
భారత దేశ రాజ్యాంగసంస్ధ, ప్రభుత్వ ఉన్నత ఆడిటింగ్ సంస్ధ అయిన ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ రిలయన్స్ ఇండస్ట్రీస్ కాంట్రాక్టు ఉల్లంఘనలపై తన పూర్తి నివేదికను గురువారం సమర్పించింది. ఈ నివేదికలో కేంద్ర ప్రభుత్వం, రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండింటినీ కాగ్ విమర్శించింది. కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీకీ, రిలయన్స్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించేలా సహకరించినందుకు ప్రభుత్వానికీ అక్షింతలు వేసింది. దేశానికి చెందిన కీలకమైన ఆయిల్ వనరు కృష్ణ-గోదావరి (కె.జి) బేసిన్ అభివృద్ధి చేసే కాంట్రాక్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ చేజిక్కించుకుంది. ప్రారంభంలో కుదుర్చుకున్న ఒప్పందానికి సవరణలు చేయడం ద్వారా ప్రభుత్వం తన లాభాలను గణనీయంగా వదులుకుందని కాగ్ సంస్ధ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపింది. సవరించిన “లాభాల పంపిణీ ఒప్పందం”ను మళ్లీ సమీక్షించాలని సూచించింది.
సముద్ర జలాల్లోని కె.జి బేసిన్ ద్వారా భారత దేశ ఆయిల్, గ్యాస్ అవసరాలలో నాలుగోవంతు అవసరాలను తీర్చవచ్చని అంచనాలు వేశారు. కాని రిలయన్స్ కంపెనీ హామీ ఇచ్చిందానిలో సగం మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి తీస్తుండడంతో ప్రభుత్వం విదేశాలనుండి అధిక రేటు చెల్లించి గ్యాస్, ఆయిల్ లను కొనవలసి వస్తున్నది. విద్యుత్, ఎరువుల కర్మాగారాలు ఇంధనం కోసం గ్యాస్ పైనే ఆధారపడుతుండడంతో కొరత ప్రభావం ఇతర పరిశ్రమలన్నింటిపైన పడుతున్నది. కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న పలు ప్రధాన కాంట్రాక్టులను గత సంవత్సరకాలంగా సుప్రీం కోర్టు, కాగ్ లు చురుకుగా పరిశీలిస్తూ అవినీతిని ఎండగడుతున్న సంగతి విదితమే.
ప్రభుత్వము, రిలయన్స్ కంపెనీల మద్య కుదిరిన ఉత్పత్తి పంపిణీ ఒప్పందం సవరణ, ప్రవేటు కాంట్రాక్టర్ల (రిలయన్స్) కేపిటల్ ఖర్చులను పెంచుకునేలా ప్రోత్సహించడానికి ఉద్దేశించిందని కాగ్ తన నివేదికలో తెలిపింది. దీనివలన ప్రభుత్వ వాటా తగ్గిపోయిందని కాగ్ పేర్కొన్నది. లాభాల పంపిణీ ఒప్పందాన్ని సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది. కాగ్ నివేదిక ప్రత్యేకంగా రిలయన్స్ కంపెనీ తప్పులను ఎత్తి చూపింది. కె.జి బేసిన్ లోని KG-DWN-98/3 లేదా D6 బ్లాకు కు సంబంధించి రిలయన్స్ అవకతవకలకు పాల్పడిందని తేల్చింది. ఉత్పత్తి పంపిణీ ఒప్పందం నిబంధనలను రిలయన్స్ కంపెనీ ఉల్లంఘించడానికి ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నది.
కాంట్రాక్టు ప్రకారం ప్రతి దశ చివరా 25 శాతం కాంట్రాక్టు ఏరియాను ప్రభుత్వానికి అప్పజెప్పకుండానే రిలయన్స్ కంపెనీ, ఆయిల్, గ్యాస్ ల తవ్వకాలకు సంబంధించి రెండవ, మూడవ దశలలోకి అడుగు పెట్టిందని కాగ్ ఎత్తి చూపింది. డి1, డి3 గ్యాస్ బావులకు సంబంధించి మొదట వేసిన అంచనా ప్రకారం కాకుండా అధిక అంచనాతో కేపిటల్ ఖర్చులను పెంచుకుందనీ, కాని ఆయిల్, గ్యాస్ వెలికి తీస్తున్న కార్యకలాపాలలో అత్యధికం మొదటి కాంట్రాక్టు ఏరియాలో కాకుండా రెండవ కాంట్రాక్టు ఏరియాలోనే ఎక్కువగా చేస్తున్నదనీ తెలిపింది. దానివలన ప్రభుత్వానికి రావలసిన లాభాల వాటా రాకుండా పోయిందనీ పేర్కొంది. అయితే కాగ్, ప్రభుత్వం ఎంతమొత్తం నష్టపోయిందీ చెప్పలేదు.
మే నెలలో రిలయన్స్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపాన గల డి6 బావినుండి 48 ఎం.ఎస్.సి.ఎం.డి (మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే ఆఫ్ గ్యాస్) ల గ్యాస్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రభుత్వ నియంత్రణ సంస్ధ తెలిపింది. కాని ఇది గత సంవత్సరం ఉత్పత్తి చేసిన 60 ఎం.ఎస్.సి.ఎం.డి ల కంటే తక్కువ కాగా, ఈ సంవత్సరం ఉత్పత్తి చేయగలనని ప్రభుత్వానికి వాగ్దానం చేసిన 80 ఎం.ఎస్.సి.ఎం.డి ల కంటే మరింత తక్కువ కావడం గమనార్హం.
అంతే కాకుండా ఆధునిక పరిశోధనా యంత్ర పరికరాల పరిజ్ఞానం అందుతున్న కారణం చూపించి, రిలయన్స్ కంపెనీ తనకు అప్పజెప్పిన గ్యాస్, ఆయిల్ బావులలో ముప్ఫై శాతం వాటాను బ్రిటిష్ పెట్రోలియం (బిపి) కంపెనీకి అమ్ముకున్నది. దాని తర్వాత బిపి కంపెనీ ఎంతవరకు ఆధునిక టెక్నాలజీని పొందిందీ ఇంతవరకూ ప్రకటించలేదు. భవిష్యత్తులో ప్రకటిస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. రిలయన్స్ కంపెనీకి అనుకూలంగా ప్రభుత్వ వర్గాలు పాల్పడిన ఈ అవినీతి, అలాగే రిలయన్స్ కంపెనీ కాంట్రాక్టు ఉల్లంఘనలూ కార్పొరేట్ అవినీతిగా పరిగణిస్తున్నారు. ప్రవేటీకరణ వలన చోటు చేసుకుంటున్న ఈ కార్పొరేట్ అవినీతిపై విచారణకు అన్నా హజారే బృందం ప్రతిపాదించిన జన్ లోక్ పాల్ బిల్లులో స్ధానం లేదని అరుంధతీ రాయ్ లాంటి ప్రముఖులు విమర్శలు గుప్పించారు.
రాను రానూ భారత దేశంలో ప్రవేటీకరణ మరింత వేగంతో విస్తరించనుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు ప్రభుత్వాలు పార్టీలతో సంబంధం లేకుండా చేస్తున్నాయి. అటువంటి నేపధ్యంలో కార్పొరేట్ కంపెనీల అవినీతి, ప్రవేటు రంగంలో జరిగే అవినీతిల గురించి ప్రస్తావించకుండా అవినీతిపై పోరాటం అంటే అది ఉత్తి నినాదమే తప్ప మరొకటి కాదు. ప్రభుత్వాలు తమ మెజారిటీ విధులనుండి తప్పుకుని ప్రవేటు రంగానికి అప్పజెపుతున్నాయి. కనుక ప్రవేటు రంగ అవినీతిపై దృష్టి పెట్టడం ఇప్పటి కాలంలో అత్యవసరం. కొన్ని ప్రవేటు కంపెనీలు అన్నా హజారే అవినీతి వ్యతిరేక బృందం నిర్వహించిన పోరాటానికి నిధులు అందజేసి ఏర్పాట్లు చేశాయనీ ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో జన్ లోక్ పాల్ బిల్లు సమర్ధత మరింత ప్రశ్నార్ధకంగా మిగిలింది.
