ఏ ముఖం పెట్టుకుని ఆగష్టు 15న జాతీయ జెండా ఎగరేస్తారు? -ప్రధానికి హజారే ప్రశ్న


“మా నిరసనను తెలియజేయడానికి అనుమతిని నిరాకరించడం ద్వారా, మీరూ మీ ప్రభుత్వమూ మా మౌలిక హక్కులను ఉల్లంఘించడం లేదా? దేశా స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు రోజుల ముందే మా స్వాతంత్ర్యాన్ని మీరు లాగేసుకోవడం లేదా? ఏ మొఖం పెట్టుకుని 65 వ స్వాతంత్ర్య దినం రోజున జాతీయ జెండా ఎగరేస్తారు?” తూటాల్లా తాకుతున్న ఈ ప్రశ్నలు భారత దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే రాసిన లేఖలో వేసిన ప్రశ్నలు.

లోక్ పాల్ బిల్లు విషయంలో తమకిచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తున్న అన్నా హజారే, తమ సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ సమర్ధవంతమైన లోక్ పాల్ బిల్లుని రూపొందించాలని కోరుతూ అన్నా హజారే ఆగస్టు 16 నుండి ఆమరణ నిరాహారా దీక్షకు కూర్చుంటున్న సంగతి తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో ప్రత్యామ్నాయంగా నాలుగు స్ధలాలను అన్నా హజారే ప్రతిపాదించాడు. రామ్ లీలా మైదానంలో దీక్షకు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అనుమతించినప్పటికీ, పోలీసులు మూడు రోజులు మాత్రమే దీక్ష కొనసాగాలని షరతు విధించారు. షరతులతో అనుమతి ఇవ్వడం పట్ల నిరసన తెలుపుతూ అన్నా హజారే ప్రధాన మంత్రికి కఠిన పదజాలంతో లేఖ రాశాడు.

కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాధమిక హక్కులను అణచివేస్తున్నదని లేఖలో హజారే ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని అణవివేస్తున్నదని ఆరోపించాడు. “అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తినవారిని మీ ప్రభుత్వం అణచివేస్తున్నది. మీ ప్రభుత్వంలో ఇది చాలా తరచుగా జరుగుతోంది” అని హజారే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. తాను కోరిన ప్రదేశాలలో నిరహార దీక్ష చేయడానికి ఏ కారణం లేకుండా అనుమతి నిరాకరించడాన్ని ఎత్తి చూపుతూ “ఇదంతా నియంతృత్వాన్ని తలపించడం లేదా?” అని ప్రశ్నించారు. “ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం ద్వారా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ద్వారా ప్రజల ప్రాధమిక హక్కులను అణచివేయడం మీకు సరైనదేనని మీరు బావిస్తున్నారా? స్వాతంత్ర్య వచ్చినప్పటినుండీ మీదే అత్యంత అవినీతి పభుత్వమని ప్రజలు చెబుతున్నారు. ప్రతి ప్రభుత్వమూ తన ముందరి ప్రభుత్వం కంటే మరింత అవినీతితో వ్యవహరించిందని నా అభిప్రాయం” అని హజారే తన లేఖలో రాశారు.

మూడు రోజులు మాత్రమే దీక్షకు అనుమతి ఇవ్వడానికి కారణాలేమీ చూపలేదని హజారే ఎత్తి చూపారు. తన దీక్షకు అనుమతి నిరాకరించడానికి ప్రభుత్వం కారణాలు వెతుక్కుంటోందని ఆరోపించారు. “జంతర్ మంతర్ లో దీక్షకు మా దీక్షే మొత్తం స్ధలాన్ని ఆక్రమిస్తుందనీ, ఇతరుల నిరసనకు స్ధలం ఉండదన్న కారణం చూపుతూ అక్కడ మా దీక్షకు అనుమతిని నిరాకరించారు. తర్వాత మేము రాజ్‌ఘాట్, బోట్ క్లబ్, రామలీలా మైదాన్, షాహీద్ పార్క్ లలో ఏదో ఒక దగ్గర దీక్షకు అనుమతి కోరాము. ఢిల్లీ మునిషిపల్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చినా, ఢిల్లీ పోలీసులు వారం రోజులు నానబెట్టి చివరికి అనుమతి నిరాకరించారు” అని ప్రధానికి రాసిన లేఖలో హజారే తెలిపారు. అనుమతి నిరాకరణకు సరైన కారణం చూపలేదని చెబుతూ ఢిల్లీ పోలీసుల చర్య నియంతృత్వాన్ని తలపిస్తున్నదని ఆక్షేపించాడు. ప్రతి పౌరుడికీ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్న సంగతిని గుర్తు చేశాడు.

“రాజ్యాంగాన్ని త్యాగం చేసి ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి మేము మిమ్మల్ని అనుమతించం. ఇది మా ఇండియా. ఈ దేశ ప్రజలది ఈ ఇండియా. ఈ రోజు మీ ప్రభుత్వం ఉంది. రేపు అది ఉండొచ్చు లేదా లేకపోవచ్చు” అని రాసిన హజారే, ప్రధానిని ధైర్యంగా ఉండాలని కోరాడు. శక్తివంతమైన లోక్‌పాల్ బిల్లుకోసం, అవినీతిపై నిరసన కోసం సరైన స్ధలాన్నీ చూపడం ద్వారా ధైర్యాన్ని ప్రదర్శించాలని కోరాడు. “మీకు 79 సంవత్సరాల వయస్కులు. దేశంలో అత్యున్నత పీఠంపై కూర్చున్నారు. మీ జీవితం నుండి మీకు సమస్తం సమకూరింది. ధైర్యాన్ని చూపి నిర్ధిష్ట చర్యలు తీసుకొండి” అని హజారే ప్రధానిని కోరారు.

“రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ కాపాడవలసిన ప్రధాన కర్తవ్యం మీమీద ఉంది. పరిస్ధితి తీవ్రతను గమనించి సత్వరమే చర్యలు తీసుకోగలరని నమ్ముతున్నాను. నిరసన తెలియజేయడానికి ఒక స్ధలాన్ని చూపడంలో ప్రజాస్వామ్య అధినేట విఫలమైన పక్షంలో మేము అరెస్టు కావడానికి సిద్ధం. జైలులోనే మా నిరసనను కొనసాగిస్తాము.” అని హజారే హెచ్చరించారు. తాను నిరసనలో కూర్చుండగా లక్షల మంది వీధుల్లోకి వస్తారని ఆయన తెలిపారు.

4 thoughts on “ఏ ముఖం పెట్టుకుని ఆగష్టు 15న జాతీయ జెండా ఎగరేస్తారు? -ప్రధానికి హజారే ప్రశ్న

 1. ప్రజలలో వచ్చిన చైతన్యం (హజారే వల్లే కావచ్చు) చూసి ఈ ప్రభుత్వం తప్పని పరిస్థితిలో హజారే బృందం తయారు చేసిన లోక్‌పాల్ బిల్‌ కి కొన్ని తేడాలతో పార్లమెంటుతో ఆమోదముద్ర వేయుంచుకుంది.
  ఆ బిల్లులో వున్న లోపాల సవరణపై పోరాటం చేయకుండా, ప్రస్తుత లోక్ పాల్ బిల్‌ను చెత్త కుప్పలో వేయమంటుంటే సందేహం కలుగుతుంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నమ్మిన హజారే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి రారాజైన పార్లమెంట్ కన్నా గొప్ప/క్రీయాశీల వ్యక్తిగా కీర్తి పొందాలనుకుంటునట్లు వుంది.

 2. మీరంటున్నది ప్రభుత్వం చేస్తున్న వాదన. పార్లమెంటు కంటే అధిక కీర్తి పొందాలని హజారే భావిస్తున్నంత మాత్రాన ఆయనకది దక్కకపోవచ్చు. నిజానికి ప్రజాస్వామ్యంలో అంతిమ అధికారం పార్లమెంటు కాదు ప్రజల చేతుల్లో కదా ఉండేది. ఆ ప్రజల డిమాండ్లను అంటే అవినీతిపరులందరినీ విచారించే వ్యవస్ధ ఒకటి కావాలని కోరడంలో తప్పులేదు.

  ప్రధాని అవినీతిపై విచారణ వల్ల అస్ధిర పరిస్ధితులు ఏర్పడతాయంటున్నవారు అది కాకుండా ఇతర పరిస్ధితుల వలన ఏర్పడుతున్న అస్ధిర పరిస్ధితులను ఆపడానికి చేసిన ప్రయత్నాలేవీ లేవు. అదొక సాకు మాత్రమే. తన అవినీతిపై విచారణ జరిపే వ్యవస్ధ ఉందని ప్రధానికి తెలిసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి తప్ప తాను ఎలాగూ అవినీతికి పాల్పడతాను, విచారణ ఎలాగూ జరుతుంది. అందువలన ప్రభుత్వం అస్ధిరం పాలవుతుంది” అంటే ఎలా? తాను అవినీతికి పాల్పడితే విచారణ జరుగుతుంది, కనుక పాలన అస్ధిరం అవుతుంది. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి.” అని వారెందుకు భావించరు?

  అసలు “ప్రధాని అవినీతికి ఎలాగూ పాల్పడరు. కనుక విదారణ జరిపినా బైటపడేది ఏమీ ఉండదు. కనుక ప్రభుత్వం స్ధిరంగానే ఉంటుంది” అని ఎందుకు అనుకోవడం లేదు? అలా కాకుండా దానికి భిన్నంగా ఆలోచించి, భిన్నమైన కంక్లూజన్ కి వస్తున్నారంటే, ప్రధాని అవినీతికి పాల్పడతాడు అని పరోక్షంగా అంగీకరించినట్లే కదా?

  హజారే ప్రతిపాదనలు మొత్తం కరెక్టు కాకపోవచ్చు. కరెక్టు కానివేవో ఎత్తి చూపి కమిటీలో ఎత్తి చుపుతూ, ప్రజలకు కూడా వివరిస్తూ కమిటీ చర్చల ద్వారా బిల్లు రూపకల్పన జరిగితే ప్రభుత్వానికి పోయిందేముంది? ప్రధానిపై విచారణ అనగానే ఆయన ఒక్కడే అన్నట్లుగా ధ్వనిస్తోంది. కాని వాస్తవానికి ప్రధాని కింద ఒక పెద్ద వ్యవస్ధె ఉంటుంది. అనేక మంది సీనియర్ అధికారులు, వివిధ శాఖలు, ఆ శాఖల నాన్-క్యాబినెట్ మంత్రులు చాలా మంది ఉంటారు. ప్రధానిని అడ్డు పెట్టుకుని వీరంతా తప్పించుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలలో బ్లాంకెట్ ఆరోపణలు, బ్లాంకెట్ కొట్టివేటలు తప్ప నిర్ధిష్టత లేదు. అది కూడా గమనించాలి.

  ఛీఫ్ జడ్జిని తప్పించడం సుప్రీం కోర్టుకే ఇష్టం లేదు. గతంలో అటువంటి బిల్లుపైన కోర్టుకి వెళితే ఛీఫ్ జస్టిస్, ప్రధాని లేకుండా బిల్లు అసంపూర్ణం అని కోర్టు వ్యాఖ్యానించినట్లుగా హజారే బృందం చెబుతోంది.

  హజారే కీర్తి పొందుతున్నాడా లేదా అని కాకుండా అతని బిల్లు ప్రతిపాదిస్తున్నదేమిటి, ఎందుకు ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది, ప్రభుత్వ వాదనలు కరెక్టేనా, హజారే వాదనలో నిజమెంత, వీటిపైన దృష్టిపెడితే ఉపయోగం వాసవ్య గారూ. అలాగని హజారే బిల్లు వల్ల మొత్తం అయిపోతుందనీ, అవినీతి ఇక ఉండదనీ, నేనస్సలు అనుకోవడం లేదు. కాని ఏదో కారణం రీత్యా ఆయన ఉద్యమిస్తున్నాడు. వెనక ఫాలోయింగ్ ఏర్పడింది. ఏ విధంగా చూసినా అది మంచిదే. ఆయన రాజీపడితే అప్పుడే చెప్పొచ్చు, కీర్తి కక్కుర్తి అని రుజువైనప్పుడే ఆ ఆరొపణలని సంధించవచ్చు. ప్రస్తుతానికి అతని ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని నా అభిప్రాయం.

 3. ప్రధాని తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షించాల్సిందే. కానీ అలాంటి అధికారం ఏ ఒక్కరి చేతిలోనో పెడితే, అతను ప్రతిపక్షాలతో కుమ్మక్కయి ఐన దానికి, కాని దానికి ప్రధానిని శిక్షించాలనో,మార్చాలనో ప్రయత్నించడని గ్యారెంటీ ఏమిటి? ప్రతి ఒక్కరినీ విచారించే/శిక్షించే వ్యవస్థో,వ్యక్తో ఉండాలనడం బాగానే ఉంది. కానీ అంతిమంగా ఆ వ్యక్తి/వ్యవస్థ ప్రజలచే ఎన్నుకోబడాలా ( ప్రస్తుత మున్నట్లుగా) , లేక పరోక్షంగా ఎవరితోనో నియమించబడాలా( ఇప్పుడు హజారే బృందం అడుగుతున్నట్లుగా సర్వోన్నత/సర్వ శక్తిమంత లోక్ పాల్) ఉండాలా అనేది కీలకాంశం.

 4. లోక్ పాల్ ఇప్పుడు ప్రజలచేత ఎన్నుకోబడుతుందని ఎవరూ అనలేదు కదా? లోక్ పాల్ నియామకం ప్రజలచేత జరగడం అసాధ్యం. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల ద్వారానే ఆ నియామకం జరుగుతుంది. అంటే అవినీతికి పాల్పడుతున్న పెద్దలే లోక్ పాల్ నీ నియమిస్తారు. ఆ విధంగా లోక్ పాల్ పని విధానానికి కూడా పరిమితులుంటాయి. అవినీతికి పాల్పడడానికి రాజకీయ నాయకులకూ, అధికారులకూ అన్ని అవకాశాలనూ పాలనా వ్యవస్ధలో కల్పిస్తూ అటువంటి అవినీతిపైన సర్వ శక్తివంతమైన వ్యవస్ధను కోరుకోవడంలోనే వైరుధ్యం ఉంది.

  ఈ వైరుధ్యం ఎందుకొచ్చింది? అన్న ప్రశ్న వేసుకుంటే… వ్యవస్ధలో ప్రాధమికంగానే వైరుధ్యాలున్నాయన్న అవగాహన హజారే బృందానికి లేదు. రాజ్యాంగం ఎటువంటి లొసుగులు లేకుండా ఉన్నదనీ, దాన్ని రాజకీయనాయకులూ, అధికారులే పాటించడం లేదనీ వారి భావన. కానీ రాజ్యాంగంలో కానీ, చట్టాల్లోగానీ తమ అవినీతికి తగిన లొసుగుల్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నారని హజారే బృందం భావించడం లేదు. అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగి ఉండకపోవచ్చు. కాని ఆ లోసుగులని పూడ్చకపోవడమే పాలకుల అసలు బుద్ధిని తెలుపుతోంది. ఇప్పటి వ్యవస్ధ, సర్వాధికారాలనూ ధనికవర్గానికి కట్టబెట్టింది. ఉత్పత్తి సాధనాలన్నింటినీ (భూమి, ఫ్యాక్టరీలు, మొ.వి) ధనికవర్గం చేతిలో ఉన్నపుడు, వారే కోర్టుల్నీ, పాలనా వ్యవస్ధలనీ శాసించగలుగుతారు. ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది అదే. అప్పుడప్పుడూ కపాడియా లాంటి వారు తగలడం కూడా యాదృచ్ఛికం కాదు.

  ఇప్పుడు సాగుతున్న అవినీతి విచారణ కేవలం కొద్దిమంది కార్యకర్తలు, కోర్టుల క్రియా శీలత్వం వల్లనే జరుగుతోంది. ఎస్.హెచ్.కపాడియాతో పాటు మరికొంతమంది, ఒక విషయాన్ని గుర్తించారు. ఇప్పటి రాజకీయ సామాజికవ్యవస్ధ పూర్తిగా చెడిపోయి ఉన్న విషయం గుర్తించారు. ఏ పార్టీ అవినీతికి అతీతంగా లేదని గుర్తించారు. దేశ సంబదలన్నీ కొద్దిమంది రాజకీయ, కార్పొరేట్ మాఫియాలే నియంత్రిస్తున్న సంగతిని గమనించారు. ఇదిలానే కొనసాగితే ప్రజలనుండి హింసాత్మక తిరుగుబాట్లు తధ్యమని కూడా గమనించారు. అందుకే మరమ్మతు పనులు చేపట్టారు. ఆ పనులు ఈ వ్యవస్ధపైన నమ్మకం కోల్పోకుండా చేయడానికి ఊపయోగపడతాయి. “ఎంత అవినీతి, దుష్పరిపాలన సాగినా సరిచేయడానికి కోర్టులున్నాయి. అవి పూనుకుని ప్రజా స్వామ్యాన్ని కాపాడతాయి” అన్న నమ్మకాన్ని ప్రజల్లో పెరగడానికి దోహదపడతాయి. అవి చేయగలిగింది అంతవరకే.

  సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్.ఎహ్.కపాడియా నేతృత్వంలో ప్రస్తుతం ప్రక్షాళనా కార్యక్రమం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దానికి మరికొంతమంది నిజాయితీ జడ్జిలు సయాయపడుతున్నారు. కపాడియా రిటైరయ్యాక ఇవి కొనసాగుతాయన్న గ్యారంటీ లేదు. ఇప్పటీకే సుప్రీం కోర్టు ఆదేశాలని కేంద్ర ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తూ రివ్యూపిటిషన్లని దాఖలు చేస్తోంది. అంటే అవినీతి, పోలీసు పాలన లాంటి అంశాలపై కోర్టు ఇచిన ప్రగతిశీల తీర్పులను సాధ్యమైనంతగా వాయిదా వేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కపాడియా పోతే దర్యాప్తులనన్నింటినీ అటకెక్కించగల కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది.

  సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్, సి.వి.సి. సి.బి.ఐ, ఇ.డి ఇవన్నీ ప్రజా ప్రతినిధులచేత నియమితమయ్యేవే. వాటికి స్వతంత్రంగా వ్యవహరించగల అధికారాలు ఉన్నాయి. కానీ నియామకాలు అవినీతిపరుల చేతిలోనే ఉన్నందున ఎక్కువసార్లు సరైనవారు అక్కడ నియమించబడరు. అప్పుడప్పుడూ కపాడియా లాంటివారు వచ్చినపుడు కొంత ఊపు వస్తుంది. వారు పోయాక వారిచ్చిన ఊపు కూడా పోతుంది. అంతిమంగా కోర్టుల క్రియా శీలత్వం కుళ్ళిపోయిన వ్యవస్ధపైన నమ్మకాన్ని తాత్కాలికంగా పెంచి, వారి తిరుగుబాటును మరికొంతకాలం వాయిదా వేస్తుంది.

  జపాన్ లో రెండు సంవత్సరాల్లో ముగ్గురు ప్రధానులు మారారు. ఇప్పటి ప్రధాని కూడా రోజులు లెక్కపెడుతున్నాడు. జపాన్ ఆర్ధిక వ్యవస్ధ మనకన్నా మూడున్నర రెట్లు పెద్దది. అయినా అక్కడ ఏ అస్ధిరత ఉన్నదని? పాలనలో అస్ధిరత్వం వచ్చినట్లు అక్కడ వార్తలేమీ లేవు. ముఖాలు మారుతాయి తప్ప పాలనకు ఢోకాలేవీ ఉండవు. ప్రధానిపై విచారణ వలన రాజకీయ, ప్రభుత్వ అనిశ్చితి ఏర్పడుతుందని అనడం మోసం తప్ప మరొకటి కాదు. రాజ్యాంగం వారికి ఆ అవకాశం ఇవ్వలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s