ఆగష్టు 16 దీక్షపై గుబులు? అన్నా హజారే పై కాంగ్రెస్ ముప్పేట దాడి!


ఆగష్టు 16 న లోక్‌పాల్ బిల్లుపై హజారే చేస్తానంటున్న నిరవధిక నిరాహార దీక్ష తేదీ దగ్గరు పడుతున్నకొద్దీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు, సచివులలో కూడా గుబులు పుట్టిస్తోంది. ఇన్నాళ్ళూ సామ, భేదో పాయాల్లో హజారేతో వ్యవహరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు అంతిమంగా దండోపాయానికి దిగిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో రాజకీయ నాయకులు, అధికారులు పాల్పడే అవినీతిని విచారించడానికి సమర్ధవంతమైన లోక్‌పాల్ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని అన్నా హాజారే నేతృత్వంలోని సామాజిక కార్యకర్తల బృందం చేస్తున్న డిమాండ్ కి స్పందించడానికి బదులు కాంగ్రెస్ పార్టీ, దాని నేతృత్వంలోని ప్రభుత్వం ఎదురుదాడి ప్రారంభించాయి.

అన్నా హజారే ఏర్పాటు చేసిన నాలుగు ధార్మిక సంస్ధలపై విచారణ చేసిన జస్టిస్ సావంత్ కమిటీ సంస్ధల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు తేల్చిందనీ ముందు వాటికి సమాధానం చెప్పాలనీ కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ కోరాడు. మరోవైపు ప్రభుత్వ ప్రతినిధిగా ప్రణబ్ ముఖర్జీ, అన్నా హజారే పై పార్లమెంటుపై ఆధిక్యత సాధించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఆరోపణలు సంధించాడు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండీ అత్యధిక కాలం దేశాన్నేలిన కాంగ్రెస్ పార్టీ ఇటువంటి సంక్షోభాలను మొదటి నుండీ ఎదుర్కుంటూ వచ్చింది. ఆ అనుభవంతోనే ఇప్పుడు కూడా హజారే బృందం సృష్టించిన సంక్షోభం నుండి ప్రయత్నించడానికి ప్రయత్నిస్తోంది.

ఏనాడూ ప్రజలకు జవాబుదారీగా ఉండని కాంగ్రెస్ పార్టీ ఐదుగురు సామాజిక కార్యకర్తల దీక్షలకు బెదిరి జవాబుదారీతనాన్ని కొని తెచ్చుకుంటుందని భావించడం భ్రమే కాగలదు. అయితే అన్నా హజారే బృందం తనముందుంచిన సవాళ్ళను కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుందన్నదే అసక్తికర విషయం. ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో ఉండడానికి అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీ, బాబా రామ్‌దేవ్ పట్ల వ్యవహరించినట్లుగా దండోపాయాన్నే ఎంచుకున్నట్లు తాజా దాడులను బట్టి స్పష్టమవుతోంది. అన్నా హాజారే గుణ గణాలపై దాడి చేయడం (character assassination) ద్వారా దాడి ప్రారంభించిన కాంగ్రెస్, ప్రభుత్వాలు దీక్షలో ఉన్న అన్నా హజారే బృందంపై పోలీసులతో దాడి చేయించడానికి తగిన భూమికను తయారు చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నది.

“ఆగష్టు 16 నుండి ప్రారంభం కానున్న దీక్షకు అవినీతి అంశంతో కానీ, లోక్ పాల్ బిల్లు తో గానీ ఎటువంటి సంబంధం లేదు” అని కాంగ్రెస్ ప్రతినిధి చెబుతూ హజారే నైతికక పునాదులను జస్టిస్ పి.బి.సావంత్ కమిషన్ బదాబదలు చేసిందని గుర్తు చేశాడు. 2003 సంవత్సరంలో అప్పటి మహా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నలుగురు మంత్రులపై హజారే చేసిన అవినీతి ఆరోపణలపైన జస్టిస్ పి.బి.సావంత్ కమిషన్ విచారణ జరిపింది. ఆ సందర్భంగా హజారే నేతృత్వంలోని నాలుగు ట్రస్టులపై కూడా విచారణ జరిగింది. “అవినీతి, లోక్ పాల్ లే దీక్షకు కూర్చోవడానికి కారణాలైతే హజారే ముందు తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి. అని మనీష్ తివారి పత్రికల సమావేశంలో కోరాడు.

హజారే ఒక పద్ధతి ప్రకారం దేశంలో అస్ధిరత తేవడానికి పార్లమెంటును అపహాస్యం చేయడానికీ ప్రయత్నిస్తున్నాడని కాంగ్రెస్ ఆరోపించింది. “ఎవరైనా అస్ధిరతను తేవడానికి ప్రయత్నిస్తున్నపుడు, ఏ రాజకీయ పార్టీ ఐనా తిరిగి పోరాటం చేయాల్సి ఉంటుంది” అని తివారీ అన్నాడు. అవినీతి, లోక్ పాల్ అంశాలపై సాగుతున్న ఘర్షణను కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అస్ధిరపరచడంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. ప్రధానిపై లోక్ పాల్ విచారణ చేస్తే అస్ధిరత్వం తలెత్తుతుందని ప్రభుత్వం వాదిస్తున్న సంగతి ఈ సందర్భంగా గమనార్హం. ఆ అస్ధిరత ఎందుకొస్తుందో పార్టీగానీ ప్రణబ్ ముఖర్జీ లాంటి పెద్దలు గానీ ఇంతవరకు వివరించిన పాపాన పోలేదు.

అవినీతి ఆరోపణలను రుజువైన ప్రధాని రాజీనామా చేయవలసి ఉంటుంది. ప్రధాని రాజీనామా చేసినపుడు పాలక పార్టీలోగానీ, కూటమిలో గానీ కొత్త ప్రధాని పదవి కోసం కుమ్ములాటలు బయలుదేరతాయి. ఆ విధంగా పాలక పార్టీలో అస్ధిరత ఏర్పడుతుంది. దానితో దేశ ప్రజలకు సంబంధం లేదు. ఒక వేళ ప్రధాని అవినీతి రుజువై రాజీనామా చేయవలసి వచ్చి కొత్త ఎన్నికలు జరిగితే అందులో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. వీరికి కావల్సినప్పుడల్లా ఎన్నికలు ఎలాగూ జరుగుతుంటాయి. దానికి అవినీతి ప్రధాని దిగినందువల్ల మరోసారి ఎన్నికలు వస్తే దానికి పాలకపార్టీ సిద్ధంగా ఉండక పోవచ్చుగానీ బహుశా భారత ప్రజలు సిద్ధంగానే ఉంటారు.

హజారేపై ఆరోపణలు చేస్తూ మనీష్ తివారీ ఆయన బృందాన్ని అసక్తికరంగా అభివర్ణించాడు. “అన్నా హజారే బృందం, పడక్కుర్చీ ఫాసిస్టులు, ఉపరితలం పైన ఉన్న మావోయిస్టులు, బట్టల బీరువాలో దాగిఉన్న అనార్కిస్టులతో కూడి ఉండి, మితవాద ప్రతీఘాతక శక్తుల వెనక సమకూరి, అదృశ్య శక్తుల నిధులతో పని చేస్తున్నారు” అని తివారీ అభివర్ణించాడు. అయితే ఇవన్నీ ప్రాసకోసం అవినీతి వ్యతిరేక ఆందోళనకారులపై సంధించిన పదజాలంగానే కనిపిస్తోంది. పార్లమెంటుని అపహాస్యం చేస్తున్నందుకు ఇతర పార్టీలు కూడా గళమెత్తాలని కూడా తివారీ పిలుపిచ్చాడు. కొంతమంది అరాచకాన్ని వ్యాపించడానికి ప్రయత్నిస్తూ ఐదుగురు మంత్రులు వరుసగా చర్చలు జరిపినప్పటికీ అరాచకం తమ జన్మ హక్కులా ప్రవర్తిసున్నారని తివారీ ఆరోపించాడు.

హజారేకి వ్యతిరేకంగా సావంత్ కమిషన్ కనుగొన్న అక్రమాలపై అప్పటి మహారాష్ట్రలోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఎందుకు వదిలేసిందన్న ప్రశ్నకు తివారీ సమాధానం దాటవేశాడని ‘ది హిందూ’ పేర్కొంది. “ఇప్పటి అంశం హజారే నైతికత గురించేననీ, అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం హజారే పట్ల ఎందుకు సానుకూలంగా ఉన్నది కాదనీ” అన్నాడు. అయితే భారత ప్రజలు కోరుతున్నది మాత్రం అవినీతిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకోవడం లేదన్నదే నని మనీష్ తీవారీకి అర్ధం అయినట్లు లెదు. వాస్తవానికి మనీష్ తివారి చేస్తున్నది ఎదురు దాడి తప్ప మరొకటి కాదు. హజారే, ఆయన బృందం ఒక్కటే ప్రభుత్వంలోని అవినీతిని విచారించాలని కోరుతున్నట్లుగా వారు ఒక కలర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు గానీ వారి వెనక ఉన్న ప్రజల మద్దతుని చూడ్డానికి నిరాకరిస్తున్నారు.

జస్టిస్ సావంత్ కమిషన్ 116 పేజీల నివేదిక వెలువరించిందనీ, గ్రామీణాభివృద్ధికీ నైతిక విద్యకూ ఏర్పాటు చేసిన హింద్ స్వారాజ్ ట్రస్టు నుండి రు.2.2 లక్షలను పుట్టినరోజు కోసం ఖర్చు చేసినట్లు కమిషన్ కనుగొన్నదని తివారీ చెప్పాడు. సదరు చర్య చట్ట విరుద్ధమని, అవినీతి కిందికి వస్తుందని చెప్పిందని గుర్తు చేశాడు. యాదవ్ బాబా శిక్షణ్ ప్రసారణ్ మండలి కి సంబంధించి 20 సంవత్సరాల పాటు ఎకౌంట్లు ఇవ్వలేదని కమిషన్ ఎత్తి చూపిందనీ, భ్రష్టాచార్ విరోధి జన్ ఆందోళన్ సంస్ధాన్ కి చెందిన ఉద్యోగులు నిదులు గుంజడానికీ, బ్లాక్ మెయిలింగ్ కీ, ఇతరుల సంపదలను ఆక్రమించడానికీ వినియోగించిన విషయం కనుగొన్నదనీ తివారీ వివరించాడు. హజారే ఆర్మీలో ఏం చేసిందీ తెలియ జేయాలని ఆర్.టి.ఐ చట్టం ప్రకారం కోరినా హజారె సమధానం ఇవ్వలేదని మరో ఆరోపణను తివారి చేశాడు. బృందంలోని శాంతి భూషణ్, సంతోష్ హెగ్డే లు ఈ అంశాలపై అన్న వద్ద వివరణ కోరాలని తివారీ కోరాడు. తద్వారా అన్నా బృందంలో విభజన సృష్టించాలని కాంగ్రెస్ ప్రతినిధి ప్రయత్నించాడని చెప్పవచ్చు.

అయితే హజారే పైన చేసిన ఈ ఆరోపణలను కమిషన్ కనుగొంటే అప్పటి ప్రభుత్వం ఏం చేసిందన్నది తప్పనిసరిగా తలెత్తే ప్రశ్న. అప్పుడు తీసుకోకుంటే ఇప్పుడన్నా చర్య తీసుకోవచ్చు. ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ అన్నా హజారే ఏ కారణం కోసం దీక్ష చేస్తున్నాడో ఆ కారణాల జోలికి పోకుండా బురద జల్లాలని కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నించడమే అతి పెద్ద అరాచకం. మనీష్ తివారీ చెబుతున్న అరాచకం ముందు ప్రభుత్వమే పెద్ద ఎత్తున చేస్తున్నది. వీరి అవినీతి, అరాచకాలే దేశ ప్రజల సమస్యలకు ప్రధాన కారణం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s