తాలిబాన్ దాడికి అమెరికా షాక్‌కి గురైన వేళ…


ఎస్&పి ఆర్ధిక పరంగా అమెరికా రేటింగ్ ని తగ్గిస్తే, ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబాన్, అమెరికాని మిలట్రీ పరంగా రేటింగ్ ని పడదోసిన పరిణామం ప్రపంచ దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. అమెరికాకి చెందిన శక్తివంతమైన ఛినూక్ హెలికాప్టర్ ను తాలిబాన్ కేవలం ఒక రాకెట్ ప్రొపెల్లర్ గ్రెనేడ్ తో కూల్చివేయడం ద్వారా అమెరికాని షాకి కి గురి చేసింది. దాడిలో 19 అమెరికా నేవీ సీల్ కమెండోలు, 7గురు ఆఫ్ఘన్ ప్రభుత్వ సైనికులు చనిపోగా మరో 12 మంది మిలిటెంట్లు కూడా చనిపోయారు.

ఛినూక్ హెలికాప్టర్ సైనికుల్ని పెద్ద సంఖ్యలో చేరవేయగలిగిన హెలికాప్టర్. అమెరికా యుద్ధ సామాగ్రిలో ముఖ్యమైన వాహనం. పాకిస్ధాన్ అబ్బోత్తాబాద్ లో లాడెన్ హత్యకు వినియోగించిన స్పెషల్ కమెండోలే ఈ తాలిబాన్ దాడిలో చనిపోయారని ఆ తర్వాత అమెరికా తెలిపింది. సీల్ కమెండోలు ప్రయాణిస్తున్న ఛినూక్ హెలికాప్టర్ ను తాలిబాన్, అది ఎగిరిన కొద్ది నిమిషాలకే కూల్చి వేసింది. తద్వారా ఎస్&పి, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ని తగ్గించినట్లుగా, తాలిబాన్, అమెరికా మిలట్రీ సామర్ద్యాన్ని డౌన్ గ్రేడ్ చేసినట్లయ్యింది.

అమెరికా అధికార వ్యవస్ధ ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి దారితీసిన అసలు కారణాలను ఒప్పుకోదు. అమెరికన్ ధనికులకీ, మెగా కార్పొరేషన్లకీ సంవత్సరాల తరబడి బుష్ అందించిన పన్నుల రాయితీలు, సంక్షోభం కాలంలో బ్యాంకులకు, ఇన్సూరెన్సు సంస్ధలకు పెద్ద ఎత్తున బెయిలౌత్లుగా మంజూరు చేసిన వందల బిలియన్ల డాలర్లు, ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లపై ఖర్చు చేసిన ట్రిలియన్ల కొద్దీ డాలర్లు… ఇవి అమెరికా ఆర్ధిక సంక్షోభానికీ, ఆ తర్వాత ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికీ కారణం అయ్యాయని అమెరికా పాలకులు అంగీకరించరు. ఆ విధంగానే తాలిబాన్ రాకెట్ తో కూల్చడం వల్లనే అమెరికా ఛినూక్ హెలికాప్టర్ కూలిపోయిందని అమెరికా మొదటా అంగీకరించలేదు. ఆఫ్ఘన్‌లో ఒబామా హయాంలో అమెరికా ప్రారంభించిన నూతన యుద్ధ వ్యూహం విఫలమైందని కూడా అమెరికా అంగీకరించదు, వాస్తవాలెలా ఉన్నా.

ఛినూక్ (సి.హెచ్-47) హెలికాప్టర్ సాకేతిక కారణాలవలన కూలిపోయిందని అమెరికా సైనికాధికారులు విలేఖరులకు చెప్పారు. హెలికాప్టర్ కూల్చివేతపై అతిగ ఊహాగానాలు చేయవద్దని కూడా హెచ్చరిక లాంటిది జారీ చేశారు. కాని అదే సమయంలో తాలిబాన్ కూడా పత్రికలకు అన సమాచారం అందించింది. తామే రాకె ప్రొపెల్డ్ గ్రెనేడ్ తో హెలికాప్టర్ ని కూల్చామనీ ఈ దాడిలో తమ మిలిటెంట్లు కూడా చనిపోయారనీ ప్రకటించింది. పెంటగాన్ హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో కూలిపోవడంపై దర్యాప్తు జరపాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు. 

హెలికాప్టర్ కూల్చివేత సంఘటన తాలిబాన్ కి గట్టి పట్టు ఉన్న వార్‌దాక్ రాష్ట్రంలో జరిగింది. వార్ దాక్ రాష్ట్రంతో పాటు పక్కనగల లోగార్ రాష్ట్రం కూడా తాలిబాన్ కి కేంద్రమే. ఈ ప్రాంతాలు తాలిబాన్ కి కొట్టిన పిండి. క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించడానికి తయారవడానికి కూడా సరైన ప్రాంతమని తెలుస్తోంది. అంతేకాక ప్రజా సంబంధాల నైపుణ్యంలోనూ, యుద్ధరంగానికి కొత్త ఆయుధాలను పంపడంలోనూ, దురాక్రమణ దేశాల సైన్యాన్ని మానసికంగా దెబ్బతీయగల దాడుల్లోనూ తాలిబాన్ “ప్రగతిని సాధించిన” సంగతి ఈ ఘటన వెల్లడించిందని ఏసియా టైమ్స్ పత్రిక వెబ్ సైట్ అభిప్రాయపడింది.

10,000 మంది ప్రత్యేక సైన్యంతో ఏర్పాటు చేసిన ‘జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్’ టాస్క్ ఫోర్స్ లో సీల్స్ కమెండోలు ఒక భాగమని తెలుస్తున్నది. ఆఫ్ఘన్ దురాక్రమణ ప్రారంభంలో ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ద్ధాన్ లపైకి ఇది రోజుకు 70 వైమానిక దాడులను ఈ కమెండోల బృందం జరిపిందనీ, తమ దాడుల్లో అది 2900 తిరుగుబాటుదారులను పట్టుకుని 800 మందిని చంపేసిన చరిత్ర ఉన్నది ఈ కమెండోలకు. ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన సైనిక స్ధావరాల్లో కూడా వీరు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అబ్బోత్తా బాద్ లో లాడేన్ హత్యకు సీల్స్ టీం 6 ని వినియోగించారు. వారే వార్దక్ లో కూలిపోయిన హెలికాప్టర్ లో ఉన్నారని అమెరికా చెపుతోంది. కాని అప్పటిలాగా 160th Special Operations Aviation Regiment’s state-of-the-art stealth helicopter కాకుండా ఈ సారి వారు నేషనల్ గార్డులు వినియోగించే ఛినూక్ హెలికాప్టర్ ని వాడారు.

ఛినూక్ హెలికాప్టరు గాలిలోకి పైకి లేస్తుండగానే తాలిబాన్ లు అభివృద్ధి చేయబడిన రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ తో కూల్చివేశారు. ఇటువంటి ఆయుధాలను మరిన్ని దిగుమతి చేసుకోవడానికి తాలిబాన్ ప్రయత్నిస్తున్నదని తాలిబాన్ తెలిపింది. ఇరాక్ నుండి ఇవి దిగుమతి అవుతున్నట్లుగా పత్రికలు రాశాయి. అమెరికా నేవీ సీల్స్ ఓటమి ఎరుగని వారన్న నమ్మకాన్ని ఈ దాడి ద్వారా తాలిబా తుత్తునియలు చేసినట్లయింది.

అబ్బోత్తాబాద్ లో లాడెన్ హత్యలో పాల్గొన్న నావీ సీల్స్ కమెండోలే వార్దాక్ లో చనిపోయారని అమెరికా చెప్పడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాడెన్ స్ధావరంగా చెప్పబడిన ఇంటి ఆవరణలో అమెరికా నేవీ సీల్స్ ఉపయోగించిన ఒక స్టెల్త్ హెలికాప్టర్ కూలిపోయిన సంగతి తెలిసిందే. కూలిపోయిన స్టెల్త్ హెలికాప్టర్ బాడీ పాకిస్ధాన్ సైనికుల చేతికి చిక్కితే చైనాకి అందజేస్తారన్న భయంతో దాన్ని నాశనం చేసారనీ, తోక భాగం అక్కడే ఉండిపోయిందనీ పత్రికలు వార్తలు రాశాయి. వాస్తవానికి లాడెన్ ఇంటి ఆవరణలో స్టెల్త్ హెలికాప్టర్ కూలిన సందర్భంలో అమెరికా కమెండొలు చనిపోయారనీ, వారే మళ్ళీ ఒక సారి వార్దాక్ లో తాలిబాన్ దాడిలో చనిపోయినట్లుగా అమెరికా ప్రకటించి పాత వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని అనుమానాలు బలంగా వ్యాపించి ఉన్నాయి. లేకుంటే అధునాతనమైన స్టెల్త్ హెలికాప్టర్లను వాడే నేవీ సీల్స్ దానికంటే అతి తక్కువ శక్తి గల ఛినూక్ హెలికాప్టర్ లో ప్రయాణం కట్టడం ఏమిటని అనుమానిస్తున్నవారు ప్రశ్నిస్తున్నారు.

ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైనిక ఉపసంహరణ జరపడంలో అమెరికా సైన్యం తన వాదనలకు సాక్షిగా వార్ధాక్ ఘటనను ఉపయోగించుకోవచ్చు. ఆఫ్ఘన్ సైనికులు, పోలీసులు తమని తాము పాలించుకోవడానికి ఇంకా సన్నద్ధులు కాలేదనీ కనుక సైనిక ఉపసంహరణకి అప్పుడే పూనుకోవడం సరి కాదని అమెరికా సైనికాధికారులు వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్లందరూ అమెరికా సైన్యం దేశం విడిచి పోవాలని ముక్త కంఠంతో కోరుతున్న సంగతిని మాత్రం వారు దాచిపెడతారు. సైనిక ఉపసంహరణకు ఒబామా పూనుకున్నా పూర్తి ఉపసంహరణ జరగదన్నది అందరికీ తెలిసిన విషయం.

5 thoughts on “తాలిబాన్ దాడికి అమెరికా షాక్‌కి గురైన వేళ…

 1. లాడెన్ ఇంటి ఆవరణలో స్టెల్త్ హెలికాప్టర్ కూలిన సందర్భంలో అమెరికా కమెండొలు చనిపోయినా లేదా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వార్దాక్ లో తాలిబాన్ దాడిలో అమెరికా నేవీ సీల్ కమెండోలు చనిపోయారని అమెరికా ప్రచారం చేస్తున్నా.. ఒకటి మాత్రం నిజం. వీటిలో ఒకటవది తప్పై, రెండో అంశం సరైనది అయినా పర్వాలేదు. అగ్రరాజ్యం అమెరికా అబద్దాలు చెప్పడంలో, ప్రచారం చేయడంలో ఆరితేరిపోయిందని ఎన్నోసార్లు తేలిపోయింది.
  కానీ, భూమండలం మొత్తంపై యుద్ధ కోరలు చాచి పొంచుకుని కూర్చున్న అమెరికా కంటే తాలిబాన్ శక్తులే యుద్ధంలో నిజాయితీని కలిగి ఉన్నారన్నది తేలిపోయింది. ఓటమి ఎరుగని వారని పేరు పడిపోయిన అమెరికా నేవీ సీల్స్ కూడా కాగితం పులులే అని తేలిపోయింది. ఒక చిన్న శక్తి పెద్ద శక్తిని, ఒక చిన్న దేశం పెద్ద దేశాన్ని నిలువరించగలవని, ఎదురించి నిలదొక్కుకోగలవని తత్వ శాస్త్రం మనకు ఎన్నిసార్లు బోధించలేదు? ఇంతకూ అమెరికా, నాటోకూటమి ఆప్ఘనిస్తాన్‌లో ఊడబొడిచిందేమిటి, ఊడబొడుస్తున్నదేమిటి?

 2. ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా ఊడబొడిచింది ఏముంది? ఏమీ లేదు. లక్షల మంది ఆఫ్ఘన్ లను చంపి స్వయంగా కొంతమంది సైనికుల్ని కోల్పోవడం మినహా అమెరికాకి ఒరిగింది, ఒరగబోయేది ఏమీ లేదు. అది మిత్ర దేశం అనుకున్న పాకిస్ధానే, తాలిబాన్, ఆల్ ఖైదాలతో సంబంధాలు పెట్టుకుని ఆఫ్ఘనిస్ధాన్ లో తన పలుకుబడి కొనసాగడానికి ప్రయత్నిస్తున్నది. ఈ మధ్య ప్రజల ఆందోళనలతో సి.ఐ.ఎ ఏజెంట్లను వెళ్లగొట్టింది కూడా. అప్పటినుండీ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పాక్ సహకారం లేకుండా అమెరికా ఏమీ చేయలేదు. ఒక్క ఆఫ్ఘనిస్ధానే కాదు, ఇరాక్ కూడా అంతే. ఇరాక్ లో యుద్ధం గెలిచామని అమెరికా చేసుకుంటున్న ప్రచారం అబద్ధం. ఆ విషయం అమెరికా పత్రికలే రాస్తున్నాయి.

  టెర్రరిస్టు సంస్ధ అని తాలిబాన్‌ ని అంటున్నారు గాని, నిజంగా అది ఆఫ్ఘనిస్ధాన్ తప్ప ఇంకెక్కడైనా టెర్రరిజం అని చెబుతున్న చర్యలకు పాల్పడిందా? తమ దేశాన్ని ఆక్రమించిన వారిని వెళ్ళగొట్టడానికే అది పోట్లాడుతోంది తప్ప మరింకే చేస్తున్నది? వాళ్ళు చేస్తున్నది స్వతంత్ర పోరాటమే తప్ప టెర్రరిజం కాదు. అమెరికా లాంటి సైనికపాటవం ఉన్న దేశాన్ని ఎదుర్కోవాలంటే మానవ బాంబులు, గెరిల్లా ఎత్తుగడలు తప్పవు. చైనా విప్లవంలో అత్మాహుతు దళాల వలన చాలా విజయాలను సాధించారు. తాలిబాన్ మానవబాంబుల్ని టెర్రరిజం అనడం సరైంది కాదని నా అభిప్రాయం. అలాగే తాలిబాన్ కూడా టెర్రరిస్టు సంస్ధ అనడం కరెక్టు కాదు.వాళ్ళ దేశాన్ని కాపాడు కోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అది వారి హక్కు.

  గెరిల్లా యుద్ధం ముందు సాంప్రదాయక యుద్ధ ఎత్తుగడలు పని చేయవు కదా!

 3. తమ దేశాన్ని ఆక్రమించిన వారిని వెళ్ళగొట్టడానికే అది పోట్లాడుతోంది తప్ప మరింకే చేస్తున్నది? – I may agree with the fact that they are fighting to save their country, but do you think they are not responsible for anything else?

  తాలిబాన్ పాలనలో మనుషుల బ్రతుకులు, ముఖ్యంగా మహిళల జీవితాలు ఎంత దీనంగా ఉన్నయో తెలియంది కాదు కద.

  That aside,
  అగ్ర రాజ్యం ఎవరి బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వకుండా ఆడుకుంది.

  అసలు తాలిబాన్ని సృష్టించింది వీళ్ళే కద.

  ఎదుటి వాడు చేస్తున్న చెడ్డ పనిని ఆపకపోవడం కూడ తప్పు.
  అఫ్గన్, ఇరాక్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఎవ్వరు ఏమీ అనలేదు.
  ఈ అగ్ర రాజ్యం యుద్ధానికి కోట్లు పోసి సంక్షోభంలో కి వెళ్ళి తనతో పాటు అందర్ని లాక్కెళుతోంది.

  ఇప్పుదు అందరూ తీరిగ్గా లబోదిబో అంటున్నారు.

 4. సంజయ్ గారూ, యుద్ధమూ, తాలిబాన్ ప్రతిఘటన వరకి దృష్టిలో పెట్టుకుని రాసాను. ఇప్పటి ప్రధాన అంశం అదే. తాలిబాన్ పాలన జరుగుతున్నపుడు పౌర హక్కులు, మహిళల హక్కులు ఖచ్చితంగా చర్చకు వస్తాయి. మహిళల హక్కుల కోసం కాదు గదా అమెరికా ఆఫ్గనిస్ధాన్ ని ఆక్రమించింది?

 5. తాలిబాన్లు నిస్సందేహంగా ఫండమెంటలిస్టులే. కాని వారు నేడు చేస్తున్నది అమెరికా అగ్రెషన్ కీ, ఎక్స్‌ప్లాయిటేషన్ కీ వ్యతిరేక పోరాటం. పేట్రియాటిక్ పోరాటంగా చూడాలి. అమెరికా ఫైనాన్షియల్ క్రైసిస్ తో పాటు ఆఫ్ఘనిస్ధాన్ లో నేవీ సీల్స్ హెలికాప్టర్ కూల్చి వేయడం ప్రపంచ రాజకీయ పరిణామాల్లో ముఖ్య పరిణామం…..పి.ఆర్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s