
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ఇప్పుడు బహుళ వేగాలతో రికవరీ సాధిస్తున్నదని ఆయన పేర్కొన్నాడు. అంటే అన్ని దేశాలూ ఒకే వేగంతో 2008-2009 ఆర్ధిక సంక్షోభం నుండి రికవరీ సాధించడం కాకుండా వివిధ దేశాలు వివిధ వేగాలతో రికవరీ సాధిస్తున్నాయని ప్రపంచ బ్యాంకు అధిపతి చెప్పదలిచాడు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రస్తుతం ఆర్ధిక వృద్ధికి, అవకాశాలకూ వనరుగా ఉన్నాయని ఆయన వివరించాడు. ఇతర అభివృద్ధి చెందిన దేశాలకంటే మూడవ ప్రపంచ దేశాలు ప్రపంచ ఆర్ధిక రికవరీకీ దోహదపడుతున్నాయని తెలిపాడు. ప్రధానంగా ఎమర్జింగ్ దేశాల ఆర్ధిక వృద్ధి ప్రపంచ ఆర్ధిక వృద్ధికి నాయకత్వం వహిస్తున్నాయని తెలిపాడు.
అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఆర్ధిక వృద్ధికి, అవకాశాలకూ వనరులుగా ఎందుకు లేవన్నదీ ఆయన వివరించలేదు. ధనిక దేశాలు ఆర్ధిక రికవరీకి వనరులుగా ఉండి, ఉండీ అలసిపోయాయా లేక అవి బలహీనపడడం వలన పరిస్ధితి తారుమారు అయిందా అన్నది ఆయన వివరించలేదు. ఎప్పుడూ ఉన్న పరిస్ధితి గురించి గడ్డుగా ఉందనో, బాగా ఉందనొ చెప్పడం తప్ప ఆ ఉన్న పరిస్ధితికి కారణాలేమిటి, ఆ కారణాలను తొలగించడానికి గల మార్గాలేమిటి అన్న సంగతిని ఆయన చెప్పలేదు. ఆ విధంగా ప్రపంచ బ్యాంకు బలవంతంగా రుద్దే ఆర్ధిక విధానాల దుష్పలితాలకు గల తన బాధ్యత నుండీ తప్పించుకో గలుగుతున్నాడు.
గత రెండు వారాలుగా జరుతున్న పరిణామాలను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు వివరిస్తున్నాడు. యూరప్ రుణ సంక్షోభం తీవ్రమవడం, అమెరికా క్రెడిట్ రేటింగ్ వలన ఏర్పడిన రుణ సంక్షోభం పరిస్ధితులు వీటిగురించి వ్యాఖ్యానిస్తూ ఆయన “గత రెండు వారాల్లో జరిగినదేమంటే, యూరప్, అమెరికాలలో జరిగిన ఘటనల ఫలితం ఒక చోటికి వచ్చి చేరింది. అది మార్కెట్లలో పాల్గొంటున్నవారికి కొన్ని కీలక దేశాల ఆర్ధిక నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లేందుకు దారితీసింది” అని పేర్కొన్నాడు. “కొన్ని దేశాల రికవరీలలో ఉన్న పెళుసుదనం ఆ ఘటనలకు తోడవడంతో మనం నూతన ప్రమాదం లోకి నెట్టబడ్డాము. ఈ మాటలు నేను సరదాకి చెప్పడం లేదు. …విధాన రూపకర్తలు సీరియస్ గా పరిగణించాలి అని కోరాడు.
సావరిన్ అప్పు సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన క్రమాలు, యూరోజోన్ లోని కొన్ని అంశాలు అన్నీ ఒక రోజు ఆలస్యంగా జరగడం మామూలైందనీ దానితో అధికారులు సమస్య పరిష్కారానికి ముందుండగల సామర్ధ్యంపై మార్కెట్లు భయాలకు లోనయ్యాయని తెలిపాడు. చాలా యూరోజోన్ దేశాలకు సంబందించి మనం ‘డ్రామా’ నుండి ‘ట్రౌమా’ (ప్రమాదానంతర ఉద్వేగం) కి వెళ్తున్నామని పేర్కొన్నాడు. అమెరికాపై మాట్లాడుతూ ఆయన సరికొత్త భాష్యం చెప్పాడు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ సమస్యలను ఎదుర్కొంటున్న భయాలు మార్కెట్లు కూలడం వెనక లేవనీ అంటూ ఆయన ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అమెరికా కీలక భూమిక పోషించడానికీ, ఆర్ధిక నాయకత్వం వహించడానికి మార్కెట్లు అలవాటు పడిపోయాయి” అని జోయెలిక్ వివరించాడు.
అమెరికా పొదుపు చర్యలు విచక్షణాధికారాలతో పెట్టే ఖర్చులపైనె కేంద్రీకరించారనీ అలా కాకుండా సామాజిక భద్రత లాంటి హక్కులపైన దృష్టి పెట్టలేదనీ చెప్పాడు. అంటే ప్రపంచ బ్యాంకు అధ్యక్ధుడు బడా కార్పొరేషన్ల పన్ను రాయితీలపై దాడి చేయడానికి బదులు ప్రజలకు ఇచ్చే సదుపాయలను కత్తిరించడంపైనే కేంద్రీకరించి బడ్జెట్ లోటు తగ్గించాలని ప్రభోధం చేస్తున్నాడు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ రికవరీ బాట పట్టడానికి చైనా యువాన్ రేటు తగ్గించాలని మరొక అప్పీలుచేశాడు.
ఇంతా జేసి ప్రపంచం ఏ కొత్త ప్రమాదం ముందున్నదీ చెప్పడంలో విఫలమైనాడు. ఏదో జరగకూడనిది జరగబోతుందన్నదే తప్ప ఏం జరగబోతున్నదీ ప్రపంచ బ్యాంకు అధిపతి జోయెలిక్ చెప్పలేక పోతున్నాడు. దానికి కారణం అలా తెలుసుకోగల ఉపకరణాలు, విజ్ఞానం, పెట్టుబడిదారీ సిద్ధాంతం వద్ద లేకపోవడమే. కమ్యూనిస్టులని అడిగితే వాళ్ళు చక్కగా చెప్పగలరు. జోయెలిక్ ఊహించలేని ఆ పరిణామం ప్రజల తిరుగుబాట్లే. గోడవరకూ నెట్టాక ఇక వెనక్కి జరగడానికి ఖాళీ లేనపుడు ప్రజలు తమ పరిస్ధితుల పట్ల నిరసన ప్రారంభిస్తాడు. అది సామూహిక రూపం తూసుకుంటే తిరుగుబాటుగా మారుతుంది. కాని అటువంటి తిరుగుబాటు పరిస్ధితులను సొమ్ము చేసుకోగల ప్రజానుకూల పక్షాలు బలహీనంగా ఉండడం నేటి దౌర్భాగ్యం.
