నాటో బలగాల నిర్విరామ వైమానిక దాడులు ముందుండి దారి చూపగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు తయారు చేసుకున్న కీలు బొమ్మల నాయకత్వంలోని లిబియా తిరుగుబాటు బలగాలు, సగర్వంగా ట్రిపోలిని వశం చేసుకున్నాయి. ట్రిపోలిలో అడుగు పెట్టడంతోనే ప్రతీకార చర్యలకు దిగాయి. గడ్డాఫీ మద్దతుదారులుగా భావిస్తున్న వారందరినీ ఊచకోత కోసే పని మొదలైంది. ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాల ఉమ్మడి ప్రాయోజిత తిరుగుబాటు ఆద్యంతం నాటో సేనలు లిబియాపై మిసైళ్ల వర్షం కురిపించాయి. చివరి వారాల్లోనైతే తెంపు లేకుండా లిబియా పట్టణాలపై స్వైరవిహారం చేసిన నాటో విమానాలు సర్వం నాశనం చేశాయి.
ఇప్పుడు ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలు మొదట తలపెట్టిన కార్యక్రమం లిబియా ప్రజలకు ప్రజాస్వామిక వ్యవస్ధను అందించడమా? అలా భావిస్తే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల హంతక ముఠాను చిన్న చూపు చూసినట్లే. వారిప్పుడు లిబియా ఆయిల్ వనరుల పునః పంపిణీలో మునిగిపోయారు. తిరుగుబాటు సైన్యాలు ఇళ్ళపై పడి ఊచకోతలు సాగిస్తుంటే, హంతక ముఠా సౌదీ అరేబియా, ఖతార్ లాంటి అరబ్బు ప్రభువుల తో కలిసి ఆయిల్ విందుని భాగాలు పంచుకుంటున్నారు. లిబియాపై త్వరగా ఆధిపత్యం సాధించడానికి తద్వారా ఆయుధ ఖర్చు తగ్గించుకోవడం కోసం, స్వదేశంలోని వ్యతిరేకతను తగ్గించడం కోసమూ ట్రిపోలిపై హంతకముఠా సాగించిన అనైతిక వినాశనం ఈ కార్టూన్ లో:
కార్టూనిస్టు: విక్టర్ నీటో, వెనిజులా
—-