
అరబ్బులను హీనంగా చూస్తున్నప్పటికీ కొన్ని అరబ్ దేశాల ప్రభుత్వాలు ఇజ్రాయెల్ తో మిత్రత్వం నెరుపుతున్నాయి. అందులో ఈజిప్టు ప్రముఖమైనది. 1967 అరబ్ యుద్ధంలో సిరియా, జోర్డాన్, ఈజిప్టు దేశాల భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. అరబ్ దేశాలన్నీ ఐక్యంగా ఇజ్రాయెల్ నుండి తమ భూభాగాలను వెనక్కి తీసుకోవాల్సి ఉండగా ఈజిప్టు ఒక్కటే ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకుని తన భూభాగం సినాయ్ ద్వీప కల్పాన్ని వెనక్కి పొందింది. ముబారక్ ఈ శాంతి ఒప్పందాన్ని కొనసాగించి అరబ్ దేశాల మధ్య ఇజ్రాయెల్ కు నమ్మకమైన మితృడుగా కొనసాగింది. ఈ సంవత్సరం జనవరిలో ముబారక్ ని ప్రజా ఉద్యమం గద్దె దింపడంతో ఇజ్రాయెల్, ఈజిప్టు సంబంధాలు కష్టాల్లో పడ్డాయి.
ముబారక్ అరెస్టు అనంతరం సైనిక ప్రభుత్వం గాజా, ఈజిప్టు దేశాల మధ్య ఉన్న సరిహద్దుని తెరిచింది. ఇది ఇజ్రాయెల్ కి పూర్తిగా వ్యతిరేకమైన చర్య. ప్రజాస్వామిక ఉద్యమం తలెత్తినప్పటినుండీ ఈజిప్టు ప్రజలు ఇజ్రాయెల్ తో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ సైనికులు ఈజిప్టు పోలీసులను చంపడంతో ఆ డిమాండ్ మళ్ళీ ప్రాణం పోసుకుంది. ఇజ్రాయెల్ సైనికులు పోలీసులను కాల్చి చంపిన రోజున అప్పటికఫ్పుడు ప్రజలు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ముందు గుమిగూడి ఆందోళన చేశారు. అలెగ్జాండ్రియా రాయబార కార్యాలయంపై ఎగురుతున్న ఇజ్రాయెల్ జెండాను తొలగించి, ఈజిప్టు, పాలస్తీనా జండాలను నిరసనకారులు ఎగురవేశారు.
ప్రజాగ్రహంతో ఈజిప్టు ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. పోలీసుల మరణానికి ఇజ్రాయెల్ ను రాజకీయంగా, చట్టపరంగా బాధ్యురాలిని చేస్తున్నట్లు ప్రకటించింది. ఘటనపై దర్యాప్తు జరిపడంతో పాటు క్షమాపణ చెప్పాలని ఈజిప్టు ప్రభుత్వం డిమాండ్ చేసింది. దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ అంగీకరిస్తూ పాలస్తీనా మిలిటెంట్లను వెంటాడుతూ వచ్చిన ఇజ్రాయెల్ సైనికులు అధికారులను చంపారని తెలిపింది. అనుమానిత మిలిటెంట్లను వెంటాడుతూ సరిహద్దు దాడిన ఇజ్రాయెల్ బలగాలు అనేకమందిని చంపాయని ఈజిప్టు అధికారులు తెలిపారు. చనిపోయీనవారిలో పోలీసులున్నారని తెలిపారు.
సినాయ్ ఎడారి ద్వీపంలో భద్రతా పరిస్ధితులు క్షీణించాయని ఇజ్రాయెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. పాలస్తీనా మిలిటెంట్లు సినాయ్ ద్వీపం ద్వారా తప్పించుకున్నారని తెలిపింది. అంటే ఇజ్రాయెల్ బలగాలు తెలిసీ ఈజిప్టు లోకి ప్రవేశించి పోలీసులను కాల్చి చంపాయన్నమాట! ముబారక్ పాలనా కాలం లాగా ఎప్పుడంటే అప్పుడు ఈజిప్టు సరిహద్దులోకి ప్రవేశించే వెసులుబాటు ఉందనుకొని ఇజ్రాయెల్ సైనికులు ఈజిప్టులోకి చొరబడినట్లుంది. సైనిక ప్రభుత్వం కూడా ఆ అంశాన్ని పెద్ద సీరియస్ గా తీసుకునేది కాదు. సైనిక ప్రభుత్వం వెనక అమెరికా మద్దతు ఉండడమే దానికి కారణం.
ఇజ్రాయెల్ ప్రకటనకు ఈజిప్టు ప్రభుత్వం సమాధానం చెప్పింది. సినాయ్ పై ఈజిప్టు ప్రభుత్వానికి అదుపు లేదనడాన్ని ఖండించింది. పోలీసుల మరణంపై దర్యాప్తు చేయాలనీ అప్పటివరకూ ఇజ్రాయెల్ నుంది తమ రాయబారిని ఉపసంహరిస్తున్నామని ప్రకటించింది. తొందరపడి ఈజిప్టుపై అనవసర వ్యాఖ్యలు చేసినందుకు ఇజ్రాయెల్ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. పోలీసులపై దాడి 1979 నాటి శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొంది.
ముబారక్ గద్దె దిగిన తర్వాత సినాయ్ ద్వీప కల్పం ఆల్-ఖైదా మిలిటెంట్లకు నిలయంగా మారిందని పశ్చిమ దేశాల పత్రికలు చెబుతున్నాయి.
