బంగ్లాదేశ్‌కు రు.3375 కోట్ల రుణం మంజూరు చేసిన ఇండియా


ఓ వైపు బడ్జెట్ లోటు తగ్గించడానికి ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం తగుదునమ్మా అని తనకు మాలిన ధర్మాన్ని అనుసరిస్తోంది. భారత దేశంలో రోడ్లు, రైల్వేలు లాంటి మౌలిక రంగాల నిర్మాణం ఆధినిక సౌకర్యాలతో లేనందున సరఫరా నష్టాలు ఏర్పడి ధరలు పెరుగుతున్నాయనీ, దానితో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతున్నదనీ ప్రధాని మన్మోహన్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చెబుతున్నారు. ఆ పేరుతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాల కోసం నిధులు సంపాదించడానికి కేంద్ర ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండులను గత రెండు సంవత్సరాలుగా జారీ చేస్తున్నది. దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం గురించి పట్టించుకోకుండా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం భారత దేశం 750 మిలియన్ డాలర్ల (రు.3,375 కోట్ల) రుణాన్ని మంజూరు చేసింది. “తాదూర కంత లేదు, మెడకో డోలు” అంటే ఇదే కాబోలు.

వాణిజ్య మౌలిక రంగాల అభివృద్ధి కోసం ఈ రుణం మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ కు చెందిన ఒక సీనియర్ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ విషయం తెలిపింది. ప్రధాని మన్మోహన్ ఈ వారంలో బంగ్లాదేశ్ ను సందర్శించనున్న నేపధ్యంలో ఈ రుణ వితరణ జరిగింది. పోర్టులు, తత్సంబంధిత ఇతర మౌలిక నిర్మాణాల కోసం ఒక బిలియన్ డాలర్ల (రు. 4,500 కోట్లు) రుణం ఇవ్వాలన్న ప్రతిపాదనలో ఇది భాగమని ఆర్ధిక సంబంధాల డివిజన్ సెక్రటరీ ముషార్రఫ్ హొస్సయిన్ భౌయాన్ తెలిపాడు.

గత సంవత్సరం ఆగస్టు నెలలో రెండు డజన్ల వరకూ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేయడానికి ఒప్పందం కుదిరిమ్చని బౌయాన్ తెలిపాడు. వీటిలో తీస్తా, ఫెని నదులకు సంబంధించి మధ్యంతర నీటి పంపిణీ ఒప్పందాలు రెండు ముఖ్యమైనవని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డిపు మోని తెలిపింది. ఇండియా, నేపాల్, భూటాన్ దేశాలకు కనెక్టివిటీ పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా ఆమె తెలిపింది. రైలు, జల మార్గం, వాయు మార్గాల ద్వారా ఈ కనెక్టివిటీ పెంపుదల చేయవలసి ఉందని ఆమె తెలిపింది.

సెప్టెంబరు 6, 7 తేదీల్లొ ప్రధాని బంగ్లాదేశ్ సందర్శించనున్న కాలంలో వివిధ ఒప్పందాలు జరగనున్నాయి. 1947 నాడు దేశం చీలిన నాటి వివాదాలతో పాటు ప్రధాన నదుల నీటి హక్కులు ఒప్పందాలు జరుగుతాయని భావిస్తున్నారు. పొరుగున ఉన్న చిన్నదేశంతో భారత దేశం దగ్గరి సంబంధాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న సంగతిని ప్రపంచానికి తెలిపినట్లవుతుందని ఇండియా భావిస్తున్నది. ఈశాన్య రాష్ట్రాలనుండి బంగ్లాదేశ్ లోకి రాకపోకలకు సౌకర్యాలను మెరుగుపరచాలని ఇండియా కోరుతున్నది. చిట్టగాం, మోంగ్‌లా పోర్టులను ద్వైపాక్షిక సంబంధాలనూ, వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి వాడవలసిందిగా బంగ్లా దేశ్ ఇండియా కోరింది. అయితే బంగ్లాదేశ్ ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. వీటివలన బంగ్లాదేశ్ కంటే భారత దేశానికే ఎక్కువ ఉపయోగమనీ తేల్చాయి. 250 మెగావాట్ల విద్యుత్ ను ఇండియా నుండి కొనడానికి బంగ్లాదేశ్ చూస్తున్నదని కూడా ఒక మంత్రిని ఉటంకిస్తూ వార్తలు తెలిపాయి.

భారత ప్రభుత్వం స్ధానికంగా అంటే దక్షిణాసియాలో పెద్దన్నగా ఉండడానికి ప్రయత్నిస్తుంటుంది. అటువంటి భారత్ ప్రయత్నాలని పాకిస్ధాన్ ఇష్టపడదు. బంగ్లాదేశ్ ను భారత దేశమే పాకిస్ధాన్ నుండి విడిపించిందని చెబుతున్నప్పటికీ అక్కడి ప్రజలు క్రమంగా పాకిస్ధాన్ వైపుకి మొగ్గు చూపడం ప్రారంభించారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పౌరులలో అత్యధికులు ఇండియా కంటే పాకిస్ధాన్‌నే మిత్ర దేశంగా పరిగణించడం యాదృచ్ఛికమేమీ కాదు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ కి రుణం ఇవ్వడం ఇండియా గొప్పతనంగానో, స్వయం సమృద్ధి సాచించినందునే పొరుగు దేశాలకు అప్పులివ్వగలుగుతోందని నమ్మవలసిన అవసరం లేదు. ఇండియా బంగ్లాదేశ్ కి అప్ ఇచ్చినప్పటికీ అది తన అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసే సౌకర్యం దానికి ఉండదు. భారత్ నిర్దేశించిన ప్రాజెక్టులకే భారత్ అప్పులిస్తుంది.

భారత్ ఇచ్చే అప్పులతో కట్టే ప్రాజెక్టులను ఇండియా సూచించే కంపెనీలకే బంగ్లాదేశ్ కాంట్రాక్టులు ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధంగా ఇండియా అప్పిచ్చి దానిని తాను చెప్పిన కంపెనీలకు కాంట్రాక్టులు అప్పజెప్పదానికి వినియోగిస్తుందన్నమాట. ఈ పద్ధతి కొత్తదేమీ కాదు. అమెరికా, యూరప్ లు ఇండియాపై అమలు చేసే పద్ధతి కూడా ఇదే. రుణాలిచ్చి ఆ రుణాల ద్వారా ఇచ్చే కాంట్రాక్టులను తమ దేశాల బహుళజాతి కంపెనీలకు అప్పగించాలని డిమాండ్ చేస్తాయి. అయితే ఇండియా జారీ చేసే రుణాల ద్వారా ఒక్క భారత దేశ కంపెనీలే కాకుండా భారత దేశంపై పెత్తనం చేస్తున్న బహుళజాతి సంస్ధలు కూడా లబ్ది పొందవచ్చు. ఏతావాతా తేలేదమంటే భారత్ చిన్న దేశాలకి ఇచ్చే అప్పు ద్వారా అంతిమంగా భారత్ లేదా అమెరికా, యూరప్ ల బహుళజాతి కంపెనీలే లబ్దిపొందుతాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s