ఢిల్లీ పేలుళ్ల ఈమెయిల్‌కు కాశ్మీరుతో లింకు, ఇండియన్ ముజాహిదీన్ నుంచి మరో ఈమెయిల్


ఢిల్లీ హైకోర్టు వద్ద బుధవారం సంభవించిన బాంబు పేలుడుకు తమదే బాధ్యత అంటూ ‘హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ’ సంస్ధ పంపిన ఈ మెయిల్ కాశ్మీరు నుండి వచ్చినదిగా పోలిసులు తేల్చారు. కాశ్మీరులోని కీష్త్వర్ పట్టణంలోని ఒక సైబర్ కేఫ్ నుండి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. సైబర్ కేఫ్ యజమానులైన సోదరులిద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలిపారు. వారు వర్ణించినదాని ప్రకారం కొన్ని కీలకమైన క్లూలను సంపాదించినట్లు కూడా పొలీసులు గురువారం తెలిపారు.

జమ్ము నుండి 230 కి.మీ దూరంలోని కీష్త్వర్ పట్టణంలో ఉన్న ‘గ్లోబల్ ఇంటర్నెట్ కేఫ్’ యజమానులు ఖాజా మెహ్మూద్ అజీజ్, అతని సోదరుడు ఖలీల్ అజీజ్ లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ మెయిళ్ళ రికార్డులను స్కానింగ్ చేసి వివరాలను వారు రాబడుతున్నారు. కేఫ్ యజమానులనుండి మరిన్ని వివరాలను రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకూ నిందితుడు ఎలా ఉంటాడన్నదీ వివరాలు రాబట్టామని వారు తెలిపారు.

“ఆవ్యక్తి భౌతిక రూపం గురించిన వివరాలు కొన్నింటిని సంపాదించాము. అతనిని వెతికి పట్టుకోవడానికి పోలీసు పార్టీలను నియమించాము” అని పరిశోధనలో ఉన్న ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపినట్లుగా ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది. ఇంతవరకూ ఎవర్నీ అరెస్టు చేయలేదని ఆయన తెలిపాడు.

బుధవారం సైబర్ కేఫ్‌ను సందర్శించిన వారి వివరాలను కూడా పోలీసులు తీసుకున్నారు. ఈ మెయిల్ సందేశం కాశ్మీరునుండి వచ్చిందని వెల్లడయ్యాక జమ్మూ కాశ్మీరు పోలీసులు కొన్ని దాడులు చేసినట్లు తెలుస్తోంది. రెండు జాతీయ వార్తా ఛానెళ్లకు హుజి సంస్ధగా చెప్పబడుతున్నవారి నుండి ఈమెయిల్ వచ్చింది. పేలుడుకు తమదే బాధ్యత అని చెబుతూ, పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురుకి ఆ శిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే తదుపరి దాడి సుప్రీం కోర్టుపైనేనని హెచ్చరించారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.హెచ్.కపాడియా, గురువారం ఢిల్లీ హైకోర్టు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ జడ్జిలతో సమావేశమై తీసుకోవలసిన జాగ్రత్తలను చర్చించారు. దేశవ్యాపితంగా కోర్టుల వద్ద భద్రతా ఏర్పాట్లు పెంచాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ‘హర్కత్ ఉల్ జీహాద్ ఇస్లామీ’ సంస్ధ పాకిస్ధాన్ భూభాగం నుండి నడుస్తున్న టెర్రరిస్టు సంస్ధగా భారత ప్రభుత్వం గుర్తించింది.

ఇదిలా ఉండగా మీడియా సంస్ధలు మరో ఈమెయిల్ అందుకున్నాయి. ఇండియన్ ముజాహిదీన్ నుండి తమదే పేలుడుకు బాధ్యత అంటూ మెయిల్ అందింది. ‘ఛోటూ’ పేరుతో వచ్చిన ఈ మెయిల్‌లో షాపింగ్ మాల్‌లో మరో బాంబు పేలుతుందని హెచ్చరిక అందింది. chotoominani5@gmail.com నుండి మధ్యాహ్నం తాజా ఈ మెయిల్ అందింది. హుజికి ఈ పేలుడులో ఏ పాత్రా లేదని ఛోటూ తన మెయిల్ లో తెలిపాడు.

హైకోర్టు వద్ద బుధవారం బిజీగా ఉంటుందనీ, అందుకే ఆ రోజును ఎన్నుకున్నామని ఇండియన్ ముజాహిదీన్ తెలిపింది. అయితే పోలీసులు మీడియాకి అందుతునన్ ఈమెయిళ్ల విశ్వసనియతపై ఏమీ చేప్పలెకపోతున్నారు. ఏ అవకాశాన్ని వదలడం లేదని మాత్రమే చెబుతున్నారు. భద్రతా సంస్ధలు, పరిశోధనలనూ అయోమయానికి గురిచేయడానికి టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారా అన్నది పరిశీలిస్తున్నారు.

బుధవారం జరిగిన పేలుడులో మరణించినవారి సంఖ్య 12 కి చేరుకోగా గాయపడిన వారు 91 మందని వార్తా ఛానెళ్ళు చెబుతున్నాయి. కాశ్మీరును కొన్ని షరతులపైన 1947లో అప్పటి పాలకులు ఇండియాలో విలీనం చేశారు. నిజానికి విలీనం చేయలేదనీ, అది పాకిస్ధాన్ నుండి దాడులనుండి రక్షణ పొందడానికి తాత్కాలికంగా చేసుకున్న ఏర్పాటు మాత్రమేనని కాశ్మీరు స్వతంత్ర వాదులు పేర్కొంటున్నారు.

కాశ్మీరులో ఫ్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహిస్తామన్న వాగ్దానాన్ని ఆ తర్వాత నెహ్రూ పట్టించుకోలేదు. ఇప్పటి జమ్ము & కాశ్మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా నాయకత్వంలో వాగ్దానం మేరకు ఫ్లెబిసైట్ జరపాలని డిమాండ్ చేయడంతో ఆయనను భారత ప్రభుత్వం మొత్తం 18 సంవత్సరాలపాటు జైల్లో నిర్భంధించింది. 1989లో మొదలైన తాజా ఉద్యమం ఇంకా రగులుతూనే ఉంది.

జమ్ము & కాశ్మీరు ప్రాంతం మనఃపూర్తిగా ఇండియాలో కలవాలంటే భారత ప్రభుత్వం అక్కడి ప్రకృతినీ, ఆదాయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అక్కడ నివసించే కాశ్మీరి జాతి ప్రజలకు ప్రాధాన్యం ఇస్తూ వారి మనసులను గెలుచుకోవలసిన అవసరం ఉంది. సైనిక చర్యలలోనే పరిష్కారం వెతుకుతున్నంత కాలం, కాశ్మిరు స్వాతంత్ర్యం పేరుతో ఉగ్రవాదం భారత దేశాన్ని వెంటాడుతూనె ఉంటుంది. పాకిస్ధాన్ బూచిని చూపెట్టి భారత ప్రజల్లో కాశ్మీరు ప్రజలపై ద్వేషాన్ని పెంచే ప్రయత్నాలని ప్రభుత్వం కట్టిపెట్టి వాస్తవికతల ఆధారంగా పరిష్కారం వెతకాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s