
గాలి బ్రదర్స్ గ్రూపుకి చెందిన బి.శ్రీరాములు, తమకు మంత్రివర్గంలో చోటు కల్పించనందుకు నిరసనగా రాజీనామా చేసిన మరుసటి రోజే గాలి జనార్ధన రెడ్డి అరెస్టు జరగడం విశేషం. బి.శ్రీనివాసులు రాజీనామా అనంతరం బి.జె.పి నుండి మరో ఇరవైమంది బి.జె.పి ఎం.ఎల్.ఎ లు శ్రీరాములు తరహాలో రాజీనామ చేయనున్నారనీ, కర్ణాటక లోని బి.జె.పి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆదివారం పత్రికలు, వార్తా సంస్ధలు ఊహాగానాలు చేసిన నేపధ్యంలో సి.బి.ఐ అకస్మాత్తుగా అరెస్టులు సాగించడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
బి.జె.పి పార్టీలో చీలిక తెచ్చి, తద్వారా ప్రభుత్వంపై పోయిన పట్టును తిరిగి రాబట్టుకోవడానికి గాలి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నంతలోనే వారి అరెస్టులు జరిగాయి. గాలి అరెస్టు ద్వారా ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఒక గండం నుండి గట్టేక్కినట్లయింది. అంటే బి.జె.పి ప్రభుత్వం నిలబడింది. దీనిని బట్టి కర్ణాటక ప్రభుత్వం నిలుపుకోవడానికీ, ఆంధ్రలో జగన్ శిబిరం లోకి చేరిన ఎం.ఎల్.ఎ లను తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేలా ఆలోచింపజేయడానికీ బి.జె.పి, కాంగ్రెస్‌లు ఒక లోపాయకారి అవగాహనకు రావడం వల్లనే సి.బి.ఐ దాడులు జరిగి ఉండడానికి ఆస్కారం కనిపిస్తున్నది.
సి.బి.ఐ బలగాలు రెండు బృందాలుగా ఏర్పడి సోమవారం ఉదయం 5:30 ని.లకే ఒకే సారి జనార్ధన రెడ్డి, శ్రీనివాస రెడ్డి ఇళ్లపై దాడులు చేశారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. శ్రీనివాస రెడ్డిని శ్రీనగర్ లోని అవంభావి కాలనీలో అరెస్టు చేయగా, దానికి దగ్గర్లోనే ఉన్న విలాస భవనం నుండి జనార్ధన రెడ్డిని అరెస్టు చేశారు. ఇద్దర్నీ తీసుకుని లక్ష్మీనారాయణ హైద్రాబాదు వెళ్ళగా, మిగిలినవారు అక్కడే ఉండి ఇరువురి ఇళ్ళలోనూ సోదాలు కొనసాగించారు. మైనింగ్, ఇతర కార్యకలాపాలకు చెందిన డాక్యుమెంట్లను వారు తనిఖీ చేస్తున్నారని సి.బి.ఐ ప్రతినిధి తెలిపాడు.
బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఓబులాపురం గ్రామంలోనూ, అనంతపురం జిల్లాలోని మల్పనగుడి గ్రామంలోనూ ఓబులాపురం మైనింగ్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనింగ్ లీజులు మంజూరు చేసింది. ఈ కేటాయింపులో అక్రమ మైనింగ్ తో పాటు పలు ఇతర అక్రమాలు చోటు చేసుకున్న ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కే.రోశయ్య సి.బి.ఐ విచారణకు ఆదేశించారు.
ఒ.ఎం.సి, అనంతపురం మైనింగ్ కార్పొరేషన్ లకు మూడు మైనింగ్ లీజులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ రెండు కంపెనీలు గాలి జనార్ధన రెడ్డికి చెందినవి. జనార్ధన రెడ్డి సోదరుడు కరుణాకర్ రెడ్డి, వారి మిత్రుడు బి.శ్రీరాములు కూడా ఒ.ఎం.సి లో డైరెక్టర్లుగా ఉన్నారు. ఓ.ఎం.సి అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వాస్తవ ఉత్పత్తి కంటే అధిక మొత్తంలో ఖనిజాన్ని తరలించుకెళ్లడం, లీజుల మంజూరులో అవకతవకలు, రాష్ట్ర సరిహద్దును దాటి కర్ణాటకకు చెందిన మైనింగ్ ఏరియాలోకి చొచ్చుకొని వెళ్ళడం తదితర ఆరోపణలు ఒ.ఎం.సి పైన వచ్చాయి.
డిసెంబరు 10, 2009 న మొదటి సారిగా సి.బి.ఐ ఒ.ఎం.సి కార్యాలయం, బళ్ళారిలోని ఇతర కార్యాలయాలపైనా సి.బి.ఐ దాడి జరిపింది. ఎ.పి హైకోర్టు స్టే విధించడంతో విచారణ కొంతకాలం వాయిదా పడింది. ఈ సంవత్సరం మళ్ళీ జనవరిలో విచారణ పునఃప్రారంబమయ్యింది. అప్పటినుండి నిరాఘాటకంగా విచారణ కొనసాగుతోంది. ఆంద్రప్రదేశ్ లో జగన్ ఆస్తులపైన విచారణ సాగిస్తున్న సి.బి.ఐ, అతని మిత్రుడూ గాలి జనార్ధన రెడ్డిపై కూడా దాడి చేయడం జగన్ కు ప్రతికూల పరిణామమే. జగన్ వెంట వచ్చే ఎం.ఎల్.ఎలలు పునారాలోచన ప్రారంభం కావడానికి దోహదం చేయవచ్చు.
