, పాకిస్ధాన్ నుండి గానీ వారికి ఆ ఆయుధాలు అందుతాయి. ఈ రెండు దేశాలూ, నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ లోనే ఓడిపోవాలని కోరుకుంటున్నాయి” అని ఒలూమి అభిప్రాయపడ్డాడు.

ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా లేదా నాటో బలగాల పరిస్ధితి ఏమిటో అమెరికాకి తప్ప ఇతరులందరికీ తెలిసినట్లు కనిపిస్తోంది.

One thought on “కొత్త ఆయుధంతో అమెరికాకు దడ పుట్టిస్తున్న తాలిబాన్

  1. యుధ్ద వ్యూహ పరంగా చాలా మంచి కథనం. ఒక చిన్న సైన్యం ఒక మహా సైన్యాన్ని, ఒక చిన్న దేశం ఒక పెద్ద దేశాన్ని ఎదిరించి నిలవగలుగుతుందని, అంతిమంగా ఓడించగలుగుతుందనే తాత్విక సూత్రాన్ని ఈ వార్త నిరూపిస్తోంది. మానవ చరిత్రలో అత్యాధునిక సాంకేతిక సైనిక శక్తికి, తాలిబాన్ వంటి కొండ ప్రాంతాల్లోని నాటు సైనిక శక్తికి మధ్య జరుగుతున్న అసమాన యుద్ధంలో చిన్న శక్తి సాధించే ఏ కాస్త విజయమైనా యుద్ధచరిత్రలో గొప్ప స్థానం సంపాదించుకుంటుంది. భౌగోళికంగా చిన్న ప్రాంతంలో ఉన్నందువల్ల చరిత్రలో ఆప్గనిస్తాన్ ప్రజలు సాధించిన అసమాన విజయాలను పెద్దగా ప్రాచుర్యం పొందలేకపోవడం వాస్తవమే. 19వ శతాబ్ది సామ్రాజ్య విస్తరణ కాలంలో వేలాదిమంది బ్రిటిష్ సైన్యాలను ఊచకోత కోసి బ్రిటిష్ సైనిక శక్తిని పరిహసించిన చరిత్ర ఆప్ఘనిస్తాన్‌దే. అమెరికాకు పోటీగా సామ్రాజ్యవాద శక్తిగా మారిన సోవియట్ యూనియన్‌ దురాక్రమణ సైన్యాన్ని దశాబ్దం పైగా సాగిన అంతర్యుద్ధంలో తిప్పికొట్టి సోవియట్ యుద్ధ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చి, అంతిమంగా సోవియట్ సామ్రాజ్యవాదశక్తినే రద్దుపరిచిన ఇటీవలి చరిత్ర కూడా ఆప్ఘనిస్తాన్‌దే. చివరకు అమెరికా, నాటో సామ్రాజ్యవాద ముష్కర సేనలను ముప్పుతిప్పులు పెడుతూ వాటి ఆర్థిక పతన చరిత్రకు దోహదం చేస్తున్న చరిత్ర కూడా ఆప్ఘనిస్తాన్‌దే. ఆప్ఘనిస్తాన్ తన చరిత్ర పొడవునా ఏ దురాక్రమణకు కూడా తలొంచలేదు. ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజాశక్తులకు గొప్ప ప్రేరణను కల్గిస్తున్న ఘటనలను ఈ కథనంలో చాలా బాగా వివరించారు.
    “ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా లేదా నాటో బలగాల పరిస్ధితి ఏమిటో అమెరికాకి తప్ప ఇతరులందరికీ తెలిసినట్లు కనిపిస్తోంది” మీ వ్యాసంలోని చివరి వాక్యం మొత్తం కథనానికే హైలెట్.
    అభినందనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s