నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -2


‘ప్రజలు’ అంటే జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించకుంటే చివరికంటా నిరాహార దీక్ష చేసి చనిపోతానని ఒక 74 ఏళ్ళ వ్యక్తి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న దృశ్యాన్ని వీక్షించడానికి జమ కూడినవారు మాత్రమే. ఆకలిగొన్నవారికోసం చేపలు, రొట్టెలను యేసు క్రీస్తు అనేక రెట్లు పెంచిన పద్ధతిలో, టి.వి ఛానెళ్ళు తమ అద్భుత మాయాజాలంతో మిలియన్లకు పెంచగలిగన పదుల వేల మంది మాత్రమే ప్రజలు. “ఒక బిలియన్ మంది (వంద కోట్లు) ఒకే గొంతుకతో ‘ఇండియాయే అన్నా’ అన్నారని మనకు చెప్పారు.

అయితే ఆయన, మరాఠి మనువు రాజ్ ధాకరే ప్రభోధించే విదేశీయులపై ద్వేషానికి మద్దతునిస్తాడు. 2002 ముస్లింల మారణ కాండను పర్యవేక్షించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి “అభివృద్ధి నమూనా” ను ప్రశంసలతో ముంచెత్తుతాడు. (వివిధ వర్గాలనుండి వ్యతిరేకత రావడంతో తన ప్రశంసలను అన్నా వెనక్కి తీసుకున్నప్పటికీ, వ్యక్తిగతంగా వారి పట్ల ఉన్న ఆరాధనను అన్నా మానుకోలేదు).

అన్నా ఉద్యమంపై పత్రికలెంతగా రొదపెడుతున్నా, వాటికి లోను కాని కొందరు జర్నలిస్టులు తమ పని తాము చేయకపోలేదు. అన్నా హజారేకు పూర్వాశ్రమంలో ఆర్.ఎస్.ఎస్ తో ఉన్న సంబంధాలను వీరు బయటపెట్టారు. అన్నా కి చెందిన ‘రాలిగావ్ సిద్ధి’ గ్రామ కమ్యూనిటిపై ముకుల్ శర్మ అనే విలేఖరి అధ్యయనం జరిపాడు. అక్కడ గత పాతిక సంవత్సరాలుగా గ్రామ పంచాయితీకి గాని, కో-ఆపరేటివ్ సొసైటీకి గానీ ఎన్నికలు జరగలేదు. హరిజనుల పట్ల అన్నా వైఖరి మనకు తెలిసిందే: “అది మహాత్మాగాంధి విజన్. దాని ప్రకారం ప్రతి గ్రామంలోనూ ఒక చెప్పులు కుట్టే వాడూ (చమర్), ఒక సూనార్ (?), ఒక కుమ్మరి ఇలా అందరూ ఉండాలి. వారంతా తమ వృత్తి ప్రకారం పని చేస్తూ ఉండాలి. ఆ విధంగా గ్రామాలు స్వయం సమృద్ధిని సాధిస్తాయి. రాలెగావ్ సిద్ధి లో జరుగుతున్నది అదే” ఇది ముకుల్ శర్మ వెల్లడించిన నిజం. టీమ్ అన్నా బృందంలో సభ్యులైనవారు, రిజర్వేషన్ వ్యతిరేక (ప్రతిభా వాదం) ఉద్యమమైన “యూత్ ఫర్ ఈక్వాలిటీ” తో సంబంధాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలిగించే విషయమా? అన్నా ఉద్యమ ప్రచారం కోకో కోలా, లేమాన్ బ్రదర్స్ (ఆర్ధిక సంక్షోభంలో దివాలా తీసిన ఈ కంపెనీని అమెరికా ప్రభుత్వం జాతీయం చేసింది. అంటే ఇది అమెరికా ప్రభుత్వ కంపెనీయే -విశేఖర్) లాంటి కంపెనీలు ఉదారంగా నిధులు అందించగా స్ధాపించబడ్డ ఎన్.జి.ఓ సంస్ధ ఆధ్వర్యంలో నడుస్తోంది. అన్నా బృందంలో కీలక సభ్యులయిన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల సంస్ధ “కబీర్”కు, గత మూడు సంవత్సరాలలో ఫోర్డ్ ఫౌండేషన్ (ఇది ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా తరపున ఇండియాలో గూఢచర్యం చేసిన సంస్ధ -విశేఖర్) నుండి 400,000 డాలర్ల (రు. 1.8 కోట్లు) నిధులు అందాయి. “ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్” ఉద్యమానికి విరాళాలు అందిస్తున్నవారిలో అల్యూమినియం కర్మాగారాలను కలిగి ఉన్న కంపెనీలు ఉన్నాయి. నౌకాశ్రయాలు, స్పెషల్ ఎకనమిక్ జోన్ లను నడిపే కంపెనీలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే సంస్ధలు ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయల ఫైనాన్స్ కంపెనీలు నడిపే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వారిలో కొంతమంది అవినీతి, ఇంకా ఇతర నేరాలకు పాల్పడినందుకుగానూ విచారణను కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళంతా అంత ఉత్సాహంగా ఎందుకున్నట్లు?

వికీలీక్స్ సంస్ధ ద్వారా వెల్లడైన వాస్తవాలతో మన రాజకీయ నాయకులకు చాలా ఇబ్బందికర పరిస్ధితులు తలెత్తడం, 2జి స్పెక్ట్రం తో పాటు అనేక పెద్ద పెద్ద కుంభకోణాలు వరుసగా బయడపడుతున్న సమయంలోనే జన్ లోక్ పాల్ బిల్లు కోసం ప్రచారం ఊపందుకున్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ కుంభకోణాల్లో పెద్ద పెద్ద కార్పొరేషన్లు, సీనియర్ జర్నలిస్టులు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పాత్రధరులుగా తేలారు. కొన్ని వందల వేల కోట్ల రూపాయల ప్రజాధనం ప్రభుత్వ కోశాగారం నుండి సొంత ఖాతాలకు దారిమళ్ళిన విషయం వెల్లడవుతున్న నేపధ్యంలో కాంగ్రెస్, బి.జె.పి లకు చెందిన రాజకీయ నాయకులు వివిధ మార్గాల్లో కుమ్మక్కయిన పరిస్ధితి కనిపించిన విషయం గుర్తుంచుకోవాలి. అనేక సంవత్సరాలలొ మొట్టమొదటి సారిగా జర్నలిస్టులు, లాబీయిస్టులు అవమానకర రీతిలో పట్టుబడ్దారు. ఇండియాలోని ఏదో ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ అధిపతి జైల్లోకి వెళ్ళక తప్పదా అన్నా పరిస్ధితి కనిపించింది. ప్రజల అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సరైన సమయం! లేక అదే నిజమా?

రాజ్యం, తన సాంప్రదాయక విధుల నుండి ఉపసంహరించుకుంటూ కార్పొరేషన్లు, ఎన్జీవోలు ప్రభుత్వ విధులను (నీటి సరఫరా,విద్యుత్తు, రవాణా, టెలి కమ్యూనికేషన్లు, మైనింగ్, విద్యా వైద్య రంగాలు) చేపట్టిన సమయంలో; ప్రజల ఆలోచనలను, ఊహలను ఒడిసి పట్టడానికీ, నియంత్రించడానికీ, భయంకరమైన, జనానికి అతి దగ్గరికి వెళ్లిన కార్పొరేట్ మీడియా ప్రయత్నిస్తున్న సమయంలో… ఇవి -కార్పొరేషన్లు, మీడియా, ఎన్జీవోలు- లోక్ పాల్ బిల్లు పరిధిలోకి తీసుకొస్తారని ఎవరైనా సహజంగానే ఆశిస్తారు. దానికి బదులుగా ప్రతిపాదిత బిల్లు, వాటన్నింటినీ పూర్తిగా వదిలి పెట్టింది.

ఇతరులందరి కంటే పెద్దగా కేకలు వేయడం ద్వారా, కపట రాజకీయవేత్తలు, అవినీతి ప్రభుత్వాలు అంటూ అదేపనిగా ఎత్తి చూపే ప్రచారాన్ని గుప్పించండం ద్వారా వారు చాలా తెలివిగా తమను తాము విడుదల చేసుకోగలిగారు. ఇంకా ఘోరం ఏమిటంటే కేవలం ప్రభుత్వాన్ని ఒక్కదాన్నే రాక్షసిగా చూపించడం ద్వారా రాజ్యం తన పాత్రను మరిన్ని విధులనుండి ఉపసంహరింపజేయాలనీ, రెండవ రౌండ్ ఆర్ధిక సంస్కరణలను ప్రారంభించాలనీ వాళ్ళు తమకొక వేదికను సృష్టించుకోగలిగారు. రెండో రౌండ్ ఆర్ధిక సంస్కరణలంటే మరింత ప్రవేటీకరణ, భారత దేశ మౌలిక రంగాలను, సహజ వనరులను మరింతగా వారికి అందుబాటులోకి తేవడమే. కార్పొరేట్ల అవినీతిని చట్టబద్ధం చేసి దానికి ‘లాబీయింగ్ ఫీజు’ అంటూ పునఃనామకరణం చేసే రోజు ఎంతో దూరంలో లేదేమో!

రోజుకు రు.20 కంటే ఎక్కువ సంపాదించలేని  830 మిలియన్ల జనాన్ని మరింత దరిద్రంలోకి నెట్టే ఈ విధానాలను మరింత శక్తివంతం చేయడం వలన వారికి నిజంగా ప్రయోజనం ఉంటుందా? లేక దేశాన్ని ప్రజా యుద్ధం వైపుకి తీసుకెళ్తారా?

నేరగాళ్ళు, ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం మానేసిన మిలియనీర్ రాజకీయవేత్తలతో నిండి ఉన్న భారత దేశ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఘోరంగా విఫలమవడం నుండే ఈ దారుణ సంక్షోభం తలెత్తింది. ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్ధలో ఏ ఒక్క ప్రజాస్వామ్య సంస్ధ కూడా సాధారణ మానవునికి అందుబాటులో ఉండదు. జెండా ఊపుడు ద్వారా ఫూల్స్ కాకండి! పెద్ద ప్రభువుల చేతుల్లోకి భారత దేశాన్ని నెట్టి వేయడానికి జరుగుతున్న యుద్ధాన్ని మనమిప్పుడు చూస్తున్నాం. అది ఆఫ్ఘనిస్ధాన్ లోని యుద్ధ ప్రభువుల సాగించిన ఏ యుద్ధం కంటే గూడా వినాశకరమైనది. అంతే కాక ఆ యుద్ధంలో గెలుచుకోగల సిరి ఎంతో అసామాన్యమైనది కూడా.

….అయిపోయింది

3 thoughts on “నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -2

  1. ఒకే ఒక్కమాట.. అరుంధతీరాయ్‌పై కార్పొరేట్ విషపత్రికలు ఎందుకు విషం గక్కుతున్నాయో ఇప్పుడు మరింతగా అర్థమవుతోంది. గత నలభై ఏళ్లుగా నక్సలైట్ ఉద్యమం గొంతు చించుకుని చెబుతున్న దళారీల పాలనా దౌష్ట్యాన్ని అరుంథతీ రాయ్ శక్తివంతంగా చెబుతున్నారు. ఆమె ఎందుకు బహిరంగ నక్సలైటుగా రాజ్యం దృష్టిలో పడ్డారో ఇప్పుడింకా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడొకే ప్రశ్న. ఈ దేశాన్ని అన్నా ఏం చేయబోతున్నారు? ఏమీ చెయ్యరు… చేయలేరు కూడా.

    విశేఖర్ గారూ… సరైన సమయంలో చక్కటి అనువాదం అందించారు. ధన్యవాదాలు. మీరు హారం, కూడలి, జాలము, మాలిక వంటి తెలుగులోని అన్ని బ్లాగ్ అగ్రిగేటర్లలో మీ బ్లాగును యాడ్ చేశారా లేదా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s