ముంబై దాడుల దోషి హేడ్లీ అప్పగింతకు ఇండియా సీరియస్‌గా లేదు -మాజీ భద్రతాధికారి


ముంబై దాడుల నిందితుడు హేడ్లీని అమెరికానుండి ‘నేరస్ధుల అప్పగింత ఒప్పందం’ కింద ఇండియాకి రప్పించడానికి, భారత ప్రభుత్వం అంత సీరియస్ గా లేదని అమెరికా రాయబారితో చెప్పిన విషయం వికీలీక్స్ వెల్లడించిన కేబుల్ ద్వారా బైటపడింది. లష్కర్ ఎ తొయిబా సభ్యుడు డేవిడ్ కోలమన్ హేడ్లీని ఇండియాకి రప్పించడానికి అమెరికాపై ఒత్తిడి చేసున్నట్లు పైకి కనిపించినప్పటికీ వాస్తవానికి ‘ఈ సమయంలో’ హేడ్లీని రప్పించడానికి భారత్ సిద్ధంగా లేదని భారత ప్రభుత్వ మాజీ భద్రతా సలహాదారు ఎం.కె.నారాయణన్ అమెరికా రాయబారి రోమర్ తో అన్న విషయం అమెరికా డిప్లోమేటిక్ కేబుల్ ద్వారా వెల్లడయ్యింది.

భారత దేశంలోని అమెరికా రాయబారులు ఇండియా లో గూఢచర్యం సాగిస్తూ వివిధ రంగాలలో భారత అధికారులలోనే కాంటాక్టులని నియమించుకుని, వారిద్వారా సమాచారం సేకరించి అమెరికా ప్రభుత్వానికి కేబుల్స్ ద్వారా పంపిన సంగతి వికీలీక్స్ సంస్ధ బైటపెట్టింది. తమకు అందిన డిప్లోమేటిక్ కేబుల్స్ ను కొద్ది రోజుల క్రితం వికీలీక్స్ సంస్ధ దాదాపు 250,000కు పైగా కేబుల్స్ ను ప్రచురించింది. తాను ఒప్పందం కుదుర్చుకున్న పత్రికలు ఎంతకూ కేబుల్స్ ను బైటపెట్టకపోవడంతో విసుగు చెందిన వికీలీక్స్ సంస్ధ తానే ఒకే సారి తమ వద్ద ఉన్న మెజారిటీ కేబుల్స్ ను ప్రచురించింది. ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్, మాజీ డెప్యుటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలంగాణ ఉద్యమంలో కెరీర్ భయం లేని మాదిగ యువకులు ఉన్నారంటూ వివాస్పద వ్యాఖ్యలను అమెరికా రాయబారి వద్ద చేసినట్లుగా వికీలీక్స్ ద్వారా వెల్లడయ్యిన సంగతి విదితమే. ఆ సంగతి పత్రికల్లో నలుగుతుండగానే ముంబై టెర్రరిస్టు దాడుల నిందితులను రప్పించడానికి భారత ప్రభుత్వం సీరియస్ గా లేదన్న సంగతి బైటపడడం సంచలనంగా మారింది.

డిసెంబరు 2009లో ఎమ్.కె.నారాయణన్ కూ, అమెరికా రాయబారి రోమర్ కూ ఈ సంభాషణ జరిగినట్లు కేబుల్ ద్వారా తెలుస్తోంది. అంటే ముంబై దాడులు జరిగి దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఈ సంభాషణ జరిగింది. ముంబై దాడులకు ముందు అనేక సార్లు ఇండియా సందర్శించి టెర్రరిస్టులకు అవసరమైన ఏర్పాట్లు చేసిన హేడ్లీని, ఇండియాకు ‘ఆ సమయంలో’ రప్పించడానికి భారత ప్రభుత్వం సుముఖంగా లేదని ఎం.కె.నారాయణన్ చెప్పడాన్ని బట్టి భారత ప్రభుత్వ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. ముంబైదాడుల నిందితుడ్ని ఇండియా రప్పించడం అంటే ప్రభుత్వం సాధించిన విజయంగా ప్రజల్లో ప్రచారం చేసుకోవచ్చు. డిసెంబరు 2009 నాటికి రెండవ విడత యు.పి.ఎ అధికారంలోకి వచ్చినందున, ప్రజల్లో పేరు వచ్చే అటువంటి సంఘటనలను మళ్ళీ ఎన్నికలనాటికి వాయిదా వేయవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించిఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

డిసెంబరు 17, 2009 తేదీన రాసిన కేబుల్ లో అప్పటి అమెరికా రాయబారి తిమోతి జె. రోమర్ ఈ అంశాలను పొందుపరిచాడు. హేడ్లీ అప్పగింతపై నారాయణన్ తనతో మాట్లాడుతూ ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడకుండా ఉండడం చాలా కష్టమైన పని అని చెబుతూ కాని ప్రభుత్వం హేడ్లీ అప్పగింతకు “ఈ సమయంలో” అంత ఆసక్తిగా లేదని చెప్పాడని రోమర్ కేబుల్ లో రాశాడు. రోమర్ నిజానికి హేడ్లీ అప్పగింతను ఇండియా కోరకుండా ఉండడమే తమకు కావాలని కోరుకుంటున్న నేపధ్యంలో ఎం.కె.నారాయణన్ మాటలు బహుశా నెత్తిన పాలు పోసినట్లయి ఉంటుంది. 26/11 దాడులలో ప్రధాన ముద్దాయిని ఇండియా రప్పించడానికి ముందే ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తే ప్రభుత్వం గడ్డు పరిస్ధితిని ఎదుర్కోవలసి వస్తుందని నారాయణన్ రోమర్ కి చెప్పాడు. అంటే భారత ప్రభుత్వం నిజానికి హేడ్లీని అప్పుడే రప్పించడం పట్ల ఆసక్తిగా లేదనీ, కానీ ఆసక్తి లేదన్న విషయం బైటికి తెలిస్తే చాలా ప్రతికూల పరిస్ధితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని కనుక పైకి ఒత్తిడి చేస్తూనే ఉన్నా దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదని నారాయణన్ అమెరికా రాయబారికి అభయం ఇచ్చాడన్నమాట.

హేడ్లీని ఇండియాకి అప్పగిస్తున్నట్లు తెలిస్తే అతను అమెరికా విచారణకు సహకరించడం మానేస్తాడన్న భయాన్ని రోమర్ వ్యక్తం చేశాడని కేబుల్ తెలిపింది. కానీ అమెరికా న్యాయ వ్యవహారాన్ని కొనసాగివ్వనిస్తూ, హేడ్లీ నేరాన్ని రుజువు చేయగల సాక్ష్యాలు అతను చెప్పె వరకూ విచారణ ప్రక్రియను సాగదీయాలని, అలా చేసినట్లయితే హేడ్లీనుండి గరిష్టంగా సమాచారాన్ని రాబట్టగలమనీ రోమర్ భావించాడని కేబుల్ ద్వారా తెలుస్తున్నది. హేడ్లీ చెబుతున్న విషయాలను ఇండియా జాగ్రత్తగా దాచిపెట్టాలనీ కాని ఆ సమాచారం లీక్ అయినట్లుగా భారత పత్రికల ఊహాగానాలు చేస్తున్నాయని, భారత ప్రభుత్వాధీకరి ద్వారానే తెలిసినట్లుగా పత్రికల వార్తలను బట్టి తెలుస్తున్నదని రోమర్ చెప్పగా, నారాయణన్ పత్రికల వార్తలను అర్ధం లేనివిగా కొట్టిపారేశాడని కేబుల్ తెలిపింది.

హేడ్లీ గనుక దోషిగా రుజువైతే ఇండియాకి అతనిని రప్పించడం అసాధ్యంగా మారిపోవచ్చని కూదా రోమర్ నారాయణన్ కి చెప్పాడు. దోషిగా రుజువైతే కోర్టు శిక్ష విధిస్తుందనీ, అమెరికా చట్టాల ప్రకారం శిక్ష పూర్తయ్యె వరకూ అప్పగింత కుదరదనీ కనుక అది బహుశా దశాబ్ధాలు కూడా పట్టవచ్చనీ రోమర్ నారాయణన్‌కి తెలిపాడు. దీనిపై నారాయణన్ స్పందన ఏమిటన్నదీ కేబుల్‌లో లేదు. మూడు వందలకు పైగా ప్రాణాలను తీసుకున్న టెర్రరిస్టు దాడుల ప్రధాన నిందితుడిని “ఈ సమయంలో” ఇండియాకి రప్పించడానికి నారాయణన్ చెప్పడం ప్రభుత్వాల ప్రాధామ్యాలను తెలిపే అంశం. భారత పౌరుల మూడొందల వరకూ చనిపోయినప్పటికీ ధోషులను సాధ్యమైనంత త్వరగా శిక్షించడం కంటే దానినుండి రాజకీయ ప్రయోజానాలను రాబట్టుకోవడం పైనే ప్రభుత్వం దృష్టి సారించడం అమానుషం.

4 thoughts on “ముంబై దాడుల దోషి హేడ్లీ అప్పగింతకు ఇండియా సీరియస్‌గా లేదు -మాజీ భద్రతాధికారి

  1. పింగ్‌బ్యాక్: ముంబై దాడుల దోషి హేడ్లీ అప్పగింతకు ఇండియా సీరియస్‌గా లేదు -మాజీ భద్రతాధికారి (via తెలుగులో జాతీయ

  2. పింగ్‌బ్యాక్: ముంబై దాడుల దోషి హేడ్లీ అప్పగింతకు ఇండియా సీరియస్‌గా లేదు -మాజీ భద్రతాధికారి (via తెలుగులో జాతీయ

  3. పింగ్‌బ్యాక్: ముంబై దాడుల దోషి హేడ్లీ అప్పగింతకు ఇండియా సీరియస్‌గా లేదు -మాజీ భద్రతాధికారి (via తెలుగులో జాతీయ

  4. పింగ్‌బ్యాక్: ముంబై దాడుల దోషి హేడ్లీ అప్పగింతకు ఇండియా సీరియస్‌గా లేదు -మాజీ భద్రతాధికారి (via తెలుగులో జాతీయ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s