ఇజ్రాయెల్ రాయబారిని బహిష్కరించిన టర్కీ


మధ్య ప్రాచ్యం (Middle East) లో గత రెండు మూడు సంవత్సరాలుగా వినూత్న కదలికలతో పత్రికల పతాక శీర్షికలను ఆక్రమించిన టర్కీ తాజాగా మరొక చర్య తీసుకుంది. ఇజ్రాయెల్ రాయబారిని టర్కీ నుండి బహిష్కరించింది. ఇకనుండి ఇజ్రాయెల్‌తో రెండవ స్ధాయి సెక్రటరీ స్ధాయిలోనే సంబంధాలు ఉంటాయని తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టిన పాలస్తీనా ప్రాంతం గాజాకు మానవతాసాయాన్ని టర్కీ నుండి తీసుకెళ్తున్న ఓడల కాన్వాయ్ పైన గత సంవత్సరం సైనికులతో అమానుషంగా దాడి చేసి తొమ్మిందిని చంపేసిన ఘటనపై క్షమాపణ చెప్పడానికి ఇజ్రాయెల్ తిరస్కరించడంతో టర్కీ ప్రభుత్వం తాజా చర్య తీసుకుంది.

గత సంవత్సరం మధ్యధరా సముద్రంలో టర్కీనుండి గాజాకు వెళ్తున్న మావి మార్మారా అనే ఓడపైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐ.డి.ఎఫ్) అమానుషంగా దాడి చేసింది. ప్రయాణీకులంతా వివిధ రంగాల్లో అంతర్జాతీయ స్ధాయిలో లబ్ద ప్రతిష్టులైనవారు. పైగా నిరాయుధులు. గాజా సముద్రజలాల్లోకి ప్రవేశించకుండానే, ఓడలు ఇంకా అంతర్జాతీయ జలాల్లోనే ఉన్నప్పటికీ ఐ.డిఎఫ్ సైనికులు హెలికాప్టర్లపై నుండి కాల్పులు జరిపారు. హెలికాప్టర్ నుండి కాల్పులు జరుపుతుండగానే సైనికులు తాళ్ళతో ఓడపైకి దిగి దగ్గర్నుండి మరికొంతమందిని కాల్పులు జరిపారు. సైనికులు ఆత్మ రక్షణ కోసమే కాల్చారనీ, ఓడలో ఉన్నవారు లాఠీలు, కత్తులతో తమపై దాడి చేశారని అందుకే తాము (పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో) కాల్పులు జరిపామనీ వారు ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నించారు.

సూడాన్ అధ్యక్షుడి పైనా, సెర్బియన్ల నాయకుడిపైనా, లిబియా అధ్యక్షుడి గడ్డాఫీపైనా పౌరుల్ని చంపారంటూ సాక్ష్యాలు లేకుండా కేసులు నమోదు చేసి అరెస్టు వారెంటు జారీ చేసే అంతర్జాతీయ న్యాయస్ధానం ఇజ్రాయెల్ దుర్మార్గంపై నోరు మెదపలేదు. ప్రపంచంలో లా అండ్ ఆర్డర్ కి బాధ్యత తీసుకునే అమెరికా కూడా ఇజ్రాయెల్ హత్యలపైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టర్కీ అప్పుడే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినా ఇజ్రాయెల్ చెప్పలేదు. అయితే ఇన్నాళ్లూ ఎదురుచూసి ఇప్పుడు చర్య తీసుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

టర్కీ విదేశాంగ మంత్రి అహ్మత్ దవుటోగ్లు శుక్రవారం ఈ మేరకు ప్రకటన జారీ చేశాడు. ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాల స్ధాయిని తగ్గిస్తున్నట్లుగా ఆయన తెలిపాడు. రెండవ సెక్రటరీ స్ధాయికి తగ్గిస్తున్నామనీ వచ్చే బుధవారం లోగా ఇజ్రాయెల్ రాయబారి దేశం విడిచి వెళ్లాలనీ కోరాడు. అంతేకాకుండా ఇజ్రాయెల్ తో ఇంతవరకూ కుదుర్చుకున్న మిలట్రీ ఒప్పందాలన్నింటినీ సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆయన తెలిపాడు. “ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోవలసిన సమయం ఆసన్నమయింది” అని ఆయన వ్యాఖ్యానించాడు. దీనితో మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ కు ఉన్న ఏకైక మిలట్రీ మిత్రుడు టర్కీని కూడా ఇజ్రాయెల్ కోల్పోయినట్లయింది.

ఈజిప్టులో వచ్చిన ప్రజాస్వామిక ఉద్యమ ఫలితంగా ముబారక్ గద్దె దిగడంతొ అక్కడ మిలట్రీ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ కి అరబ్ దేశాలలో ముబారక్ అత్యంత నమ్మకస్తుడిగా మెలిగాడు. ముబారక్ కూల్చివేతతో ఇజ్రాయెల్ కు ప్రధాన అరబ్ అనుచరుడిని కోల్పోయింది. మిలట్రీ ప్రభుత్వం ఇజ్రాయెల్ తొ ఉన్న శాంతి ఒప్పందాన్ని గౌరవిస్తామని ప్రకటించినప్పటికీ ఈజిప్టు ప్రజలు అందుకు సుముఖంగా లేరు. ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనీయుల వెంటబడి వచ్చి ఈజిప్టు భూభాగంలోకి జొరబడి ఎనిమిది మంది ఈజిప్టు పోలీసులను చంపివేసింది. ముబారక్ గద్దేమీద ఉన్నట్లయితే అసలు పోలీసులు చనిపోయిన సంగతి కూడా బైటికి పొక్కేది కాదు. కానీ పరిస్ధితి మారిపోయింది.

పోలీసులను చంపాక ఈజిప్టు ప్రజలు వేల మంది ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ముందు అప్పటికప్పుడు అర్ధరాత్రి గుమికూడి పెద్ద పెట్టున ఆందోళన నిర్వహించారు. ప్రదర్శకులలో కొందరు రాయబార కార్యాలయంపై ఉన్న ఇజ్రాయెల్ జెండాను తొలగించి ఈజిప్టు జెండాను ప్రతిష్టించడం అరబ్బు లోకానికి గొప్ప స్ఫూర్తిని ఇచ్చింది. ప్రజల ఒత్తిడితో ఈజిప్టు తాత్కాలిక సైనిక ప్రభుత్వం ఇజ్రాయెల్ పోలీసుల హత్యలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలనీ, పోలీసుల హత్య ఇరుదేశాల మధ్య ఉన్న శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించడమేననీ గట్టిగా కోరింది. ఇజ్రాయెల్ నుండి తమ రాయబారిని వెనక్కి పిలిపిస్తామని కూడా హెచ్చరించింది. ఈజిప్టు ప్రజాస్వామిక ఉద్యమం ముందయితే ఈ పరిణామాలు బొత్తిగా ఊహించడానికి కూడా వీలులేనివి.

ఈజిప్టులో ప్రజా ఉద్యమం తర్వాత ముబారక్ ప్రభుత్వం కుప్ప కూలటం, టర్కీ కూడా మిలట్రీ సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించడంతో ఇజ్రాయెల్ కు మధ్య ప్రాచ్యంలో ఇక బలమైన మిత్రులు లేని పరిస్ధితి ఏర్పడింది. ఉన్నవన్నీ అమెరికా తొత్తులుగా ఉంటూ దానిపైన రక్షణ కోసం ఆధారపడే బహ్రెయిన్, సౌదీ అరేబియా లాంటివే తప్ప మిలట్రీ పరంగా ఇజ్రాయెల్ ది గతంనాటి పరిస్ధితికాదు. మధ్య ప్రాచ్యంలో ఇప్పుడు గతం తో పోలిస్తే ఇజ్రాయెల్ ఒంటరిగా మిగిలిందిని చెప్పవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s