మార్క్సిజం పుట్టుక పరిణామం, మానవ స్వభావం, సోషలిజం అనివార్యత


మానవ స్వభావంలో మార్క్సిజం లో ఇమడని లక్షణాలు ఉన్నాయని’, ‘మార్క్సిజం లో ఖాళీలున్నాయనీ‘, “మార్క్సు చూడనిది మానవ స్వభావంలో ఏదో ఉందనిఇలాంటి భావాలు మానవ హక్కుల సంఘం నేత బాలగోపాల్ గారు ఒక ధీసిస్ లాంటిది రాశారు. అప్పటివరకూ ఆయన పౌరహక్కుల సంఘం నాయకుడుగా ఉంటూ పీపుల్స్ వార్ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారు. దానినుండి బైటికి వచ్చి ఆయన మానవ హక్కుల సంఘం పెట్టారు. పౌర హక్కుల…” నుండి మానవ హక్కుల…” అనే కాన్సెప్ట్ కి మారడం వెనక ఆయన మారిన అవగాహన ఉంది. అదొక సంగతి.

బాల గోపాల్ గారు రాసిన ధీసిస్ పైన రంగనాయకమ్మ గారు విమర్శ లేదా మార్క్సిస్టు దృక్పధంతో సమాధానం రాశారు. ఆవిడ రాసిన పుస్తకం పేరు కొండను తవ్వి ఎలకను కూడా పట్టనట్లు. బాలగోపాల్ గారు మార్క్సిజంలో తాను కనిపెట్టానని రాసిన ఖాళీలు నిజానికి ఎప్పుడో చర్చించబడ్డ అంశాలేననీ, వాటినే కొత్తగా బాలగోపాల్ తెచ్చారనీ సవివరంగా చర్చించి ఆయన వాదనలోని ఖాళితనాన్ని ఆవిడ తన పుస్తకంలో రుజువు చేశారు. దానికి బాలగోపాల్ గారు సమాధానం ఇవ్వలేదు. ఇవ్వడానికి కూడా ప్రయత్నించలేదు. నేను ఒకసారి ఓ చోట కలిసినపుడు (పరిచయం లేదు లెండి) రంగనాయకమ్మగారి విమర్శకి సమాధానం రాస్తున్నారా అని అడిగాను. దానికాయన ఎందుకు లెండి. నేను రాస్తే ఆవిడ ఇంకొకటి రాస్తుంది. ఎందుకదంతా?” అని కొట్టిపారేశారు. మార్క్సిజంలో ఆయన కనిపెట్టిన ఖాళీల ఖాళీతనం అలా ఉంది. బాలగోపాల్ గారు తనకు తట్టింది అలా పుస్తకాలుగా రాయడం, దానిపైన విమర్శలు రావడం, విమర్శలకు ఆయన జవాబులు ఇవ్వకపోవడం అప్పట్లో మామూలు సంగతి.

ఒక ధీసిస్ లాంటిది ఆయన రాసి పడేశాక దానిపైన విమర్శలు వస్తే సమాధానం తప్పనిసరిగా ఇవ్వలని ఆయన భావించకపోవడం విచిత్రం. ధీసిస్ లాంటిది అని ఎందుకంటున్నానంటే, మార్క్సిజం గురించి పైపైన తెలిసినవారికి, లేదా పూర్తిగా అవగాహన లేక పోయినా బాగా తెలుసు అనుకుంటున్నవారికి అది ధీసిస్ లాగా కనిపిస్తుంది. కాని మార్క్సిజం ని సరిగ్గా అర్ధం చేసుకున్నవారికి అది ధీసిస్ కాదని, తలా తోకా లేని ఆలోచనల కలబోత అని అర్ధం అవుతుంది. లేదా ఆ విమర్శలో మార్క్సిజంలోనే సమాధానం ఉందన్న విషయం అర్ధం అవుతుంది. నేను గతంలో రాసినట్లు మార్క్సిజం తమకు తెలుసునని భావిస్తూ నిజానికి దానిగురించి సరైన అవగాహన లేనివారు చాలామంది ఉన్నారు. వారికి బాలగోపాల్ వాదనలు గొప్ప ధీసిస్ లాగా అనిపించేవి. మార్క్సిజాన్ని సరిగా అర్ధం చేసుకోవడంలో వైఫల్యం జరిగినపుడు సహజంగానే అందులో ఏదో ఖాళీ ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ ఖాళీని ఖాళీ కాదని చూపిస్తూ, మార్క్సిజం మాటల్లొ చెప్పినపుడు దానికి తిరిగి సమాధానం రాయాల్సిన బాధ్యత బాలగోపాల్ పైన ఉన్నా ఆయనా పనికి పూనుకోలేదు.

మార్క్సిజం అద్దాలతో సమాజాన్ని, అందులోని సమస్యలను చూడడం అంటే ఏమిటి? ఏది ముందు? ఏది వెనక?

సమాజాలు మారుతూ వచ్చాయి. విఫ్లవాల ద్వారా ఆ మార్పులు జరుగుతూ వచ్చాయి. మరోపక్క శాస్ర సాంకేతిక రంగంలోజివ శాస్త్రంలో డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం, భౌతిక శాస్త్రంలొ శక్తి నిత్యత్వ సూత్రం, సామాజిక శాస్త్రంలొ ఫ్రెంచి ఫ్యూయర్ బా సోషలిస్టు భావాలు, తత్వ శాస్త్రంలో జర్మన్ హెగెల్ గతి తర్కంఇవన్నీ అప్పటికీ అభివృద్ధి చెంది ఉన్నాయి. వీటిలో వేటినీ మార్క్సు కనిపెట్టలేదు. కాని అవన్నీ మార్క్సిజానికి ప్రాణవాయువులుగా ఉపయోగపడ్దాయి. ఎంతగా ఉపయోగపడ్డాయంటే అవి లేకుండా మార్క్సిజం లేదు. ఏంగెల్స్ మార్క్సిజం పుట్టుకను గురించి వ్యాఖ్యానిస్తూ కాలం గర్భంతో ఉండి మార్క్సుని కన్నదిఅని అంటాడు. అంటే అప్పటికి మార్క్సిజం పుట్టడానికి కావలసిన పరిస్ధితులన్నీ మానవ సమాజంలో ఏర్పడి ఉన్నాయని అర్ధం. ఆ పరిస్ధితులు ఏర్పడకపోయినట్లయితే మార్క్స్ మిగతా మనుషుల్లాగే పుట్టి గిట్టేవాడు. కాకపోతే తత్వ శాస్త్రంలో మరొక పుస్తకం రాసి ఉండేవాడు కాని మార్క్సిజం పుట్టి ఉండేది కాదు.

క్కడ చెప్పదలుచుకున్నది మార్క్సిజం, మార్క్సిజం కోసమో లేక అప్పటికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కనుక తానూ ఒక సిద్ధాంతం సృష్టించాలని మార్క్స్ కి ఉన్న ఉబలాటం వల్లనో పుట్టలేదు. మార్క్సిజం జన్మించడానికి అప్పటికి ఒక చారిత్రక అవసరం ఏర్పడి ఉంది. ఆదిమ కమ్యూనిస్టు వ్యవస్ధ, బానిస వ్యవస్ధగానూ, బానిస వ్యవస్ధ ఫ్యూడల్ వ్యవస్ధగానూ, ఫ్యూడల్ వ్యవస్ధ పెట్టుబడిదారీ వ్యవస్ధగానూ అభివృద్ధి చెందింది. పెట్టుబడిదారీ వ్యవస్ధ లో వైరుధ్యాలు తీవ్రమై సంఘర్షణ జరుగుతున్న కాలం అది. అటువంటి ఒక సంఘర్షణ ఫలితంగా పారిస్ కమ్యూన్ పుట్టింది (పారిస్ ని కార్మికులు సాయుధంగా వశం చేసుకుని రెండు నెలలకు పైగా తమను తాము పాలించుకున్నారు. అది పారిస్ కమ్యూన్ గా చరిత్రలో రికార్డయ్యింది). పారిస్ కమ్యూన్ కూడా మార్క్సిజం లోని ఒక అంశాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడింది.

అంటే మార్క్సిజం అనేది కేవల కారల్ మార్క్స్ బుర్రలో మాత్రమే పుట్టింది కాదు. అది అప్పటి సమాజంలో పరిపక్వానికి వచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్ధితులనుండి పుట్టింది. అప్పటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్ధితుల ఉమ్మడి ప్రభావం, కారల్ మార్క్స్ మెదడు లో ప్రతిబింబించి మార్క్సిజంగా జనించింది. (భావాలు ఎలా పుడతాయి? అని ప్రశ్నించుకుంటే, మనిషి చుట్టూ ఉన్న సామాజిక పరిస్ధితుల ప్రతిబింబాలే మెదడులో భావాలుగా జనిస్తాయి అని సమాధానం చెప్పుకుంటాము. అదే నేనిక్కడ చెబుతున్నాను. నా సొంత సిద్ధాంతం కాదిది.) కానీ మార్క్స్ కే ఎందుకు తట్టింది? మరో పుల్లయ్యకి ఎందుకు తట్టలేదు? ఎందుకంటే, కారల్ మార్క్స్ అప్పటికి తత్వశాస్త్ర పరంగా హెగెల్ అనుచరుడుగా ఉన్నాడు. హెగెల్ నిజానికి భావవాది. కాని మార్క్సు ఫ్యూయర్ బా నుండి సోషలిస్టు భావాజాలం అందిపుచ్చుకున్నాక హెగెల్ తత్వంలోని గతి తర్కాన్ని దానికి జోడించగలిగాడు. హెగెల్ తత్వ శాస్త్రం లేనట్లయితే మార్క్సుకి ఫ్యూయర్ బా భౌతిక వాద సోషలిజం అందినా వృధా అయి ఉండేది. పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే మార్క్సు హెగెల్ కి శిష్యుడు. తన చుట్టూ అభివృద్ధి చెందిన వివిధ శాస్త్రాల సిద్ధాంతాలను ఫ్యూయర్ బా భౌతికవాదానికి అన్వయించినపుడు హెగెల్ గతి తర్కం తలకిందులుగా ఉన్న అంశాన్ని మార్క్సు గ్రహించాడు. ఈ గమనింపు అత్యంత ముఖ్యమైనది. తలకిందులుగా ఉన్న హెగెల్ గతి తర్కాన్ని యధాస్ధానానికి తెచ్చి ఫ్యూయర్ బా బౌతికవాదానికి అన్వయించి, అప్పటికి అభివృద్ధి చెందిన శక్తి నిత్యత్వ సూత్రమూ, డార్విన్ పరిణామ సిద్ధాంతమూ తదితర శాస్త్ర ఆవిష్కరణలను, తన చుట్టూ ఉన్న సామాజికార్ధిక రాజకీయ పరిస్ధితుల వెలుగులో పరిశీలించిన మార్క్సు గతితార్కిక భౌతికవాద తత్వ శాస్త్రాన్ని ఆవిష్కరించాడు.

ఈ ఆవిష్కరణ జరిగాక మార్క్సు ఇక ఎంత మాత్రమూ హెగెల్ శిష్యుడిగా లేడు. పైగా హెగెల్స్ తత్వ శాస్త్రానికి పూర్తిగా భిన్న ధృవమైన అత్యంత మౌలికమైన, ఆధునిక తత్వ శాస్త్రానికి పరమ మూలమైన గతితార్కిక భౌతిక వాద తత్వ శాస్త్రానికి సృష్టికర్తగా నిలిచాడు. గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాన్ని సామాజిక పరిణామాలకి అన్వయించి చారిత్రక భౌతికవాద సిద్దాంతాన్ని ఆవిష్కరించాడు. తన తాత్విక చింతనను ఆర్ధిక వ్యవస్ధ పునాదులకి అన్వయించి “దాస్ కేపిటల్” రచించాడు. దాస్ కేపిటల్ రచించడానికి మార్క్సుకి తోడ్పడిన ముఖ్యమైన అంశం మరొకటుంది. అది బ్రిటన్ పెట్టుబడిదారీ విధానం. బ్రిటన్‌లో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందకపోయినట్లయితే కారల్ మార్క్స్ చేతి నుండి “దాస్ కేపిటల్” మనకి అంది ఉండేది కాదు. దాస్ కేపిటల్ లో కారల్ మార్క్సు కనిపెట్టిన అతి ముఖ్యమైన అంశం అదనపు విలువ‘. పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇలా ఉంది ఇతర ఆర్ధికవేత్తలు కూడా కొంత తేడాలతో చెప్పినా, మార్క్స్ దర్శించిన అదనపు విలువను మిగిలిన వారు చూడలేకపోయారు. ఎందుకంటే వారికి గతితార్కిక భౌతికవాద తాత్విక భూమిక లేదు గనక.

అప్పటివరకూ తత్వవేత్తలు తత్వశాస్త్రాన్ని పండితులకే పరిమితమైన శాస్త్రంగా భావించేవారు. జీవిత కాలమంతా కాచివడపోసి ఉన్న మహా పండితులు మాత్రమే చర్చించుకునే శాస్త్రంగా భావించేవారు. కాని కారల్ మార్క్సు ఆ తత్వ శాస్త్రం మెడపట్టి లాక్కొచ్చి కార్మికవర్గానికి పాదాక్రాంతం చేశాడు. తత్వ శాస్త్రాన్ని కార్మిక వర్గానికి పాదాక్రాంతం చేయడం అంటే మాటలు కాదు. సమాజంలో తొంభైతొమ్మిది మందికి అర్ధం కాని శాస్త్రంగా, పడక్కుర్చీ పండితులకే పరిమితమైన శాస్త్రంగా మన్ననలందుకుంటున్న తత్వ శాస్త్రాన్ని అసలు ఉపయోగపెట్టవలసింది తొంభైతొమ్మిది మంది కష్టించి పనిచేసే వారి కోసమని కారల్ మార్క్స్ నిర్ద్వంద్వంగా నిరూపించాడు. తత్వశాస్త్రానికి ఉన్న పండిత, మేధో బంధనాలని ఒక్క ఉదుటున తెంచి కార్మిక వర్గ కాళ్ళపై పడవేసిన కారల్ మార్క్స్ బహుధా అభినందనీయుడు. సర్వకాల సర్వావస్ధలందు కూడా స్మరణీయుడు. మానవ సమాజం ఉన్నంత కాలం మనిషి శ్రమ చేయవలసిందే. శ్రమ చేయకుండా ఈ ప్రపంచంలో ఒక్క పూచిక పుల్ల కూడా నడిచిరాదు. అటువంటి శ్రామికులని ఈసడించుకుంటూ, శాస్త్రాల పరిజ్ఞానాన్ని తమ సొత్తుగా భావిస్తూ వచ్చిన కులీన వర్గ పండితుల విశ్వాసాలను మార్క్సు బదాబదులు చేస్తూ శ్రమకి అగ్రపీఠాన్ని అందించాడు.

మధ్య యుగాలలొ కులవ్యవస్ధ బలిష్టంగా ఉన్న కాలంలో మెడకు ముంత, మొలకు తాటాకు కడితే తప్ప రోడ్డు మీదకి పంచములని రానీయని వ్యవస్ధ ఉన్న కాలంలో ఒక పంచముడికి, దేశ దేశాల రాజులు వశం చేసుకోవాలని పోటీపడుతున్న ఒక అందమైన సుకుమారమైన బ్రాహ్మణ యువతిని (దురుద్దేశం ధ్వనిస్తే అది నాది కాదని విన్నవించుకుంటున్నాను) ఇచ్చి పెళ్ళి చేయడం సాధ్యమవుతుందేమో ఒక్క సారి ఊహించండి! అటు సూర్యుడు ఇటు పొడవచ్చు గాక! మన్నూ మిన్నూ ఏకం కావచ్చుగాక! సాగరములన్నియు ఏకము కావచ్చును గాక! అది మాత్రం సాధ్యం అయి ఉండేది కాదు. కానీ కారల్ మార్క్సు దాన్ని సుసాధ్యం చేశాడు. కులీనుల పడక్కుర్చీ మేధావుల చర్చలలో ఓలలాడే తత్వశాస్త్ర సామ్రాజ్యానికి కార్మికవర్గాన్ని పట్టాభిషిక్తుడిని చేయడం దానితో సమానంగా భావించవలసి ఉంది.

సరే, ఈ క్రమాన్ని బట్టి మనకు అర్ధమవుతున్నదేమిటి? కారల్ మార్క్స్ తన సిద్ధాంతాన్ని ప్రకటించేనాటికి సామాజిక, ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధ లో ఉన్న పరిస్ధుతులనుండే మార్క్సిజం పుట్టింది. ఇక్కడ ఏది ముందు? సమాజం ముందు. దాని తర్వాతే మార్క్సిజం. కారల్ మార్క్సు ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని ఊహించుకుని దానికి అనుగుణంగా తన సిద్దాంతాన్ని తయారు చేయలేదు. సామాజిక వ్యవస్ధల పరిణామాన్ని ఆయన పరిశీలించాడు. ఒక వ్యవస్ధ నుండి మరొక వ్యవస్ధ మారిన క్రమాన్ని పరిశీలించాడు వ్యవస్ధలు విప్లవాల ద్వారా మారుతున్న క్రమాన్ని పరిశీలించాడు. ఏయే విప్లవాలకు ఏయే ఆర్ధిక వర్గాలు నాయకత్వం వహించాయో, ఏయే ఆర్ధిక వర్గాలు వారికి సహకరించాయో పరిశీలించాడు. విప్లవాల అనంతరం ఏర్పడిన నూతన సమాజాల గతిని పరిశీలించాడు. ఆ గతి వెళ్తున్న మార్గాన్ని గమనించాడు. వ్యవస్ధలను పైపైన మాత్రమే చూడకుండా వ్యవస్ధ నిలబడడానికి మూలకారకులైన వర్గాలెవరో గమనించాడు. వ్యవస్ధ నిలబడడానికి మూలమైన వర్గాల పరిస్ధితినీ, మూలంగా లేకపోయినా వ్యవస్ధనంతటినీ గుప్పెట్లో పెట్టుకున్న వర్గాలేవిటో గ్రహించాడు. విప్లవాలలో వారి పాత్రను చూశాడు. బానిస వ్యవస్ధల నుండి పారిస్ కమ్యూన్ వరకూ ప్రతి విప్లవాన్నీ, ప్రతి సామాజిక పరిణామానికి ఆద్యులెవరో, చివరికి పై స్ధానానికి చేరిందెవరూ చూశాడు. ఈ పరిణామాలన్నింటిలోనూ దండలో దారంలాగా ఒక క్రమాన్ని గమనించాడు కారల్ మార్క్సు. అ క్రమంలోనే తానున్న వ్యవస్ధ తదుపరి ఏ రూపంలోకి మారుతుందో అంచనా వేశాడు. అలా వేసిన అంచనాయే సామ్యవాద వ్యవస్ధ.

ముందు వెళ్ళినవారు ఎటువైపు వెళ్లారో కనుక్కొవడానికి వెనక వచ్చేవారు ఏం చేస్తారు? వారి కాలి జాడలను చూస్తారు. అవి ఏదిక్కుకి వెళుతున్నాయో చూస్తారు. ఆ దిక్కువైపే వెళ్ళి ముందు వెళ్ళినవారితో కలుస్తారు. కారల్ మార్క్స్ చేసిందిదే. ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి పెట్టుబడిదారి వ్యవస్ధ వరకూ జరిగిన పరిణామక్రమాన్నీ, ఆ పరిణామాల క్రమాన్ని శాస్త్ర బద్ధంగా, జీవ, బౌతిక, రసాయన, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, శాస్త్రాల ఆధారంగా గత సమాజాల అడుగుజాడల్ని పసిగట్టాడు. ఆ అడుగుజాడల ఆధారంగా సామాజిక పయనాన్ని గమనించి దాని భవిష్యత్తు గమనాన్ని చూశాడు కారల్ మార్క్సు. ఊహాలతో కాదు సుమా! పెట్టుబడిదారీ వ్యవస్ధ అభివృద్ధి క్రమంలోనే దాని తదుపరి వ్యవస్ధల తీరుతెన్నులను కూడా చూశాడు. తదుపరి వ్యవస్ధ మూలాలు పెట్టుబడిదారీ వ్యవస్ధలోనే ఉన్నాయని ఎత్తి చూపించి, దాని ప్రకారమే సామ్యవాద వ్యవస్ధ ఏర్పడుతుందని నిరూపించాడు.

అంటే సామ్యవాద వ్యవస్ధ యుటోపియా ఎంత మాత్రమూ కాదు. సామ్యవాద యుటోపియా కారల్ మార్క్స్ పుట్టక ముందరి సంగతి. దానికీ కారల్ మార్క్స్ నిరూపించిన సామ్యవాద వ్యవస్ధకే పొంతనే లేదు. సామ్యవాదం అనగానే మార్క్సుకి ముందరి యుటోపియా భావజాలాన్ని గుర్తు తెచ్చుకుని అదొక ఆదర్శవంతమైన సమాజం. అది ఊహలలోనిదే అని ఆలోచనలను అంతటితో ముగించడం మార్క్సిజం కాదు. మార్క్సిజం చెప్పిన సామ్యవాద వ్యవస్ధ, సామాజిక వ్యవస్ధలు తాము నడుస్తున్న దారిలో పయనమై వెళుతూ ఉన్న క్రమంలో ఏర్పడే అనివార్య సామాజిక పరిణామం. దానికి ఒకరి ఇష్టాఇష్టాలతో సంబంధం లేదు. ఒకరి ఊహలు ఆదర్శాలతో సంబంధం లేదు. ఒకరి చావు పుట్టుకలతో సంబంధం లేదు. మరొకరి సిద్ధాంత రాద్ధాంతాలతో అసలే సంబంధం లేదు. తూర్పున పొడిచే సూర్యుడు ఎటు అసమిస్తాడు? ప్రతి రోజూ లేచి ఈరోజు ఉత్తరాన అస్తమిస్తాడా, దక్షిణాన అస్తమిస్తాడా, లేక ఎప్పటిలా పడమట అస్తమిస్తాడా అని చర్చిస్తూ కూచుంటే, ఆ చర్చల ఫలితం కోసం సూర్యాస్తమయం ఆగదు. అది తన దారిన తాను పోతుంది.

హాలీవుడ్ దర్శకుడొకరు ఒక పరిస్ధితిని ఊహించి ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్అని సినిమా తీశాడు. అందులో హీరో  ముసలోడిగా పుట్టి పసివాడిగా చనిపోయినట్లు చూపిస్తాడు. ఆయన అది ఊహించి తీసిన సినిమా. అది చూసి ఏ జంటయినా అదెలాగొ ఉంటుందో చూద్దామను కుంటే సాధ్యమేనా? పెట్టుబడిదారీ వ్యవస్ధ శాశ్వతమని భావించడం అలాంటిదే. వ్యవస్ధలో సమస్యలు, వైరుధ్యాలన్నీ పరిష్కారం అయ్యేంతవరకూ అది ముందుకు పోతూ ఉంటుంది. ఆ గమనంలో కొన్ని సార్లు వెనకడుగులుండవచ్చు, మానవ సమాజం గనక. కాని అవి తాత్కాలికమే.

మనం ధరించే ఫ్యాంట్ ఎన్ని రూపాలు మార్చుకుందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం! 1970 ల ప్రారంభ కాలంలో పురుషులు ధరించిన ఫ్యాంట్ బాగా narrow గా ఉండేది. కాలికి అంటుకు పోయినట్లుండేది. ఫ్యాంట్ విడవాలంటే ఎవరైనా కింద కూర్చుని చివర్ల పట్టుకుని లాగవలసి ఉండేది. కొన్నాళ్ళకి అది అసౌకర్యంగా తోచింది. కిందినుండి తేలికగా విడవడానికి వీలు కలిగేటట్లుగా రూపం మార్చుకుని బెల్ బాటమ్ అయింది. 70 ల దశాబ్దం రెండో అర్ధభాగానికి వచ్చేసరికి ఈ బెల్ బాటం విస్తృతంగా వాడకంలోకి వచ్చింది. కానీ అది కూడా అసౌకర్యంగా మారింది. వెడల్పైన  బెల్ బాటం నేలమీదికి రాసుకుని చినిగిపోయి అసహ్యంగా ఉండేవి. మళ్ళీ narrow వైపుకి మార్పు జరిగింది. ఈ సారి అంతకుముందరి narrow కాకుండా మరికొంత సౌకర్యవంతంగా మారింది. పైన లూజుగా, కిందికి వచ్చేసరికి పాదాలలో సగం వరకు ఉండేలా మారింది. అంటే పాత నేరో లోని అసౌకర్యాన్ని తొలగించుకుని బెల్ బాటంగా మారిన సౌకర్యాన్ని నిలుపుకుంది. కానీ అదీ తర్వాత అసౌకర్యంగా మారి మొత్తం లూజుగా ఉండేలా పార్లల్ వచ్చింది. అది గొట్టం ఫ్యాంటులా ఉండేసరికి అది కొద్ది కాలం మాత్రమే మనగలిగింది. ఇప్పుడది బ్యాగీగా స్ధిరపడింది. పైనుండి కిందివరకూ ఏ స్ధానంలో ఎంత లూజు ఉండాలో అంతే ఉండేలా దర్జీలు ఫ్యాంటులు కుడుతున్నారు. ఈ పయనానికి ఎవరు మార్గదర్శకం? ఎవరిది పధకరచన? ఏ ఒక్కరిదీ కాదు. వస్త్రధారణకి ఒక వ్యవస్ధ మనకి తెలియకుండానే ఏర్పడిపోయింది. అది comfortability వైపుగా రూపం మార్చుకుంటూ వచ్చింది. సౌకర్యవంతంగా ఉండేలా రూపం మార్చుకుంటూ వచ్చింది. ఏ వ్యవస్ధకి సంబంధించిన పరిణామ క్రమాన్నైనా చూడండి మనకొక క్రమం కనిపిస్తుంది. అది సౌకర్యవంత మైన స్ధితికి దారితీస్తూ ఉంటుంది. మన హెయిర్ స్టైల్ కూడా ఇలాగే మారుతూ వచ్చిన క్రమాన్ని మనం గమనించవచ్చు.

మానవ సమాజం కూడా అంతే. సౌకర్యవంతమైన వ్యవస్ధ స్ధిరపడేదాకా వ్యవస్ధ మారుతూ ఉంటుంది. మానవ సమాజానికి సౌకర్యవంతమైనది ఏమిటి? వైరుధ్యాలు లేకపోవడమే సౌకర్యవంతం. పేద, ధనిక వ్యత్యాసాలు, పాలకుడు పాలితుదు వ్యత్యాసాలు, పట్టణం గ్రామం వ్యత్యాసాలు, శారీరక శ్రమకూ, మేధో శ్రమకీ వ్యత్యాసాలూ, మతం, కులం, ప్రాంతం, ఇలా సమస్త వ్యత్యాసాలు పరిష్కరించబడే వరకూ సమాజం మారుతూనె ఉంటుంది. కారల్ మార్క్సు ఈ మార్పులను శాస్త్ర బద్దం చేశాడు. అది మార్క్సు రచించాడు కనక మార్క్సిజం అయ్యింది. పుల్లయ్య గమనించి రచించినట్లయితే పుల్లయ్యిజం అయి ఉండేది. మార్క్సిజం అనగానే జర్మనీకి చెందిన ఒక గడ్డపాయన రాస్తే, ఎక్కడో రష్యాలో, చైనాలో విప్లవాలు వస్తే, వారిని చూసి భారతీయులు అనుకరించేది కాదు. ధామస్ ఎడిసన్ బల్బు కనిపిడితే అమెరికా వాడు విదేశీయుడు కనిపెట్టాడని వాడడం మానేస్తున్నామా? శాస్త్ర బద్ద ఆవిష్కరణ ఎవరు చేసిన ప్రపంచం అంతా దానిని వినియోగిస్తుంది. మార్క్సిజం అంతే. సామాజిక, రాజకీయ, ఆర్ధిక వ్యవస్ధ పరిణామ క్రమానికి చెందిన నియమాల సమాహారమే మార్క్సిజం. ఒక క్రమంలో పెట్టిన విజ్ఞానం, శాస్త్రంగా మారుతుంది. అలా మారిన సామాజికార్దిక రాజకీయ శాస్త్రమే మార్క్సిజం. ఆయన కాలంలో సామ్రాజ్యవాదం అభివృద్ధి చెందలేదు. అందుకని మొదటి విప్లవం బ్రిటన్ లో వస్తుందని మార్క్సు ఊహించాడు. ప్రపంచంలో పరిపక్వ దశకు వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ బ్రిటన్ లోనే ఉంది గనక అక్కడే మొదటిసారి సోషలిస్టు విప్లవం సంభవిస్తుందని ఆయన భావించాడు. కాని అలా జరగలేదు. కారణం?

మార్క్సు కాలంనాటికి పూర్తిగా అభివృద్ధి చెందని సామ్రాజ్యవాద వ్యవస్ధ (ఫైనాన్సియల్ పెట్టుబడిని ఎగుమతి చేసి దానిపై పట్టుద్వారా మూడవ ప్రపంచ దేశాలని అదుపులో పెట్టుకోవడం) లెనిన్ కాలానికి అభివృద్ధి చెందింది. ప్రపంచంలో ఉన్న సామ్రాజ్యవాద దేశాలు ఒకరినొకరు సహకరించుకుంటూ గొలుసుకట్టుగా ఏర్పడ్డారనీ, ఆ గొలుసుకట్టులో ఎక్కడ లింకు బలహీనంగా ఉంటే అక్కడ మొదట సోషలిస్టు విప్లవం సంభవిస్తుందని లెనిన్ సూత్రీకరించాడు. ఆయన చెప్పినట్లే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా సామ్రాజ్యవాదం బలహీనపడి అక్కడ విప్లవం బద్దలైంది. చైనాకి వచ్చేసరికి అక్కడ కార్మికవర్గం సరిగా అభివృద్ధి చెందలేదు. రైతాంగం ప్రధానంగా ఉండి భూములు వారి చేతిలో కాక భూస్వాముల చేతిలో కేంద్రీకరించబడి రైతులపై దోపిడీ సాగింది. కార్మికవర్గం అభివృద్ధి చెందని వ్యవసాయక దేశాల్లో కార్మికులు రైతులు ఉమ్మడిగా నూతన ప్రజాస్వామిక విప్లవం తేవాలని మావో సూత్రీకరించి ఆ మేరకు కృషి చేసి విజయం సాదించాడు.

అంటే మార్క్సిజం మార్క్సు సూత్రీకరణల దగ్గరే ఆగిపోలేదు. వ్యవస్ధలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందింది. మార్క్సిజం, మార్క్సిజం-లెనినిజం అయ్యింది. అది మార్క్సిజం-లెనినిజం-మావో ధాట్ గా అభివృద్ధి చెందింది. మార్క్సిజం పిడివాదం అనేవారికి ఇది సమాధానం.

కనుక మార్క్సిస్టు సూత్రాలు సామాజిక పరిణామక్రమాలనుండి గ్రహించిన క్రమానుగత నియమాల సారాంశం. ఎవరు ఏ యిస్టు లైనా, ఈ సామాజిక నియమాలకి కట్టుబడి ఉండవలసిందే. నేనుండను అన్నా అది ఆచరణలో వీలు కాదు. హోళీ పండగరోజే రంగులు చల్లడానికి జనం పరిచయం లేకపోయినా అనుమతిస్తారు. కాని రోజు వచ్చి నేనీరోజు హోళీ జరుపుకుంటున్నా, రంగులు జల్లుతా అంటే జనం నాలుగిచ్చుకుంటారు. అంటే సామాజిక నియమాలకు ఒకరి ఇష్టాఇస్టాలతో నిమిత్తం లేదు. అవి జరిగిపోతుంటాయి. అయితే మనిషి చేయగల పని ఏమిటి? ఆ నియమాలను కనుగొని, పరిణామాలు ముందుకు సాగే క్రమంలో వాటిని వేగవంతం చేయడానికి తగిన చర్యలను మనిషి తీసుకోగలడు. ఏమిటా చర్యలు? విప్లవ సిద్ధికి ఒక వ్యవస్ధను ఏర్పరుచుకుని అందుకోసం కృషి చేయడం. ఆ కృషే కమ్యూనిస్టు పార్టీల ఏర్పాటు. ఆందోళనలు, ప్రజల సమీకరణ, వారి సహకారంతో సామాజిక మార్పుకు కృషి చేయడం. చేయకపోతే? ఆ పరిస్ధితి ఉండదు. మనిషి చేస్తాడు. ఎంతటి నిరాశామయ పరిస్ధితిలోనయినా మనిషి ప్రయత్నిస్తూనే ఉంటాడు. లేకుంటే సౌకర్యవంతమైన స్ధితి రాదు.

ఇప్పటి సామాజిక మార్పులు ఒక జీవిత కాలంలో సాద్యం కాకపోవచ్చు. ఇపుడున్నవారు తమ కృషితాము చేస్తే తరువాతివారు అక్కడినుండి కృషిని అందుకుంటారు. ప్రజలు పూనుకోవడానికి కొన్ని సామాజిక పరిస్ధితులు కూడ అవసరమే. ఇప్పటి పరిస్ధితులు అందుకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని మార్క్సిస్టు లెనినిస్టులు భావిస్తున్నారు. కాని స్వీయాత్మక పరిస్ధితులు సిద్ధంగా లేవు. అంటే మార్పుని తలపెట్టాల్సిన కార్మిక వర్గం ఐక్యంగా లేదు. రైతులు కూడా తమ సమస్యలపై ఉద్యమిస్తున్నారు గానీ వారికి నాయకత్వం వహించవలసినవారు సిద్ధంగా లేరు. రైతాంగం, కార్మికవర్గం కూడా ఐక్యం కాలేదు. పెట్టుబడిదారీ వర్గం, వారు ఒకటికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నందున ఉద్యమాలు కూడా దూరం జరుగుతున్నాయి. కాని మనిషి అది తలపెడతాడు. ఎప్పుడన్నదే సమస్య తప్ప వస్తుందాలేదా అన్నది సమస్య కాదు.

చివరిగా చెప్పేది మానవ స్వభావం అనేది తనంతట తానే ఎక్కడా ఉండదు. మనిషి చుట్టూ ఉన్న సామాజిక పరిస్ధితుల భావాలు మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుపై ప్రతిబింబించినప్పుడు పుట్టేవే భావాలు. సమాజం నుండి పుట్టే భావాలు సామాజిక సూత్రాలకు అతీతంగా ఉంటాయనడం సరైంది కాదు. రాముడి కాలంలో పుష్పక విమానం అంటే ఆర్టిస్టులు ఎలా గీస్తారు? బోయింగ్ విమానం బొమ్మని గీయరు. నాలుగు స్తంభాలు గల మందిరం గీసి రెక్కలు తొడుగుతారు. రాముడి కాలానికి మనిషి ఊహించగల విమానం అదే. గాల్లొ ఎగిరేవాటికి రెక్కలుండాలి. రాజులు ప్రయాణించేది కనుక రాజమందిరం ఊహించి దానికి రెక్కలు తొడిగారు. మనిషి మెదడుకి తమ చుట్టూ ఉన్న పరిస్ధితులకు అతీతంగా ఊహలు, భావాలు సాధ్యం కాదని చెప్పడానికి ఇది. అలాగే ఒక మనిషి ఇస్టా ఇష్టాలు, అతని భావాలు, ఊహలు, ఆశలు అన్నీ సమాజ పరిదులకి లోబడే ఉండాలి ఉంటాయి కూడా. మనిషి భౌతిక పరిస్ధితికి అతీతంగా అతని ఊహలు, భావాలు ఉంటాయని భావిస్తే చాలా శాస్త్రాలని తిరగరాయాల్సి ఉంటుంది.

అందువలన మనిషి స్వభావం ఊహాతీతంగా, సామాజిక నియామలకు అతీతంతా ఉండదని గ్రహించాలి. అది గ్రహించాక ఇతర అనుమానాలన్నీ దూదిపింజల్లా తేలిపోవలసిందే.

19 thoughts on “మార్క్సిజం పుట్టుక పరిణామం, మానవ స్వభావం, సోషలిజం అనివార్యత

 1. Great write up Visekhar Gaaru…Great explanation.You writings need to reach more and more people..I wish some one publish all your posts as a book..Good work..I am Proud that you are from our Tatikonda,Great Guturian..

 2. శేఖర్ గారు,
  ఎన్నాళ్ల తర్వాత ఇంత మంచి వ్యాసం చదివానండీ..ఏ సిద్ధాంతం పైన అయినా గుడ్డి ద్వేషం తగదనే సూక్తిని విశ్వసించే భావజాల నిజాయితీ కలిగిన ఎవరయినా సరే ఈ సైద్ధాంతిక పరిచయాన్ని, మీ వ్యాఖ్యలను తప్పనిసరిగా చదవాలి. నా ఉద్దేశంలో మార్క్సిజం సానుభూతిపరులు, విశ్వసించేవారి కంటే మార్క్సిస్ట్ వ్యతిరేకులు చదివితీరవలసిన గొప్ప రచన ఇది.

  సైద్ధాంతికంగా మార్క్సిజాన్ని వ్యతిరేకించడం కంటే సోషలిస్టు ఆచరణలో గత 80 ఏళ్లుగా జరుగుతూ వచ్చిన ఘోరమైన పొరపాట్ల కారణంగా కమ్యూనిస్టులంటేనే గుడ్డి వ్యతిరేకత మేధోప్రపంచంలో ప్రబలి ఉన్న పరిస్థితి ఇప్పుడు ప్రపంచమంతటా చాలా తీవ్రంగా ఉడటం వాస్తవమే.

  కాని, మానవ ఆలోచనా పరిణామ క్రమంలో ఆవిర్భవించిన మార్కిస్ట్ ప్రాపంచిక దృక్పధాన్ని ఇంత నచ్చచెప్పే రీతిలో మీరు రాయడం హృద్యంగా ఉంది. ఈ నచ్చచెప్పే ధోరణి మీ ప్రతి వ్యాసంలోనూ ఉండాలని, మార్క్సిజాన్ని గుడ్డిగా వ్యతిరేకించేవాళ్లను కూడా ఇలాగే కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  ‘కాలం గర్భంతో ఉండి మార్క్సుని కన్నది” ఎంగెల్స్ వ్యాఖ్య మనస్సును ఉర్రూతలూగిస్తోంది. మార్క్సిజాన్ని మనిషి భౌతిక, బౌద్ధిక పరిమాణక్రమంలో ఆవిర్భవించిన సరికొత్త ఆవిష్కరణగా ఎంగెల్స్ ఎంత గొప్ప వ్యాఖ్య చూశాడో.

  “మార్క్సు రచించాడు కనక మార్క్సిజం అయ్యింది. పుల్లయ్య గమనించి రచించినట్లయితే పుల్లయ్యిజం అయి ఉండేది. ధామస్ ఎడిసన్ బల్బు కనిపెడితే అమెరికా వాడు విదేశీయుడు కనిపెట్టాడని వాడడం మానేస్తున్నామా? శాస్త్ర బద్ద ఆవిష్కరణ ఎవరు చేసిన ప్రపంచం అంతా దానిని వినియోగిస్తుంది. మార్క్సిజం అంతే.”

  మార్క్సిజం రూపంలోని విదేశీయ సిద్ధాంతాన్ని భారతీయ కమ్యూనిస్టులు కౌగలించుకుని అంటకాగుతున్నారంటూ గత అయిదు దశాబ్దాలుగా విద్వేష ప్రకటనలు చేస్తున్న పిదపబుద్దులు గుండు సూది నుంచి మొదలుకుని ఆధునిక విమానాల వరకు పాశ్చాత్య మేథస్సు శతాబ్దం పైగా ఆవిష్కరిస్తున్న ప్రతి వస్తువును, భౌతిక సౌకర్యాలను ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా వదులుకోకుండా అనుభవిస్తునే ఉన్నారు. తమ బ్యాంకు బ్లాలెన్సులూ, ఆస్తులూ, వడ్డీ వ్యాపారాలు, సమాజ వనరులను కొల్లగొట్టడాలు ఇలాగే కొనసాగుతుంటాయనీ, ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది.. ఉండాలనీ తమకే సాధ్యమైన గుడ్డి విశ్వాసంతో ఉంటున్న వారు మీ పై వ్యాఖ్యను తమ జీవితంలో ఎన్నటికీ అర్థం చేసుకోలేరు.

  “ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి పెట్టుబడిదారి వ్యవస్ధ వరకూ జరిగిన పరిణామక్రమాన్నీ, ఆ పరిణామాల క్రమాన్ని శాస్త్ర బద్ధంగా, జీవ, బౌతిక, రసాయన, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, శాస్త్రాల ఆధారంగా గత సమాజాల అడుగుజాడల్ని పసిగట్టాడు. ఆ అడుగుజాడల ఆధారంగా సామాజిక పయనాన్ని గమనించి దాని భవిష్యత్తు గమనాన్ని చూశాడు కారల్ మార్క్సు.

  మానవ సమాజానికి సౌకర్యవంతమైనది ఏమిటి? వైరుధ్యాలు లేకపోవడమే సౌకర్యవంతం. పేద, ధనిక వ్యత్యాసాలు, పాలకుడు పాలితుదు వ్యత్యాసాలు, పట్టణం గ్రామం వ్యత్యాసాలు, శారీరక శ్రమకూ, మేధో శ్రమకీ వ్యత్యాసాలూ, మతం, కులం, ప్రాంతం, ఇలా సమస్త వ్యత్యాసాలు పరిష్కరించబడే వరకూ సమాజం మారుతూనే ఉంటుంది. కారల్ మార్క్సు ఈ మార్పులను శాస్త్ర బద్దం చేశాడు.”

  “రాముడి కాలంలో పుష్పక విమానం అంటే ఆర్టిస్టులు ఎలా గీస్తారు? బోయింగ్ విమానం బొమ్మని గీయరు. నాలుగు స్తంభాలు గల మందిరం గీసి రెక్కలు తొడుగుతారు. రాముడి కాలానికి మనిషి ఊహించగల విమానం అదే. గాల్లొ ఎగిరేవాటికి రెక్కలుండాలి. రాజులు ప్రయాణించేది కనుక రాజమందిరం ఊహించి దానికి రెక్కలు తొడిగారు. మనిషి మెదడుకి తమ చుట్టూ ఉన్న పరిస్ధితులకు అతీతంగా ఊహలు, భావాలు సాధ్యం కాదని చెప్పడానికి ఇది. అలాగే ఒక మనిషి ఇస్టా ఇష్టాలు, అతని భావాలు, ఊహలు, ఆశలు అన్నీ సమాజ పరిదులకి లోబడే ఉండాలి ఉంటాయి కూడా. మనిషి భౌతిక పరిస్ధితికి అతీతంగా అతని ఊహలు, భావాలు ఉంటాయని భావిస్తే చాలా శాస్త్రాలని తిరగరాయాల్సి ఉంటుంది.”

  “మానవ సమాజం ఉన్నంత కాలం మనిషి శ్రమ చేయవలసిందే. శ్రమ చేయకుండా ఈ ప్రపంచంలో ఒక్క పూచిక పుల్ల కూడా నడిచిరాదు. అటువంటి శ్రామికులని ఈసడించుకుంటూ, శాస్త్రాల పరిజ్ఞానాన్ని తమ సొత్తుగా భావిస్తూ వచ్చిన కులీన వర్గ పండితుల విశ్వాసాలను మార్క్సు బదాబదులు చేస్తూ శ్రమకి అగ్రపీఠాన్ని అందించాడు.”

  పై మీ వ్యాఖ్యలనే మళ్లీ ఇక్కడా పొందుపరుస్తున్నాను.
  పాతికేళ్ల క్రితం ఎస్వీ యూనివర్శిటీ ఎంఎ తెలుగు చదువుతున్నప్పుడు తెలుగు విభాగంలో ప్రొఫెసర్ మద్దూరి సుబ్బారెడ్డి గారు పదే పదే ఒక విషయాన్ని నొక్కి చెప్పేవారు. మార్క్సిజం ప్రభావానికి గురికాని శాస్త్రం నేటి ప్రపంచంలో లేదని గుడ్డివ్యతిరేకులు కూడా సామాజిక, తాత్విక, శాస్త్ర రంగాల్లో మార్క్సిజం ప్రపంచ వ్యాప్త ప్రభావాన్ని విస్మరించడం సాధ్యం కాదని, మార్క్సిజం బద్ధ వ్యతిరేకులు కూడా దాని సైద్ధాంతిక ప్రభావాన్ని, ప్రాంసంగికతను అంగీకరించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆ రెండేళ్ల కాలంలో కొన్ని డజన్ల సార్లు తెలుగు క్లాసు రూములో చెప్పగా చెవులు రిక్కించుకుని విన్నాను.

  నాకు అన్నిటికంటే ఆశ్చర్యం గొల్పిన విషయం ఏమిటంటే మా ప్రొఫెసర్ గారు పక్కా కాంగ్రెస్ మనిషి. జాతీయ వాది కూడా. ఆయన చేసిన పీహెచ్‌డీ పరిశోధన కూడా జాతీయోద్యమ కవిత్వంపైనే కొనసాగింది. ఈయన..అప్పట్లో ఎస్వీయూ వీసీగా పనిచేసిన తెలుగు ప్రొపెసర్, ప్రముఖ భాషా శాస్త్రవేత్త జీఎన్‌రెడ్డి గారు కూడా తమ విశ్వాసాలు ఏవైనా సరే సృజన, అరుణతార, ప్రజాసాహితి వంటి సామ్యవాద ప్రబోధ సాహిత్య పత్రికలను క్రమం తప్పకుండా కొని తీసుకునేవారు.

  ఈరోజంటే తమకు నచ్చని, తాము విశ్వసించని సిద్ధాంతాలపట్ల, ముఖ్యంగా మార్క్సిజం పట్ల తీవ్రమైన గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కొంతమంది మధ్యతరగతి ‘బుద్ధి’ జీవులు కాదు కాదు “భద్ర”జీవులు ద్వేషమే పునాదిగా మార్కిస్టు వ్యతిరేక సైద్ధాంతిక వ్యక్తీకరణలను తీవ్రస్థాయిలో ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా నేను గమనించినంతవరకు తెలుగు బ్లాగుల్లో ఈ ధోరణి విపరీతంగా కనబడుతోంది.

  ఒక సిద్ధాంతాన్ని చదివి, ఆకళింపు చేసుకుని దానిపై విమర్శలు గుప్పించడం వేరు.. హిట్లర్‌ని, నాజీయిజాన్ని మనం వ్యతిరేకించవచ్చు కాని దాని గురించి ఓనమాలు తెలుసుకోకుండా ద్వేషిస్తే మన విచక్షణకు అర్థం ఉంటుందా.

  పుట్టపర్తి నారాయణాచార్యుల వంటి సరస్వతీ పుత్రులు, శుద్ధ సాంప్రదాయ వాది తన జీవితం పొడవునా వేదాధ్యయనానికి ఎంత ప్రాముఖ్యత నిచ్చారో, మార్క్సిజం అధ్యయనానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. మార్క్సిజాన్ని ఆయన ‘అంటరానిదిగా’ చూడలేదు. జీవితం చివరి రోజుల్లో కూడా తనకు అవసరమనిపిస్తే న్యూక్లియర్ ఫిజిక్స్ ని ఈ వయసులో తెలుసుకోవడానికి వ్యతిరేకించను అంటూ వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారితోటే వాదించారాయన. సిద్ధాంతాన్ని సిద్ధాంతంగా, భావజాలాన్ని భావజాలంగా అధ్యయనాంశంగా మాత్రమే చూడగల విచక్షణ ఉంటే తప్ప ఇంతటి సమ్యక్ దృక్పథం మనుషులలో ఏర్పడదు.

  శేఖర్ గారు నాకు మీతో కొద్ది రోజుల పరిచయం మాత్రమే ఉంది. మనసు మూలల్ని కదిలించే రచనలతో ఒక నిబద్ధతతో మీరు రాస్తున్నారు. సంయమనం, నచ్చచెప్పడం అనే లక్షణాలు పునాదిగా మీరిలా రాస్తూనే ఉండాలని అద్భుతమైన మీ శైలిని ఇలాగే కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  మీరు చందమామ బ్లాగులో ఆర్ట్‌బుక్‌ కథనంపై చక్కటి వ్యాఖ్య చేశారు. ఇప్పుడనిపిస్తోంది. నిజం చెప్పనా.. చందమామను సంవత్సరాలపాటు చదివారు కదా. మీది నిజంగా చందమామ శైలి. సిద్ధాంత వ్యతిరేకులు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు. ఈ ఒక్క జాగ్రత్తను మీరు పాటించండి. మార్క్సిజాన్ని ప్రచారం చేస్తున్న, ప్రకటిస్తున్న బ్లాగర్లపై తెలుగు బ్లాగర్లు, అంతర్జాల పాఠకులు బాగా వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్లున్నారు. ప్రతిరోజూ మీరు రాస్తున్న వార్తలు, విశ్లేషణలు ఎంతోమందిని కన్విన్స్ చేస్తున్నట్లున్నాయి.
  మీరిలాగే కొనసాగండి…

  కమ్యూనిస్టు మేనిఫెస్టో.. భూమ్మీద మనిషి రచించిన మహాకావ్యాల్లో అగ్రగామిగా నిలబడే రచన. పెట్టుబడి దారీ వ్యవస్థలోని ప్రగతి శీలత్వాన్ని, నూతన ఆవిష్కరణల పరంగా దాని మహా విజయాన్ని అనితర సాధ్యంగా కీర్తించిన అతి గొప్ప రచన ఇది. కారల్ మార్క్స్ రచించిన ఈ పరమ ప్రామాణిక రచనను, మహాకావ్యాన్ని తెలుగు పాఠకులకోసం, బ్లాగర్ల కోసం మరోసారి పరిచయం చేయకూడదూ. పాతికేళ్ల క్రితం అరుణాతారలో త్రిపురనేని మధుసూధనరావు గారు మార్క్స్ రచనలను పరిచయం చేసి మావంటి వారిని అప్పట్లో ఉర్రూతలూగించారు.

  తప్పకుండా ఇందుకు కాస్త సమయాన్ని వినియోగించండి. సమకాలీన ఘటనలపై వార్తలు, విశ్లేషణలతో పాటు తరచుగా సైద్ధాంతిక పరిచయం కూడా అవసరమే అనుకుంటున్నాను.

  ఆంధ్రజ్యోతిలో జాహ్నవి అనే పేరుతో పుంఖానుపుంఖాలుగా వస్తున్న ఆ పోలీసు అధికారి స్వేచ్ఛా వ్యాపార అనుకూల వ్యాసాలను మీరేమైనా తడిమారా చెప్పండి. ప్రధాన స్రవంతి పత్రికలో మార్క్సిజానికి వ్యతిరేకంగా అంత చక్కటి శైలితో వరుస విమర్శలు రావడం చాలామందిని ఆకర్షించిందనుకుంటున్నాను. సిద్ధాంతాన్ని సిద్ధాంతంతోనే ఎదుర్కొవాలి. ఈ కోణంలో జాహ్నవి పేరు పెట్టుకున్న-లేదా ఆంధ్రజ్యోతి యాజమాన్యం దాచిపెట్టిన- ఆ ముసుగు పోలీసు అధికారి మార్క్సిజం సానుభూతిపరులకు, సమర్థకులకు బాగానే పని పెట్టారనుకుంటున్నాను.

  చందమామలో పనిచేస్తున్న కారణంగా చందమామ బ్లాగులో నా రచనలకు చాలా పరిమితి ఉంటోంది. మీ బ్లాగు చూసిన తర్వాత నేను కూడా నా స్వేచ్ఛకోసం, నా స్వేచ్ఛా వ్యక్తీకరణ కోసం మరొక కొత్త బ్లాగు రూపొందించుకోవాలనిపిస్తోంది.

  వీలైతే మీ మెయిల్ ఐడీ, మొబైల్ ఇవ్వండి. ఒకసారి మాట్లాడాలని ఉంది.

  నా ఈమెయిల్, మొబైల్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి.
  krajasekhara@gmail.com
  9884612596
  చెన్నయ్.

 3. రాజశేఖర రాజు గారికి

  మీ సుదీర్ఘ వ్యాఖ్య నాకు సంతోషం కలిగించింది. పొగడ్తకు కాదు సుమా! తెలుగు బ్లాగర్లలో మరొక సైద్ధాంతిక తోడు దొరికినందుకు. మీరు కోరినట్లు కమ్యూనిస్టు మేనిఫెస్టో పరిచయం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

  జాహ్నవి వ్యాసాలు నాకు తల తోక లేకుండా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. వాటికి సమాధానంగా ఒక వ్యాసం రాయాలని ఒక సారి ప్రయత్నించాను గాని, ఆయన వ్యాసాలు ఏదో ఒక క్రమాన్ని పాటిస్తే విమర్శ రాయవచ్చు. కాని ఎన్ని వ్యాసాలు చదివినా ఆయన రాతల్లో నాకు క్రమ పద్ధతి కనిపించడం లేదు.

  అసలాయన సోషలిజం గురించి అర్ధం చేసుకున్నదానిలో చాలా తప్పులున్నాయి. నెహ్రూ దగ్గర్నుండి చైనా, రష్యా ల సోషలిజాల వరకూ ఒకే గాటన కడుతుంటే దేనికి స్పందించాలో తెలియడం లేదు. పోనీ పెట్టుబడిదారీ విధానంపైన అయినా సరైన అభిప్రాయాలు ఉన్నాయా అంటే అదీ లేదు. అమెరికా, యూరప్ లలో పెట్టుబడిదారీ వ్యవస్ధలు అమలు చేస్తున్నవి సరైన పెట్టుబడిదారీ విధానాలు కావంటాడు, అదేమి చిత్రమో. ఆయన దేన్ని విమర్శిస్తున్నాడొ, దేన్ని సమర్ధిస్తున్నాడో తెలియన కలగాపులగంగా ఆయన వ్యాసాలు ఉన్నాయి.

  అప్పటికీ రంగనాయకమ్మ గారు కొంత విమర్శ రాశారు గానీ దానికాయన సమాధానం ఇచ్చినట్లు లేదు.

  మీ వ్యాఖ్య ద్వారా మరికొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. నా ఐడి మీకు ఈ మెయిల్ ఇస్తాను.

  కృతజ్ఞతలు.

 4. విజయ శేఖర్ గారు,
  తెలుగు బ్లాగర్లలో మరొక సైద్ధాంతిక తోడు దొరికినందుకు అన్నారు. చాలా సంతోషం. కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో తప్పక పరిచయం చేయండి. కాస్త ఆలస్యం అయినా సరే… వీలైనంత గాఢతతో -డెప్త్- పరిచయం చేయండి. ఈ తరానికి అది చాలా అవసరం. మార్క్సిజం సిద్ధాంతం గురించిన సమాచారం ఇంగ్లీషు మార్క్సిస్ట్ వెబ్‌సైట్లలో చాలా ఎక్కువగానే లభ్యమవుతోంది కాని తెలుగు పాఠకులకు తెలుగులో దాన్ని అందించడం చాలా అవసరం.

  నిత్యం కొత్త విషయాలు, వార్తలు ప్రచురితమవుతున్న మీ బ్లాగ్ ఈ కోణంలో మంచి ప్రభావం వేయనుంది. వామపక్ష పదజాలం ఎక్కువగా ఉపయోగించకుండానే తేలికపాటి శైలే అయినా ఆకర్షణీయమైన శైలిలో మీరు రచనలు చేస్తున్నారు. ఇది సరిగ్గా కొడవటిగంటి కుటుంబరావు గారి శైలి. పడికట్టు పదాలు, జార్గాన్‌తో సంబంధం లేకుండానే విషయాన్ని వివరించడం చిన్న విషయం కాదు. ఇంకా చెప్పాలంటే చాలా కష్టమైన విషయం. దాన్ని మీరు సాధించారు.

  “జాహ్నవి వ్యాసాలు నాకు తల తోక లేకుండా ఉన్నట్లు కనిపిస్తున్నాయి… నెహ్రూ దగ్గర్నుండి చైనా, రష్యా ల సోషలిజాల వరకూ ఒకే గాటన కడుతుంటే దేనికి స్పందించాలో తెలియడం లేదు…. ఆయన దేన్ని విమర్శిస్తున్నాడొ, దేన్ని సమర్ధిస్తున్నాడో తెలియన కలగాపులగంగా ఆయన వ్యాసాలు ఉన్నాయి..”

  జాహ్నవి పేరు పెట్టుకున్న ఆ ఇంటెలిజెన్స్ అధికారి నెహ్రూ సోషలిజం, రష్యా, చైనాల సోషలిజం గురించి తెలియనితనంతో ఆంధ్రజ్యోతిలో ఆలా పుంఖానుపుంఖాలుగా రాస్తున్నాడని నేననుకోవడం లేదు. స్వేచ్ఛా వ్యాపారం సామ్రాజ్యవాదంగా పరిణమించిన విషయాన్ని కూడా చాలా తెలివిగా తను దాచిపెడుతున్నట్లుంది. పోలీసు బుర్రకే సాధ్యమైన తెలివితో అన్ని విషయాలను కలగాపులగం చేసి గందరగోళం సృష్టించడంలో తాను ఆరితేరిపోయినట్లుంది. సామాజిక రాజకీయ ఉద్యమాలనే పూర్తిగా నెగేట్ చేయడం ద్వారా తాను అంతిమంగా ఏం చెప్పుతున్నాడో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

  రంగనాయకమ్మ గారి విమర్శకు తాను సమాధానం ఇవ్వడమా…. అంత స్థాయి తనకు ఉందంటారా?

  ధన్యవాదాలతో
  రాజు.

 5. “నెహ్రూ సోషలిజం, రష్యా, చైనాల సోషలిజం గురించి తెలియనితనంతో ఆంధ్రజ్యోతిలో ఆలా పుంఖానుపుంఖాలుగా రాస్తున్నాడని నేననుకోవడం లేదు. స్వేచ్ఛా వ్యాపారం సామ్రాజ్యవాదంగా పరిణమించిన విషయాన్ని కూడా చాలా తెలివిగా తను దాచిపెడుతున్నట్లుంది.”

  అవును. మీరన్నది నిజమే. కొంతమంది అటువంటి తెలివిని ఉపయోగించడం నాకూ అనుభవమే. జ్యోతి ఇన్నాళ్లూ ఆయన రాతలను ప్రచురించుకోవడమే ఆశ్చర్యకరం. ఆ పత్రిక నిజమైన ఆసక్తి అదేనేమో! ఆయన రాసే పద్దతి ప్రతి విమర్శ రాయడానికి వీలు లేకుండా ఉంది. ఒక అంశాన్ని కేంద్రంగా పెట్టుకుని వివరమైన విమర్శ చేయడం గాకుండా గందరగోళంగా విమర్శ చేయడం ఆయన ధోరణిగా ఉంది. ఆ గందరగోళంలో మార్క్సిజం చెప్పింది చెప్పనట్లుగా, చెప్పనది చెప్పినట్లుగా చెబుతూ తప్పుదారి పట్టిస్తున్నాడు. మార్క్సిజాన్ని తనదైన పద్ధతిలో అర్ధం చేసుకుని అదే సరైన పద్దతిగా తనకు తాను తేల్చేసుకుని దానిపై ఆధారపడి విమర్శ సాగిస్తున్నాడు. దానితో ప్రతి విమర్శని ఒక క్రమంలో పెట్టడానికి కావలసిన మార్గాన్ని ముళ్ళ కంచెలతో మూసినట్లయ్యింది. ఆయన రాతలపై విమర్శ చేసే ముందుగా, ఆ ముళ్ళ కంచెలను తొలగించుకోవలసి ఉంది. అలా తొలగించడం ఒకింత శ్రమ కలిగించేదని చెప్పుకోవచ్చు. ఇదీ నేను చెప్పదలుచుకున్నది.

  మీకు ఈ మెయిల్ ఇచ్చాను.

  విశేఖర్.

 6. మార్క్సిజం ఆర్టికల్ బాగుంది. కమ్యూనిస్టు పార్టీల కేడర్ చేత చదివించవలసిన అవసరం ఉంది. …చిట్టిపాటి

 7. విశేఖర్

  మీ వ్యాసం అందించిన తీరు బాగున్నది. బాలగోపాల్ గారి గురించి మీ అభిప్రాయాన్ని మాత్రం అంగీకరించలేను. రంగనాయకమ్మ గారు ఏమి వ్రాసారో తెలియదు కాని,ఆమెకు సాధికారత ఉంది, బాలగోపాల్ గారి సిద్దాంత వ్యాసం విమర్శించడానికి. కాని తిరిగి సమాధానం బాలగోపాల్ గారు ఎందుకు వ్రాయాలి.వారిద్దరి దారులు వేరు అయినా, ఆశయాలు ఒకటే అయినపుడు. నేనే గొప్ప అని నిరూపించు కోవడానికి ఆయన ఎందుకు తపన పడాలి?

  మార్క్సిజం ని, దాని ప్రయోజనాలను ఇప్పటి సమాజం లో అట్టడుగు వర్గానికి కుడా అందేలా చేసే క్రమం లో ఆయనకి కనిపించిన అవరోధాలు (ఇంకో వంద సంవత్సరాలకి ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. అందరిలా తనుకూడా అదే పోరాటం చేస్తూ ఉంటె, చివరికి మిగిలేది కేవలం పోరాటమే అయ్యే సమస్య కుడా ఉంది కదా) , తను చెయ్య గలిగే కొద్ది పనులు అయినా నేరవేర్చగలిగే సిద్దాంతానికి దగ్గరవడం తప్పు ఎలా అవుతుంది.

  కనీసం ఆయన చేసిన పనుల్లో అయినా ఆయన అభిప్రాయాలకి అర్ధం తెలుసుకొని, ఆ దిశలో మార్క్సిజం పై మనకున్న అవగాహనని సరి చేసికొంటే ఆయన చేసిన విమర్శ వల్ల మేలు జరిగే అవకాశం లేదా?

 8. Small correction to my earlier comment:

  మార్క్సిజం పై Meeku unna అవగాహనని సరి చేసికొంటే ఆయన చేసిన విమర్శ వల్ల మేలు జరిగే అవకాశం లేదా?

 9. మౌళి గారూ, మీ వ్యాఖ్యని ఆలస్యంగా చూశాను. ఇతర పనుల్లో ఉన్నందున బ్లాగ్ ని అప్ డేట్ చెయ్యలేకపోతున్నాను. నా బ్లాగ్ లోకి నేను రావడం కూడా చేయలేకపోతున్నాను. అందువల్ల ఆలస్యం జరిగింది. మరి కొన్ని రోజులు ఈ పరిస్ధితి ఉండవచ్చు.

  బాల గోపాల్ గారు మార్క్సిజంలో ఖాళీలున్నాయని రాసారు. మానవ ప్రవృత్తి అనేది ప్రత్యేకంగా ఒకటుంటుందనీ, దానిని మార్క్సిజం పట్టుకోలేక పోయిందని ఆయన అభిప్రాయ పడ్డాడు. భౌతిక సమాజ నియమాలకు అతీతంగా మానవ ప్రవృత్తి ఉంటుందని ఆయన అభిప్రాయం. ఇంకా అలాంటివి మరి కొన్ని ఆయన రాసాడు.

  రంగనాయకమ్మ గారు ఆయన అభిప్రాయాలను సవివరంగా చర్చించారు. బాలగోపాల్ గారు, తాను కనిపెట్టానంటున్న ఖాళీలు, నిజానికి కొత్తగా కనిపెట్టినవి కావనీ, అనేక దేశాలకు చెందిన అనేక పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు, తత్వవేత్తలు, సామాజిక పండితులు ఆ అంశాలను వివిధ రూపాలలో ప్రస్తావించినవేననీ, వాటినే బాల గోపాల్ మరొక రూపంలో ప్రస్తావిస్తున్నారనీ రంగనాయకమ్మ గారు తన విమర్శలో రాసారు. సదరు విమర్శలకు సమాధానాలు అప్పటికే రికార్డయి ఉన్నాయనీ చెబుతూ బాల గోపాల్ విమర్శలు ఎందుకు సరైనవి కావో వివరిస్తూ ఆవిడ తన విమర్శని పాఠకులకు అందించారు.

  దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత బాలగోపాల్ గారిపైన ఉంటుంది. మీరన్నట్లు ‘రంగనాయకమ్మ గారి కంటే నేనే గొప్ప’ అని నిరూపించుకునే బాధ్యత బాల గోపాల్ గారి పైన ఉంది అని కాదు నేననడం. బాల గోపాల్ గారు ‘మార్క్సిజం లో ఖాళీల’ పేరుతో మార్క్సిజం పై విమర్శ రాయడం ఒక ముఖ్యమైన ఘటన. మార్క్సిజాన్ని విశ్వసిస్తున్నవారితో పాటు, మార్క్సిజం గురించి తెలియని వారికి కూడా ఆ ఘటన ఒక సమాచారాన్ని అందిస్తుంది. బాల గోపాల్ గారు ఒక విమర్శ రాసి పడేశాక అది అలాగే స్తబ్దంగా ఉండదు. అది అనేక మందిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల తాను రాసే విమర్శలకు బాలగోపాల్ గారు బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.

  తాను కనిపెట్టిన ఒక విషయాన్ని ‘అది మీరు కని పెట్టింది కాదు. ఇప్పటికే ఆ వాదనలు ఉన్నాయి. వాటికి సమాధానాలు కూడా ఉన్నాయి. ఆ సమాధానాలు ఇవే’ అని చెబుతూ మరొకరు చెప్పాక బాల గోపాల్ గారిపైన మరొక కొత్త బాధ్యత వచ్చి చేరుతుంది. ఏమిటా బాధ్యత? “కాదు కాదు. నేను ప్రస్తావించినవి నేను కనిపెట్టినవే. మీరు చెప్పినట్లుగా అవి పాతవి కాదు. కొత్తవే. ఇదిగో ఈ కారణాల వల్ల అవి కొత్తవి. అవి పాతవేనంటూ మీరు చూపిన కారణాలు, ఉదాహరణలు ఫలానా కారణాల వల్ల సరైనవి కావు” అని చెప్పవలసిన బాధ్యత అది. ఆ బాధ్యతను బాల గోపాల్ గారు స్వీకరించలేదు అన్నది నా విమర్శ.

  ‘నేను సమాధానం ఇస్తే ఆమె మరొకటి రాస్తారు’ అని బాల గోపాల్ గారు భావించడం సరైంది కాదు అన్నది నా విమర్శ. తన తప్పుల్ని మరొకరు ఎత్తి చూపినపుడు అవి తన తప్పులు కావు అని చెప్పవలసిన బాధ్యత ఆయన పైన ఉన్నా దాన్ని స్వీకరించలేదన్నది నా విమర్శ. ఆయన తన గొప్పను నిరూపించుకోవాల్సిందేనని నేను అనడం లేదు. అసలిక్కడ ఆయన గొప్పతనం గురించే నాకు అనవసరం. ఒక సైద్ధాంతిక చర్చకు ఆయన సిద్ధపడ్డాక చిన్న సాకు చూపి అర్ధంతరంగా ఆ చర్చ నుండి ఆయన ఉపసంహరించుకోవచ్చునా? కూడదు అని నా అభిప్రాయం.

  మార్క్సిజం లో ఖాళీలున్నాయి అని బాల గోపాల్ గారు అభిప్రాయపడ్డాక ఆయనిక మార్క్సిజానికి కట్టుబడి లేరు. ఆయన దృష్టిలో మార్క్సిజం రెలెవెన్స్ కోల్పోయింది. కనుక రంగనాయకమ్మగారు, బాల గోపాల్ గార్ల విషయంలో “వారిద్దరి దారులు వేరు అయినా, ఆశయాలు ఒకటే అయినపుడు” అని మీరు అన్నది కరెక్టు కాదు. బాల గోపాల్ ముందు ఇక ఏ దారీ లేదు. ముఖ్యంగా మార్క్సిజం అన్న దారి అసలు లెదు. ఎందుకంటే ఆయన దృష్టిలో అందులో ఖాళీలున్నాయి కనుక. ఖాళీలున్న మార్గంలో పయనించాలని ఆయనెందుకు భావిస్తాడు?

  బాల గోపాల్ గారు చర్చను కొనసాగించడం అన్నది ఆయన గొప్పతనాన్ని రుజువు చేసుకోవడానికి కాక వారి చర్చను అనుసరిస్తున్న పాఠకులు, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తల అవగాహన రీత్యా అవసరం అన్నది మీరు గుర్తించాలి. తన కంటే ఎక్కువ సైద్ధాంతిక అవగాహన బాల గోపాల్ గారికి ఉంటుందని పాఠకులు, కార్యకర్తలు భావిస్తారు. కనుక ఒక సైద్ధాంతిక చర్చను మధ్యలో ముగిస్తే అది వారిని గందరగోళంలో పడేస్తుంది. ఒక్క గందరగోళం మాత్రమే జరగలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాక భారత దేశంలోనే గొప్ప ఉద్యమంగా కొనసాగిన ఎ.పి.సి.ఎల్.సి నాయకత్వంలోని ‘పౌరహక్కుల ఉద్యమం’ రెండుగా చీలిపోవడానికి బాల గోపాల్ సైద్ధాంతిక చర్చ దారి తీసింది.

  అది చిన్న పరిణామం కాదు. భారత దేశంలోని పౌర హక్కుల ఉద్యమానికి ఎ.పి.సి.ఎల్.సి ఒక దిక్సూచిగా ఉన్న పరిస్ధితి ఎ.పి లో నెలకొని ఉండగా, అటువంటి గొప్ప ఉద్యమాన్ని ఆయన లేవనెత్తిన సైద్ధాంతిక చర్చ ఒక్కసారిగా పక్కకు మళ్ళించింది. ఆయన చర్చ తర్వాత పౌర హక్కుల ఉద్యమం బలహీనపడింది. ఆ తర్వాత కూడా పౌర హక్కుల ఉద్యమం నడిచినప్పటికీ, ఆయన స్ధాపించిన మానవ హక్కుల ఉద్యమం, పౌర హక్కుల ఉద్యమంతో భిన్నమైనది అన్న వాతావరణం భారత దేశంలో చొప్పించబడింది. పౌర హక్కులను ప్రభుత్వాలు పాశవికంగా అణచివేస్తున్న సంగతి పక్కకుపోయి, ‘మానవ హక్కులు’ భంగం కావడంలో ‘మానవ ప్రవృత్తి’ పాత్ర వహిస్తోందన్న కొత్త వాదన ముందుకు వచ్చింది.

  పౌర హక్కులు ఎందుకు భంగం అవుతున్నాయి? అన్న ప్రశ్న ముందు మనం వేసుకోవాలి. దానికి సమాధానం చెప్పుకోవాలి. సమాజం రెండు వర్గాలుగా విభజించబడి ఉంది. అతి కొద్ది సంఖ్యలో ఉన్న ధనికులు సమాజంలో ఉన్న ఉత్పత్తి సాధనాలన్నింటినీ (భూములు, పరిశ్రమలు, యంత్రాలు, కంప్యూటర్లు మొ.వి) తమ వశంలో పెట్టుకుని, ఆ ఉత్పత్తి సాధనాలపైన జరిగే శ్రమ ద్వారా జనిస్తున్న సమస్త సంపదలనీ తమ ఆధీనంలో పెట్టుకున్నారు. అధిక సంఖ్యాక వర్గాలు ఆ ఉత్పత్తి సాధనాలపైన శ్రమ చేస్తున్నందువల్లనే ఉత్పత్తి జరుగుతుండగా, శ్రమ చేస్తున్నవారు అనేక కష్టాల్లో, రోగాల్లో, రోజు గడవని పరిస్ధితుల్లో రోజులు వెళ్లదీస్తుండగా, కొద్ది మంది ధనికులు విలాసాల్లో తేలియయాడుతున్నారు. ఇది శ్రమ దోపిడి. ఈ దోపిడి సజావుగా కొనసాగించుకోవడానికి వారు అనేక ఏర్పాట్లు చేస్తుకున్నారు. ఆ ఏర్పాట్లలో ముఖ్యమైనది రాజ్యాంగ యంత్రం. పార్లమెంటు, కోర్టులు, బ్యూరోక్రసీ, పోలీసులు, సైన్యం ఇవన్నీ కలిసి రాజ్యాంగ యంత్రంగా చెప్పుకుంటున్నాం. ఈ యంత్రాన్ని సాధనంగా చేసుకుని దోపిడి వర్గం తమ దోపిడిని యధేచ్ఛగా సాగిస్తోంది.

  శ్రమ చేసేవారు తమపై సాగే దోపిడిని ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. తమ శ్రమ ఫలితాన్ని తామే అనుభవించడానికి వస్తూన్న అడ్డంకుల్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే తిరుగుబాటు. తిరుగుబాటు ఎల్లప్పుడూ ఒకే రూపంలో ఉండదు. సంఘటిత రూపం తీసుకున్నపుడు తిరుగుబాటు గా మనకు కనిపిస్తుంది గానీ, అంతకు ముందు కూడా అది అనేక రూపాల్లో వ్యక్తం అవుతుంటుంది.

  మొన్నీ మధ్య యానాంలో ఒక సిరమిక్ ఫ్యాక్టరీలో కార్మికులు సంఘం పెట్టుకుని సమ్మె చేస్తుంటే ఆ సంఘం నాయకుడిని పోలీసులు కొట్టి చంపారు. అప్పటికి నెల రోజుల నుండి కార్మికులు తమ వేతనాలు పెంచమని సమ్మె చేస్తున్నారు. ఇరవై, పాతికేళ్లనుండి పని చేస్తున్నా వారి సర్వీసు రెగ్యులరైజ్ చెయ్యకుండా కాంట్రాక్టు కార్మికులుగానే కొనసాగిస్తూ వచ్చింది యాజమాన్యం. ఆ విధంగా మూడు నెలల కంటే ఎక్కువ కాలం వరుసగా పని చేసినవారిని రెగ్యులరైజ్ చేయ్యాలని కార్మిక చట్టాలు చెబుతున్నాయి. వందమందికి పైగా కార్మికులు సంఘం పెట్టుకోవచ్చనీ, అలా పెట్టుకున్న సంఘాలను యాజమాన్యంగుర్తించి చర్చలు జరపాలనీ చట్టాలున్నాయి. ఈ చట్టాలను అమలు చేయాలని నెల రోజులుగా సమ్మె చేసినా కార్మికులకు సహాయంగా పోలీసులు రాలేదు. కాని పాతికేళ్లనుండి చట్ట విరుద్ధంగా తక్కువ జీతాలిచ్చి లాభాలు సంపాదిండడమే కాక కనీసం కార్మికులకి ఇవ్వవలసిన జీతాలు కూడా ఇవ్వని యాజమాన్యానికి మాత్రం పోలీసులు పాతికేళ్ళుగా వత్తాసుగా వస్తూనే ఉన్నారు. ఇసారి కార్మికుల నాయకుడి ప్రాణాలను కూడా బలి తీసుకున్నారు. (కార్మికుల ప్రతి దాడిలో కంపెనీ ఉపాధ్యక్షుడు చనిపోయాడని వార్తలు వచ్చాయి. వాస్తవానికి కార్మికుల ముసుగులో ఉన్న మాఫియా చేతిలో ఆయన చనిపోయినట్లు ఆ తర్వాత పత్రికలె చెప్పాయి. ఇది వేరే విషయం)

  కొన్ని సంవత్సరాల క్రితం గుర్ గావ్ లో హోండా ఫ్యాక్టరీ లో కార్మికులు కూడా ఇలాగే సంఘం పెట్టుకున్నారు. కేవలం సంఘం పెట్టుకున్న పాపానికే వారిని పనిలోనుండి తీసేశారు. వారంతా ఎ.పి నుండి వలస వెళ్లినవారే. పనిలోనుండి తీసేస్తే కార్మికులు ఊరుకోకుండా సమ్మె చేపట్టారు. ఆ సమ్మెను పోలీసులు అత్యంత దుర్మార్గంగా అణచివేసారు. కార్మికులని అరెస్టు చేసి ఒక పబ్లిక్ పార్క్ లో ఉంచి చుట్టూ పోలీసులు చేరి లాఠీలతో కుళ్లబొడిచారు. ఈ హింసను టి.వి చానెళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేశాయి కూడా. కంపెనీవాడు జపానోడు. ఇక్కడికొచ్చి ఇక్కడి కార్మికుల శ్రమతో వాహనాలు తయారు చేయడానికి ఎందుకొచ్చాడు? ఎందుకంటే భారత దేశంలో కార్మిక చట్టాలను అమలు చేయాలని ఇక్కడి ప్రభుత్వాలు పట్టుబట్టవు కనుక. అదే జపాన్ లోనో, యూరప్, అమెరికాల్లోనో అయితే ఖచ్చితంగా చట్టాలు అమలు చేయాలని చూస్తాయి. అదే ఫ్యాక్టరీ ఇక్కడ పెడితే చౌకగా దొరికే కార్మికుల శ్రమ, కార్మికుల చట్టాల అమలుకు ఆసక్తి చూపని ప్రభుత్వాలు, బలహీన మైన పర్యావరణ చట్టాలు, వీటన్నింటివల్ల వారి లాభాలు అనేక రెట్లు పెరుగుతాయి. ఈ దోపిడిని అడ్డుకోవడానికి ఉన్న కనీస చట్టాలను భారత దేశ ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయవు?

  యానాం, గుర్ గావ్ లాంటి ఉదాహరణలు చిన్నవీ, పెద్దవీ భారత దేశంలో కొన్ని లక్షలు ఉన్నాయి. అవి రోజూ జరుగుతున్నాయి. వాటిని రాస్తూ పోతే పత్రికలకు ఇతర వార్తలకు చోటు దొరకదు.

  ఈ రెండు ఉదాహరణలు ఏమి చెబుతున్నాయి? చట్టాలు, కోర్టులు, పోలీసులు, పార్లమెంటు ఇవన్నీ ఉన్నది ప్రజల కోసం కాదని. మరి ఎవరి కోసం? ఎవరైతే ఉత్పత్తి సాధానాలను తమ ఆధీనంలో ఉంచుకుని శ్రమ దోపిడి చేసి, కోటి కోట్ల రూపాయల ప్రజల డబ్బుని స్విస్ బ్యాంకుల్లో దాచారో వారి కోసమే. పది లక్షలు లంచం తీసుకున్నాడని స్వయంగా మద్యం సిండికేట్ మెంబరు సాక్ష్యం చెప్పినా మంత్రి మోపిదేవిని ఈ చట్టాలు ముట్టుకోవు. లక్ష కోట్ల జగన్ అవినీతిపైన సి.బి.ఐ అనేక సాక్ష్యాలు సంపాదించినా జగన్ అరెస్టు కాడు. భవిష్యత్తులో అరెస్టు అయినా ఏదో విధంగా బైటికి రావడం ఖాయం. రాజివ్ గాంధీ అవినీతి కి పాల్పడిన బోఫోర్స్ కుంభకోణం పాతికేళ్ళు నాని, నాని కనీసం ఒక్కడైనా శిక్ష పడకుండా విచారణ ముగిసిపోయింది. పది వేల మంది భోపాల్ ప్రజలను విషవాయువు తో చంపిన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ యజమాని యాండర్సన్ ను అప్పటి మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ దగ్గరుండి రాష్ట్ర ప్రభుత్వ విమానం ఎక్కించి మరీ సాగనంపాడు. అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలమేరకే తానాపని చేశానని అర్జున సింగ్ పోయినసంవత్సరం చెప్పాడు. కామన్ వెల్త్ కుంభకోణంలో సురేష్ కల్మాడి ఒక్కడే దోషా? టుజి కుంభ కోణంలో రాజా, కనిముళి మాత్రమే దోషులా? రాజా చేస్తున్న పందేరాన్ని గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డ మన్మోహన్, చిదంబరం లు దోషులు కాకుండా ఎలా పోతారు? కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి గా ఉంటూ తన ఇంటికి వందకు పైగా ఫోన్ లైన్లు వేసుకున్న దయానిధి మారన్ ఎప్పటికీ అరెస్టు కాడు. శిక్షలు తర్వాత సంగతి. ఈ సవాలక్ష కుంభకోణాలు ప్రధాని, మంత్రులు, అధికారులు, దర్యాప్తు సంస్ధల అధికారులు వీరందరికీ భాగ స్వామ్యం లేకుండానే జరిగిపోతున్నాయా?

  కనుక ఈ చట్టాలు సమాజానికి ఆధిపత్యం వహిస్తున్న వర్గాలను ముట్టుకోవు. వారు తప్పించుకుపోవడానికి అవసరమైన రాజ మార్గాలను చట్టాల్లోనే వారు ఏర్పరుచుకుంటారు. కాని అవే చట్టాలు శ్రమ చేసేవాడు ఎంత దోపిడికి గురవుతున్నా చూస్తూ ఊరుకుంటాయి. వారెప్పుడయినా తెగించి ప్రశ్నిండడానికి సిద్ధపడితే ఆధిపత్య వర్గాల తరపున జులుం చేయడానికి మాత్రం సదా సిద్ధంగా ఉంటాయని గుర్ గావ్, యానాం లాంటి లక్షల ఉదాహరణలు చెప్పడం లేదా?

  రాజ్యాంగ యంత్రాన్ని అడ్డుపెట్టుకుని ఆధిపత్య దోపిడి వర్గాలు అనేక వందల ఏళ్లనుండి తమ దోపిడిని నిరాటంకంగా కొనసాగిస్తున్న పరిస్దితుల్లోనే, ప్రజలు సాగించిన అనేక తిరుగుబాట్ల ఫలితంగా కొన్ని హక్కులు అమలులోకి వచ్చాయి. ఆ హక్కులు అమలు చేయవలసిన బాధ్యత చట్టాలు, కోర్టులపైన ఉండగా, అవి ఉన్నోడి జేబులో ఉన్నందున శ్రామిక వర్గాలకు అక్కరకు రాకుండా పోతున్నాయి. ఈ నేపధ్యంలోనె పౌర హక్కుల ఉద్యమం ప్రముఖంగ ముందుకు వచ్చింది.

  ఆదిపత్య వర్గాలు తాము సాగిస్తున్న దోపిడిని సజావుగా సాగించుకోవడానికి రాజ్యంగ యంత్రాన్ని వినియోగిస్తూ హక్కులు అడుగుతున్న ప్రజలను పాశవికంగా అణచివేస్తున్న పరిస్దితిని ఈ కొద్ది వివరణలో చెప్పడానికి నేను ప్రయత్నించాను.

  ఇక్కడ ‘మానవ ప్రవృత్తి’ వాదులు కొత్త వాదనలు ముందుకు తెస్తున్నారు. వీరి వాదన దోపిడి సాగిస్తున్న వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. వీరి ప్రకారం దోపిడికి, అణచివేతలకు, సమ్మెలకు, తిరుగుబాట్లకు అన్నింటికి ఒకే సమాధానం వస్తుంది. అదే ‘మానవ ప్రవృత్తి’. మనిషి స్వతహాగా స్వార్ధ జీవి అనీ, తన స్వార్ధం కోసం అనేక తప్పులు చేస్తారనీ ఆ తప్పుల్లో భాగమే ఈ దోపిడి, అణచివేత, సమ్మె, తిరుగుబాటు అనీ వీరు చెబుతారు.

  అంటే ఆధిపత్య వర్గాలు తమ దోపిడీని సజావుగా కొనసాగించుకోవడానికి దోపిడి పై తిరగబడుతున్న శ్రామికుల పౌర హక్కులను అణచివేస్తూ తీవ్ర నిర్భంధాలకు పూనుకుంటున్నారన్న వాస్తవాన్ని ఈ ‘మానవ ప్రవృత్తి’ వాదం తిరస్కరిస్తుంది. కళ్లెదుట కనిపిస్తున్న ఈ సాధారణ వాస్తవానికి వీరు తమ తిక్క వాదనతో మసిపూరి మారేడు కాయ చేసి అంతిమంగా ఆధిపత్య వర్గాల దోపిడి తిరుగుబాట్లు లేకుండా కొనసాగడానికి దోహద పడుతున్నారు తప్ప దోపిడి నుండి విముక్తి కోరుకుంటున్న శ్రామికులకు ఈ వాదన ఏ మాత్రం సాయం చేయదు, పైగా హాని చేస్తుంది.

  రాజా అంత చీప్ గా 2 జి లైసెన్సులని కంపెనీలకు ఎందుకు ఇచ్చాడు? కంపెనీలనుండి లంచాలు దిగమింగి ఆ పని చేశాడన్నది సమాధానం. అయితే అన్ని కోట్లు అతనేం చేసుకుంటాడు? సమాధానం: “అది అతని మానవ ప్రవృత్తి, మనిషి స్వతహాగా స్వార్ధ జీవి.”

  భారత ప్రజలకి ఉపయోగపడాల్సిన ఇనుప ఖనిజాన్ని గాలి జనార్ధన్ రెడ్డి అంత దారుణంగా చట్ట విరద్ధంగా తవ్వి విదేశాలకి ఎందుకు పంపాడు? ప్రజలకు హాని చేసి సంపాదించిన అన్ని వేల కోట్లు అతనికెందుకు? సమాధానం: “అది అతని మానవ ప్రవృత్తి, మనిషి స్వతహాగా స్వార్ధ జీవి.”

  వెయ్యి మందికి పైగా ముస్లింలని నరేంద్ర మోడి ఎందుకు చంపించాడు? గోధ్రా రైలు తగలబెడితే దోషుల్ని పట్టుకుని శిక్షించవలసిన స్ధానంలో ఉండి కూడా ఆ పని చేయకుండా మొత్తం ముస్లిం ప్రజానీకంపై దమనకాండకు ఎందుకు తెగబడ్డాడు? తద్వారా రాష్ట్రంలోని హిందువుల్లో శాశ్వత స్ధానం సంపాదించుకుని ఎల్లకాలం ముఖ్యమంత్రిగా కొనసాగడానికి. ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధిస్తాడు? మహా అయితే కోట్లు వెనకేసుకుంటాడు. అన్ని కోట్లేంజేసుకుంటాడు? సమాధానం: “అది అతని మానవ ప్రవృత్తి, మనిషి స్వతహాగా స్వార్ధ జీవి.”

  నెహ్రూ, ఇందిర, రాజీవ్ ఇలా తాతలు తండ్రులు సంపాదించింది ఉండగా ఇంకా అధికారంలో ఉంటూ మరిన్ని కోట్లు వెనకేసుకోవలసిన అవసరం సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఏం ఉంది? అన్ని కోట్లేంజేసుకుంటారు? సమాధానం: “అది వారి మానవ ప్రవృత్తి, మనిషి స్వతహాగా స్వార్ధ జీవి.”

  టాటా, బిర్లా, అంబానీ, కిర్లోస్కర్, సింఘానియా, ఖేతాన్, విప్రో …. ఈ కుటుంబాలకి ఇప్పటికే అనేక కోట్లున్నాయి. తరాలు తిన్నా తరగని సంపద వారిది. ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. ఐనా అంబానీ సోదరులు ఆస్తుల కోసం కొట్టుకుని వీధిన పడతారు. నానో కారు క్లిక్ కాకపోవడంతో టాటాకి నిద్ర ఉండదు. మోర్ అంటూ రిటైల్ కంపెనీ పెట్టి మోర్ సంపాదన కోసం బిర్లాను రాత్రింబవళ్ళు పని చేస్తుంటారు. కొత్త కొత్త కాంట్రాక్టుల కోసం వీరంతా అనేక కుట్రలకు, రాజకీయాలకూ, లంచాలకూ పాల్పడుతూనె ఉంటారు. ఎందుకివన్నీ? ఇంత సంపాదించిన వీరు అదంతా ఏం జేసుకుంటారు? సమాధానం: “అది వారి మానవ ప్రవృత్తి, మనిషి స్వతహాగా స్వార్ధ జీవి.”

  అనేక ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన పవార్ పక్షవాతం వచ్చినా మంత్రిగా కొనసాగుతున్నాడు. అది చాలక బిసిసీఐ పీఠం మీద కూడా కూర్చున్నాడు. ఐపిఎల్ పెట్టి కోట్లు దండుకుంటున్నాడు. ఎందుకిదంతా? మూట గట్టుకు పోతాడా? సమాధానం: “అది అతని మానవ ప్రవృత్తి, మనిషి స్వతహాగా స్వార్ధ జీవి.”

  ఈ మానవ ప్రవృత్తి వాదనలో వీళ్లంతా సాగిస్తున్న దోపిడి లెక్కకు రాదు. అవినీతి లెక్కకు రాదు. అణచివేత లెక్కకు రాదు. పౌర హక్కుల హరణ పట్టించుకోనవసరం లేదు. అంతా మానవ ప్రవృత్తి కిందకు వచ్చేస్తుంది. మానవ ప్రవృత్తి వల్లనే ఇదంతా జరుగుతున్నపుడు ఇక శ్రామిక అనుభవిస్తున్న అనేక సమస్యలు… ఆకలి, దరిద్రం, నిరుద్యోగం, అనేక రకాల హింస అన్నీ మానవ ప్రవృత్తి ఖాతాలోకే చేరిపోతాయి. అపుడిక వారు తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినా ఫలితం ఉండదు. ఎందుకంటే అదంతా మానవ ప్రవృత్తి కిందకే వస్తుంది కదా. పొట్ట గడవక, చేయడానికి పని లేక అనివార్య పరిస్ధితిలో చిన్న దొంగతనం చేయడానికి కారణం మానవ ప్రవృత్తే. తరాలు తిన్నా కరగని సంపదలున్నా ఇంకా కాంట్రాక్టుల కోసం నానా అడ్డదారులు తొక్కుతున్న అంబానీ ది కూడా మానవ ప్రవృత్తే.

  కనుక సమాజంలో ఆర్ధిక వర్గాలు లేవు. కొద్ది మంది ఉత్పత్తి సాధనాలు ఆధీనంలో పెట్టుకుని సమస్త సంపదలను వశం చేసుకుంటున్న ఆధిపత్య వర్గాలు లేవు. అనేక సమస్యలతో కునారిల్లుతున్న శ్రామిక జనం లేరు. ఇవేవీ లేవు. ఉన్నదల్లా మానవ ప్రవృత్తే.

  ఇక శ్రామికులకు మిగిలిన కర్తవ్యం ఏముంటుంది? ఎదురైనా ప్రతి కష్టాన్ని మానవ ప్రవృత్తి కిందకి నెట్టేసుకుని అందింది తినడం లేదా ఎదురైన ప్రతి హింసని సహిస్తూ బ్రతకడం.

  మానవ ప్రవృత్తి వాదన చివరికి దీనికే దారి తీస్తుంది. ఈ మానవ ప్రవృత్తి వాదన నిన్నటివరకూ కర్మ సిద్ధాంతం రూపంలో ఉంది. మనిషి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకీ ‘అదంతా నీ కర్మ ఫలమే’ అని ఆ సిద్ధాంతం చెబుతూ వచ్చింది. అదింకా పూర్తిగా పోలేదనుకోండి.

  మానవ ప్రవృత్తి వాదన యాదృచ్ఛికంగా ఉనికి లోకి వచ్చిందనుకుంటె పొరబాటు. సమాజంలోని ఆధిపత్య వర్గాలు తమ ఆధిపత్యం, దోపిడి కొనసాగడానికి నిరంతరం అనేక ఎత్తులు వేస్తాయి. అవి కొన్ని కాన్షియస్ గా జరగొచ్చు. మరికొన్ని యధాలాపంగా వచ్చినట్లు కనిపించవచ్చు. వాటికి మూలం మాత్రం ‘ఆదిపత్య ప్రయోజనాలను కాపాడుకునే’ ప్రయత్నమే.

  ఈ విధంగా అప్పటికే వివిధ రూపాల్లో ఉనికిలో ఉన్న వాదనలని బాల గోపాల్ ‘మార్క్సిజం లో ఖాళీల’ పేరుతో కొత్త పదజాలంతో నెత్తి కెత్తుకున్నాడు. ఆయన దృష్టిలో అది సైద్ధాంతిక చర్చగా నే ఉన్నా దాని అంతిమ ప్రయోజనం దోపిడి వర్గాలకే చేరుతుంది.

  బాల గోపాల్ గారు తన కొత్త వాదన తర్వాత కూడా మానవ హక్కుల కోసం తన కృషిని కొనసాగించాడు. ఆ విషయంలో ఆయన నిస్వార్ధంగా పని చేసాడు. ఆంద్ర ప్రదేశ్ లో ఆయన ఉనికే హక్కుల ఉద్యమానికి ఒక మద్దతుగా, ఒక పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చింది. ఆ విషయంలో భిన్నాభిప్రాయానికి తావు లేదు.

  కాని పౌర హక్కుల ఉద్యమాన్ని ‘మానవ హక్కుల ఉద్యమం’ గా పక్కదారి పట్టించడంలో బాల గోపాల్ వేసిన తప్పటడుగుని లేదా తప్పు అడుగుని విమర్శించకుండా, ఉతికి ఆరేయకుండా ఉండడానికి వీల్లేదు. బాల గోపాల్ తన జీవిత కాలంలో సాధించిన సాధికారత దృష్ట్యా ఆయన తప్పుల్ని విమర్శించవలసిన బాధ్యత మరింత ప్రముఖంగా ముందుకు వస్తుంది. ఆ బాధ్యతని రంగనాయకమ్మ గారు సమర్ధవంతంగా నిర్వహించారు.

  ఆయన సైద్ధాంతికంగా ఒక పొరబాటు అభిప్రాయానికి, భావజాలానికి గురైతే దానిని తిరస్కరించకుండా, వాదించి ఖండించకుండా, తర్కించి తప్పులను ఎత్తి చూపకుండా ఉండడం వీలు కాదు. హక్కుల ఉద్యమంలో ఆయన చేసిన గొప్ప కృషి ఆయన సైద్ధాంతిక దిగజారుడుకి మద్దతుగా నిలవజాలదు. ఆయన సాగించిన భౌతిక కృషి, ఆయన గురయిన సైద్ధాంతిక పతనాన్ని పూర్వ పక్షం చేయజాలదు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి మౌళీ గారు.

  ఈ నాలుగు ముక్కలను (!) నా చేత రాయించినందుకు మీకు ధన్యవాదాలు.

 10. ప్రవీణ్, లింక్ చదివాను. అక్కడ వ్యాఖ్య చేయలేకపోయాను.

  మానవ స్వభావం మారుతోందని చెప్పడానికి మీరు లేవనెత్తిన అంశం పరిగణించదగ్గది.

  “ఇప్పుడు మార్క్సిజం ప్రభావం వల్ల కార్మిక వర్గ ప్రజలలో వర్గ చైతన్యం పెరిగి వర్గ పోరాటాలు చేస్తున్నారు.”

  మార్క్సిజం రాకమునుమే ప్రజలు వర్గపోరాటాలు చేసి సమాజాలు మార్చుకున్నారు. తమ పరిస్ధితులనుండే ప్రజలు వర్గ పోరాటాలకు దిగుతారు తప్ప మార్క్సిజం దానికి షరతు కాదు. అయితే కార్మికవర్గ విప్లవాలకి మాత్రం మార్క్సిజం షరతే.

 11. ఫ్రెంచ్ విప్లవం, తదితర విప్లవాలు కార్మిక వర్గ విప్లవాలు కాదు కాబట్టి ఇక్కడ వాటి గురించి ఉదహరించలేదు. అంతే కానీ వాటిని నేను పూర్తిగా ఇగ్నోర్ చేశానని అనుకోకూడదు. బానిసలని సింహాలకి మేపిన రోజులు ఉన్న రోమన్ రిపబ్లిక్‌లో బానిస వ్యవస్థ మాయమవ్వడం చరిత్ర గమనంలో జరిగిన కీలక మార్పులలో ఒకటి కదా. అందుకే దాని గురించి ఉదహరించాను.

 12. జాన్ లెవిస్ అనే అమెరికన్ మార్క్సిస్ట్ రచయిత వ్రాసిన వ్యాసం ఒకటి తెలుగులో చదివాను. అతను మొదట్లో క్రైస్తవ భావవాదిగా ఉండి తరువాత మార్క్సిస్ట్‌గా మారాడు. ప్రజలకి సులభంగా అర్థం కావాలి కనుక తెలుగు అనువాదంలోని భాష కొంచెం మార్చి వ్రాసాను: http://hegelian.mlmedia.net.in/2012/05/john-lewis.html

 13. శేఖర్ గారూ. మీ బ్లాగ్ గూర్చి కొంత తెల్సు మునుపే.
  ఈ సారి ఇందులో వుందంతా క్షుణ్ణంగా చదివాను. చాలా బాగుంది.
  కొంత రంగనాయకమ్మ గారి గ్రూపులో పెడదామని ఉంది.
  థాంక్యూ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s