అన్నా హజారే అరెస్టు, నిర్బంధంలోనే నిరవధిక నిరహార దీక్ష ప్రారంభం


అంతా అనుకున్నట్లుగానే జరుగుతోంది. అవినీతిపై తన పద్ధతిలో సమర శంఖం పూరించిన అన్నా హజారేను నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు ప్రకటించకముందే అరెస్టు చేశారు. 74 ఏళ్ళ అన్నా హజారేను 7:30 గంటలకే ఆయన ఉంటున్న  తూర్పు ఢిల్లీలోని అపార్ట్‌మెంటుకి వెళ్ళి అరెస్టు చేశారు. మొదట దీక్ష విరమించాలని నచ్చజెప్పిన పోలీసు అధికారులు, అందుకాయన ససేమిరా అనడంతో అరెస్టు చేయక తప్పలేదని తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వేలమంది మద్దతుదారులతో దీక్షకు కూర్చుంటున్నానని హజారే చెప్పినందున ముందస్తు జాగ్రత్తగా అరెస్టు చేశామని వారు తెలిపారు. ఏయే సెక్షన్లపై ఆయనపై కేసు నమోదు చేస్తున్నదీ వారు తెలియజేయలేదు.

పోలీసుల నిర్బంధంలో ఉండగానే అన్నా హజారే తన నిరాహార దీక్ష ప్రారంభించాడని సామాజిక కార్యకర్తల బృందంలోని సభ్యుడు ప్రశాంత భూషణ్ విలేఖరులకు తెలిపాడు. హజారే కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదని ఆయన వెల్లడించాడు. సమర్ధవంతమైన లోక్ పాల్ తేవాలనీ, లోక్ పాల్ పరిధిలోకి ప్రధాని, న్యాయవ్యవస్ధలను కూడా తేవాలని అన్నా హజారే నేతృత్వంలోని సామాజిక కార్యకర్తలు బృందం డిమాండ్ చేస్తోంది. కేబినెట్ ఆమోదించిన బిల్లు కోరలు లేని బిల్లనీ, దాని వల్ల అవినీతిని అడ్డుకోవడం అసాధ్యమని అన్నా బృందం చెబుతున్నారు. పార్లమెంటుని అగౌరవపరుస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుండగా, పార్లమెంటుపై తమకు విశ్వాసం ఉందనీ, అందులోని సభ్యులపైనే నమ్మకం లేకుండా పోతోందనీ అన్నా తెలిపారు.

హజారే తదితర పౌర సమాజ కార్యకర్తల బృందంపై మంత్రులు, కాంగ్రెస్ పార్టీలు ఒక పద్ధతి ప్రకారం అసత్య ప్రచారానికి దిగుతున్నారు. వాటిలో పార్లమెంటును అగౌరవపరస్తున్నాడన్నది ఒకటి. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ వాదనను లంకించుకున్నాడు. పార్లమెంటు ముందుకు హజారె బృందం ప్రతిపాదించిన అంశాలతో కలిపి సమర్ధవంతమైన బిల్లుని తెచ్చిన తర్వాత, పార్లమెంటులో జరిగే చర్చల అనుసారంగా మార్పులు చేపడితే అభ్యంతరం ఉందకపోను. కానీ పార్లమెంటు ముందుకు తెచ్చే బిల్లే కోరలు లేకుండా నీరు కార్చినదైతే, ఇక పార్లమెంటుని ఎవరైనా అవమానించే ప్రశ్నే ఉదయించదు. నిజానికి ఏప్రెల్ నెలలో అన్నా దీక్ష సమయంలో ఆయన డిమాండ్లకు ఒప్పుకొని తీరా కోరలు లేని బిల్లుని ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వమే దేశ ప్రజలను అవమానించింది. పచ్చిగా మోసగిస్తున్నది. తన మోసం కప్పిపుచ్చుతూ ఎదురుదారి చేయడం ద్వారా సంక్షోభం నుండి బైటపడాలని తలపోస్తున్నది.

తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ లో అన్నా ఉంటున్న అపార్ట్ మెంట్ వద్దకు చేరిన 500 మంది మద్దతుదారులను కూడా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అన్నాను అరెస్టు తీసుకెళ్తుండగా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వారినీ అరెస్టు చేశారు. ఇతర నాయకులు కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల లను కూడా పోలీసులు రాజ్ ఘాట్ బైట అరెస్టు చేశారు. శాంతి భూషణ్ ని కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఢిల్లీ మునిసిపాలిటీ అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు 22 నిబంధనలు విధించి అవి ఆమొదిస్తేనే అనుమతిస్తామని చెప్పారు. అన్నా హజారే అందులో 16 నిబంధనలు మాత్రమే అంగీకరిస్తామని చెప్పడంతో అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

మరొక సామాజిక కార్యకర్త ప్రశాంతి భూషణ్, డిటెన్షన్‌కి వ్యతిరేకంగా తాము సుప్రీం కోర్టుకి వెళతామని తెలిపాడు. తన అరెస్టు, రెండవ స్వాతంత్ర్యోద్యమ ప్రారంభంగా అభివర్ణిస్తూ అన్నా హాజారే జైల్ భరో కి పిలుపిచ్చాడు. “నా ప్రియమైన భారతీయులారా, రెండో స్వతంత్ర సంగ్రామం మొదలైంది.  ఇప్పుడు నన్ను కూడా అరెస్టు చేశారు. కాని నా అరెస్టుతో ఈ ఉద్యమం ఆగుతుందా? సమస్యే లేదు. అటువంటిదాన్ని జరగనివ్వకండి!” అని అన్నా హజారే ముందుగా రికార్డు చేసిన సందేశంలో కోరాడు. పోలీసులు అరెస్టు చేసిన వెంటనే అన్నా హజారే తన దీక్ష ప్రారంభించినట్లు ప్రకటించాడని తెలుస్తోంది.

బి.జె.పి నాయకుడు ఎల్.కె.అద్వాని, హజారే అరెస్టుతో తాను ఆశ్చర్యపోలేదని తెలిపాడు. ప్రభుత్వం నడక ఆ దిశలోనే సాగుతున్నది. అవినీతిపై పోరాడటం బదులు అది బలిపశువుల కోసం చూస్తున్నది. హజారేను అరెస్టు చేస్తున్న సమయంలో అక్కడున్న కార్యకర్తలు “భారత్ ‌మాతాకి జై”, “వందే మాతం” లాంటి నినాదాలు చేశారు.

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ నిరవహిక నిరాహార దీక్షల వలన ప్రయోజనం లేదనీ, అవినీతిని పారద్రోలడానికి తన వద్ద మంత్రదండం లేదనీ ఎర్రకోట పై నుండి మాట్లాడాడు. ఇంతకీ మంత్రదండం ఉపయోగించి అవినీతిపరుల్ని శిక్షించాలని ప్రధాని మన్మోహన్ ని ఎవరు కోరారో తెలియదు. అన్నా హజరే గానీ, దేశ ప్రజలుగానీ సమర్ధవంతమైన లోక్‌పాల్ బిల్లుని తెమ్మనీ, తద్వారా అవినీతిపరులు తప్పింకుకోవడానికి వీలు లేకుండా చేయాలనీ కోరుతున్నారు. తూతూమంత్రంగా ఒక పనికిరాని బిల్లుని కేబినేట్ చేత ఆమోదింపజేయించుకుని మా దగ్గర మంత్రదండం లేదని నంగనాచిలాగా ఎర్రకోటపై నుండే ప్రధాని మాట్లాడ్డం దేన్ని సూచిస్తున్నది? మన్మోహన్ కళంకతనీ, నిష్క్రియాపరత్వాన్నీ, కపటబుద్ధినీ, అన్నింటికంటే ఎక్కువగా ప్రజలపట్ల ఉన్న అగౌరవాన్నీ సూచిస్తున్నది.

ఈ మంత్రులు అదొక పెద్ద తిరుగులేని డైలాగ్ అనుకుంటున్నారేమో అర్ధం కాని విషయం. తెలంగాణ కావాలని రెండేళ్ళనుండి సీరియస్ గా ఉద్యమిస్తుంటే, ఇప్పుదే నిద్ర లేచినట్లు “రాత్రికి రాత్రే తెలంగాణ రాదు” అని ప్రకటిస్తారు. ఏప్రిల్ నెల నుండి సమర్ధవంతమైన లోక్ పాల్ బిల్లు తీసుకురండి చాలు అని అన్నా బృందం, ప్రజలు కోరుతుంటే సరే అని తలలూపి కోరలు లేని బిల్లుని ఆమోదింపజేసుకున్నారు. అది వద్దు బిల్లుకి కోరలు తొడగండి, అవినీతి సంగతిని అది చూసుకుంటుంది అని కోరుతుంటే ‘మా వద్ద మంత్రదండం లేదు’ అసందర్భ ప్రేలాపనలని పేలడం ఏమిటి? కేవలం చట్టం ద్వారానే అవినీతి నియంత్రణలోకి రాదని చెబుతారు. ముందు చట్టం చేస్తే అది సమర్ధవంతంగా పని చేసేలా చూడవచ్చు. పనిచేయదేమో అని వంక చూపి ముందే నీరుగార్చిన బిల్లు ఆమోదానికి పెట్టడం కాంగ్రెస్, మన్మోహన్ ల కుటిలనీతి మాత్రమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s