మొత్తం అరబ్ జాతికే రోమాంఛిత క్షణాలవి. ప్రతి అరబ్బుకీ ఒళ్ళు పులకరించి, గుండెలనిండా తాజా ఊపిరి నిండిపోయి, మనసంతా ఉద్విగ్నతతో అల్లుకుపోయిన క్షణాలవి. జన్మంతా రీప్లే వేసుకుంటూ చూసుకోగల దృశ్యమది. అటువంటి అద్భుతమైన ఘటనను ఈజిప్టు యువకులు సాధించారు.
పాలస్తీనా ప్రజలు తమ ఇళ్ళు, గ్రామాలు కోల్పోయి, అరవై ఏళ్లనుండి ఇజ్రాయెల్, అమెరికాల జాత్యహంకార ముట్టడిలో అన్ని ప్రజాస్వామిక హక్కులకు దూరమై రోజులు లెక్కబెట్టుకుంటూ గడుపుతున్నారు. తమ ఇంటి కోసం, తమ వీధికోసం, తమ గ్రామం కోసం, తమ పాలస్తీనా రాజ్యం కోసం కళ్ళల్లో వత్తులు కాదు, కళ్ళనే తుపాకి గుళ్ళుగా చేసుకుని ఎదురు చూస్తున్నారు పాలస్తీనీయులు. ఇజ్రాయెల్ అరణ్యనీతికి రోజుకొక్క ప్రాణాన్ని అర్పిస్తూ, తొమ్మిదినెలలకొక్క నెత్తుటిగుడ్డుని ఉద్యమానికి అప్పగిస్తోంది పాలస్తీనా తల్లి. అక్కడ ప్రతి శిశువూ పుట్టుకతో ముజాహిదీన్. లేకుంటే రేపు లేదు.
అటువంటి నేపధ్యంలో పాలస్తీనా భూభాగం ‘గాజా’ నుండి ఈజిప్టు ద్వారా ఇజ్రాయెల్ ఆక్రమించిన తమ భూభాగంలోకి తీవ్రవాద సంస్ధగా అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ ల చేత కీర్తించబడుతున్న “హమాస్” కార్యకర్తలు, దండయాత్ర చేసి ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికుల్ని మట్టుబెట్టారు. వారిని తరుముతూ వచ్చిన ఇజ్రాయెల్ సైన్యం ఈజిప్టులో కూడా చొరబడి ఈజిప్టు పోలీసులు ఎనిమిదిమందిని పొట్టనబెట్టుకుంది. ఇంకా ఈజిప్టు పౌరుల్ని కొద్దిమందిని చంపేసింది.
ఉద్యమ కాకమీద ఉన్న ఈజిప్టు ప్రజలు ఇజ్రాయెల్ దాష్టీకానికి అగ్రహోదగ్రులయ్యారు. అదే రాత్రి ఈజిప్టులోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ముందు పదుల వేలల్లో గుమిగూడారు. ఇజ్రాయెల్ ఆటవికతకు బదులు కోరింది. అప్పుడు జరిగిందొక అనూహ్య ఘటన. సమూహం ఇచ్చిన శక్తితో ఓయువకుడు “స్పైడర్ మేన్” కాదు, కాదు… “ఫ్లాగ్ మేన్” అయ్యాడు. రాయబార కార్యాలయంపైకి ఎగబాకాడు. అరబ్బులపై ఇజ్రాయెల్ జాత్యహంకారానికి ప్రతీకగా నిలిచిన ఆ దేశ జెండాని విసిరికొట్టి, ఈజిప్టు జాతీయ జెండాని సగర్వంగా ఎగురవేశాడు.
ఆ సమయంలో అక్కడ గుమికూడిన ఒక్కొక్క అరబ్బు గుండె అరబ్బు జాతీయవాదంతో నిండిపోయింది. జాత్యహంకార జెండా స్ధానంలో తమ జాతి జెండా ఎగురుతున్న దృశ్యన్ని చీకటిలో సైతం కాంచి పులకరించిపోయారు. ఆ దృశ్యాన్ని చూడవలసిందే. ఆ జనహోరు వినవలసిందే. అసలు ఆ సమూహంలో నేనూ ఒకరినెందుకు కాలేకపోయాను?
—వీడియో: జోనాధన్ రషాద్—
——————————————————————–
—కార్టూన్: కార్లోస్ లాతుఫ్—
———————————————————–