అన్నా హజారే తిరస్కరించిన ఆరు ఫాసిస్టు షరతులు ఇవే


Anna supporters arrive to ourt arrest in Delhi

ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియం వద్దకు స్వచ్ఛందంగా అరెస్టు కావడానికి వచ్చిన అన్నా హజారే మద్దతుదార్లు

సమర్ధవంతమైన లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ముందుకు తేవాలనీ, ప్రధాని, న్యాయ వ్యవస్ధలను కూదా లోక్ పాల్ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూ అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు తలపెట్టాడు. అయితే అన్నాహజారే నిరాహార దీక్షకు కూర్చోకముందే ఆగస్టు 16 తేదీన పొద్దున్నే  పోలీసులు ఆయనని అరెస్టు చేసి పట్టుకెళ్ళారు. వ్యక్తిగత ష్యూరిటి ఇవ్వడానికి హజారే నిరాకరించడంతో హజారేకి ఆరు రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు వార్తలు తెలుపుతున్నాయి.

తాము విధించిన షరతులను హజారే అంగీకరించక పోవడం వలనా, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ దీక్షకు కూర్చుంటానని ప్రకటించినందువలనా హజారేని అరెస్టు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. పోలీసులు విధించిన 22 షరతుల్లో 16 షరతులు అంగీకరిస్తున్నామనీ, మిగిలిన ఆరు షరతులు తమ ప్రాధమిక హక్కులను ఉల్లంఘిస్తున్నందున అంగీకరించడం లేదనీ హజారే తెలిపారు. ఆ ఆరు షరతులు ఇవే.

 1. హజారే తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడు రోజులకి మించి కొనసాగరాదు.
 2. బహదూర్‌షా మార్గ్ లోని జయప్రకాష్ నారాయణ్ పార్క్ లో తలపెట్టిన ఈ దీక్ష కోసం గుడారం వేయరాదు.
 3. దీక్ష సాగినంతకాలం మైక్రోఫోన్ వాడరాదు.
 4. పార్క్ లో దీక్ష వద్ద 5,000 మంది కంటే ఎక్కువ హాజరు కారాదు.
 5. దీక్ష వద్దకు వచ్చే వాహనాల సంఖ్య 50 కి మించరాదు.
 6. వ్యక్తిగత డాక్టర్ ను అనుమతించం. ప్రభుత్వ డాక్టర్‌ని మాత్రమే అనుమతిస్తాం. బలవంతంగా ఆహారం ఇవ్వాలా లేక ఆసుపత్రికి తీసుకెళ్ళాలా అన్న సంగతిని ప్రభుత్వ డాక్టరే నిర్ణయిస్తాడు తప్ప వ్యక్తిగత డాక్టరు కాదు.

ఈ షరతులు ఎంత అవమానకరంగా ఉన్నాయో చూస్తే తెలుస్తుంది. ఇటువంటి షరతులు పెట్టి దీక్ష చేయమనే బదులు, అసలు దీక్షే చేయొద్దు, లేకుంటే తన్ని తగలేస్తాం అని ప్రకటించిఉంటే సరిపోయి ఉండేది. ప్రజా సంఘాల వారు రాస్తారోకో చేస్తుంటే పోలీసులొచ్చి మా అనుమతి తీసుకోకుండా రాస్తారోకో ఎలా చేస్తారు? అని దాష్టీకం చేస్తుంటారు. ఎవరైనా అనుమతి కోసం వెళ్తే అరగంటకు మించి రాస్తారోకో చెయ్యకూడదని షరతు విధిస్తారు. బంద్ చేస్తున్నామన్నా ఇవే షరతులు దాదాపుగా. ఢిల్లీ పోలీసులు విధించిన షరతులు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. షరతుల్లో కొన్ని ఒకదానికొకటి వైరుధ్య పూరితంగా ఉండడం మరీ విడ్డూరం.

మూడురోజుల పాటు జరిగే దీక్ష గుడారం లేకుండా సాధ్యమవుతుందా? ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ నిరాహార దీక్ష చేయాలని పోలీసుల ఉద్దేశ్యమా? దీక్ష చేస్తున్నవారిని సందర్శించడానికి వచ్చే ప్రజానికం కూర్చోవడానికి కూడా గుడారం కావాలి కదా! మూడు రోజులు ఎక్కడ కూర్చోవాలని పోలీసుల ఉద్దేశ్యం? పోలీసులు చెప్పినట్లు 5,000 మందిని అనుమతించినా, వారితో మాట్లాడడానికి, అందరికీ వినిపించే విధంగా బహిరంగ స్ధలంలో మాట్లాడడానికి మైక్రోఫోన్ కావాలి. 5,000 మందిని అనుమతించి 50 కి మించి వాహనాలు రాకూడదనడం మరీ విడ్డూరం. ఐదు వేలమంది యాభై వాహనాల్లో రావాలంటే వాహనానికి వందమంది రావాలి. అలాంటి వాహనాలని ఢిల్లీ పోలీసులు సరఫరా చేస్తే తప్ప అలా రావడం కుదరని పని. వ్యక్తిగత డాక్టర్ తో పాటు ప్రభుత్వ డాక్టర్ కూడా పరీక్షలు జరపడం సబబుగా ఉంటుంది. అస్సలు వ్యక్తిగత డాక్టరే వద్దనడం పోలీసుల నిరంకుశత్వానికి ప్రతీక.

కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ షరతులు విధించబడ్డాయి. పోలీసులు అనుమతించిన మూడు రోజులు కూడా నిరహరదీక్ష చేయడం వారికి ఇష్టం లేదు. ఎలాగైనా అన్నా హజారే దీక్షను అడ్డగించాలి. నిరాహార దీక్ష చేసే హక్కుని కాల రాయాలి. అత్మహత్య చేసుకోవడాన్ని చట్టం అనుమతించదని చట్టాల పైన గొప్ప గౌరవం ఉన్నట్లు మంత్రులు మాట్లాడుతున్నారు గానీ, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు హజారే ఎప్పుడు చెప్పాడు? నిరాహార దీక్ష చేయడం ఆత్మహత్యతో సమానమని మహాత్మా గాంధీ (గాంధీ గారంటే ఇంకా బోల్డంతమంది గాంధీలు ఉన్నారు గనుక ఆ పదాన్ని వాడలేక మహాత్మ గాంధీ అనవలసి వచ్చింది) గారు కూడా ఎక్కడా చెప్పినట్లు లేదు. పైగా దానిని ఒక బ్రహ్మాస్త్రంగా తెల్లదొరలపై ప్రయోగించాడని కాంగ్రెస్ వారే చెబుతారు. కనుక సత్యాగ్రహంలో భాగమైన నిరాహార దీక్షను ఆత్మహత్యగా అభివర్ణించడం గాంధీగారు కనిపెట్టిన సత్యాగ్రహాన్నే అవమానించడం.

అన్నా హజారే ఆచరణలో అందుబాటులో ఉన్న పరిస్ధితి కంటే ఎక్కువగా ఉద్వేగపూరితుడవుతున్నట్లు కనిపిస్తోంది. లేకుంటే రెండవ స్వతంత్ర పోరాటమని పిలుపివ్వడం దేని కిందకి వస్తుంది? ‘నన్ను కూడా అరెస్టు చేశారు. ప్రజలంతా అరెస్టు అయ్యి జైల్ భరో నిర్వహించండి. నా అరెస్టుతో రెండో స్వతంత్ర పోరాటం ప్రారంభం అయినట్లే’ అని ప్రకటించడం పిలుపివ్వడం దేని కిందకి వస్తుంది? మొదటి స్వతంత్ర పోరాటాన్ని బ్రిటిష్ వారిపైన చేశాం. మన దేశాన్ని ఆక్రమించుకుని ఉన్నారు కనక స్వతంత్ర పోరాటం అన్నాం. హజారే చెబుతున్న రెండవ స్వతంత్ర పోరాటానికి కారకులెవ్వరు? ఆ పోరాటం ఎవరి మీద? ఎవరి మీదో చెప్పకుండా రెండో స్వతంత్ర పోరాటం అంటే సరిపోతుందా?

స్వతంత్ర పోరాటం అంటే దానికొక పద్ధతి ఉంటుంది. కేవలం అన్నా హజారే అరెస్టుపైనే అది ఆధారపడు ఉండదు. అన్నా హజారే, ఆయన చుట్టూ ఉన్న మరో నలుగురు పౌర సమాజ కార్యకర్తలు… వీరేనా రెండో స్వతంత్ర పోరాట రూపకర్తలు? స్వతంత్ర పోరాటం అనివార్యంగా రాజకీయ పోరాటమే అవుతుంది. ఏ రాజకీయాలకి పౌరసమాజ కార్యకర్తలు కట్టుబడి ఉన్నారు? తమ లోక్ పాల్ బిల్లు ఆమోదిస్తే రెండో స్వతంత్రం వచ్చినట్లేనా? స్వతంత్ర పోరాటంలో ప్రజల పాత్ర ఎంతవరకు ఉన్నదో సమీక్షించుకున్నారా?

ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. లేడికి లేచిందే పరుగన్నట్లుగా ‘రెండో స్వతంత్ర పోరాటం’, ‘జైల్ భరో’ లాంటి నినాదాలను హజారే ఇచ్చేటపుడు కాస్త వెనకా ముందు చూసుకోవలసి ఉంది. ఉద్యమానికి తగిన డిమాండ్లు, డిమాండ్లకు తగిన పిలుపులు, పిలుపులకి తగిన ప్రజా మద్దతు వాస్తవంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించుకోవాలి. లేకుంటే “అవినీతిపై సమరం” అన్న గొప్ప కార్యక్రమం మరొకరికి వెతుకుదామన్నా దొరకకుండా పోతుంది.

6 thoughts on “అన్నా హజారే తిరస్కరించిన ఆరు ఫాసిస్టు షరతులు ఇవే

 1. “స్వతంత్ర పోరాటం అనివార్యంగా రాజకీయ పోరాటమే అవుతుంది. ఏ రాజకీయాలకి పౌరసమాజ కార్యకర్తలు కట్టుబడి ఉన్నారు? హజారే చెబుతున్న రెండవ స్వతంత్ర పోరాటానికి కారకులెవ్వరు? ఆ పోరాటం ఎవరి మీద? ఎవరి మీదో చెప్పకుండా రెండో స్వతంత్ర పోరాటం అంటే సరిపోతుందా?”
  మనకాలపు అచ్చమైన గాంధేయవాది ఆందోళనా హక్కును గౌరవిస్తూనే భావోద్వేగంలోంచి వస్తున్న ఆయన ప్రకటనలోని లోటుపాట్లను సమతూకంతో చెప్పారు.

  చరిత్రలో ఇంతవరకు ఏ ప్రజాస్వామిక ప్రభుత్వమూ – అంటే బూర్జువా వర్గ పాలనే అని చెప్పపనిలేదు- అవినీతిని నిర్మూలించిందీ లేదు. అవినీతి వ్యతిరేక పోరాటాలు అంతిమ ఫలితాలను ఇచ్చిందీ లేదు. ఆర్థిక పునాది మారకుండా, రాజకీయ సంస్కరణలను పరిష్కార మార్గంగా చూపి ప్రధానిని కూడా లోక్ పాల్ బిల్లులో చేరిస్తే చాలు అని వాదిస్తే జరిగేది ఎండమావిలో నీళ్ళు వెదకడమే మరి.

  ”పోరాటం ఎవరిమీదో చెప్పకుండా రెండో స్వతంత్ర పోరాటం అంటే సరిపోతుందా..” అన్న మీ వాఖ్య చాలా అర్థవంతమైంది. పాలకుల అవినీతికి వ్యతిరేకంగా కొన్ని అరబ్ దేశాల్లో జరుగుతున్న పోరాటాల ఫలితాలు ఎలా ముగుస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పౌరసమాజ కార్యకర్తలు మన దేశంలో చేసే పోరాటం కూడా ఒకరి స్థానంలో మరొకరు రావడానికి, కడుపు మండినప్పుడు ప్రజలు నెగటివ్ ఓటుతో కొట్టడానికి మాత్రమే పనికొస్తుంది.

  మన ఘనమైన దేశంలో మేధావుల, నిచ్చెన మెట్లమీద పై స్థానాల్లో ఉన్న విద్యావంతుల సామూహిక ఆగ్రహం అనేది, అవినీతి అనే ప్రత్యక్ష వాస్తవం మీదికి తప్ప మరే ఇతర వాస్తవాలమీదికి, సమస్యల మీదికి ప్రసరిస్తున్నట్లు లేదు. ఎలెక్ట్రానిక్ మీడియా పండుగ చేసుకోవడానికి మాత్రమే ఇలాంటి పోరాటాలు అంతిమంగా ఉపయోగపడతాయి. అంతకుమించి ఈ దేశానికి ఏమీ కాదు. గడచిన మూడు నాలుగు దశాబ్దాల్లో వ్యవస్థ చట్రం అలాగే ఉండి పాలకులు మాత్రమే మారిన దేశాలలో పరిస్థితి ఎంత దరిద్రంగా కొనసాగుతుందో ఎవరికి తెలీదు మరి.

  లోక్‌పాల్ పరిధిలోకి ప్రధానమంత్రిని, మంత్రులను, అధికారులను తీసుకువచ్చేసినంత మాత్రాన విప్లవం జరిగిపోతుందనుకోవడమే పెద్ద అమాయకత్వం. అన్నాహజారే, ఆయన బృందం ఈ దేశ పరాన్నభుక్కులను మరీ అంత తక్కువ అంచనా వేస్తున్నారా అనిపిస్తోంది నాకయితే..

  ఆయన దీక్ష ధర్మబద్దమైనది. ఆయన ఆగ్రహానికి నిజాయితీ ఉంది. ఆయన ఆందోళనలో స్వచ్ఛత ఉంది.

  కానీ…………….

  ప్రజాస్వామ్యమనే ప్రచ్ఛన్న ముసుగును తెలుపు చేస్తాననే ఆ అమాయకత్వం మాత్రం హేతుబద్ధం కాదనే నా నమ్మకం.

  మహాత్మా గాంధీ, నెహ్రూలు అహింసా పోరాటం ద్వారా ఈ దేశానికి స్వతంత్రం సాధించేశారని అమాయకంగా నమ్మేయడంతో సమానమిది.

 2. అవును, రాజ శేఖర గారు
  ఘోరం ఏంటంటే, కేవలం అవినీతిపైన ఎక్కుపెట్టబడిన (సోకాల్డ్ అహింసాయుత) పోరాటాన్ని కూడా ప్రభుత్వం భరించలేకపోతోంది. ఓ వైపు నిరసనలను ఆహ్వానిస్తామని చెబుతూ అవి అధికారానికి లోబడి ఉండాలి అని చిదంబరం మంగళవారం అన్నా అరెస్టు తర్వాత జరిగిన విలేఖరుల సమావేశంలో అన్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రభుత్వాధికారాలకి లోబడి ఉండాలట! అవినీతి మంత్రులకు జరిగే పోరాటం ఆ అవినీతి మంత్రి అధికారాలకు లోబడి ఉండడం ఎలా సాధ్యం? నిరసన ఎలా చేయాలన్నదీ నిరసనకారులకి సంబంధించిన విషయం. అది కూడా ప్రభుత్వాలూ, పోలీసులూ నిర్ణయిస్తే ఇక నిరసన ప్రయోజన ఏమిటి? అటువంటి నిరసన, నిరసన అవుతుందా?

  నిరసనల తీరు తెన్నులను రూపొందించుకోవడంలో ప్రజా సంఘాలకు గల హక్కులలోనికి కూడా పాలక వర్గాలు మెల్ల మెల్లగా జొరబడుతున్నాయి. తద్వారా నిరసనలను తాము అణచివేయలేని, తమ చేయి దాటిపోని పరిస్ధితికి రాకుండా జాగ్రత్తపడాలని చూస్తున్నాయి. కానీ నిరసనలు లేదా ఆందోలనలు ప్రభుత్వాలు, పోలీసుల చేయి దాటిపోతేనే పరిష్కారానికి అంగీకరించడమో, ఒక ఒప్పందానికి రావడమో చేస్తారు. అంటే పరోక్షంగా ప్రభుత్వాలు ఏ సమస్యనీ పరిష్కరించే భారం తమపై పడకుండా ఉండాలని కోరుకుంటున్నాయి.

 3. కేవలం అవినీతిని వ్యతిరేకించిన అన్నా హజారేని చెరసాలలో బంధిస్తే అవినీతితో పాటు దోపిడీ ఆర్థిక విధానాలని కూడా వ్యతిరేకించే మావోయిస్టులని కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపుతారు. వీళ్ళకీ, ఈదీ అమీన్ లాంటి నియంతలకీ ఒకటే తేడా ఉంది. ఈదీ అమీన్ తన వ్యతిరేకులని చంపి శవాలని మాయం చెయ్యించేవాడు. వీళ్ళు శవాలని మాయం చెయ్యించరు. ఇదొక్కటే మౌలికమైన తేడా.

 4. మావోయిస్టుల విషయంలో మీరు చెప్పింది నిజం. ఆ అలవాటు దొంగతనం కేసుల్లోకి కూడా వ్యాపించింది.

  పేరు మోసిన దొంగ అన్న పేరుతో తమ పేర్లెక్కడ బైటపెడతారో అని ఇద్దరు ముగ్గురిని సాధారణ దొంగల్ని అలాగే కాల్చి చంపి ఎన్ కౌంటర్ అన్నారు.

  ఆ మధ్య వరంగల్ లో విద్యార్ధినిపై యాసిడ్ పోసినపుడు పోలీసుల్ని ప్రజలు నిందించారు. రిపోర్టు ఇచ్చినా పట్టించుకోకపోయేసరికి ఇది జరిగిందని నిందించారు. సాయంత్రానికి యాసిడ్ పోసిన వారిని ఎన్‌కౌంటర్ చేశారు. దౌర్భాగ్యం ఏమిటంటే ఆ ఎన్‌కౌంటర్ ని ప్రజలు ఆమోదించారు.

  అంతకు ముందు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ధియేటర్ వద్ద క్యూలో జేబుదొంగ దొంగతనం చేస్తుంటే చూసి ఒక వ్యక్తి హెచ్చరించాడు. వాడు ఇద్దరిని వెంటబెట్టుకొచ్చి సినిమా వదిలాక హెచ్చరించిన వ్యక్తిని పొడిచి చంపారు. కొన్ని రోజులకి పోలీసులు ఆ చంపినవారిని ఎన్ కౌంటర్ చేసేసారు.

  పోలీసుల పుణ్యమాని ఎన్‌కౌంటర్ అంటే నిజంగా అవతలి వ్యక్తి కాల్చబోతుంటేనో, అలాంటిది మరింకేదన్నా చేయబోతుంటేనో తనను తాను రక్షించుకోవడానికి పోలీసు అతనిని కాల్చితే, ఆ తర్వాత అతను చనిపోతే అది మాత్రమే “ఎన్ కౌంటర్” అని అంటారన్న సంగతి ప్రజలకు క్రమంగా తెలియకుండా పోతోంది. చంపే ఉద్దేశ్యంతోనే కాల్చి చంపినా అది ఎన్‌కౌంటర్ అని నమ్మేంతగా బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి.

 5. ఉదయం పత్రికకి లాకౌట్ ప్రకటించి వందలాది మంది కార్మికులని ఉపాధి లేకుండా చేసి రోడ్డున పడేసిన మాగుంట సుబ్బిరామిరెడ్డిని చంపిన మావోయిస్టులకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కానీ పోలీసులు extrajudicial హత్యలు చేస్తే మాత్రం వాళ్ళకి ఎలాంటి శిక్షా పడదు. పోలీసులు vigilante killings చేస్తే ప్రభుత్వాలు పడిపోవు కానీ మావోయిస్టులు హత్యలు చేస్తే ప్రభుత్వాలు పడిపోతాయి. పాలక వర్గంవాళ్ళు తమ ప్రభ్తువాలని కూల్చని హత్యల గురించి అంతగా పట్టించుకోరు కానీ తమ ప్రభుత్వాలని కూల్చే potency ఉన్న హత్యలు చేస్తే అవి చేసినవాళ్ళని కుక్కల్ని కాల్చినట్టి కాల్చి చంపేస్తారు.

 6. పింగ్‌బ్యాక్: తమ ఆరు షరతులను ఉపసంహరించుకున్న పోలీసులు, రాంలీలా మైదాన్లో దీక్ష « తెలుగులో జాతీయ అంతర్జాతీయ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s