
ఐ.ఎమ్.ఎఫ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్ పై రేప్ ఆరోపణలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. దీనితో న్యూయార్క్ హోటల్ మెయిడ్ ను రేప్ ప్రయత్నం చేశాడంటూ స్ట్రాస్ కాన్ పై వచ్చిన ఆరోపణల కేసు పూర్తిగా రద్దయినట్లే. బాధిత మహిళ ప్రవేటు కేసు దాఖలు చేస్తే తప్ప స్ట్రాస్ కాన్ మళ్ళీ కోర్టు గడప తొక్కనవసరం లేదు. బాధిత మహిళ సాక్ష్యం ద్వారా ‘అనుమాన రహితంగా’ రేప్ కేసును రుజువుచేయగలమన్న నమ్మకాన్ని ప్రాసిక్యూటర్లు కోల్పోవడంతో కేసును ఉపసంహరించుకున్నట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.
నఫిస్సాటో దియల్లో, 32 సం., మనహట్టన్ లోని సోఫిటెల్ హోటల్ లో మెయిడ్ గా పని చేస్తోంది. ఆ హోటల్ లో లక్సరీ సూట్ లో దిగిన స్ట్రాస్ కాన్ శుభ్రపరచడానికి వచ్చిన మెయిడ్ దియల్లోను ఓరల్ సెక్స్ చేయమని బలవంతపెట్టడంతో ఆమె విదుల్చుకుని సహోద్యోగులకు తెలిపిందనీ, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారనీ బాధితురాలివైపు కధనం కాగా ప్రాసిక్యూటర్లు వెంటనే విమానాశ్రయంలో పారిస్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న విమానం నుండి స్ట్రాస్ కాన్ ను దించి అరెస్టు చేసారు. న్యాయ స్ధానం ఆయనకి బెయిల్ ఇవ్వకుండా రైకర్స్ ఐలాండ్ జైలులో ఉంచింది. మరో వారం రోజులకే బాధితురాలు అబద్ధం చెప్పిందనీ, ఆమె సాక్ష్యంలోని విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తాయని చెబుతూ ప్రాసిక్యూటర్లు స్ట్రాస్ కాన్ కి బెయిల్ లేకుండానే విడుదల కావడానికి దోహదం చేశారు.
ఆ తర్వాత అప్పటివరకూ అజ్ఞాతంలో ఉన్న దియల్లో బైటికి వచ్చి పత్రికలతో తన గోడుని వెళ్లబోసుకుంది. గినియా నుండి అమెరికాలో శరణు పొందడానికి వీలుగా కొన్ని అబద్ధాలు చెప్పింది వాస్తవమేననీ కాని అది తనపై జరిగిన అత్యాచారాన్ని ఎలా తుడిచిపెడుతుందనీ ప్రశ్నించింది? తనపై అత్యాచారం జరిగింది వాస్తవమేననీ ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా అదే చెబుతున్నదనీ ఎత్తి చూపింది. అయితే ఫోరెన్సిక్ నివేదిక ఇరువరి మధ్య పరస్పర అంగీకారంతోనే జరిగిందన్న సంగతిని రుజువు చేసిందని డిఫెన్స్ లాయర్లు వాదించారు. ఆమె ఒంటిపైన ఉన్న గాయాలు అంతకుముందు మరెవరితొనో పరస్పర అంగీకారంతో జరిపినపుడు గాయాలు కావచ్చునని వాదించారు.
ఇవన్నీ కొనసాగుతుండగానే ప్రాసిక్యూటర్లు సోమవారం స్ట్రాస్ కాన్ పై అన్ని ఆరోపణలను ఉపసంహరించుకున్నట్లు జడ్జికి తెలిపారు మంగళవారం స్ట్రాస్ కాన్ కోర్టుకు హాజరవుతారు. “ఫిర్యాదికి, ఫిర్యాదు ఎదుర్కొంటున్నవారికి మధ్య నిజానికి ఏం జరిగిందో తెలియదు. కాని ఫిర్యాది కొన్ని అంశాల్లో రెండు మూడు సార్లు మాటలు మార్చడంతో ఆమెపై విశ్వసనీయ కోల్పోయాము. స్ట్రాస్ కాన్ పై ఆరోపణలను అనుమాన రహితంగా రుజువు చేయలేమన్న నిర్ణయానికి వచ్చాము” అని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఫిర్యాదుదారుని తాము నమ్మ లేనప్పుడు నమ్మమని జ్యూరీకి చెప్పలేమని వారన్నారు.
దియల్లో లాయర్ కెన్నెత్ ధాంప్సన్ ప్రాసిక్యూటర్‌ని కలిసాక పత్రికలతో మాట్లాడుతూ “రేప్ కి గురైన మహిళ, తగిన న్యాయం పొందే హక్కులను ప్రభుత్వం నిరాకరించింది. ప్రాసిక్యూటర్ ఒక అమాయక భాదితురాలికి వీపు చూపడమే కాక, ఫోరెన్సిక్, మెడికల్ ఇంకా ఇతర భౌతిక సాక్ష్యాధారలపట్ల కూడా వీపు చూపించాడు. మన తల్లులు, కూతుళ్ళు, సోదరీమణులు, భార్యలు, మనకు అత్యంత ప్రీతిపాత్రమైనవారు రేప్ కి గురైనపుడు ప్రజలెన్నుకున్న జిల్లా అటార్నీ కాపాడకపోతే, ఇంకెవరు కాపాడతారు?” అని ప్రశ్నించాడు. కోర్టు బైట మహిళా హక్కుల సంస్ధలు ప్రధర్శన నిర్వహించారు. “న్యూయార్క్ నగరం, అమెరికాకి రేప్‌ల రాజధాని” అని నినాదాలు చేశారు.
కేసునుండి బైటపడినప్పటికీ స్ట్రాస్ కాన్ రాజకీయ భవిష్యత్తు పూర్తిగా కూలిపోయినట్లే భావించవచ్చు. ఆరోపణల ముందువరకు స్ట్రాస్ కాన్ ఫ్రాన్సు అధ్యక్షుడుగా అందరికంటే ముందంజలో ఉన్నారు. ఇటీవల జరిపిన సర్వేలో మూడొంతులు స్ట్రాస్ కాన్ రాజకీయాల్లోకి రాకూడదని కోరుకుంటున్నట్లుగా తేలింది.
