తమ ఆరు షరతులను ఉపసంహరించుకున్న పోలీసులు, రాంలీలా మైదాన్లో దీక్ష


Annain in Tihar

తీహార్ జైలులో అన్నా హజారే

అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు ఢిల్లీ పోలీసులు మంగళవారం 22 షరతులు విధించారు. అందులో 16 షరతులను అంగీకరించిన అన్నా హజారే బృందం మిగిలిన 6 షరతులను తిరస్కరించింది. ఆ షరతులను ఇక్కడ చూడవచ్చు. షరతులను ఆమోదించనందున అన్నా బృందాన్ని అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టుకు హాజరు పరచడంతో తీహారు జైలులో వారం రోజుల రిమాండ్ కు కోర్టు తరలించింది. అక్కడి నుండి ఢిల్లీ పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయి.

తీహార్ జైలుకి వెళ్తారని తామూ భావించలేదని చెబుతూ జైలుకి వెళ్ళినవారిని విడుదల చేయండని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. ఎలా భావిస్తారు? కోర్టు బెయిల్ ఇస్తున్న సందర్భంగా వ్యక్తి గత పూచీకత్తు అడుగుతుంది. దానికి పోలీసులు కూడా షరతుల్ని జత కలిపారు. వీటికి ఆమోదించి ఆబగా బెయిల్ అందుకుంటారని ప్రభుత్వమూ, పోలీసులూ భావించారు. దానితొ అన్నా ఆట కట్టు అనుకున్నారు. కాని అన్నా బృందం పై ఎత్తు వేసి షరతులకు అంగీకరించం అన్నారు. ఐతే జైలుకి పొండి అని మెజిస్ట్రేట్ బల్ల గుద్దాడు. అన్నా హజారే బృందాన్ని జైలుకి పంపుతారని ప్రజలు కూడా భావించలేదు. అన్నా బృందం తీహార్ జైలుకి పంపించడంతో ఒక విధంగా ప్రజానీకం షాక్ తిన్నదని చెప్పవచ్చు. దాని ఫలితమే విస్మరించడానికి వీలు లేని స్ధాయిలో ప్రజలనుండి ప్రతిస్పందన వచ్చింది. జైలునుండి బైటికి రావడానికి షరతులు విధించిన అన్నా బృందం, ఆంగీకారయోగ్యం కాని ఆరు షరతులను పోలీసుల చేత విరమింపజేసారు. ఒక్క అడుగు మాత్రమే మిగిలి ఉంది. షరతులు, పరిష్కారాలు ఇలా ఉన్నాయి.

 1. దీక్ష మూడు రోజులే ఉండాలి – ఇప్పుడు పోలీసులు మొదట ఐదు రోజులకీ తర్వాత ఏడు రోజులకీ పెంచారు. ఏడురోజులయ్యాక మళ్ళీ పొడిగిస్తామని వారు చెబుతున్నారు. కాదు నెల రోజులివ్వాలని అన్నా హజారే డిమాండ్ చేస్తున్నాడు. పోలీసులు చర్చించుకుంటున్నారు. (పోలీసులంటే, కేంద్ర మంత్రులని అర్ధం చేసుకోవచ్చు.)
 2. జె.పి.పార్కు ఇస్తాం. గుడారం వెయ్యొద్దు. – గుడారం ఊసే లేదిప్పుడు. జె.పి.పార్కుకి బదులు రాం లీలా మైదాన్ లో దీక్ష చెయ్యండని పోలీసులు కోరగా అన్నా ఓకే అన్నారు. జె.పి.పార్కు కంటే రాం లీలా మైదానం ఇంకా పెద్దది. కనుక సమస్య ఉండదని పోలీసులూ భావిస్తున్నారు.
 3. మైక్రోఫోన్ వాడరాదు. – ఈ షరతు కూడా ఇప్పుడు శోదిలోకి కూడా లేకుండా పోయింది.
 4. 5000 మంది కంటే ఎక్కువ రాకూడదు. – ఇప్పుడు ఎంతమందైనా రావచ్చు.
 5. వాహనాల సంఖ్య 50 కి మించరాదు – రాం లీలా మైదాన్ కనుక ఎన్ని వచ్చినా ఇబ్బంది లేదు అని పోలీసులు అంటున్నారు.
 6. ప్రభుత్వ డాక్టర్ మాత్రమే పరీక్షలు జరుపుతాడు. పర్సనల్ డాక్టర్ ని అనుమతించం – అబ్బే అదేం లేదు. వ్యక్తిగతంగా ఎంతమందినైనా డాక్టర్లను తెచ్చుకోవచ్చు. కాకుంటే ప్రభుత్వ డాక్టర్ని కూడా పరీక్ష చెయ్యనిస్తే చాలు.

ఈ విధంగా ఢిల్లీ పోలీసుల/కేంద్ర ప్రభుత్వం షరతులు ప్రజా స్పందన దెబ్బకి వట్టిపోయాయి. పార్లమెంటు విషయానికి వస్తే, “చట్టాలు రూపొందించడంలో ఇది ఒక ప్రత్యేక (యునీక్) అనుభవం” అని ప్రణబ్ గారు ప్రజలు కొట్టిన దెబ్బనుండి కోలుకునే ప్రయత్నం చేశారు. చిదంబరం ఇంకొంత దూరం పోవలసి వచ్చింది. “మంచి చట్టాన్ని తయారు చేయడానికి,  బిల్లులని రూపొందించేటప్పుడు మంత్రులు ప్రజలను సంప్రదించుతాం. బిల్లు రూపకల్పనలో పౌర సమాజాన్ని సంప్రదించక పోవడం ఏమంత మంచి ఐడియా కాదు. రాజకీయ పార్టీలకి 144 సెక్షన్ ఉల్లంఘించడం కొత్త విషయమేమీ కాదు. (కనుక అన్నా ఉల్లంఘించినా ఫర్వాలేదని చిదంబరంగారి అర్ధం?)  శాంతికి భంగం అనుకుంటే పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకోవచ్చు. కేవలం జన్ లోక్‌పాల్ ని మాత్రమే పార్లమెంటులో ఆమోదించాలని అన్నా కోరడాన్ని అంగీకరించను. కానీ శక్తివంతమైన చట్టం కావాలనడాన్ని అంగీకరిస్తాను.”

మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ దృష్టిలో కోట్ల కోట్ల అవినీతి, అటువంటి అవినీతిపరులను శిక్షించాలని ప్రజలు కోరడం, వారి తరపున అన్నా హజారే నిరాహార దీక్షకు పూనుకోవడం ఇవేవీ పెద్ద విషయాలు కావు. దీక్షకు దిగడానికి రెండు రోజుల ముందు తమ డిమాండ్లపై నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శిస్తున్నందుకూ, పోలీసులను దింపి దీక్ష జరగకుండా అడ్డుకుంటున్నందుకూ నిరసిస్తూ అన్నా హజారే ప్రధానికి రాసిన లేఖ మాత్రమే పెద్ద విషయం. కోరలన్నింటినీ పీకివేసిన లోక్ పాల్ బిల్లు కాకుండా తాము తయారు చేసిన జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ముందుకి తేవాలని అన్నా హజారే కోరడం కపిల్ సిబాల్ తో పాటు ప్రణబ్ ముఖర్జీ తదితర పెద్దల దృష్టిలో పెద్ద నేరం.

ఎందు కని? హజారే లేఖ ప్రధానిని దూషించిందట! ప్రధానమంత్రిని అపహాస్యం చేసిందట! అలా అపహాస్యం చేసినందుకు పార్లమెంటులోని ప్రతిపక్ష పార్టీల నాయకురాలు సుష్మా స్వరాజ్, నిరసన తెలపనందుకు కపిల్ సిబాల్ ఆవిడను తప్పు పట్టాడు. పార్లమెంటు గౌరవాన్ని అపహాస్యం చేస్తుంటే మారుమాట్లాడనందుకు కపిల్ సిబాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్లమెంటు గౌరవానికి భంగం కలిగిన సందర్భంలో పాలక, ప్రతిపక్ష సభ్యులంతా ఐక్యంగా ఉండాలని ఆయన హితవు కూడా పలికాడు.

ప్రజలన్నా, వారి డిమాండ్లన్నా గౌరవం లేని వ్యక్తులు మాట్లాడే మాటలివి. వీళ్లందరినీ తెచ్చి పార్లమెంటులో కూర్చోబెట్టిన 120 కోట్ల మంది ప్రజల గౌరవం సంగతి సిబాల్ గారు పార్లమెంటులో అడుగుపెట్టడంతోనే మర్చిపోయారు. అందుకే, 2జి స్పెక్ట్రం వేలం వేయకపోవడం వలన లక్షా డెబ్భై వేల కోట్ల రూపాయలు ఖజానాకి నష్టం వచ్చిందని రాజ్యాంగ సంస్ధ సి.ఎ.జి చెప్పినా, దానికి స్పందించి సుప్రీం కోర్టు సి.బి.ఐ చేత విచారణ చేయిస్తున్నా, తోలు మందం సిబాల్ గారికి అవేవీ కనపడలేదు. రాజా స్ధానంలొ ఐ.టి శాఖను అందిపుచ్చుకున్న మరుసటి రోజే “2జి కేటాయింపుల వల్ల ఒక్క రూపాయి కూడా ఖజానాకి నష్టం రాలేదు” అని అడ్డంగా ప్రకటించిపారేశాడు.

వీళ్ళందరిదీ ఒకటే రంధి. లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు రూపొందించాలి గానీ అన్నా హజారే రూపొందిస్తాడా? అన్నది వీరి బిలియన్ డాలర్ల ప్రశ్న. మేము కదా ప్రజా ప్రతినిధులం. ఈ అన్నా హజారే ఎవరు పార్లమెంటుని శాసించడానికి? అన్న ప్రశ్నలు కూడా వీరిని పట్టి వేధిస్తున్నాయి. ఐతే ప్రజాప్రతినిధులు ఎన్నిక కాగానే తమను ప్రజలు ఎన్నుకున్నారన్న సంగతిని మర్చిపోవడమే, కపిల్ సిబాల్ తో పాటు చిదంబరం, మన్మోహన్ తదితర మంత్రి పుంగవులు చేసిన తప్పు పని. ఆ సంగతి వీరికి తెలిసినా తెలియనట్లె నటిస్తారు.

ప్రజల తరపున తాను పార్లమెంటులో కూర్చున్నాని గుర్తుంటే, కపిల్ సిబాల్ పార్లమెంటుకి అవమానం జరిగిందని గింజుకోవడం జరగదు. ఎందుకంటే అన్నా హజారే బృందం చేస్తున్న డిమాండు ప్రజలనుండి వచ్చిన డిమాండ్. ఇంకా చెప్పాలంటే అవినీతిలో కూరుకుపోయిన కపిల్ సిబాల్ లాంటి నాయకులు, అధికారుల అడ్డగోలు అవినీతికి ప్రతిస్పందనగా మాత్రమే ఆ డిమాండ్లు జనించాయి. అందుకే, ప్రజలనుండి వచ్చిన డిమాండ్లు కనకనే, జైల్లో పెట్టిన గంటల్లోనే పౌర సమాజ కార్యకర్తలని విడుదల చేయవలసిన అగత్యం, కపిల్ సిబాల్ భాగంగా ఉన్న ప్రభుత్వానికి ఏర్పడింది. అన్నా బృందాన్ని జైలులో పెట్టినందుకు, కేవలం జైలులో పెట్టినందుకు… పార్లమెంటు తన కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకుని ఇంకా (7:42 PM) ఆ అరెస్టులపై చర్చిస్తూ కూచుంది.

ఇంతకీ వీరంతా గింజుకుంటున్నట్లు అన్నా హజారే పార్లమెంటు కంటే తాను ఎక్కువని భావిస్తున్నాడా? తాను రూపొందించిన జన్ లోక్ పాల్ బిల్లుని మాత్రమే పార్లమెంటు ఆమోదించి తీరాలని డిమాండ్ చేస్తున్నాడా? అన్నా హజారే చేస్తూ వచ్చిన ప్రకటనలు గమనించితే అందులో నిజం లేదని అర్ధం అవుతుంది. పార్లమెంటుపైన తనకు పూర్తి గౌరవం ఉందని అన్నా హజారే మంగళవారమే ప్రకటించాడు. కాకుంటే అందులో కూర్చున్న పెద్దలపైనే నాకు నమ్మకం లేదన్నాడు. అంతే కాదు. అన్నా హజారే కేవలం తన బిల్లు మాత్రమే ఆమోదించాలని కూడా కోరలేదు. (ఆ మాట కొస్టే జన్ లోక్ పాల్ బిల్లు రూపకర్త అన్నా కాదు. లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాష్ నారాయణ దాన్ని రూపొందించారు.) తనకు పార్లమెంటుపైన పూర్తి గౌరవం ఉందని చెబుతూ కాకుంటే పార్లమెంటు ముందుకు శక్తివంతమైన బిల్లుని తెండి. ఆ తర్వాత పార్లమెంటు చేసిన సవరణలతో ఆమోదించబడిన చట్టాన్ని తాను పూర్తిగా గౌరవిస్తాని ప్రకటించాడు. అసలు పార్లమెంటు ముందుకే బలహీనమైన బిల్లుని తెస్తే ఇక పార్లమెంటు చేసేదేం ఉంటుంది, ఆ బలహీన బిల్లునే ఆమోదిస్తుంది, అని అన్నా హజారే ఎత్తి చూపించాడు. జన్ లోక్ పాల్ కూడా పార్లమెంటు అధికారాలకు లోబడే ఆమోదించాలని అన్నా బృందం చెబుతూ వచ్చింది. జన్ లోక్ పాల్ లాంటి శక్తివంతమైన బిల్లుని పార్లమెంటు ముందుకి తెస్తే, అందులో అభ్యంతర అంశాలను పార్లమెంటు చర్చించి తొలగించవచ్చు, లేదా మార్పులు చేర్పులు కూర్పులు చేయవచ్చు. లేదా అదనంగా చేర్చవచ్చు. ఆ తర్వాత పార్లమెంటు ఆమోదించిన బిల్లుని దేశమంతా గౌరవిస్తుంది, అని మాత్రమే అన్నా హజారే మొదటి నుండీ చెబుతున్నాడు.

చిత్రం ఏంటంటే అన్నా హజారే చెబుతున్నది మంత్రులకు అర్ధం కాలేదో ఏమో గానీ ఈ అంశాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఎంత సేపటికీ హజారే పార్లమెంటుకంటే గొప్పా అంటారు గాని, నేను గొప్ప కాదు మొర్రో అని ఆయన వేస్తున్న కేకలని మాత్రం విననట్లు నటిస్తారు. నిజానికి మంత్రులకి వినబడకా కాదు, అర్ధం కాక కాదు. వినబడింది కనకనే, అర్ధం అయింది కనుకనే వారా నటనా విన్యాసాలని గత కొద్ది రోజులుగా అద్భుతంగా పోషిస్తున్నారు. అర్ధం అయినట్లు కనిపిస్తే అనివార్యంగా అందుకు అంగీకరించవలసి ఉంటుంది. ఎందుకంటె ఆ వాదనలో తప్పేమీ లేదు గనక. ఏ పేరూ పెట్టి దాన్ని తిరస్కరించలేరు గనక! దాని బదులు అన్నా హజారే చెప్పని మాటలను ఆయనకి అంటగట్టి, “ఆ! ఇలా అంటాడా?! అలా కూస్తాడా?! పార్లమెంటా, మజాకా? ప్రజల దేవాలయం ఇది. దేవాలయాన్నే అవమానిస్తారా?” అంటూ చెత్త డైలాగుల్ని ప్రధాని సహా ప్రణబ్, కపిల్ సిబాల్, చిదంబరం లాంటివారంతా పేలుస్తూ వచ్చారు.

ఎవరైనా గమనించినట్లయితే బి.జి.పి పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ కూడా తాము అన్నా హజారే నిరసన హక్కుని గౌరవిస్తాం గానీ ఆయన బిల్లుని అంగీకరించలేము అనీ అవినీతికి వ్యతిరేకంగా శక్తివంతమైన బిల్లుని చట్టంగా కావాలని ఆమోదిస్తాం కాని జన్ లోక్ పాల్ మాత్రమే ఆమోదించబడాలంటే మేం అంగీకరించం అనీ ప్రకటించాడు. అందుకే కాబోలు, కమ్యూనిస్టు విప్లవకారులుగా ఉన్న పార్టీలు “ఈ పార్టీలన్నీ ఒక తాను లోని గుడ్డలే” అని వ్యాఖ్యానిస్తున్నది! బి.జె.పికి కావలసింది అన్నా హజారే, ఆయన విలువలు, అవినీతి సంహారం కాదు. హజారే వెనక సమకూరుతున్న జనం, వారి ఓట్లు దానికి కావాలి. అవినీతికి పార్టీలపరంగా బాధ్యులను చేయవలసి వస్తే, ఈ దేశంలోని పార్లమెంటరీ పార్టీలన్నీ ఒకే వరుసలో నిలబడవలసిందే. ఎవరు ముందు నిలబడాలి, ఎవరు వెనక నిలబడాలి అన్నదే నిర్ణయించాలి తప్ప వారంతా అవినీతి క్యూలో నిలబడవలసిన వారే. అందుకే బి.జె.పి కపటోపాయాలకి ప్రజలు లొంగకుండా ఉండాల్సి ఉంది. ఆ ప్రజల్లో అన్నా బృందం కూడా ఉన్నారన్నది వేరే చెప్పనవసరం లేదు.

One thought on “తమ ఆరు షరతులను ఉపసంహరించుకున్న పోలీసులు, రాంలీలా మైదాన్లో దీక్ష

 1. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మీ వ్యాసం చక్కటి విశ్లేషణ. పార్టీలను, సిద్ధాంతాలను పక్కనబెట్టి ఒక్కవిషయంలో మాత్రం మనందరం అన్నా హజారేకి అభివందనలు తెలుపాల్సి ఉంటుంది. పార్లమెంటు గౌరవానికి భంగం అని చించుకుంటున్న అసలు దొంగలను పార్లమెంటులో నిన్నా నేడు చర్చల సాక్షిగా ప్రపంచం ముందు నిలబెట్టడంలో అన్నా గొప్ప విజయం సాధించారు. స్వాహాతంత్ర భారత చరిత్రలో పాలక వర్గ రాజకీయాలను ఇంత నగ్నంగా ఎండగట్టిన చరిత్ర అన్నాకే సొంతమయ్యింది. కేంద్రప్రభుత్వం ఇంత ఘోరమైన భంగపాటుకు గురయిన తర్వాత ఒక్కటే సందేహం. కేంద్రానికి అసలు ఏ విషయంలో అయినా ఒక వ్యూహం అంటూ ఏదైనా ఏడ్చిందా అని.

  ‘బతకడానికి అర్హతలేని పందులు’ అంటూ మహాకవి శ్రీశ్రీ ముప్పై ఆయిదు సంవత్సరాల క్రింతం భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరితీత సందర్భంగా రాసిన ఒక గొప్ప కవితలో రాశారు. పార్లమెంటు ఒక పందులదొడ్డి అని కూడా నక్సలైట్లు ఎప్పుడో తేల్చిపడేశారు. ‘దొంగఓట్ల దొంగనోట్ల పాలనొక్క పాలనా? దొంగ లం… కొడుకులేలు పాలనొక్క పాలనా..! అంటూ చెరబండరాజు నలభై ఏళ్లకు ముందే పార్లమెంట్ పందికొక్కులను ఉతికిపారేశాడు. ఓట్లకోసం.. సీట్లకోసం రాజకీయ ఆచరణనే ఫణంగా పెట్టిన, ‘కమ్యూనిస్టు’లమని చెప్పుకుంటున్న పార్టీలతో సహా అన్ని కుడి ఎడమల పార్టీలు కూడా పార్లమెంటరీ అవినీతి కూపంలో కూరుకుపోయాయి.

  “అవినీతికి పార్టీలపరంగా బాధ్యులను చేయవలసి వస్తే, ఈ దేశంలోని పార్లమెంటరీ పార్టీలన్నీ ఒకే వరుసలో నిలబడవలసిందే. ఎవరు ముందు నిలబడాలి, ఎవరు వెనక నిలబడాలి అన్నదే నిర్ణయించాలి తప్ప వారంతా అవినీతి క్యూలో నిలబడవలసిన వారే. అందుకే బి.జె.పి కపటోపాయాలకి ప్రజలు లొంగకుండా ఉండాల్సి ఉంది. ఆ ప్రజల్లో అన్నా బృందం కూడా ఉన్నారన్నది వేరే చెప్పనవసరం లేదు.”

  అక్షరసత్యంలాంటి ముగింపు.. అవనీతిపై ఉవ్వెత్తున ఎగిసిపడిన ఈ పొంగు ఎంతకాలం చల్లారకుండా ఉంటుంది అనేది రేపటినుంచి తేలిపోతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s