మాయావతి ఓ అనుమాన పిశాచి, డిక్టేటర్ -అమెరికా రాయబారి (వికీలీక్స్)


ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఒక అనుమాన పిశాచి అనీ, డిక్టేటర్‌ను పోలి ఉండే అలవాట్లు గల వ్యక్తి అనీ అమెరికా రాయబారి, అమెరికా ప్రభుత్వానికి పంపిన కేబుల్‌లో పేర్కొన్న సంగతి వికీలీక్స్ ద్వారా వెల్లడయ్యింది. “పోర్ట్రయిట్ ఆఫ్ ఎ లేడీ” అన్న హెడ్డింగ్‌తో రాసిన ఈ కేబుల్‌లో మాయావతి దళిత కార్డుని ఉపయోగిస్తున్నప్పటికీ ఆమె ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి చేస్తున్నదేమీ లేదనీ, అభివృద్ధికి సైతం చేస్తున్నదేమీ లేదని రాయబారి పేర్కొన్నాడు.

2007 నుండి 2009 వరకూ వివిధ దేశాలలోని అమెరికా రాయబారులు, అమెరికా ప్రభుత్వానికి పంపిన కేబుళ్లను వికీలీక్స్ తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. అమెరికాకి చెందిన న్యూయార్క్ టైమ్స్, జర్మనీకి చెందిన డెర్ స్పీగెల్, బ్రిటన్‌కి చెందిన గార్డియన్ పత్రికలతో వికీలీక్స్ ఒప్పందం కుదుర్చుకుని కేబుళ్ళు అందజేసినప్పటికీ అవి కొద్ది నెలలుగా వాటిని ప్రచురించడం మానివేశాయి. దానితో విసుగు చెందిన వికీలీక్స్ అధినేత జులియన్ అస్సాంజ్ తమ వెబ్‌సైట్ లో 250,000కి పైగా కేబుళ్ళను ప్రచురించాడు.

మాయావతి దళితుల పట్ల అవతరించిన మెస్సయ్యా లాగా పోజిచ్చినప్పటికీ ఆమె తనకు నచ్చిన బ్రాండు చెప్పుల కోసం ఖాళీ జెట్ విమానాన్ని ముంబైకి పంపిస్తుందని కేబుల్‌లో రాయబారి రాశాడు. జర్నలిస్టులు, అధికారులు చేసే ఫోన్లపై నిరంతర నిఘా ఉంటుందని తనకు తెలియకుండా ఏమీ జరగడానికి వీల్లేదని మాయావతి భావిస్తుందని కేబుల్ తెలిపింది. మాయావతి గురించి అమెరికా కేబుల్ లో రాసిన అంశాలు ఇంకా ఇలా ఉన్నాయి.

 • మాయావతి అవినీతిని తన చేతుల్లోకి కేంద్రీకరించబడేలా ఏర్పాట్లు చేసుకుంది. అనుమానంతో కూడిన డిక్టేటర్ తరహాలో వ్యవహరిస్తూ ఇద్దరు రుచి చూసేవారిని నియమించుకుంది. (తనపై విష ప్రయోగం జరుగుతుందన్న భయంతో ఈ ఏర్పాటు.) రాష్ట్ర భద్రతా దళాలతో సమానంగా తన సొంత భద్రతా దళాలను ఏర్పరుచుకుంది.
 • తమ హోదాలు పోతాయన్న భయంతో సివిల్ సర్వెంట్లు నోరు విప్పరు.
 • మాయావతికి వ్యతిరేకంగా ఏమన్నా రాసినట్లయితే కక్ష సాధింపు చర్యలు ఉంటాయని విలేఖరులు భయపడుతుంటారు. సివిల్ సర్వెంట్లు అందరి ఫోన్లనూ, జర్నలిస్టుల అత్యధిక ఫోన్లను ట్యాప్ చేసారని ఒక జర్నలిస్టు చెప్పాడు.
 • మాయావతి ప్రధాన మంత్రిని కావాలన్న కోరికను తీవ్ర స్ధాయిలో కలిగి ఉంది. 2009 లోక్ సభ ఎన్నికల్లో బి.ఎస్.పి కార్యకర్తలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయడానికి కూడా సిద్ధపడ్డారు.
 • అన్ని నిర్ణయాలూ మాయావతి ద్వారా గానీ, అమెకు ఉన్న చిన్న కోటరీ ద్వారా గానీ జరగాలి.
 • ఒక లక్నో జర్నలిస్టు ప్రకారం, ఒక మంత్రి మాయావతికి చెప్పకుండా యు.పి గవర్నర్ ను కలిసినందుకు శిక్షగా ఆమె ఎదురుగా గుంజీళ్ళు తీయవలసి వచ్చింది.
 • ఒక సివిల్ సర్వెంట్ (అధికారి) కూతురు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిందని తెలుసుకున్న మాయావతి ఆ అధికారి రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చింది. బి.ఎస్.పి నాయకులు తప్ప ఆమె పాలనను ఎవరూ మంచి పాలనగా అంగీకరించరు.
 • ములాయమ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ పాలన కంటే మాయవతి పాలనలో శాంతి భద్రతల పరిస్ధితి ఫర్వాలేదనిపించేలా మెరుగుపడింది.
 • అవినీతిని మాయావతి వ్యవస్ధీకృతం చేసింది. మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్ధీకరణల్లో పోటీ పెట్టి మరీ డబ్బులు వసూలు చేసింది. బి.ఎస్.పి పార్లమెంటరీ అభ్యర్ధిగా నిలబడడానికి 250,000 డాలర్లు సమర్పించుకోవాలి. ఇదేమీ గెలుపుని గ్యారంటీ చేసేదేమీ కాదు. కాని బి.ఎస్.పి 300 కి పైగా స్ధానాల్లో తన అభ్యర్ధులను నిలబెట్టనుంది.
 • 2007 రాష్ట్ర ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించాక మాయావతి ఎవరి మాటా లెక్క చేయని పరిస్ధితి ఏర్పడింది. దానితో ఆమె తన అసాధారణ ప్రవర్తన, చపలత్వం, అబధ్రతా భావం లతో వ్యవహరించడానికి అవకాశం లభించినట్లయింది. ఉదాహరణకి ఆమెకి కొత్త చెప్పులు అవసరమైనపుడు తనకు నచ్చిన బ్రాండు కోసం ఆమె ప్రవేటు జెట్ ని ఖాళీగా ముంబై పంపి తెప్పించుకుంది.
 • లక్నో జర్నలిస్టుల ప్రకారం, ఆమె తొమ్మిదిమంది వంటగాళ్ళను నియమించుకుంది. ఇద్దరు వంట చేస్తుండగా ఆ వంటను చూస్తూ ఉండడం మిగిలినవారి డ్యూటి. తనపై హత్యా ప్రయత్నం జరుగుతుందన్న భయంతో తనకు అత్యున్నత భద్రతా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
 • పెద్ద ఎత్తున భద్రతా చర్యలకు తోడు ఆమె తన ఇంటినీ, కార్యాలయాన్నీ కలుపుతూ ప్రవేటు రోడ్డు నిర్మించుకుంది. ఆమె కాన్వాయ్ లక్ష్యాన్ని చేరిన వెంటనే ఆ రోడ్డుని శుభ్రపరచవలసి ఉంటుంది.
 • మాయావతి మీడియాతో మాట్లాడడం అరుదు. ఎప్పుడన్నా ప్రెస్ కాన్ఫరెన్సు జరిగితే విలేఖరులు ప్రశ్నలను అనుమతించరు.
 • కాంగ్రెస్, బి.జె.పి లు బాగా బలహీనపడడంతో సమాజ్ వాదీ పార్టీ చట్టరాహిత పాలనను అంతమొందించడానికి పెద్ద కులాల వాళ్లు బి.ఎస్.పిలో చేరడానికి క్యూ కట్టారు.

ఇవన్నీ అమెరికా రాయబారి తనకున్న వివిధ కాంటాక్టుల ద్వారా సేకరించిన విషయాలు. అంటే ఇవి చెప్పిన వార్తలే తప్ప చూసి లేదా అనుభవించి రాసిన అంశాలు కావు. కనుక వాటిలో నిజం కాని అంశాలు కూడా ఉండే అవకాశం ఉంది. లేదా భూతద్దంలో చూపిన అంశాలు కూడా ఉండవచ్చు.

3 thoughts on “మాయావతి ఓ అనుమాన పిశాచి, డిక్టేటర్ -అమెరికా రాయబారి (వికీలీక్స్)

 1. ఇందులో వింత ఏమీ లేదు.ప్రజలు ఎన్నుకొన్నవారైనా(అందరూకాకపోయినా)మనదేశంలో కొందరు అధికారంలోకి వస్తే రాజులు,రాణీల్లాగ ప్ర వర్తిస్తారు.కాని వారి దాతృత్వం ,నొబిలిటీ వీళ్ళకి ఉండవు.-రమణారావు.ముద్దు

 2. రమణా రావు గారూ, రాజులకీ, రాణులకీ దాతృత్వం, నొబిలిటీ ఉంటుదనడంలో నిజం లేదనుకుంటా. వారెప్పుడు సంపాదించారు గనక దానం చెయ్యడానికి? వారి బతుకంతా పారసైట్ బతుకే కాదా?

 3. ఈ వార్త చదివిన తరువాత కింద పడి దొర్లి నవ్వుకోలేక చచ్చాను. మాయావతి తాను తీసుకునే ఆహారంలో విషం కలిసిందో లేదో తనిఖీ చేసేందుకు ఆమె రుచి చూసేవాళ్ళని నియమించుకున్నదట. ఏమి అనుమానపు బతుకు ఈమెది? ఎంతో మంది శతృవులు ఉన్న అలెక్సాండర్, చెంఘీజ్ ఖాన్, తామర్లేన్, బాబర్, ఔరంగజేబ్ లాంటి వాళ్ళు కూడా ఈ అనుమానపు బతుకు బతికి ఉండరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s