
2009 నుండీ అప్పు పేరుకుంటూ వచ్చిందనీ పదే పదే ప్రధానులు మారడం వలన సమర్ధవంతమైన ఆర్ధిక వ్యూహాలు పన్నడానికి అవకాశాలు లేకుండా పోయిందని మూడీస్ తెలిపింది. ప్రధాని నవోటో కాన్ జపాన్ను పెద్ద ఎత్తున నష్టపరిచిన భూకంపం, సునామీలను ఎదుర్కోవడంలో వేగంగా స్పందించలేదని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. సునామీలో దెబ్బతిన్న ఫుకుషిమా అణు ప్రమాదం అనంతరం రేడియేషన్ లీకేజీని అరికట్టడంలో సైతం విఫలమైనాడని జపాన్ దేశస్ధులు భావిస్తున్నారు. రేడియేషన్ ప్రమాదం వలన ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొనే ప్రజల కోసం కాకుండా అణు కంపెనీ ప్రయోజనం కోసం లోపాయకారిగా పని చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. రేడియేషన్ విడుదలకి సంబంధించి ఎప్పటీకప్పుడు వాస్తవాలను వెల్లడించడంలో కూడా విఫలమైనాడని జపనీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో రాజీనామా చేయనున్న ఆరవ ప్రధానిగా నవోటో కాన్ మిగలనున్నాడు.
జపాన్ రేటింగ్ తగ్గుదలపట్ల మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. సునామీ, అణు ప్రమాదం అనంతరం రిసెషన్ లోకి జారిపోయిన జపాన్ రేటింగ్ తగ్గడం మామూలే అన్నట్లుగా మార్కెట్లు ఉండిపోయాయి. ఈ నెల ప్రారంభంలో అమెరికా క్రెడిట్ రేటింగ్ ను AAA నుండి ఒకమెట్టు తగ్గించి ఎస్&పి సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. దాని ఫలితంగానో ఏమో కానీ ఎస్&పి కి సి.ఇ.ఓ గా పని చేస్తూ వచ్చిన భారత సంతతికి చెందిన దేవన్ శర్మ బుధవారం రాజీనామా చేయనున్నాడు. దాదాపు విశ్లేషకులంతా అమెరికా ఆర్ధిక వ్యవస్ధపై ఒక నిజాన్ని చెప్పినందుకే దేవన్ శర్మ ను బలి తీసుకున్నారని భావిస్తున్నారు.
మూడీస్ రేటింగ్ వ్యవస్ధలో ప్రస్తుతం జపాన్ కి కేటాయించిన రేటింగ్, అత్యుత్తమ రేటింగ్ కంటే మూడు మెట్లు దిగువన ఉంది. చైనా రేటింగ్ దీనితో సమానంగా ఉండగా, ఇటలీ, స్పెయిన్ ల రేటింగ్ కు ఒక మెట్టు దిగువన ఉండడం విశేషం. జపాన్ తన AAA రేటింగ్‌ను 1998 లో కోల్పోయింది. దీర్ఘకాలం పాటు డిఫ్లేషన్ (ప్రతిద్రవ్యోల్బణం) లో జపాన్ ఆర్ధిక వ్యవస్ధ కూరుకు పోవడంతో జపాన్ అత్యున్నత రేటింగ్ ను మూడీస్ తగ్గించింది. గత జూన నెలలో మూడీస్ సంస్ధ ఇటలీ క్రెడిట్ రేటింగ్ ను తగ్గించే అవకాశం ఉందని హెచ్చరించింది. జపాన్ రేటింగ్ ఒక మెట్టుతగ్గినప్పటికీ ఇంకా అది హై గ్రేడ్ లలో ఒకటిగా పేరొందినదే. గత ఐదేళ్ళలో ప్రధానులు మారుతూ పోవడం వలన జపాన్ ప్రభుత్వం దీర్ఘకాలిక ఆర్ధిక, ఫిస్కల్ (కోశాగార) వ్యూహాలను ఆచరణీయ విధానాలలోకి మార్చలేకపోయిందని మూడీస్ తెలిపింది.
జపాన్ అప్పు వార్షిక జిడిపి కంటే రెట్టింపు ఉంది. జపాన్ జిడిపి 5 ట్రిలియన్ డాలర్లు కాగా దాని అప్పు 10 ట్రిలియన్ డాలర్లకు దగ్గరగా ఉంది. ఇది అభివృద్ధి చెందిన దేశాలన్నింటితో పోలిస్తే చాలా ఎక్కువ. అణు ప్రమాదం దరిమిలా రేడియేషన్ లీకేజి వలన జపాన్ ఎగుమతులను చాలా దేశాలు నిలిపివేశాయి. దీనివలన జపాన్ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి వెళ్ళిపోయింది. ఫలితంగా ఆర్ధిక వృద్ధి మరింతగా దిగజారింది. అమ్మకం పన్నుని ఐదు శాతం నుండి పెంచుకుని బడ్జెట్ లోటుని తగ్గించుకోవాలని ఆర్ధిక పండితులు సూచిస్తున్నారు. అయితే ప్రధాని పదవికి పోటీపడుతున్న ఆర్ధిక మంత్రి నోడా అమ్మకం పన్ను కాకుండా ఇతర పన్నులను పెంచాలని సూచిస్తున్నాడు. జపాన్ లోటు అదుపులో ఉండాలంటే జిడిపి నామినల్ వృద్ధి కనీసం 3 శాతం ఉండాలని మూడీ తెలిపింది.
ఎస్&పి సంస్ధ జపాన్ రేటింగ్ ను గత జపాన్ లోనే AA- కి తగ్గించింది. ఇది ఎస్&పి రేటింగ్ లలో నాలుగవ స్ధానంలో ఉంటుంది.

వ్యాసం చాలా వివరంగా ఉంది. స్టాక్ మార్కెట్ మదుపుదారులకు ఉపయుక్తమైన సమాచారమిది.