ఓ వైపు ప్రధాని మన్మోహన్ అన్నా హజారే ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీవ్రంగా కలవరపడుతున్నదని చెబుతుండగా మరో వైపు ప్రధాని సహచరులు అన్నా దీక్ష తమ సమస్య కాదు పొమ్మంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకూ ఒప్పందం కుదురుతుందన్న వార్తాలు షికార్లు చేయగా సాయంత్రం జరిగిన సమావేశంలో చర్చలు వాడిగా జరిగినట్లుగా పౌరసమాజ కార్యకర్తలు చెబుతున్నదాన్ని బట్టి అర్ధం అవుతోంది. ప్రభుత్వానికీ అన్నా బృందానికి మధ్య జరుగుతున్న చర్చలు మళ్ళీ మొదటికే వచ్చిన పరిస్ధితి కనపడుతోంది.
మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, సల్మాన్ ఖుర్షీద్ లు అన్నా ఆరోగ్యం తమ సమస్య కాదని తేల్చి చెప్పారని వారితో చర్చలు జరిపిన అరవింద్ కేజ్రీవాల్ తెలిపాడు. “ఆయన (అన్నా హజారే) కావాలనుకుంటే నిరాహార దీక్ష చేసుకొమ్మని చెప్పండి. అది ఆయన సమస్య అని వారు (ప్రణబ్, సల్మాన్ ఖుర్షీద్) అన్నారు” అని అరవింద్ కేజ్రీవాల్, ఆర్ధిక మంత్రి నార్త్ బ్లాక్ కార్యాలయం ముందు గుమిగూడిన విలేఖరులతో చెప్పినట్లుగా డెయిలీ భాస్కర్ పత్రిక తెలిపింది.
“వారి వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. నిన్న మేం చెప్పింది విన్నారు. తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. కాని ఈరోజు వారు మేం చెప్పింది వినడానికి కూడా ఇష్టంగా లేరు” అని అరవింద్ కేజ్రీవాల్ విలేఖరులకు తెలిపాడు. ఎటువంటి ప్రగతి లేకపోయినా మళ్లీ గురువారం మధ్యాహ్నం సమావేశం అవుదామని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నారు. బుధవారం సాయంత్రం ప్రశాంత్ భూషణ్, కిరణ్ బేడి, అరవింద్ కేజ్రీవాల్ లు నార్త్ బ్లాక్ లో ప్రణబ్, ఖుర్షీద్ లతో సమావేశం అయ్యారు. రాత్రి గం.9:30 ని.ల వరకూ గంటకు పైగా చర్చలు జరిగినప్పటికీ నిర్ధిష్ట అంగీకరానికి రాలేకపోయారు.
అయితే మంత్రులు అరవింద్ చెప్పిన దానికి భిన్నంగా స్పందించారు. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని అవి కొనసాగుతాయనీ ఖుర్షీద్ చెప్పాడు. “చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. పరస్పర అభిప్రాయాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. మేము నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు మాట్లాడు కున్నాం. రేపు కూడా మాట్లాడుకుంటాం. విషయాన్ని త్వరగా ముగించాలని కోరుకుంటున్నాం” అని ఖుర్షీద్ అన్నాడు. అన్నా ఆరోగ్యం పట్ల తమకు ఆందోళనగా ఉందని కూడా చెప్పాడు.
“అన్నా హజారే నిరాహార దీక్షను ముగించేలా చేయడానికే ప్రధమ ప్రాధాన్యం. ఆయన గురించి మేమంతా ఆందోళనగా ఉన్నాం. ఆయనకేమీ జరగదని నమ్ముతున్నాం” అని సల్మాన్ పత్రికలతో చెప్పాడు. అన్నాకు ఏమీ కాదన్న నమ్మకంతోటే ఆయన దీక్షతో తమకు సంబంధం లేదని మంత్రులు భావిస్తున్నారు కాబోలు.
మరోవైపు అఖిలపక్ష సమావేశం మద్దతును కాంగ్రెస్ కూడగట్టుకుంది. పార్లమెంటును ఎవరూ ఆజ్ఞాపించలేరనీ, లోక్ పాల్ బిల్లు తయారు కావడానికే డెడ్ లైన్ లాంటివాటిని అంగీకరించేది లేదనీ అఖిలపక్ష సమావేశం స్పష్టంగా తేల్చి చెప్పింది. 9 రోజుల నిరాహార దీక్ష అనంతరం అన్నా హజారే ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది. తొమ్మిది రోజుల పాటు దీక్ష చేయడం తక్కువ కాదు. అదీ కాక 74 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తికి అది ఇంకా కష్టమైన పని. అన్నాను దాదాపు ముప్ఫై మందికి పైగా డాక్టర్లు పరీక్షిస్తున్నారని వార్తా ఛానెళ్ళు చెబుతున్నాయి.
బి.జె.పి నేతృత్వంలోని ఎన్.డి.ఏ కూటమితో పాటు ఇతర తొమ్మిది పార్టీల ఫ్రంట్ కూడా ప్రభుత్వ లోక్ పాల్ బిల్లుని ఉపసంహరించాలని కోరుతున్నాయి. అన్నా హజారే బిల్లులోని కొన్ని అంశాలు అంగీకారయోగ్యం కావని వారంతా యు.పి.ఎ తో జత కలవడం విశేషం. పార్లమెంటు సర్వాధికారాన్ని ఆ అంశాలు ఉల్లంఘిస్తున్నాయని పార్టీలన్నీ ఏకగ్రీవంగా భావిస్తున్నాయి. చూడబోతే అంతిమంగా పార్టీలన్నీ ఒకవైపు, అన్నా బృందం మరొక వైపు మొహరించి ఉన్నట్లు తోస్తోంది.
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందడం కుదరదని సి.పి.ఎం నాయకుడు సీతారాం యేచూరి అన్నాడు. “ఒక బిల్లు ఆమోదం పొందడానికి ఏ ప్రొసీజర్ ని పాటిస్తారో దాన్ని జరగనివ్వాలి. అది లేకుండా బిల్లుని ఆమోదించాలనడం తగదు. అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముఖ్యమైనది” అని బి.జె.పి నేత అరుణ్ జైట్లీ అన్నాడు. బిల్లులో ఉన్న అంశాలే ప్రధానం కానీ సమయం అనేది ప్రధానం కాదని జైట్లీ అన్నాడు. అంటే అన్నా విధించిన ఆగస్టు 30 తేదీ గడువుని పార్టీలు అసలు పట్టించుకోలేదని స్పష్టమవుతోంది.
ప్రభుత్వం ఇప్పుడు పూర్తి బాధ్యత ను మోయాల్సిన పరిస్ధితినుండి తప్పించుకుంది. అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల చేత కూడా గడువు విధించడం కుదరదనీ, పార్లమెంటే సుప్రీం అనీ చెప్పించడం ద్వారా అందరి మద్దతును కూడగట్టుకుంది. తద్వారా బంతిని అన్నా కోర్టులోకి నెట్టివేసింది.
కాంగ్రెస్సా! మజాకా?
