ఐ.ఎం.ఎఫ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్, ఒక హోటల్ మెయిడ్ ని రేప్ చేసినట్లు ఆరోఫణలు రావడంతో తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. గినియాకి చెందిన మహిళ “నఫిస్సాటౌ దియల్లో (32 సం.లు) న్యూయార్క్ మన్‌హట్టన్ లోని ఒక హోటల్ లో మెయిడ్ గా పనిచేస్తోంది. అప్పటి ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్ అదే హోటల్‌లోని లగ్జరీ సూట్ లో దిగాడు. ఆ సందర్భంగా కాన్ సూట్ ని శుభ్రపరచడానికి వెళ్ళిన మెయిడ్ దియల్లోని బాత్ రూం నుండి నగ్నంగా బైటికి వచ్చిన స్ట్రాస్ కాన్ రేప్ చేయడానికి ప్రయత్నించాడని దియల్లో ఆరోపించింది. ఆ మేరకు న్యూయార్క్ పోలీసులు కేసు దాఖలు చేసి విచారణకు కాన్‌ని అరెస్టు చేశారు.
అయితే న్యూయార్క్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ తర్వాత కేసు బలంగా లేదని చెప్పడం మొదలు పెట్టాడు. దియల్లో, గినియా నుండి అమెరికా రావడానికి వీలుగా అక్కడ తమ సైనికులు గ్యాంగ్ రేప్ జరిగినట్లు అబద్ధమాడిందనీ, హోటల్ లో రెప్ ప్రయత్నం జరిగినట్లు చెబుతున్నప్పటి తర్వాత తాను ఏం చేసింది అన్న విషయంలో దియల్లో మాట మారుస్తూ వచ్చిందనీ ప్రాసిక్యూటర్ ప్రకటించాడు. దియల్లో మాటలు నమ్మ శక్యం ఐనదీ కానిదీ అనుమానాలున్నాయని చెప్పి స్ట్రాస్ కాన్ కి బెయిల్ మంజూరు చేయడానికి అభ్యంతర పెట్టలేదు. స్ట్రాస్ కాన్ లాయర్లు కూడా జరిగింది రేప్ కాదనీ, పరస్పర అంగీకారంతొనే జరిగిందనీ ఒక ప్రచారాన్ని వ్యాప్తిలో పెట్టారు.
ఈ నేపధ్యంలో “నఫిస్సాటౌ దియల్లో” అనివార్యంగా పత్రికల ముందుకు రావలసి వచ్చింది. అప్పటివరకూ పత్రికలకు ఎక్కని దియల్లో నెల క్రితం మొదటిసారి పత్రికలకు ఎక్కింది. తన మీద దుష్ప్రచారం జరుగుతున్నందున బహిరంగంగా ముందుకు రాక తప్పలేదని చెప్పింది. అమెరికాకి వలస రావడానికి గినియాలో ఏమి జరిగిందీ చెప్పినదానికి మధ్య సంబంధం ఉందనీ, ఆ కధనంలో పొరబాట్లు ఉన్నందున తనపై రేప్ జరిగిందని తాను చేసిన ఆరోపణలు అబద్ధం ఎలా అవుతాయని ఆమే ప్రశ్నించింది. ఇదిలా సాగుతుండగానే మరో వారం రోజుల్లో స్ట్రాస్ కాన్ ట్రయల్స్ కి హాజరవ్వాల్సి ఉండగా, మెడికల్ రిపోర్టు వెల్లడయ్యింది. అందులో రేప్ జరిగినట్లు స్పష్టంగా ఉండడంతో పలు అనుమానాలు బయలుదేరాయి.
ఫ్రాన్సుకి చెందిన L’Express మ్యాగజైన్, మంగళవారం మెడికల్ రిపోర్టు లోని అంశాలను వెల్లడించింది. మే 14 తేదీన రేప్ ప్రయత్నం జరిగిందని అరోపించిన కొద్ది సేపటికి జరిగిన మెడికల్ పరీక్ష తాలూకు రిపోర్టు అది. “గాయాలకు కారణం: దాడి, రేప్” అని ఆ రిపోర్టులో ఉండడంతో కాన్ నేరంపై గట్టీ అనుమానాలు ముసురుకున్నాయి. నివేదికను బట్టి దాడి జరిగిందని రుజువవుతున్నదని దియల్లో లాయర్ తెలిపాడు. కానీ డిఫెన్సు లాయర్లు ఆయనతో విభేధిస్తున్నారు. మెడికల్ నివేదిక వెల్లడించడాన్ని వారు విమర్శించారు. నివేదిక వెల్లడి “పక్కదారి పట్టేంచేది, మోసంతో కూడుకున్నది” గా అభివర్ణించారు. ఘటన అనంతరం జరివే మెడికల్ పరీక్ష పూర్తిగా బాధితురాలి కధనంపై ఆధారపడి తయారు చేస్తారని వారు నమ్మబలుకుతున్నారు.
62 ఏళ్ళ స్ట్రాస్ కాన్ నగ్నంగా బాత్రూం నుండి బైటికి వచ్చి, సూట్ ని శుభ్రం చేయడానికి వచ్చిన దియల్లొని బలవంతం చేయబోవడంతో ఆమె తప్పించుకుని తమ చాంబర్ మెయిడ్ రూం కి వెళ్ళిందనీ, కాన్ ఆమె వెంటపడి ఆమెను రూం లోనికి లాక్కొచ్చి పట్టుకోరాని చోట పట్టుకుని ఓరల్ సెక్స్ కి ప్రయత్నించాడనీ దియల్లో ఆరోపించింది. వెనువెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు కూడా అక్కడి పరిస్ధుతులను బట్టి రేప్ జరిగిందని ప్రాధమిక నిర్ధారణకు వచ్చినట్లుగా మాట్లాడారు. దియల్లోకు అండగా మాట్లాడారు. సూట్ లో కాన్ మర్చిపోయి వెళ్ళిన సెల్ ఫోన్ ని చూసి, ఆయన హడావుడిగా విమానాశ్రయానికి వెళ్ళినట్లుందని వ్యాఖ్యానించారు. పోలీసులు విమానాశ్రయానికి ఫోన్ చేసి కాన్‌ని విమానం నుండి దింపి అరెస్టు చేశారు.
నివేదిక ప్రకారం, వైద్య పరీక్ష చేసే సమయానికి దియల్లో ఏడుస్తూ ఉంది. న్యూయార్క్ లోని సెయిట్ లూక్స్ రూజ్‌వెల్ట్ ఆసుపత్రి డాక్డర్లకు ఆమె ‘ఒక వ్యక్తి తనను బలవంతంగా పట్టుకోరాని చోట పట్టుకుని (ఆంగ్లంలో ఈ పదం నేరుగానే ఉంది. తెలుగులో రాయడం కుదర్లేదు) ఓరల్ సెక్స్ చేయవలసిందిగా బలవంతపెట్టాడని తెలిపింది. అందుకు శరీరంపై గాయపడిన గుర్తులున్నాయని నివేదిక తెలిపింది. వీరి మద్య జరిగిన ఘర్షణ వలన దియల్లో భుజానికి కూడా గాయమైనట్లుగా నివేదిక పేర్కొంది. “వైద్య నివేదికలు చాలా శక్తివంతమైనవి. ఫోరెన్సిక్ శాస్త్రం అబద్ధం ఆడదు” అని దియల్లో లాయర్ ధామ్సన్ రాయిటర్స్ వార్తా సంస్ధతో మాట్లాడుతూ అన్నాడు.
