చుక్కల్లో ఆహార ద్రవ్యోల్బణం


INFLATIONఆహార ద్రవ్యోల్బణం చుక్కల్లో విహరిస్తోంది. రెండంకెల సంఖ్యను చేరువగా వెళుతోంది. అంటే దేశంలో ఆహార ధరలు కూడా చుక్కల్లో విహరిస్తున్నాయని అర్ధం. ఆహార భద్రత గురించి గుర్తొచ్చినప్పుడల్లా ఉపన్యాసాలు దంచే ప్రధాని మన్మోహన్ అది సాధించడానికి ఏ చర్యా తీసుకోడు. మంత్రులు, అధికారుల అవినీతి జన్ లోక్ పాల్ బిల్లువలన ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళన తప్ప దేశంలో ప్రజానీకానికి తిండిని అందుబాటులో ఉంచాలన్న ధ్యాస లేదు.

ఆగస్టు 13 తో ముగిసిన వారానికి ఆహార ద్రవ్యోల్బణం 9.8 శాతానికి చేరుకుంది. ఉల్లిపాయలు, బంగాళ దుంపలు, పళ్ళు, ఇతర ప్రొటీన్ ఆధారిత అహారాల ధరలు పెరిగిపోవడంతో ఆహార ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. గత వారం ఇది 9.03 శాతం ఉండగా మరుసటివారానికే 0.77 శాతం పెరిగింది. ఈ గణాంకాలు కూడా హోల్ సేల్ ధరల ఆధారంగా నిర్ణయించినవే. హోల్ సేల్ రేట్లనుండి ప్రజలకు అందేసరికి మధ్య దళారీల దోపిడీ వలన, రిటైల్ ధరలతో ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తే అది రెట్టింపు కంటే ఏ మాత్రం తక్కువగా ఉండదు.

గత సంవత్సర ఇదే వారాంతానికి ఆహార ద్వవ్యోల్బణం 14.56 శాతం ఉందనీ, దానితో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువగానే ఉందని ప్రభుత్వం సంతృప్తి పడుతోంది. వాస్తవానికి ద్రవ్యోల్బణం మూడు శాతం దాటితే అది ప్రజలపైన భారంగానే పరిణమిస్తుంది. పేద ప్రజానికైతే పెను భారంగా పరిణమిస్తుంది. ప్రభుత్వానికి తెలిసేది లెక్కలు మాత్రమే. లెక్క పెరిగితే పెరిగింది గనక కఠిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చి మర్చిపోతారు. తగ్గితే చూశారా తగ్గించాం అని భుజాలు చరుచుకుంటారు. ద్రవ్యోల్బణం అంటే ప్రభుత్వానికి తగ్గించవలసిన అంకె మాత్రమే. కాని ప్రజలకి ద్రవ్యోల్బణం అంటే ఆకలి, పస్తులు. అర్ధాకలితో పూటగడుస్తుందా, పస్తులతో గడుస్తుందా అని రోజులు లెక్కబెట్టుకునే జీవితాలు.

పెరిగిన ఆహారధరల్లో ఉల్లిపాయలు, బంగాళ దుంపలు అత్యవసరమైన సరుకులు. బంగాళదుంప ఉత్తర భారత దేశంలో చపాతీ, నాన్ లాంటి వాటిలో తినే ఏకైక కూర. ఉల్లిపాయల సంగతి చెప్పనవసరం లేదు. పళ్లు పేద, మధ్యతరగతికి ఎలాగూ అందవు. ఎగువ మధ్యతరగతికి కూడా ఇప్పుడవి అందుబాటులో ఉండడం లేదు. “ద్రవ్యోల్బణం కట్టడి చేయడంఏ ద్రవ్య పరపతి విధానానికి ప్రధాన అంశం” అని ఆర్.బి.ఐ గవర్నరు పదవిలోకి వచ్చినప్పటినుండీ చెబుతున్నాడు. అదే మాట ప్రణాళికా శాఖ మంత్రి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ప్రధాని మన్మోహన్, ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీలు మూడేళ్ళనుండి చెబుతున్నారు. ఆ పేరుతో బ్యాంకుల వడ్డీ రేట్లను తొమ్మిదిసార్లు పెంచారు. దానితో బ్యాంకుల్లో అప్పులు ప్రియంగా మారాయి.

ప్రభుత్వం, ప్రణాళికా సంఘం, ఆర్ధిక మంత్రిత్వ శాఖ లు ఏ గాడిదలు కాస్తున్నాయోగాని, ద్రవ్యోల్బణాన్ని గత ఆర్ధిక సంక్షోభం ముగిసినప్పటినుండీ అదుపులోకి తేలేక పోతున్నారు. ప్రభుత్వ లెక్కల్లో లేని అవినీతి డబ్బు సమానంతర ఆర్ధికవ్యవస్ధని నడుపున్న నేపధ్యంలో ఆ డబ్బే వ్యవస్ధలో పేరుకుపోయి ద్రవ్యోల్బణం అదుపులోకి లేకుండా పోతోంది. ఆర్.బి.ఐ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా వ్యవస్ధలోని డబ్బుని వెనక్కి తీసుకోవడం వల్లనే ద్రవ్యోల్బణం ప్రస్తుత స్ధాయిలో ఉందంటే వడ్డీ రేట్లు పెంచనట్లయితే అది ఎక్కడ ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. ద్రవ్యోల్బణం తగ్గించడమే మా ప్రధమ కర్తవ్యం అంటున్నవారు అవినీతిని, నల్లదనాన్ని అరికట్టగలిగితే ద్రవ్యోల్బణం దెబ్బకు దిగివస్తుంది.

కాని ఉన్నత స్ధానాల్లోని అవినీతిని అరికట్టడానికి ఉద్దేశించిన లోక్ పాల్ బిల్లుని రూపొందించడానికే పాలకులకి నలభై సంవత్సరాలు పట్టింది. అది కూడా కోరలు లేని బిల్లని ప్రతిపక్ష పార్టీలన్నీ చెబుతున్నాయి. అవినీతిని అరికట్టేందుకు సమర్ధవంతమైన చట్టం రూపొందించలేనివారు ద్రవ్యోల్బణాన్ని అరికడతామని చెప్పడం అంటే అవి దగాకోరు మాటలే.

గురువారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగష్టు 6 నుండి 13 వరకు ఒక్క వారంలోనే ఉల్లిపాయల ధర 44.42 శాతం పెరిగింది. బంగాళ దుంపల ధర 16.39 శాతం, పళ్ళు 27.01 శాతం, గుడ్లు, మాంసం, చేపల ధరలు 13.37 శాతం పెరిగాయి. ఇంకా ఇతర సరుకుల ధరలు ఎలా పెరిగింది పట్టికలో చూడవచ్చు. ఒక్క గోదుమ, కాయ ధాన్యాలు తప్ప అన్ని అహార ధరలూ పెరిగాయి. మొత్తం మీద ప్రధాన సరుకుల ధరలకు సంబంధించిన ద్రవోల్బణం 11.64 శాతం నుండి 12.4 శాతానికి పెరిగింది. టోకు ధరల సూచిలో ఈ ప్రధాన సరుకుల వాటా ఇరవై శాతం ఉంటుంది. ఫైబర్, నూనె విత్తనాలు, ఖనిజాలు తదితర ఆహారేతర సరుకుల ద్రవ్యోల్బణం 16.07 శాతం నుండి 17.80 శాతానికి పెరిగిందని ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి.

“ధరల మీద మన్నుబొయ్య, ఏలెటోడ్ని కూలదొయ్య” అన్న పాట దశాబ్దాల అనంతరం కూడా సజీవంగా ఉన్నందుకు పాటగాడ్ని అభినందించాలా? ప్రభుత్వాల్ని తిట్టిపొయ్యాలా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s