
అన్నా హజారేని అరెస్టు చేసి తీసుకెళ్తున్న కారుని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న మద్దతుదారులు, అడ్డు తొలగిస్తున్న పోలీసులు
భారత దేశ ప్రజల మానవ హక్కులను కాపాడవలసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఓ విషాధకరమైన జోక్ పేల్చింది. శక్తివంతమైన లోక్ పాల్ బిల్లు కోసం శాంతియుతంగా అమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న అన్నా హజారేతో పాటు ఆయన మద్దతుదారులను అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా మానవహక్కుల కార్యకర్త ఒకరు పిటిషన్ దాఖలు చేయడంతో దానికి స్పందించింది. అన్నా హజారే, అతని మద్దతుదారుల అరెస్టుపై రెండు వారాల్లొగా నివేదిక సమర్పించాలని హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కమిషన్ కోరింది.
అన్నా హజారేతో పాటు ఇతర సామాజిక హక్కుల కార్యకర్తలు దాదాపు నెల రోజులకు పైగా లోక్ పాల్ బిల్లు కోసం ఆందోళన చేస్తున్నారు. నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని హజారే కొన్ని రోజుల క్రితమే ప్రకటించాడు. ఆయనకి ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా, ఇచ్చినా అనేక షరతులతో ఇస్తున్నట్లు నటిస్తూ, ఆయన దీక్షను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వమూ, పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చివరికి దిక్ష మొదలు కాక ముందే ఉదయాన్నే వచ్చి అరెస్టు చేసి పట్టుకెళ్ళారు.
పోలీసులకి అన్నా హజారేను గానీ, ఆయనతోటి సామాజిక కార్యకర్తలను గానీ, వారి మద్దతుగా వచ్చిన 1200 మందికి పైగా కార్యకర్తలను గానీ అరెస్టు చేసి జైలులో పెట్టడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం తీసుకున్నారు. కోర్టుకి హాజరుపరిచాక వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడం నిమిషాల్లో జరిగిపోయింది. అవినీతిపై పోరాడుతున్న ప్రముఖులంతా ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఈ సమయంలో అరెస్టుకి దారితీసిన కారణాలను వివరించడానికి హోం మంత్రిత్వ శాఖకు రెండు వారాలు అవసరమా? ఏ ప్రమాణాలతో ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇంత గడువు ఇచ్చింది?
పిటిషనర్ అనిరుధసూధన్ చక్రవర్తి రెండు ప్రధాన ఆరోపణలు చేశాడు. అన్నా హజారే బృందం అరెస్టులో రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడ్డాయని ఒక ఆరోపణా, అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సులలో సంతకందారుగా ఉండడం ద్వారా ఇండియా అంగీకరించిన సూత్రాలను ఉల్లంఘించారని మరొక ఆరోపణ చేశారు. రాజ్యాంగంలో ఏయే సెక్షన్లను ఉల్లంఘించిందీ పిటిషనర్ స్వయంగా తెలిపాడు. అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సుల సంతకందారుగా ఏ సూత్రాలని ఉల్లంఘించిందీ తెలిపాడు.
మరో పక్క పోలీసులు కూడా పత్రికలవారికి ప్రతి సారీ ప్రతి విషయాన్ని పూస గుచ్చినట్లు వివరిస్తున్నారు. తాము ఏయే సెక్షన్ల అనుసారంగా ఏ పరిస్ధితి విధించిందీ, వాటిని అన్నా బృందం ఎలా ఉల్లంఘించిందీ, ఏయే సెక్షన్లను ఉల్లంఘించడం వలన తాము అరెస్టులు సాగించిందీ అన్నీ వివరంగా చెప్పారు. ఈ అంశాలను రాతపూర్వకంగా ఇవ్వడమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేయవలసి ఉంది. దానికి రెండు వారాల సమయం కావాలా? ఆలస్యమైన న్యాయం నిరాకరించబడ్డ న్యాయమే నని కదా సూత్రం? నోటి పూర్వకంగా ఇరవై నిముషాల్లో చెప్పిందాన్ని రాత పూర్వకంగా ఇవ్వడానికి రెండు వారాలు కావాలా?
ప్రభుత్వ రంగ సంస్ధలు, బ్యూరోక్రసీల రెడ్ టేపిజం నుండి బైటికి రావడానికి ప్రభుత్వ రంగాన్నే అమ్మేస్తున్న పాలకులు, న్యాయ వ్యవస్ధ రెడ్ టేపిజం తొలగించడానికి ఏ ఒక్క చర్యా తీసుకోలేదు, తీసుకోరు కూడా. పాలకవర్గాలతో పాటు ఆధిపత్య వర్గాలపై మోపబడిన కేసుల్ని ఏళ్ళ తరబడి సాగతీసి అందరూ మర్చిపోయాక గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేయడానికి ఈ రెడ్ టేపిజమే వారికి దిక్కు మరి. పాలిత వర్గాలపై కేసులను సాగతీసి వారి ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టి విజయం సాధించడానికి తోడ్పడేదీ ఈ రెడ్ టేపిజమే!