దళితులు వినాయకుడి విగ్రహం పెట్టుకోవడానికి వీల్లేదట! మెదక్ జిల్లాలో దారుణం


వినాయక చవితి పండగని దళితులు జరుపుకోవడానికి వీల్లేదట! అందరిలాగానే తాము కూడా వినాయక చవితి విగ్రహం పెట్టుకుని పూజలు, పునస్కారాలు చేయడానికి వీల్లేదని మెదక్ జిల్లాలోని చిన్నశంకరం పేట మండలం, గజగట్ల పల్లి గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆగ్రహించి దళితులకు పాలు అందకుండా చేశారు గ్రామ పెద్దలు. 64 సంవత్సరాల స్వాతంత్ర్య పాలన దళితులకు ఒరగబెట్టినదేమిటో, అగ్రవర్ణాలకు నేర్పిన సంస్కారం ఏమిటో ఈ సంఘటన తెలియజేస్తున్నది. ఈ వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక సోమవారం రిఫోర్టు చేసింది.

దళితులు వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుసుకున్న గ్రామస్ధులు వీల్లేదన్నారు. ఇంకా ఘోరం ఏమిటంటే ఆ ఊళ్ళొ దళితులకు దేవాలయ ప్రవేశం నిషేధం అని గ్రామస్ధుల మాటల్లోనే తెలుస్తోంది. “ఈ రోజు వినాయకుడిని ఏర్పాటు చేస్తారు. రేపు గుళ్ళోకే వస్తామంటారు, మీకు మాకూ తేడా ఏంటి?” అంటూ గ్రామస్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే గజగట్లపల్లి గ్రామంలో దళితులకు ఆలయ ప్రవేశం నిషేధం అన్నమాట! గుడికి ఎలాగూ రానీయనందున తమ వాడలోనే గుడి ఏర్పాటు చేసుకున్నా, అది కూడా అగ్రవర్ణాలకు కంటగింపుగా ఉండడం దారుణమైన విషయం. ఈ పరిణామంతో స్ధానిక దళిత సంఘం ఆధ్వర్యంలో దళితులు చిన్నశంకరం పేట తహశీల్దారుకీ, పోలీసులకీ ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారిరువురినుండీ స్పందన రాలేదు.

ఫలితంగా దళితులు నిస్సహాయులుగా మిగిలిపోయారు. దళిత సంఘం తరపున మండల కేంద్రంలోనే దళితులు గత శుక్రవారం తమపై అగ్రవర్ణాల జులుంకు వ్యతిరేకంగా రాస్తోరోకో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే గ్రామంలోని బిసి కులాలు దళితులకి పాలు పోయడం మానుకున్నారు. దళితులకు పాలు పోస్తే ఆరువేలు జరిమానా విధిస్తామనీ, కుల బహిష్కరణ కూడా చేస్తామనీ బెదిరించడంతో వారు దళితులకు పాలు అమ్మడం మానుకున్నారు. కులవివక్ష ఘటన తెలిసిన వెంటనే స్పందించాల్సిన తహశీల్దారు, పోలీసులు కూడా అగ్రవర్ణాలవారైనపుడు వారినుండి స్పందన ఆశించలేము. పత్రికలకెక్కి ప్రభుత్వాలు సీరియస్ విషయంగా తీసుకునెవరకూ గజగట్లపల్లి దళితులకు బహిష్కరణ తప్పదు.

గజగట్ల పల్లి ఘటన దళితులు, దళిత సంఘం ఆధ్వర్యంలో బైటికి వచ్చి రాస్తారోకో తలపెట్టడం వల్లనే ఈ ఘటన లోకానికి తెలిసింది. దళిత సంఘమో, మరొక సంఘమో ఉంటాయని తెలియని గ్రామాలు దేశంలో కోకొల్లలు. అటువంటి గ్రామాల్లో ఉన్న కుల కట్టుబాట్లను దళితులు ఉల్లంఘించి వివాదం రగులుకుంటే తప్ప కులపరమైన అణచివేత వెలుగు చూడని పరిస్ధితి నెలకోని ఉంది. గజగట్ల పల్లి వారు నిరసించినందున అక్కడ తప్ప మిగతా గ్రామాల్లో వివక్ష లేదు అని భావించడానికి వీల్లేదు. దళితులు తమ హక్కులను గుర్తించి వాటికోసం లేచి నిలబడినప్పుడల్లా అగ్రవర్ణాలు వారిపై ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడుతున్నారు.

8 thoughts on “దళితులు వినాయకుడి విగ్రహం పెట్టుకోవడానికి వీల్లేదట! మెదక్ జిల్లాలో దారుణం

 1. మీరు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా నిర్ధారించుకున్నారా ?
  భగవంతుని సేవకు ఆటంకం కల్పించే రాక్షసులను ఎవరినీ క్షమించకూడదు.
  ఇక ఇటువంటి వార్తలుపుట్టటంలో అనేక అబద్దాలు గుమిగూడి ఉంటాయి . ఇప్పుడే మిత్రులు కొందరిద్వారా తెలిసిన విషయమేమిటంటే అక్కడ ఎవరో తాగుబోతు గొడవకోసం విలేకరిదగ్గర వాగినదానిని వాల్లు నిర్ధారించుకోకుండా వ్రాశారని ….. నిజమేమిటో నిర్ధారణ చేయాలి. ఇక్కడ అంతవాడమీద పాలిచ్చే గేదెలేలేనట్లు వినాయకుణ్ణి పెడితే పాలు పోయమన్నారని చెప్పిన విషయంలో లాజిక్ గా ఆలోచిస్తే అనుమానం వస్తుంది. మీకు ఉన్నవనరులద్వారా కూడా విచారించండి .

 2. దుర్గేశ్వరగారూ, మీ సమాచారానికి కృతజ్ఞతలు. మీరు చెప్పినట్లు నిర్ధారణ లేకుండా రాశారన్న సంగతిని విచారిస్తాను. బిసి కులం వారి దగ్గర దళితులు పాలు తెచ్చుకుంటారనీ, వారిని గ్రామ పెద్దలు కుల లేదా సాంఘిక బహిష్కరణ చేస్తామని బెదిరించడంతో దళితులకి పాలు పోయడం లేదని చెప్పారని వార్తను జ్యోతి ప్రచురించింది. పాలు అమ్మకుండా కట్టడి చేయడానికి నిరసనగా దళితులు మండల కేంద్రంలో ధర్నా చేసున్న ఫోటోను కూడా జ్యోతి ప్రచురించింది. కనుక అనుమానానికి ఆస్కారం లేదని నాకనిపిస్తోంది.

  వినాయకుడికి పట్టడానికి వీల్లేకుండా పాలు దొరకకుండా చేశారన్న సూచన మీ వ్యాఖ్యలో ధ్వనిస్తోంది. కాని వార్తలో అలా లేదు. రోజువారి వాడకానికే పాలు అమ్మడం లేదన్న అర్ధంలో రాశారు. వినాయక చవితికి పట్టే విగ్రహాలు పెద్దవి. వాటికి పాలు పట్టినా అవి తాగవు. చేతులతో పట్టుకోగల విగ్రహాలు మాత్రమే అలా తాగుతాయి. “స్ధల తన్యత” (సర్ఫేస్ టెన్షన్) లక్షణం వలన పాలు తొండం మీదికి ఎగబాకి “స్ధలతన్యత” నెట్టగలిగినంత పైకి పోయి అక్కడినుండి అందుబాటులో ఉన్న ఉపరితలం ద్వారా కిందికి వచ్చేస్తాయి. నాకు తెలిసినంతవరకూ ఈ పరిస్ధితి పెద్ద విగ్రహాలకు ఉండదు. కారణం పెద్ద విగ్రహాలకు తొండం కూడా పెద్దదిగా ఉండి స్ధల తన్యత పైకి నెట్టడానికి వీలు కానంత విశాలమైన ఉపరితలం ఉంటుంది. కనుక దళితులకు పాలు అమ్మకపోవడానికీ, వినాయక విగ్రహానికి పాలు తాగడానికీ సంబంధం లేదని అనిపిస్తోంది.

  జ్యోతిలో “మట్టి బొమ్మలకి తాపడానికి పాలు దొరికాయి కానీ, దళితుడికి పొయ్యడానికి దొరకలేదు” అని చెప్పదలుచుకున్నాడు అనిపిస్తోంది. మరొకసారి ఆలోచించి చూడండి. ఆఫ్ కోర్స్ నా కనిపించినదానిలో కూడా తప్పులుంటే ఉండవచ్చు. కాని వార్తలో అబద్ధం లేదనే నాకనిపిస్తోంది.

 3. మీ స్పందనకు అభినందనలు
  నేనుకూడా పూర్వాశ్రమంలో పత్రికలలో పనిచేశాను
  ముందు ఒక వార్త స్రుష్టించబడినతరువాత దానికనుగుణంగా స్పందన కలగటం అక్కడివాల్లు కాకున్నా పక్కవాల్లద్వారానైనా జరుగుతుంది. ఇది రెండవ విషయం . అసలు వాస్తవం తెలియాలంటే మనం మూలానికి వెల్లాలి. అంత ఓపిక పరిశ్రమ ఉన్నవారు ఈరంగంలో ఉన్నంతకాలం లోకానికి మేలుజరిగింది. ఇప్పుడు మండలానికొక రిపోర్టర్ అదీ ఏవిలువలూ లేనివారే కోకొల్లలు ….వార్తా రచయితలుగాకాక సృష్టికర్తలుగాకూడా తయారవుతున్నారు. జనం ఈరోజు వీల్లువ్రాసినదానికి ఎదురుచెప్పలేకపోయినా ఖాండ్రించి ఉమ్మువేసే వార్తలు వస్తున్నాయి.

 4. అవున్నిజమే. పత్రికా విలేఖరుల స్ధాయి తొంభైలనాటికే క్షీణించింది. వ్యాపార ధోరణుల ప్రభావం అది. గట్టిగా చెప్పాలంటే నూతన ఆర్ధిక విధానాల వలన వచ్చీపడిన వ్యాపార సంస్కృతి ప్రతిదాన్నీ వ్యాపార దృష్టితో చూడడం చేస్తుంది. వేరే విలువలేవీ వారికి పట్టవు. ఇటీవలే ప్రపంచం ముందు తలదించుకున్న రూపర్డ్ మర్డోక్ దానికి ప్రబల ఉదాహరణ.

 5. “వినాయక చవితికి పట్టే విగ్రహాలు పెద్దవి. వాటికి పాలు పట్టినా అవి తాగవు. చేతులతో పట్టుకోగల విగ్రహాలు మాత్రమే అలా తాగుతాయి. “తల తన్యత” (సర్ఫేస్ టెన్షన్) లక్షణం వలన పాలు తొండం మీదికి ఎగబాకి “స్ధలతన్యత” నెట్టగలిగినంత పైకి పోయి అక్కడినుండి అందుబాటులో ఉన్న ఉపరితలం ద్వారా కిందికి వచ్చేస్తాయి.”

  సందర్భోచితం కాదనుకుంటే సైన్స్ సూత్రాలు దాగి ఉన్న ఈ వాస్తవాంశాన్ని వీలైనంత వివరంగా ఒక ప్రధాన వ్యాసంగా తర్వాత రాయగలరు. విగ్రహాలు పాలు ఎలా తాగగలవో.. అన్ని మతాల దైవ విగ్రహాల కళ్లలోంచి ఉన్నట్లుండి పాలు, లేదా ఇతర ద్రవాలు ఎలా కారగలవో.. ఆ విగ్రహాలలోని జిత్తుల గురించి రికార్డు కోసమైనా వ్యాసం రాయండి.

  దేవుళ్లను, దయ్యాలను ప్రమోట్ చేస్తున్న వారి ఈ సరికొత్త మోసాలను గత పదిహేనేళ్లుగా చాలానే చూస్తున్నాము. -దైవభావనను నిజాయితీగా విశ్వసిస్తూ తమ విశ్వాసాలను వ్యక్తిగత స్థాయిలో మాత్రమే ఉంచుకుంటున్న నిజమైన భక్తులను అవమానించడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు, విశ్వాసాలను అమ్ముకునేవారు, వాటితో వ్యాపారం చేసేవారితోటే సమస్య అంతా..

  వార్తలను నమోదు చేసేవారు కాకుండా వార్తలను సృష్టించేవారు ‘సృష్టించబడిపోయిన’ పాడు కాలం గురించి దుర్గేశ్వర రావు గారు చేసిన ప్రస్తావన చాలా బాగుంది.

  వినాయకుడికి పట్టడానికి వీల్లేకుండా పాలు దొరకకుండా చేసినట్లయితే అది చాలా చిన్న నేరం. కానీ, మనుషుల రోజువారి వాడకానికే పాలు అమ్మడం మానేసినట్లయితే అది చాలా పెద్ద నేరం.

  “భగవంతుని సేవకు ఆటంకం కల్పించే రాక్షసులను ఎవరినీ క్షమించకూడదు.”
  కాని మనుషుల రోజువారీ జీవితాలకు అన్యాయంగా అడ్డుకట్టలు వేసేవారు రాక్షసులకంటే హీనం. కులపొగరు, ధనపొగరు తాండవిస్తున్న ఆ రాక్షసులు మనలోని వారే.. మన మనుషులే కావడం మరీ ఘోరం. అది మన జాతి దౌర్భాగ్యం కూడా.

  “ఈ రోజు వినాయకుడిని ఏర్పాటు చేస్తారు. రేపు గుళ్ళోకే వస్తామంటారు, మీకు మాకూ తేడా ఏంటి?”
  తేడా చాలానే ఉంది. మనుషులుగా ఉండటం.. మనుషులు కాకపోవడం.. ఈ దేశంలో అగ్రకులాల వారికీ, పేదకులాల వారిలో చాలా మందికి కూడా ఈ రకమైన మానుష గుణం లేకపోవడం నిజంగా దారుణం… మనుషులలో మానవ గుణాన్ని తిరిగి తీసుకురావడం కంటే మించిన విప్లవం ఈ దేశంలో మరొకటి లేదు. ఈ దేశంలో అన్ని విప్లవాల మౌలిక విజయం దీనిపైనే ఆధారపడి ఉంది. ఇది సాధ్యం కానినాడు ఏ విప్లవాలూ, పోరాటాలు ఫలించవు.

  “మట్టి బొమ్మలకి తాపడానికి పాలు దొరికాయి కానీ, దళితుడికి పొయ్యడానికి దొరకలేదు”
  అందుకే మన పల్లెసీమలు ఈ సాంకేతిక యుగంలోనూ గిడసబారిపోయి అలా ఏడుస్తున్నాయి.. దేవుడు కూడా ఈ వివక్షతను ఇన్ని శతాబ్దాలుగా, ఇన్ని తరాలుగా మౌనంగా ఆమోదిస్తున్నప్పుడు, -అలాంటి జంగమరూపం అంటూ ఒకటి ఉందనుకుంటే- ఆ దేవుడినే బహిష్కరించే తరహా చైతన్యం రాకపోవడం ఈ దేశ పీడిత ప్రజానీకం దురదృష్టం.. నమ్మిన దైవాన్ని కొలుచుకునే హక్కు పేదవాడికి కూడా ఉండాలి. కానీ, అదేసమయంలో ఆ పేదవాడికి ఇంకా చాలా లక్షణాలు ఉండాలి. ఆలోచించే స్వభావం ఉండాలి.

  అంబేద్కర్ అత్యంత వాస్తవికంగా ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు దళితులకు కాస్త ఊపిరి పోస్తుండటం నిజమే కాని ఈ రిజర్వేషన్లు పీడిత కులాల్లోని పీడితులను మానసికంగా కలుపలేకపోయాయి. కష్టజీవులలో చీలికలను మాపలేకపోయాయి. చివరకు అస్పృశ్యత భారాన్ని మోస్తున్న ఆ రెండు కులాలలోనే వర్గీకరణ కోసం కాట్లాట…..

  “దేవుడా రక్షించు నా దేశాన్ని, పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి”
  – దేవర కొండ తిలక్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s