ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో తాలిబాన్ మిలిటెంట్లు మరోసారి దాడికి పాల్పడ్డారు. 1919 లో బ్రిటన్ నుండి ఆఫ్ఘనిస్ధాన్ స్వాతంత్రం సంపాదించుకున్న రోజునే బ్రిటిష్ కౌన్సిల్ పై దాడి జరగడం విశేషం. దాడికి తామే బాధ్యులుగా తాలిబాన్ ప్రకటించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్య ఉండే కాబూల్ లో అడుగడుగునా చెకింగ్ ఉన్నప్పటికీ మిలిటెంట్లు విజయవంతంగా దాడులకు పాల్పడడం కొనసాగుతున్నది. నాటో బలగాలకు ఇది అవమానకరంగా పరిణమించినప్పటికీ అవి తాలిబాన్ దాడులను అరికట్టడంలో విఫలమవుతున్నాయి.
పేరు చెప్పడానికి ఇష్టపడని కౌన్సిల్ ఉద్యోగి ఒకరు దాడిని ధృవపరిచినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. “బ్రిటిష్ కౌన్సిల్” అనేది విద్య, సంస్కృతి, కళల రంగాల అభివృద్ధికి తోడ్పడే సంస్ధగా చెప్పుకుంటుంది. ఇది దాదాపు 110 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. తాలిబాన్ దాడిలో నలుగురు ఆఫ్ఘన్ పోలీసు అధికారులు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, ఒక పౌరుడు ఉన్నారని జనరల్ మహమ్మద్ అయూబ్ సలాంగి తెలిపాడు. కాని దాడిలో పది మంది చనిపోయారని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపాడు. ఎనిమిది మంది ఆఫ్ఘన్ దేశస్ధులు కాగా ఇద్దరు విదేశీయులనీ వారు ఏ దేశం వారో తెలియదనీ అయన తెలిపాడు. నాటో సైనికులు చనిపోయినపుడు దాచి పెట్టడం, ఆఫ్ఘన్ సైనికులు, పౌరులు చనిపోతే పెద్ద ఎత్తున ప్రచారం చేయడం నాటో అధికారులకు మామూలే.
దాడిలో ఐదుగురు ఆత్మాహుతి బాంబులు పాల్గొన్నారని తెలుస్తోంది. ఒకరు పేలుడు పదార్ధాలతో నిండి ఉన్న ట్రక్కుని ప్రవేశ ద్వారం వద్ద పేల్చివేయగా, మరొకరు గేట్లవరకు వెళ్ళి తనను తాను పేల్చుకున్నాడని జనరల్ అయూబ్ ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. మరో ముగ్గురు కాంపౌండు లోనికి ప్రవేశించగా ఒకర్ని చంపివేశారనీ మరో ఇద్దరు కాల్పులు సాగించారని పత్రిక తెలిపింది. వారిద్దరిని కూడా చంపినప్పటికీ ఇంకా కాల్పులు వినపడుతున్నాయని తెలుస్తోంది. తాలిబాన్ విలేఖరులకు పంపిన ఎస్.ఎం.ఎస్ సందేశంలో విదేశీ అతిధి గృహంపై అనేక మంది ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారనీ, విదేశీయులకు తీవ్ర నష్టం జరిగిందనీ, పోరాటం కొనసాగుతున్నదనీ తెలిపారు.
గాయపడిన విదేశీయులను ఆసుపత్రికి తరలించడానికి అక్కడ ఉన్న విదేశీయులు ఒప్పుకోలేదనీ, వారి సంగతి తాము చూసుకోగలమని చెప్పారనీ ఆఫ్ఘన్ డాక్టర్లు తెలిపారు. కాబూల్ లో ఆఫ్ఘన్లను ఎవరినీ నమ్మలేని పరిస్ధితి ఏర్పడడంతో వారా విధంగా నిరాకరించారు. జూన్ నెలలో కాబూల్ లోని అత్యంత భద్రమైన స్ధావరంగా పేర్కొనే సైనిక స్ధావరంలో ఆఫ్ఘన్ విమాన పైలట్ ఒకరు విమానంలో ప్రయాణించడానికి సిద్ధమైన అత్యున్నద ఆర్మీ అధికారులు పది మందిని చంపాడు. ఈ విషయాన్ని అమెరికా ప్రకటించుకోలేక పోయింది. సైనిక ఉపసంహరణ ప్రారంభమైనప్పటికీ ఆఫ్ఘనిస్ధాన్ తన నియంత్రణలో ఉందని అమెరికా చెప్పుకోలేని పరిస్ధితిలో ఉంది.
