ఆగష్టులో ఒక్క ఉద్యోగమూ ఇవ్వని అమెరికా, ముసురుకుంటున్న డబుల్ డిప్ భయాలు


ఘనత వహించిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ ఆగష్టులో ఒక్క ఉద్యోగమూ కల్పించలేకపోయింది. ముప్ఫై కోట్ల జనాభాలో ముప్ఫై రోజుల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా నికరంగా ఉద్యోగం ఇవ్వలేకపోయింది. ప్రభుత్వానికి రక్షణ బాధ్యత, పాలన బాధ్యత తప్ప మిగిలినవి ఏవీ ఉండకూడదు. ఇతర అన్ని కార్యకలాపాలనూ మార్కెట్‌కే అప్పజెప్పాలని ప్రపంచానికి నిత్యం బోధలు చేసే కార్పొరేట్ అమెరికా ఉద్యోగాలు ఇవ్వకుండా లాభాలను మాత్రం బిలియన్ల కొద్దీ డాలర్లు ప్రకటిస్తోంది. ఉద్యోగాలివ్వని లాభాలవి. ఉద్యోగాలివ్వని వ్యాపారమది. ఉద్యోగాలివ్వని ఉత్పత్తి ఇపుడు అమెరికాలో తీస్తున్నారు.

శుక్రవారం విడుదల చేసిన ఉద్యోగాల రిపోర్టు ప్రకారం ఆగష్టు నెలలొ ఉద్యోగాల సృష్టి ఆవిరైపోయింది. దానితో అమెరికా మళ్లీ మాంద్యం (రిసెషన్) లోకి జారిపోనున్నదన్న భయాలు మళ్లి ఒక సారి రంగం మీదికి వచ్చాయి. కార్పొరేట్ మీడియాకి స్వల్ప కాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక అవగాహనలు ఉంటాయని ఆశించడం తప్పు కాదు. ఇదేం రోగమో కాని ఈ రోజు ఉద్యోగాల రిపోర్టు చూసి అమెరికా మళ్లీ మాంద్యం లోకి వెళ్తుందేమో అని విశ్లేషణలు గుప్పిస్తాయి. రేపు మాన్యుఫాక్చరింగ్ రంగం కొద్దిగా రవ్వంత వృద్ధి నమోదు చేసిన రిసేషన్ భయాలను మాన్యుఫాక్చరింగ్ వృద్ధి చెల్లా చెదురు చేసేసిందని రాసేస్తున్నాయి. వీళ్ల విశ్లేషణలను చూసి స్టాక్ మార్కెట్లు ఏదో మేర ప్రభావితం అవుతున్నాయి.

ఆగస్ఠు పరిస్ధితి అలా ఉండగా జూన్, జులై నెలలకుగాను గతంలో ప్రకటించినట్లుగా కాకుండా వాస్తవంలో 58,000 ఉద్యోగాలు తక్కువగా ఇచ్చినట్లుగా తాజా గణాంకాలు తేల్చాయి. ప్రభుత్వ ఉద్యోగాలు ఆగష్టులో 17,000 తగ్గిపోయాయి. మిన్నెసోటాలో వేలమంది ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ మూసివేత ముగిసి ఉద్యోగాల్లో చేరినా ఈ పరిస్ధితి ఉండడం ఇంకా ఆందోళనకరం. దీర్ఘకాలిక నిరుద్యోగం పైన ఫెడరల్ రిజర్వు అధిపతి బెర్నాంక్ ఆందోళన వెలిబుచ్చాడు. వరుసగా రెండు సంవత్సరాల పాటు నిరుద్యోగులుగా ఉన్నవారి సంఖ్య స్ధిరంగా కొనసాగుతుండడం ఆయన ఆందోళనకు కారణం. దీర్ఘకాలిక నిరుద్యోగం ఆర్ధిక వ్యవస్ధపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అంటున్నాడు. జనాభాలో 58.2 శాతమే ఉద్యోగులుగా ఉన్నారు. జులై సంఖ్య 58.1 శాతం కంటే ఒక పాయింటు ఎక్కువగా ఉండడం రెండు నిమిషాలపాటు సంతోషించడానికి సరిపోతుంది.

నిజానికి అమెరికా ఉద్యోగాలు ఇవ్వని పరిస్ధితి 2007-2008 మాంద్యం నుండీ కొనసాగుతూ వస్తున్నది. ఓ పక్క ఉద్యోగాలు ఇంకా తొలగిస్తూ ఉండగా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని రిపోర్టు వస్తుంది. అన్ని రకాల నివేదికలను క్రోడీకరించి తులనాత్మక విశ్లేషణ ఇచ్చినట్లయితే చదువరులకు గానీ, మార్కెట్ పరిశీలకులకు గానీ, మార్కెట్ ప్లేయర్లకు గానీ ఉపయోగం. వనరులు తక్కువగా ఉన్న చిన్న స్ధాయి పత్రికలు, ఛానెళ్లయితే సరిపెట్టుకోవచ్చు. కాని రాయిటర్స్, బ్లూంబర్గ్ లాంటి ప్రతిష్టాత్మక వార్తా సంస్ధలు కూడా దేశాల ఆర్ధిక వ్యవస్ధలపైనా, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధపైనా రోజుకో విశ్లేషణ ప్రచురించడం మామూలైపోయింది. అమెరికా మాంద్యం నుండి కోలుకున్నదని చెప్పినప్పటికీ ఉద్యోగాలు స్ధిరంగా ఇస్తున్న పరిస్ధితి లేదు. ఏ నెలలోనైనా కొద్దిగా ఎక్కువ ఉద్యోగాలు వస్తే ఆహా ఓహో అనడం, మరుసటి నెల తగ్గంగానే ప్చ్ అని నిట్టూరుస్తూ మళ్ళీ మాంద్యం వస్తుందేమో అనడం…, నిజంగా ఇవి వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయా అన్న అనుమానాలు వస్తున్నాయి.

ఇప్పుడు అమెరికా సాధిస్తున్న రికవరీ, జాబ్‌లెస్ రికవరీ. ఈ చేదు నిజాన్ని అందరూ గుర్తించాలి. ఆ సంగతి గత మూడు సంవత్సరాలనుండి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో నెలలో కొన్ని స్ధానిక పరిస్ధితుల వలన కొద్దిగా ఉద్యోగాలు వచ్చినా అవి కనీసం మధ్య కాలికంగా నైనా నిలిచే అంకె కాదని తెలుస్తూనే ఉంది. జాబ్‌లెస్ రికవరీని నిజానికి రికవరిగా పరిగణించలేము. రికవరీగా పరిగణించలేకే జాబ్‌లెస్ రికవరీగా చెబుతున్నారు. అంటే అమెరికా నిజమైన అర్ధంలో ఇంకా మాంద్యంలోనే కొనసాగుతోంది. వరుసగా రెండు క్వార్టర్లపాటు జిడిపి వృద్ధి తగ్గితే (మైనస్ నమోదు చేస్తే), అప్పుడా దేశం మాంద్యం (రిసెషన్)లో ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఈ ఒక్క నిర్వచనానికి చిక్కడం లేదు తప్ప అమెరికా ఆర్ధిక వ్యవస్ధ నిజానికి మాంద్యం నుండి కోలుకున్న సూచనలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

కాని అమెరికాలోని బహుళజాతి ప్రవేటు కంపెనీలు, మాంద్యానికి కారణ భూతమైన కంపెనీలు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన బెయిలౌట్లు భోంచేసి బాగానే కోలుకున్నాయి. ప్రభుత్వం కోలుకోకపోవడంతో అది ఉద్యోగాలు ఇవ్వలేకపోతోంది. కోలుకున్న ప్రవేటు కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చే పని పెట్టుకోవడం లేదు. ఇంకా ఊడబెరుకుతున్నారు తప్ప ఇచ్చే పని పెట్టుకోవడం లేదు. అమెరికా మరోసారి వరుసగా రెండు క్వార్టర్లు నెగిటివ్ వృద్ధి నమోదు చేస్తే టెక్నికల్‌గా మరోసారి మాంద్యంలోకి వెళ్ళినట్లు. ఇలా వరుసగా ఒక మాంద్యం నుండి పూర్తిగా కోలుకోక ముందే మళ్ళీ మాంద్యంలోకి వెళ్తే దాన్ని “డబుల్ డిప్” (అంటే రెండు సార్లు సంక్షోభ సముద్రంలో మునకవేయడం అన్నమాట) అంటున్నారు. అమెరికా ఇలా టెక్నికల్ గా కూడా డబుల్ డిప్ కి గురవడం ఖాయమని, నౌరుబి, జోసెఫ్ స్టిగ్లిట్జ్ లాంటి ప్రఖ్యాత పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు ఘంటాపధంగా రాస్తున్నారు.

అయినప్పటికీ వార్తా సంస్ధలు మంచి జాబ్స్ రిపోర్టు వస్తే ‘నో రిసెషన్’ అనీ, జాబ్స్ రాకపోతే ‘అయ్యో డబుల్ డిప్’ అనీ రాస్తూనే ఉన్నాయి. ఇన్‌వెస్టర్లను భయపెడుతూనే ఉన్నాయి. షేర్ మార్కెట్లు వీరి వార్తలకు స్పందించి ప్రభావితమవుతున్నాయా లేక షేర్ మార్కెట్లు చూసి వీరు వార్తలు రాస్తున్నారా అంటే చెప్పడం ఓకరకంగా కష్టంగా మారిపోయింది. రెండు ఒకదానిపై ఒకటి ఇంక్రిమెంటల్ గా ప్రభావం చూపించుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే వార్తా సంస్ధలతో ప్రభావితమైన మార్కెట్ కదలికలు నిలవని సంగతిని మదుపుదారులు గ్రహించేలోపే మరొక పరిణామం సంభవిస్తోంది. దాన్ని నిలదొక్కుకునే లోపే ఇంకొక పరిణామం దానితో మదుపుదారులకు సరైన గైడెన్స్ ఇచ్చేవారు కరువైపోయారని అనుకోవలసి వస్తున్నది.

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ అత్యంత పెద్దది. ఎంతంటే, దాని తర్వాత రెండవ స్ధానంలో ఉన్న చైనా జిడిపి కంటే అమెరికా జిడిపి మూడు రెట్లు ఎక్కువ. చైనా దాదాపు 5 ట్రిలియన్ల జిడిపి నమోదు చేస్తుండగా, అమెరికా దాదాపు 15 ట్రిలియన్ల జిడిపిని నమోదు చేస్తున్నది. ఈ కారణంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధపై అంత తేలికగా ప్రభావాలు పడడం సాధ్యం కాదు. అదీ కాక అనధికారికంగానే అయినా అంతర్జాతీయ కరెన్సీగా ఇంకా డాలరే కొనసాగుతోంది. అందువలన అమెరికా ఫెడరల్ రిజర్వు యధేచ్ఛగా డాలర్లు ముద్రించడానికి అనుమతి ఇస్తోంది. గత సంవత్సరం మధ్యలో 600 బిలియన్ డాలర్ల మేరకు అమెరికా ట్రెజరీ బాండ్లను తానే కొనుగొలు చేసి విడతలుగా సొమ్ముని మార్కెట్లోకి విడుదల చేసింది. దాని కాలం ముగిసిన మరుసటి నెలనుండే అది లేని పరిస్ధితి కనిపించడం మొదలయ్యింది.

దానితో అంతా మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ బెర్నాంక్ వైపు మోరలెత్తి చూస్తున్నారు. మరొక క్వాంటిటేటివ్ ఈజింగ్ ప్రకటించకపోతాడా అని. అంటే ట్రెజరీ బాండ్లను కొనుగొలు చేయడం ద్వారా మరింత డబ్బుని మార్కేట్లోకి విరజిమ్మే ‘క్వాంటిటేటివ్ ఈజింగ్ – 3’ (క్యు.ఇ-3) ని ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరం ‘క్యు.ఇ-2’ ని ఇచ్చినందుకే యూరప్, చైనాలు మండిపడ్డాయి. దానివలన తమ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుతుతుందని. అయినా ‘క్యు.ఇ-3’ ని ఇచ్చే పరిస్ధితిలోనే బెర్నాంక్ కనిపిస్తున్నాడు. అది ప్రకటిస్తే ఇండియా, చైనా లాంటి ఎమర్జింగ్ దేశాలతో పాటు, ఇ.యు దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం జడలు విప్పడం ఖాయం. అది ఇండియాకి మరింతగా శరాఘాతంగా పరిమించడం ఇంకా ఖాయం. అయితే ఇండియా వృద్ధి రేటు తగ్గిపోతున్నందున క్యు.ఇ-3 సొమ్ము ఇటువైపు వస్తుందో లేదో చూడవలసి ఉంది.

అమెరికా ఈ పరిస్ధితిని ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా, కార్మికులు ఉద్యోగులకు సదుపాయాలను కొద్దిమేరకు పెంచడం ద్వారా కొంతమేరకైనా ఎదుర్కోగలుగుతుంది. రికవరీని బలవంతంగా కొనసాగించడానికి ఫెడరల్ రిజర్వు, ట్రెజరీ వేస్తున్న పధకాలను ఉద్యోగాల సృష్టివైపుకి మళ్ళీంచ గలిగితే ఆర్ధిక వ్యవస్ధలో వినియోగం పెరిగి మళ్ళీ ఉత్పత్తి పెరగడానికి దారి తీస్తుంది. కాని కంపెనీలు అందుకు అంగీకరించడం లేదు. తాము ఉద్యోగాలను ఇవ్వకపోగా, ప్రభుత్వాన్ని కూడా ఇవ్వనీయడం లేదు. దానిలో భాగంగానే రిపబ్లికన్లు పొదుపు బిల్లుని ప్రవేశపెట్టారు. కార్మికులకి, ఉద్యోగులకి ఇస్తున్న కొద్ది సదుపాయాలలో తీవ్రంగా కోత విధిస్తున్నారు. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్లు మొన్న కాంగ్రెస్, ఒబామా కుదుర్చుకున్న ఒప్పందం పుణ్యాన పొదుపు చర్యలు అమెరికా ప్రజలపైన మరోవిడద దాడి చేయనున్నాయి. ఈ దాడి పూర్తి స్ధాయి దాడిగా ఉండనుంది. బహుశా ఒబామా రెండో సారి ఎన్నికయినా, కాకపోయినా మరోవిడత దాడి డబుల్ ధమాకాతో జనాల మీద పడడం ఖాయం. ఆ వైపుగా, రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు రెండూ తయారై ఉన్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధ తన సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి కార్మికవర్గం, ఉద్యోగ వర్గంలపైనా, పెన్షన్లు, ఆరోగ్య భీమాలపైనా దాడి చేయడానికి నిర్ణయించుకున్నాయి. అందుకె ముందుంది ముసళ్ల పండగ అంటున్నది!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s