తిరుగుబాటు ముందువరకూ గడ్డాఫీ అమెరికాకి మిత్రుడే -వికీలీక్స్


ప్రస్తుతం లిబియా రాజధాని ట్రిపోలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల సైన్యాలతూ కూడిన నాటో దళాలు మౌమ్మర్ గడ్డాఫీ కోసం వేటాడుతున్నాయి. గడ్డాఫీ నమ్మకస్తులనుకున్నవారి ఇళ్లపై బడి గడ్డాఫీకోసం వెతుకులాట పేరుతో దారుణ విధ్వంసం సృష్టిస్తున్నాయి. ‘వేటాడి చంపవలసినవాడు’ గా అమెరికా ప్రకటించిన కల్నల మౌమ్మర్ గడ్డాఫీ నిజానికి తిరుగుబాటు పేరుతో అంతర్యుద్ధం ప్రారంభమయ్యే వరకూ అమెరికా కు అనుంగు మిత్రుడే. ఆ మేరకు రిపబ్లికన్ సెనేటర్లతో పాటు, బుష్ అధికార బృందంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా పని చేసిన కొండొలీజా రైస్ కూడా గడ్డాఫీని నమ్మదగిన మిత్రుడుగా కొనియాడారు. గడ్డాఫీ సైన్యానికి శిక్షణ కూడా ఇచ్చారు. నమ్మదగిన మిత్రులను మోసం చేయడంలో అమెరికా పేరెన్నికగన్నది గనక అది గడ్డాఫిని కూడా నమ్మించి మోసం చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.

వికీలీక్స్ సంస్ధ బుధ, గురువారాల్లో లక్ష వరకు అమెరికా రహస్య డాక్యుమెంట్లను విడుదల చేసింది. వివిధ దేశాల్లోని అమెరికా రాయబారులు తాము నియమించబడిన దేశాల్లో గూడచర్యం చేస్తూ తద్వారా సేకరించిన వివరాలను అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు కేబుల్స్ రూపంలో పంపిన లేఖలు వికీలీక్స్ చేతికి చిక్కడంతో అమెరికా రాయబారుల దారుణ కృత్యాలు గత సంవత్సరం నవంబరు నుండి వెల్లడవుతున్నాయి. తాజాగా విడుదల చేసిన డాక్యుమెంట్లలో అమెరికా గడ్డాఫీని ఎంతగా ప్రోత్సహించిందీ, ఎంతగా మిత్రత్వం నెరిపిందీ తెలుసుకున్నట్లయితే లిబియా తిరుగుబాటుపై పశ్చిమ మీడియా ప్రచారాన్ని నమ్మినవారికి, గడ్డాఫీపై నేడు వారు కక్కుతున్న విషం పట్ల  విస్మయం కలగక మానదు.

తాజాగా విడుదలైన “డిప్లొమాటిక్ కేబుల్స్” ను కార్పొరేట్ మీడియా ప్రచురించదలుచుకోలేదు. తాజా కేబుల్స్ విడుదలను  అవి పూర్తిగా ఎరగనట్లే ప్రవర్తిస్తున్నాయి. ఏవో కొన్ని ఆసక్తి కలిగిన వెబ్ సైట్లు తప్ప ప్రధాన స్రవంతి పత్రికలేవీ ప్రచురించకూడదని నిశ్చయించుకున్నట్లే ప్రవర్తిస్తున్నాయి. లిబియా ప్రజలను గడ్డాఫీ నుండి విముక్తి కావించే బృహత్తర కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న ప్రస్తుత సమయంలో అవి అమెరికా పవిత్ర కర్తవ్యాన్ని తమ వంతు సహాయాన్ని అందించదలుచుకున్నాయి కాబోలు! అమెరికాలోని ఒక రాష్ట్ర సుప్రీం జడ్జి వికీలీక్స్ అధిపతి జులియన్ అస్సాంజ్ పేరున సబ్ పూనా జారీ చేసిన మరుసటి రోజే లక్షకి పైగా కేబుల్స్ విడుదల కావడం యాదృచ్ఛికత కాకపోవచ్చు.

గడ్డాఫీ, అమెరికా సంబంధాలు ఎలా సాగాయన్నదానికి ఆగస్టు 2009లో రిపబ్లికన్ సెనేటర్లు, గడ్డాఫీతో పాటు అతని పుత్రుడు మౌతస్సిమ్ గడ్డాఫీ లతో జరిపిన సమావేశం ఒక ప్రబల సాక్ష్యంగా నిలుస్తుంది. ఆ సమావేశంలో అరిజోనా సెనేటర్ మెక్ కెయిన్ (ఒబామాపై రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన సెనేటర్), సౌత్ కరోలినా సెనెటర్ లిండ్‌సే గ్రాహం, మెయినే సెనెటర్ సుసాన్ కొలిన్స్, కనెక్టికట్ ఇండిపెండెంట్ సెనెటర్ జో లీబర్ మేన్ లు పాల్గొన్నారు. మెక్ కెయిన్ ఇటీవల చేసిన ప్రసంగాల్లో గడ్డాఫీని “భూమిపైన ఉన్న రక్తదాహం కలిగిన డిక్టేటర్లలో ఒకడి” గా అభివర్ణించాడు. గడ్డాఫీ పైన అమెరికా తన శక్తినంతా ఉపయోగించనందుకు ఒబామాని ఆయన విమర్శించాడు కూడా.

అటువంటి సెనేటర్ రెండేళ్ల క్రితం జరిగిన సమావేశంలో అమెరికా బృందానికి నాయకత్వం వహిస్తూ గడ్డాఫీలకు మేలు చేస్తామని చెప్పడంలో ముందున్నాడు. ఎంబసీ కేబుల్ ప్రకారం ఆయన లిబియా భద్రత కోసం అవసరమైన పరికరాలన్నింటినీ అమెరికా సరఫరా చేస్తుందని హామీ ఇస్తూ కాంగ్రెస్ లో ఆ మేరకు చర్యలు ముందుకు సాగడానికి సహకరిస్తానని ప్రతిన బూనాడు. “ద్వైపాక్షిక భద్రతా సహకారంలో దీర్ఘకాలిక దృక్పధం కలిగి ఉండవలసిన అవసరాన్ని మనసులో ఉంచుకోవాలని ఆయన మౌతస్సిమ్ గడ్డాఫీని ప్రోత్సహించాడు. అప్పుడప్పుడూ చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయనీ వాటిని అధిగమించవచ్చన్న విషయం గుర్తుంచుకోవాలని అయన కోరాడు. లిబియా, అమెరికాల ద్వైపాక్షిక మిలట్రీ సంబంధాలు దృఢమైనవని ఆయన అభివర్ణించాడు. అమెరికా కమేండ్, సిబ్బంది, యుద్ధ కాలేజీల్లో లిబియా ఆఫీసర్లు శిక్షణ పొందడం లిబియా మిలట్రీ సహకారంలో గొప్ప కార్యక్రమాలని ఆయన అభివర్ణించాడు” అని కేబుల్ పేర్కొంది.

జో లీబర్‌మేన్ ఏమన్నాడో కేబుల్ తెలిపింది. “మౌమ్మర్ గడ్డాఫీ పుత్రుడు ఆహ్వానించగా మేము లిబియా రాజధాని ట్రిపోలిలో ఈ విధంగా సమావేశంలో కూర్చుంటామని పది సంవత్సరాల క్రితం అస్సలు ఊహించలేనిది. టెర్రరిజంపై యుద్ధంలో లిబియా, అమెరికాకి ముఖ్యమైన మిత్రుడు. ఉమ్మడి శత్రువులు ఒక్కోసారి మంచి మిత్రత్వాన్ని సృష్టిస్తాయి” అని పేర్కొన్నాడాయన. లీబర్ మేన్ చెప్పిన ఉమ్మడి శత్రువులు మరెవరో కాదు. తూర్పు లిబియాలో కేంద్రీకృతమై ఉన్న ఇస్లామిస్ట్ మిలిటెంట్లే వారు. వారిని అణచివేయడంలో గడ్డాఫీకి అమెరికా అప్పట్లో సహకరించింది. కాని ఇప్పుడు వారినే అమెరికా ఆర్గనైజ్ చేసి సాయుధుల్ని కావించి గడ్డాఫీని కూలదోయడానికి ఉసిగొల్పింది. అమెరికా చరిత్ర నిండా ఇలాంటి చీకటి అధ్యాయాలే. అమెరికా చరిత్ర రాస్తే అందులో ఒక్కో చాప్టర్ అమెరికా స్వార్ధంతో చేసిన ఒక్కో దారుణ, అనైతిక కుట్రను వివరిస్తుందే తప్ప స్వంతగా తన కాళ్ళపైన తాను నిలబడిన చరిత్రను ఎవరూ రాయలేరు.

అమెరికా ఎంబసీ నలుగురి సమావేశాన్ని క్లుప్తీకరిస్తూ ఇలా పేర్కొంది. “మౌమ్మర్, మౌతస్సిమ్ గడ్డాఫీలతో మెక్ కెయిన్ సమావేశం సానుకూలంగా నడిచింది. ద్వైపాక్షిక సంబాంధాలలో సాధించిన ప్రగతిని సమావేశం గుర్తించింది. విస్తృతమైన భద్రతా సహకారాన్ని లిబియా కోరుతున్న సంగతిని సమావేశం మరొక సారి స్పష్టీకరించింది. రక్షణ పరికరాలు, సి 130 ల (లిబియాపై అప్పటివరకు విధించబడిన ఆంక్షల వలన నిషేధించబడిన కాంట్రాక్టు) సరఫరాల విషయంలో మరింత సహాయం అవసరమని లిబియా కోరిన సంగతిని గుర్తించింది” అని కేబుల్ పేర్కొంది.

అదే సమావేశంపై మరొక కేబుల్ వెల్లడయ్యింది. స్కాట్లండ్ జైలు నుండి లిబియా ఖైదీ “అబ్దెల్‌బాసిత్ ఆల్-మెగ్రాహి” విడుదలపై మెక్ కెయిన్ గడ్డాఫిలకు ఇచ్చిన సలహాలని ఈ కేబుల్ పేర్కొంది. ఇక్కడ మెగ్రాహి విచారణ, జైలు శిక్ష, తెరచాటు ఒప్పందాలు తదితర విషయాల్ని కొంచెం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 1988 లో స్కాట్లండ్ లోని లాకర్ బీ ప్రాంతం పైన “పాన్ ఆమ్ 103” అనే పేరుగల అమెరికా విమానం కూల్చివేయబడింది. అందులో ఉన్న అమెరికన్ ప్రయాణీకులతో పాటు అందరూ చనిపోయారు. అది “లాకర్ బీ ఘటన” గా చరిత్రలో ప్రసిద్ధి పొందింది. ఆ కేసులో అప్పటికి మెగ్రాహీ స్కాట్లండ్ జైలులో శిక్ష పొందుతున్నాడు. ఈ ఘటనను గుర్తు చేస్తూ ఇప్పుడు మెక్ కెయిన్ “గడ్డాఫీ చేతులకు అమెరికన్ల రక్తం అంటిందంటూ” అభివర్ణిస్తాడు. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికాకి అధ్యక్షులుగా పని చేసిన వారందరికీ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వాసులు మిలియన్ల మంది రక్తం అంటిన విషయం అమెరికా అంగీకరించదన్నది వేరే విషయం. ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా దేశాల పౌరుల రక్తాన్ని తన చేతులకు అంటించుకునే గొప్ప అవకాశాన్ని మెక్ కెయిన్ ఒబామా వలన కోల్పోయాడు మరి. ఆ కోపాన్ని కూడా మెక్ కెయిన్ గడ్డాఫీ పైన చూపదలిచే ఒబామాని పూర్తి శక్తిని లిబియాపై ఉపయోగించలేదంటూ విమర్శిస్తుండవచ్చు.

మెగ్రాహీ విడుదల అమెరికాలో చాలా సున్నితమైన విషయం గా మెక్ కెయిన్ అప్పటి సమావేశంలో మెక్ కెయిన్ గడ్డాఫీలకు వివరించాడు. ఇరు దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు నష్టం కలగని రీతిలో మెగ్రాహీ విడుదల విషయాన్ని పరిహరించాలని మెక్ కెయిన్ కోరాడు. అంటే మెగ్రాహీని స్కాట్లండ్ విడుదల చేస్తున్న సంగతి అమెరికాకి చాలా ముందుగానే తెలుసన్నమాట! ఈ మాటను ఎందుకు అనవలసి వస్తున్నదంటే, మెగ్రాహి విడుదలపై అమెరికా బహిరంగంగా పెద్ద ప్రహసనాన్నే సృష్టించింది. లిబియా, బ్రిటన్ తో 2007లో కుదుర్చుకున్న విలువైన వ్యాపార ఒప్పందాలలో మెగ్రాహీ విడుదల అంశాన్ని చేర్చారన్న విషయం బైటపడింది. అదీకాక మెగ్రాహీ విచారణ సమయంలో ఆయన తరపున వాదించిన డిఫెన్స్ లాయర్, మెగ్రాహికి అనుకూలంగా ఉన్న సాక్ష్యాలను తొక్కి పెట్టేలా అమెరికా బ్రిటన్ లు ప్రోత్సహించడం వల్లనే మెగ్రాహిని దోషిగా నిర్ధారించారని ససాక్ష్యంగా నిరూపితమయ్యే వివరాలు వెల్లడయ్యాయి.

అందువలన తిరిగి విచారణ జరిగితే మెగ్రాహిగా విడుదలయ్యే అవకాశాలు దండిగా ఉండడంతో మెగ్రాహీ, పునఃవిచారణకై వేయనున్న అప్పీలును ఉపసంహరించుకోవడానికి బ్రిటన్, అమెరికా, స్కాట్లండ్ లు తెరవెనుక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందుకు ప్రతిగా మెగ్రాహీ ప్రోస్ట్రేట్ కాన్సర్ తో భాధపడుతున్నందున మానవతా దృక్పధంతో విడుదల చేసేలా ఒప్పందం జరిగింది. ఫలితంగా మెగ్రాహీ తన పునః విచారణ అప్పీలును ఉపసంహరించుకోవడం, ఆ తర్వాత ఆరు రోజులకే ఆగస్టు 20, 2009 తేదీన విడుదలవ్వడం జరిగిపోయింది. మెగ్రాహి పునః విచారణలో నిర్దోషిగా విడుదల కావడం అంటే లాకర్ బీ విమానం కూల్చివేతలో నిందితులను పట్టుకుని శిక్షించడంలో అమెరికా, బ్రిటన్ లు విఫలమయ్యాయని అర్ధం. ఇది దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను తీవ్రంగా కలిచివేసే విషయంగా మారుతుంది. అమెరికా బ్రిటన్ లకు తలెత్తుకోలేని పరిస్ధితి దాపురిస్తుంది. మెగ్రాహియే దోషి అని చెప్పిన సాక్షికి అమెరికా బ్రిటన్ లు మిలియన్ల డాలర్లను ఇచ్చి మెగ్రాహికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించాయి. ఇప్పుడీ విషయాల్లో ఏది బైటపడినా అమెరికా బ్రిటన్లకు తీవ్ర అవమానంగా చరిత్రలో మిగిలిపోతుంది.

ఈ నేపధ్యంలో మెగ్రాహిని అమెరికా, బ్రిటన్ లు ఒప్పందం ప్రకారమే విడుదల చేశారు. విడుదల చేసే సమయంలో మెగ్రాహీ కేన్సర్ వలన ఇంకా మూడు నెలలే బతుకుతాడన్న డాక్టర్ల సాక్ష్యాలను కోర్టుకి సమర్పించారు. కాని మూడు నెలలు కాదు ఆరునెలలైంది, సంవత్సరమైంది ఐనా మెగ్రాహి చావుకి దగ్గర్లో ఉన్న సూచనలు కనిపించలేదు. పత్రికలు అల్లరి చేయడంతో అది ప్రజలకు పాకింది. ఇక అమెరికా తానేమీ ఎరగనట్లు బ్రిటన్ పైన తెచ్చిపెట్టుకున్న కోపంతో “అలాగా?” అని హుంకరించింది. వ్యాపార ఒప్పందాల్లో భాగంగానే విడుదల చేసినట్లయితే బ్రిటన్ పైన ఆంక్షలు విధించాల్సిందే నని కొంతమంది కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. వీరందరికీ మెగ్రాహీ అసలు దోషి కాదని, ఆయన్ని ఇరికించారనీ, ఈ విషయాలు సాక్ష్యాలతో వెల్లడి కావడంతో మెగ్రాహి పునర్విచారణకు అప్పిలు వేసాడనీ, ఆ విచారణలో నిర్దోషిగా బైటికి వస్తాడనీ, అలా వస్తే అమెరికా, బ్రిటన్ ల ప్రజలు అగ్రహోదగ్రులవుతారనీ రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవనీ గమనించి మెగ్రాహీతో ఒప్పందం కుదుర్చుకుని విడుదల చేశారనీ అన్నీ తెలుసు. కాని అమెరికా, బ్రిటన్ ప్రజలకు అవి తెలియకుండా ఉండడానికి అమెరికా ఉగ్రరూపం దాల్చినట్లు నాటకం ఆడటం అందుకు తగినట్లుగా బ్రిటన్ అబ్బే అదేమీ లేదంటూ వినయంగా అమెరికాకి చెప్పుకున్నట్లు బదులు నాటకం ఆడటం జరిగిపోయాయి. ఈ విధంగా అమెరికా బ్రిటన్ లాంటి పశ్చిమ రాజ్యాలు నిరంతరం తమ ప్రజల్ని మోసం చేస్తూ తమ చెత్త పనులకి ఆమోదం సంపాదించుకుంటాయి.

మెగ్రాహి విడుదలను గడ్డాఫీ తన పాలనలో సాధించిన గొప్ప విజయంగా చెప్పుకున్నాడు. 2010 జులైలో తన 40 సంవత్సరాల పాలనా ఉత్సవాల్లొ మెగ్రాహీని హీరోగా చూపించాడు. మెగ్రాహీ విడుదలై ట్రిపోలీ విమానాశ్రనయంలో దిగినప్పుడు కనివినీ ఎరుగని రీతిలో ఆయనకి ప్రభుత్వం స్వాగత సత్కారాలను నిర్వహించింది. మెక్ కెయిన్ బృందం అంతకు కొన్ని రోజుల ముందే మెగ్రాహీ విడుదలను అమెరికాలో సున్నిత విషయమనీ కావున వారు గాయపడేలా ఆయన విడుదలను స్వీకరించాలని చిలక్కి చెప్పినట్లు చెప్పినా గడ్డాఫీ పట్టించుకోదలుచుకోలేదని అమెరికాకి అర్ధమయ్యింది.

ఆగస్టు 2009కి ముందు తర్వాతా రాసిన కేబుళ్లలో అమెరికా రాయబారి, గడ్డాఫీ పాలన అమెరికా కోరిన స్ధాయిలో ఆయిల్ వనరుల్ని అమెరికాకి అప్పగించడానికి సిద్ధంగా లేడన్న విషయాలని కూడా రాశాడు. అమెరికా కోరిన పూర్తి వనరుల అప్పగింత చేయకపోవడమే ప్రధానంగా అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు లిబియాపై కత్తిగట్టడానికి కారణమయ్యింది. గడ్డాఫీ చర్యలను మౌనంగా దిగమింగుకుంటున్న సమయంలో అరబ్ దేశాల్లో ప్రజాందోళనలు వాటికి బాగా కలిసి వచ్చింది. అదే అవకాశంగా అమెరికా తాను అంతవరకూ సాకుతున్న లిబియా పాత మిలట్రీ నాయకుల్ని లిబియా తూర్పు ప్రాంతంలోని ప్రధాన పట్టణం బెంఘాజీలో దింపింది. ఏ ఇస్లాం మిలిటెంట్లనైతే అణచివేయాలని అమెరికా గడ్డాఫికి సహాయం చేసిందో అదే ఇస్లాం మిలిటెంట్లతో అమెరికా జట్టుకట్టింది. ఆ మిలిటెంట్లు అప్పటికే ఆల్-ఖైదాతో సంబంధాలు పెట్టుకున్నా అమెరికా పట్టించుకోలేదు. ఆల్-ఖైదాపై అమెరికా తలపెట్టిన పోరాటంలో ఎంత ఛిత్త శుద్ధి ఉందో ఈ సంఘటన రుజువు చేస్తుంది. వారికి ఆయుధ సహాయం, ఇంటలిజెన్స్ సహాయం అన్నీ అందించింది. గడ్డాఫీ బెంఘాజీ కేంద్రంగా ఉన్న మిలిటెంట్లను అప్పటికే అణచివేయడం, వారికి తెగల పరంగా స్ధానికంగా మద్దతు ఉండడంతో బెంఘాజి తిరుగుబాటుదారులకి కేంద్రంగ మనగలిగింది.

బెంఘాజీ లో ఉన్న గడ్డాఫీ మద్దతుదారులను తిరుగుబాటుదారులు ప్రారంభదశలో ఊచకోత కోయడాన్ని కార్పొరేట్ పత్రికలు కానీ, ఐక్యరాజ్య సమితి కాని పట్టించుకోలేదు. ఈలోగా అమెరికా ఎక్కడ ఆధిపత్యం వహిస్తుందో అన్న తొందరలో ఫ్రాన్సు మొదటి సారిగా తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటన్ దాన్ని అనుసరించింది. లిబియాపై వైమానిక దాడుల ద్వారా తిరుగుబాటుదారుల పురోగమనానికి ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలు సాయం చేసి చివరికి తాము అనుకున్నది సాధించాయి. లిబియాలో త్వరలో తమ ఆఫ్ఘనిస్ధాన్ లో లాగానే కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పరిచి అక్కడి ఆయిల్ వనరులని తీరిగ్గా కొల్లగొడతాయి. అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, ఇటలీ లకు చెందిన ఆయిల్ కంపెనీలు ఇప్పుడు బాగా లబ్ది పొందడానికి అవకాశాలు అందిపుచ్చుకున్నాయి. అవి ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించాయి కూడా. లిబియాలో తాము చెప్పిన ప్రజాస్వామ్య స్ధాపన కంటే ముందుగానే ఆయిల్ కంపెనీలను దించిన పశ్చిమ రాజ్యాలు లిబియా ప్రజలను కాపాడడానికే వారిపై బాంబులు వేస్తున్నామని మొదటి నుండి చెప్పడం దాన్ని ప్రపంచం గుడ్డిగా నమ్మడమే ఈ కధలో అత్యంత విషాదకరమైన సంగతి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s