అయ్యా అయోమయం జగన్నాధం గారూ! తమరి గొప్ప విమర్శలకి సమాధానం ఇదిగో!!


రుణ సంక్షోభంలో ఫ్రాన్సు కూడా! పతనబాటలో అమెరికా, యూరప్ షేర్లు” అన్న టైటిల్ తో నేను రాసిన పోస్టు కింద “అయోమయం జగన్నాధం” గారు రాసిన విమర్శకి ఇది సమాధానం.

ముందు మీరు విమర్శలుగా భావిస్తున్నవాటికి సమాధానం.

మీకు తెలియని విషయాలని అంత కాన్ఫిడెంట్ గా ప్రస్తావించి తప్పులెన్నాలని ప్రయత్నిస్తున్నందుకు ఒకరకంగా తమర్ని అభినందించవలసిందే. ఒక్కోటీ ప్రస్తావిస్తూ సమాధానం ఇస్తాను.

(1) “చివరిగా ‘ది గ్రేట్ రిసెషన్’ కాదు ‘ది గ్రేట్ డిప్రెషన్’ ఏమో”

అమెరికాలో రిసెషన్ డిసెంబరు 2007 లో ప్రారంభమైంది. అది జులై 2009లో ముగిసినట్లు అమెరికా ప్రభుత్వం చెబుతోంది. అంటే 20 నెలలపాటు కొనసాగింది. ఇంత సుదీర్ఘకాలం పాటు కొనసాగిన రిసెషన్ గతంలో లేదు. అందుకని దీనిని ది గ్రేట్ రిసెషన్ అని ఆర్ధికవేత్తలు పిలుస్తున్నారన్న సంగతి తమరికి తెలిసినట్లు లేదు. నిజానికి అమెరికాలో రిసెషన్ జులై 2009లో ముగిసినట్లు అమెరికా చెప్పుకున్నా దాని ప్రభావాలు లోతుగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఫెడరల్ రిజర్వ్ 2013 వరకూ వడ్డీ రేటుని 0.25 శాతం వద్దే ఉంచుతానని రెండు రోజుల క్రితం ప్రకటించింది. మార్కెట్ విశ్లేషకులు QE3 (Quantitative Easing 3) అవసరం అని చెబుతున్నారు. నిరుద్యోగం అధికారికంగా ఇంకా 9 శాతం పైనే ఉంది. వాస్తవానికి ఇది అంతకు రెట్టింపు ఉంటుందని నౌరుబి లాంటి ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. పేరుకి జిడిపి వృద్ధి సాధిస్తున్నా అది పరిగణించలేనంత తక్కువగా నమోదవుతోంది. అంటే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ సాధిస్తున్న కొద్ది వృద్ధి కూడా ఫెడరల్ రిజర్వ్ అందుబాటులో ఉంచుతున్న ఫైనాన్స్ వల్ల సాధించిందే తప్ప ఉత్పత్తి కార్యకలాపాలు ఊపందుకుని, కొత్త పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు కల్పించి తద్వారా సాధిస్తున్న వృద్ధి కాదని స్పష్టం అవుతోంది. ఇది నేను కనిపెట్టింది కాదు. ఫెడరల్ రిజర్వ్ అధినేత బెర్నాంక్ స్వయంగా అంగీకరిస్తున్న సత్యం. అమెరికా మళ్ళీ (టెక్నికల్) రిసెషన్ లోకి జారకుండా ఉండడానికి వడ్డీ రేటు మరో రెండు సంవత్సరాలు 0.25 శాతం వద్దే ఉంచుతానని ఆయన చెప్పాడు. అందువలన సాంకేతికంగా జిడిపి వృద్ధి సాధిస్తున్నప్పటికీ అమెరిక ఇంకా వాస్తవంలో రిసెషన్ లో కొనసాగుతున్నదని చాలామంది విశ్లేషిస్తున్న వాస్తవం. నిరుద్యోగం తగ్గకుండా ద్రవ్య సంక్షోభం అంతం కాదని ఐ.ఎం.ఎఫ్ కూడా స్వయంగా అనేక సార్లు చెప్పింది.

 • అమెరికా “ది గ్రెట్ రిసెషన్” లో ఉందని డిసెంబరు 2008 లోనే అభివర్ణించిన ది వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆర్టికల్ చూడండి.
 • ది గ్రేట్ రిసెషన్ పైన వికీపీడియా ఎంట్రీ చూడండి. The late-2000s recession, more often called the Great Recession… అన్న వాక్యంతో ఈ ఎంట్రీ ప్రారంభం అవుతుంది.
 • ఓ ఆర్ధీకవేత్త డిసెంబరు 2008 లో అమెరికా ఆర్ధిక పరిస్ధితిపై రాసిన విశ్లేషణకు The Great Recession 2008-2009 అని పేరు పెట్టాడు. వీలయితే చూడండి.
 • జాన్సన్ & వేల్స్ యూనివర్సిటీ తరపున జరిగిన ఈ విశ్లేషణా వ్యాసాన్ని చూడండి. దాని హెడ్డింగ్ “THE GREAT RECESSION OF 2008-2009 AND GOVERNMENT’S ROLE
 • ఎం.ఐ.టి సంస్ధ ఎంత ప్రఖ్యాతి గాంచిందో తెలిసిందే కదా. ఆ సంస్ధ ప్రచురించిన పరిశోధనా వ్యాసాలు కొన్ని ది గ్రేట్ రిసెషన్ గానే అభివర్ణించాయి. చూడండి ఇక్కడ. (పరిశోధనా వ్యాసం చూడాలంటే ఎకౌంట్ ఉండాలి)

ఇవి మచ్చుకు కొన్ని. నెట్ లో ఇంకా బోలెడన్ని విశ్లేషణలు ‘ది గ్రేట్ రిసెషన్’ గా అభివర్ణిస్తూ ఉన్నాయి. ఇవేవీ తెలుసుకోకుండా “ది గ్రేట్ డిప్రెషన్ ఏమో” అని తెలియకుండానే కొట్టిపారెయ్యడం ఏమిటి? తమరిలాగా నేనిక్కడ క్రెడిట్ తీసుకోవాలనుకోవడం లేదు. నాకు తెలిసింది చాలా చాలా తక్కువ ఆ విచక్షణ నాకు ఉంది. కాని విమర్శించేటప్పుడు కొన్ని పద్దతులు అనుసరించాలి.

పాల్ క్రుగ్ మెన్ (నోబెల్ విజేత) లాంటి ఆర్ధికవేత్తలు జులై 2009 నుండి సాధించిన రికవరీని ‘జాబ్‌లెస్ రికవరీ’ అని పేర్కొన్నాడు. ఇంతవరకూ రిసెషన్‌లు సంభవించిన తర్వాత సాధించిన రికవరీలన్నీ ఉద్యోగాల సృష్టితో కలిసి జరిగినవి. కాని ఇప్పటి రికవరీ అలా లేదు. వాల్‌స్ట్రిట్ కంపెనీలు లాభాలు సంపాదిస్తున్నా, ఉద్యోగాల సృష్టి నికరంగా మెరుగుపడలేదు. ఇప్పటికీ ఉద్యోగాలు తగ్గిస్తూనే ఉన్నారు. నిజానికి ఉద్యోగాలు పుట్టించని రికవరీ, రికవరీ కాదు. అందుకే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ ఇంకా 0.25 శాతం వడ్డీ రేటుపైనా, ఫెడరల్ రిజర్వ్ చేస్తున్న సావరిన్ బాండ్ల కొనుగోలు పైనా (సావరిన్ బాండ్లు మార్కెట్ లో అమ్ముడుబోక ఫెడరల్ రిజర్వే కొనుగోలు చేస్తూ ట్రెజరీకి డబ్బు ముద్రించి అందిస్తోందన్నమాట) ఇటువంటీ రికవరీని కూడా అమెరికా నిలబెట్టుకోలేక తంటాలు పదుతోంది. అది వేరే విషయం.

(2) “సంక్షోభానికి పరిష్కారం లేదని మీరు ఎలా decide చేసేశారు?”

నేను డిసైడ్ చేయడం ఏమిటి? ఏదో తప్పు వెతకాలన్న ఆత్రుతలో అడ్డగోలుగా వేసిన ప్రశ్నలాగుంది తప్ప దీనికి అర్ధం ఉందా?

పరిష్కారం ఉంటే మరి అమలు చెయ్యడం లేదేం? యూరప్ రుణ సంక్షోభం, అమెరికా రుణ సంక్షోభం వీటిని పరిష్కరించే దారులు దొరక్కే కదా ఫెడరల్ రిజర్వ్ దగ్గర్నుండి రాష్ట్ర ప్రభుత్వాల దాకా మార్గాల్ని వెతుక్కొంటోంది. సంక్షొభాలకు పరిష్కారం ఉంటే, అది అమలు చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ సంక్షోభాలు తలెత్త కూడదు. కాని పెట్టుబడిదారీ వ్యవస్ధ వరుసగా ఎదుర్కొంటున్న సంక్షోభాలకు అంతం కనిపిస్తోందా? మరొక సంక్షొభం రాదని ఏ పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తయినా చెప్పగలడా? చెప్పరు. పైగా వారు ఏం చెబుతారో తెలుసా? సైక్లిక్ సంక్షోభాలు సహజం అంటారు. కాలం గడిచే కొద్దీ అవే పోతాయని చెబుతారు. ఈ నమ్మకాన్ని మేనార్డ్ కీన్స్ బద్దలు కొట్టాడు, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో. పెట్టుబడి ఆర్ధిక వ్యవస్ధలు సంక్షోభాలు వరుసగా ఎదుర్కొంటున్నపుడు వాటిలో చిక్కుకుని బైటపడలేని పరిస్ధితి వస్తుందనీ, అప్పుడు బైటినుండి సహాయం ఉంటే తప్ప సంక్షొభం నుండి బైటికి రాలేవనీ ఆయన చెప్పాడు. బైటి సాయం అంటే ప్రభుత్వ సహాయం అని అర్ధం. పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు కీన్స్ ని తిడుతూనే ఆయన సిద్ధాంతాన్ని అమలు చేస్తారు. బబుల్స్ బద్దలైనప్పుడల్లా ప్రభుత్వమే బెయిలౌట్లు ఇస్తూ వచ్చింది. గత బెయిలౌట్లన్నీ ఒక ఎత్తయితే ఇప్పటి సంక్షోభానికి ఇచ్చిన బెయిలౌట్లు ఒక ఎత్తు. “టూ బిగ్ టు ఫెయిల్” అని పేరుమోసిన వాల్ స్ట్రీట్ కంపెనీలు, కార్ల కంపెనీలు దేహీ అని ట్రెజరీ ముందు చెయ్యి సాచాయి. (అడుక్కోవడానికి కూడా కార్ల కంపెనీల సి.ఇ.ఓ లు ప్రవేటు జెట్ విమానాల్లో వచ్చి అందరితో తిట్టించుకున్నారు.) క్రెడిట్ క్రంచ్ నుండి బైటికి రావడానికి ప్రభుత్వం డబ్బు కుమ్మరించాలి. అతిగా సెక్యూరిటైజేషన్ చేసి విషతుల్యమైన అప్పులు సృష్టించి దివాలా తీస్తే దానికీ ప్రభుత్వమే డబ్బు కుమ్మరించాలి. కాని ఈ దగుల్బాజీ బడా కంపెనీలు వెధవ్వేషాలు వెయ్యకుండా ప్రభుత్వం నియంత్రణ విధిస్తానంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు. జి20 గ్రూపు సమావేశాల్లో (2008 2010 వరకూ జరిగిన సమావేశాలు) వాల్‌స్ట్రిట్ కంపెనీలలాంటి బడా కంపెనీలను కట్టడి చేయాలనీ, టూ బిక్ టు ఫెయిల్ కంపెనీలని విడగొట్టాలనీ, పన్నుల ఎగవేయడానికి అవకాశం ఇచ్చే బ్యాంకుల్ని కట్టడి చేయ్యాలనీ ఒట్టుమీద ఒట్లు పెట్టుకున్నారు. (జి20 వెబ్ సైట్ కి వెళ్తే వివిధ సమావేశాల డిక్లరేషన్లు చూడవచ్చు.) ఆ ఒట్లన్నీ ఇప్పుడు గట్టుమీద కూడా లేవు. మళ్ళీ మామూలే.

పరిష్కారం ఉండి అది మీకు తెలిసినట్లయితే చెప్పండి. అంట్లాంటిక్‌కి అటూ ఇటూ ఉన్న దేశాలు మీకు బ్రహ్మరధం పడతాయి. అర్జెంటుగా మీకు ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇస్తారు. ఒక్క నోబెలే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అత్యున్నత అవార్డులన్నీ ఒకే రోజు ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఎందుకని? ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్ధలో వచ్చే సంక్షోభాలకి పరిష్కారం పెట్టుబడిదారీ సిద్ధాంతంలో లేదు కనక. అదే ఉంటే ఇపుడు మార్కెట్లలో జరుగుతున్న అల్లకల్లోలం ఎందుకు జరుగుతున్నట్లు? అసలు ఇప్పుడు అమెరికా, యూరప్ లు సంక్షోభాల్లో ఉన్న సంగతిని తమరు అంగీకరిస్తారా లేదా?

(3) “పెట్టుబడిదారి వ్యవస్థ ని చీల్చి చెండాడడమే వ్యాపకం గా పెట్టుకున్నట్లు ఈ blog post ని చూస్తుంటే అనిపిస్తోంది”

అయ్యో రాత! ఆ పని నా వరకు ఎక్కడాగిందండీ బాబు? ఆ పని ఎప్పుడో చేసేశారు. నేను చేస్తున్నది ఛీల్చి ఛెండాడం కాదసలు. కొన్ని అంశాలు, నేను అర్ధం చేసుకున్నవి రాస్తున్నానంతే. ఎవరైనా నాకన్నా ఎక్కువ తెలిసి (చాలా మంది ఉంటారు. అనుమానం లేదు) బాబూ ఇది తప్పు అని సవివరంగా చెప్పగలిగితే నాకేమీ అభ్యంతరం లేదు. శుభ్రంగా స్వీకరిస్తాను. కాని అది పద్దతిగా ఉండాలి. వెక్కిరిస్తూ, ఎగతాళి చేస్తూ “నీకు తెలియదు” అని చెప్పేవారికి “అసలు నిజానికి ఏమీ తెలియదనీ, తెలిసి ఉన్నట్లయితే నీకు తెలియదు అనరనీ, చర్చకు దిగి పరస్పరం ఇచ్చి పుంచుకుంటారనీ” మా హిస్టరీ లెక్చరర్ గారు చెబుతుంటారు. అది నేను నమ్ముతాను. నిజానికి తెలుసుకున్న కొద్దీ మనకు ఎంత తక్కువ తెలుసో అర్ధమవుతుందని నేను నా అనుభవం లో నేర్చుకున్న సత్యం.

రోజువారీ జరుగుతున్న పరిణామాలను నేను అర్ధం చేసుకున్నంతలో విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నాను. దీనిలో నా స్వార్ధం కూడా ఉంది. నాకు తెలిసింది రాస్తుంటే నాకు తెలియనిదేమిటో అది తెలిసినవారు చెబుతారని నా ఆశ. అది తమరిలాగా వెటకారాలతో తెలుస్తుందని నేను అనుకోను. పరస్పర గౌరవాలతో సావధానంగా జరిగే చర్చల ద్వారా మాత్రమే అది జరుగుతుందని నా నమ్మకం.

పెట్టుబడిదారీ వ్యవస్ధ భూస్వామ్య వ్యవస్ధను కూలదోసి ఏర్పడింది. భూస్వామ్య వ్యవస్ధను కూలదోసినప్పుడు అది ప్రగతిశీలంగానే పని చేసింది. అది నిలదొక్కుకున్నాక దాని విశ్వరూపం ప్రదర్శిస్తోంది. దేశాలపైన దాడులు చేసి వలసలను ఏర్పాటు చేసుకుని అక్కడి అభివృద్ధిని అడ్డుకోవడం అది చేసిన అతి పెద్ద పాపం. దాని వలన ఇప్పటికీ మూడో ప్రపంచ దేశాలు అనేక వైరుధ్యాలతో తీసుకుంటున్నాయి. వలస పాలనపైన దేశాలు తిరుగుబాటు (స్వాతంత్ర ఉద్యమం) చేశాక పెట్టుబడిదారీ దేశాలు ప్రత్యక్ష పాలనను ఉపసంహరించుకుని తెలివిగా ఫైనాన్స్ పెట్టుబడిని ఎగుమతి చేసి మూడో ప్రపంచ దేశాల్ని ఏలుతున్నాయి. చూడ్డానికి ఇండియా స్వతంత్ర దేశమే. కాని అది తన ఆర్ధిక విధానాలని తాను స్వంత ఇష్టానుసారం రూపొందించుకోలేదు. మంత్రివర్గాన్ని మార్చినా అమెరికా కి చెప్పాలి. (ఇదీ నేను కనిపెట్ట లేదు. వికీలీక్స్ బైటపెట్టిన డిప్లొమేటిక్ కేబుల్స్ ద్వారా స్పష్టంగా రుజువైంది.) దేశంలోని వనరులన్నింటినీ విదేశీ పెట్టుబడుల పరం చేస్తున్నారు. రైతుల దగ్గర్నుండి భూములు లాక్కొని విదేశీ కంపెనీలకి అప్పజెపుతున్నారు. (నియమగిరి వేదాంత, పోస్కో, రస్ ఆల్ ఖైమా ఇంకా బోలెడు). ఇవన్నీ పెట్టుబడిదారీ వ్యవస్ధలో జరుగుతున్నవే.

యూరప్ లో, అమెరికాలొ నిరుద్యోగం, అర్ధాకలి, దరిద్రం పెరుగుతున్నాయి. మరి అమెరికా, యూరప్ లు సాధించిన అభివృద్ధి ఎక్కడకి పోయినట్లు?

(4) ఆ వ్యవస్థ వల్ల ఆయా దేశాలు ఎలా లబ్ది పొందాయో మీకు తెలీదా?

తెలీదండీ. నిజ్జంగా. నాకు తెలిసినట్లు మీకెలా తెలిసింది? నా బ్లాగ్ పోస్టుల్లో పెట్టుబడిదారీ వ్యవస్ధని చీల్చి చెండాడుతున్నట్లు మీరే చెబుతుంటిరి. చీల్చి చెండాడే వ్యవస్ధలనుండి ఆ దేశాలు లబ్ది పొందాయని నేనెందుకు భావిస్తానండీ అయోమయం గారూ? ఆ అభివృద్ధేమిటో మీరే చెబితే తెలుసుకుని ఉండేవాడ్ని కదా?

దేశం అంటే మేప్ అని నేను భావించడం లేదు. మట్టి, గడ్డి, చెట్టు, చేమ, కొండ, గుట్ట ఇవీ అనీ నేను భావించడం లేదు. దేశం అంటే మనుషులు. ఆ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కలిస్తేనే దేశం. కొద్ది పెట్టుబడిదారులు సంపదలనన్నింటినీ హస్తగతం చేసుకుని శ్రమ చేస్తున్న వారికి జీతాల రూపేణా బిచ్చం పడేస్తే దానిని శ్రామికులు కష్టపడి సర్దుకుంటుంటే అది అభివృద్ధి అని మీరు భావిస్తే భావించండి. అది అభివృద్ధి కాదని లండన్ అల్లర్లు చెబుతున్నాయి. అమెరికా దురాక్రమణ మీద తిరగబడ్డ ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ ప్రజలు చెబుతున్నారు. విస్కాన్సిన్ రాష్ట్రంలొ వాకర్ దగుల్బాజీ చట్టాన్ని ఈజిప్టు తరహా ఉద్యమంతో నిరసించిన విద్యార్ధులు, పోలీసులు, ఫైర్ డిపార్ట్ మెంటూ, కార్మికులూ చెబుతున్నారు. పోస్కో వల్ల స్వగ్రామాలనుండి గెంటివేయబడుతున్న అక్కడి గ్రామాల ప్రజలు చెబుతున్నారు. నొయిడా రైతులు చెబుతున్నారు. గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో జరుగున్న కార్మిక వర్గ సమ్మెలు, నిరసనలు చెబుతున్నాయి. ఈజిప్టు, ట్యునీషియా, బహ్రెయిన్, యెమెన్, సిరియా, సౌదీ అరేబియా లలోని ప్రజా ఉద్యమాలు చెబుతున్నాయి. చైనా కార్మికులు అంతూపొంతూ లేని సమ్మెలతో చెబుతున్నారు (అవి బైటికి పొక్కకుంటే పొక్కకపోవచ్చు గాక).

ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతుంటే అమెరికా యూరప్ లలో అభివృద్ధి జరిగిందని మీరెలా చెప్పగలరు? ఓ లక్షమంది ఐఫోన్లు వాడితేనో, ఓ కోటిమంది ఐ ప్యాడ్ లు వాడుతుంటేనో, లేకపోతే ఓ పదిమంది లగ్జరీ కార్లలో తిరిగితేనో అది అభివృద్ధి అని మీరనుకుంటే అనుకోండి. కాని పొట్టగడవక, రోజు గడవక అల్లాడుతున్నవారు కొన్ని వందల కోట్లమంది ఈ ప్రపంచంలో ఉన్నారు. వారంతా తమకు చాతనైన పద్దతుల్లో ఇప్పుడు అమెరికా, యూరప్ లు సాధించిన అభివృద్ధి, అభివృద్ధి కాదని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలు మాత్రమే దరిద్రులున్న దేశాలు కాదిప్పుడు. ఉత్తర అమెరికా, యూరప్ లు కూడా ఆ కోవలోనివే. మనసు పెట్టి చూస్తే కనపడతారు. వందల కోట్లమంది చాలీ చాలని ఆదాయాలతో, కరువుతో, పౌష్టికాహార లోపంతో బతుకులీడుస్తుంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాం ఎన్ని అధునాతన ఆవిష్కరణలు సాధిస్తేనేం? అందరికీ అందని సౌకర్యాలు ఏస్ధాయికి అభివృద్ధి చెందితేనేం? అవన్నీ ప్రజలకి అందకుండా ఉంటే అది అభివృద్ధి కానే కాదు.

(5) ఇంకో విషయం – European countries కి US కి సహస్రం తేడా వుంది countries ఎలా operate అనే విషయం లో. రెంటిని ఒకే గాటన కట్టడం సముచితం కాదు.

ఏ విషయాల్లో ఒకే గాటన కట్టాను? అసలు ఒకే గాటన కట్టడం అన్న సమస్య ఎందుకొచ్చింది? అమెరికాలో ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్ధ. యూరప్ లో కూదా అదే. అమెరికా రుణ సంక్షోభంలో ఉంది. కాకుంటే రుణ సంక్షోభం ప్రాధమిక దశలో ఉంది. యూరప్ రుణ సంక్షోభం కొన్ని దేశాల్లో ముదిరింది. కొన్ని దేశాల్లో ప్రాధమిక దశలో, మరి కొన్నింటిలో మధ్య దశలో ఉన్నాయి. సంక్షోభాల్లో వివిధ దశల్లో ఉన్నాయి తప్ప సంక్షోభాలన్నీ ఒకటే కదా. అమెరికా, యూరప్ దేశాలు రెండింటిలోనూ స్వేచ్చా మార్కెట్ ఎకానమీలే ఉన్నాయి. అవి ఒకే రకంగా ఆపరేట్ అవుతాయి. ఆయా భౌగోళిక తేడాలు, ప్రభుత్వ నిర్మాణం (అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇత్యాది)లో తేడాలు, ఇలా కొన్ని తేడాలు ఉన్నా అక్కడి ఆర్ధిక వ్యవస్ధలలో సూత్రాలూ, సిద్ధాంతాలూ అన్నీ ఒకటే. వేరయితే అవేంటో చెబితే తెలుసుకుంటాం. అప్పులు ఒకేలాగా సేకరిస్తాయి. పోయిన సంక్షోభం పరిష్కారానికి ఒకేలా స్పందించాయి. అది కూడా ఉమ్మడిగా కూడబలుక్కుని (జి20 సమావేశాల్లో) మరీ ఒకే పరిష్కార మార్గాల్ని అమలు చేశాయి. రికవరీ సాధించాక బడ్జెట్ లోటు తగ్గించడానికి ఒకే రకమైన పొదుపు విధానాలు అమలు చేస్తున్నాయి. అప్పుల సేకరణని అన్ని దేశాలూ సావరిన్ డెట్ బాండ్ల ద్వారానే చేస్తున్నాయి. సమ్మెలు చేస్తే పోలీసులూ, ఇంటలిజెన్సు వారితోనే అన్నీ అణచివేస్తున్నాయి. అమెరికా నాయకులు కాంగ్రెస్ లో పోట్లాడుకుంటే బ్రిటన్ కామన్స్ లో బ్రిటన్ నాయకులు పోట్లాడుకుంటున్నారు. రూపర్ట్ మర్డోక్ బ్రిటన్ లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో పత్రికలు నడుపుతున్నాడు. ఒక దేశంలో వాల్ స్ట్రీట్ జర్నల్ అయితే మరో దేశంలో న్యూస్ ఇంటర్నెషల్ లేదా న్యూస్ ఆఫ్ ది వరల్డ్. ఒకచోట ఫాక్స్ న్యూస్ అయితే మరొకచోట ఇంకొకటి. ఇంకా ఇతర కంపెనీలన్నీ మార్కెట్ లో ఒకే ఆర్ధిక సూత్రాలతో కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

ఇక తేడాలెక్కడండీ అయోమయం గారూ?

అదీ సంగతి! తమరు పట్టుకున్న మెతుకులు అస్సలు ఉడికినట్లు లేవు.

ఇక తమరి ముందుమాట!

(6) విమర్శలకు భయపడే / బాధపడే మనస్తత్వం అయితే…

తమరు చేసిన విమర్శని ఒక్కసారి చూద్దాం.

“సగం తెలిసి సగం తెలీని (అంటే మిడి మిడి జ్ఞానం అన్న మాట) వ్రాతలతో ఏదో నెట్టు కొచ్చేస్తున్నారు. కానీండి.”

ఇది విమర్శా? నేను రాసిన విషయంలో తప్పుని ఎత్తి చూపి ఇది ఫలానా కారణం వలన ఇది తప్పు. అని చెబితే విమర్శ. అది కూడా తప్పు ఎత్తి చూపడం అనేది తమరు రాసినట్లు వెటకారంతో, నా జ్ఞానాన్నంతా కనిపెట్టిన కాన్ఫిడెన్సుతో జరిగితే అది విమర్శ కాదు. విమర్శ అనేది ఆరోగ్యకరమైన చర్చకు దారి తీయాలి. విమర్శ తెగడ్తే కానవసరం లేదు. పొగడ్త కూడా విమర్శే. కాకుంటె పొగడ్త లో కానీ, తెగడ్తలో కానీ విషయం ఉండాలి. అవతలి వ్యక్తి సానుకూలంగా గ్రహించే విధంగా విమర్శ ఉండాలి.

అదేమీ లేకుండా నాజ్ఞానాన్ని మిడి మిడి జ్ఞానంగా తమరు ఎగతాళి చేస్తే దాన్ని నేను “ఆహా భలే విమర్శ చేశారు. నాది మిడి మిడి జ్ఞానం అని గొప్ప విమర్శ చేశారు. నేను పూర్తి జ్ఞానం వచ్చేదాకా ఒక్క అక్షరం కూడా రాయకూడదు. బ్లాగుల్లో అసలే రాయకూడదు. ఎందుకంటె ‘అయోమయం.జగన్నాధం’ గారి లాంటి విశిష్ట వ్యక్తులకి అసహనమో, కోపమో రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి” అని భావించి బ్లాగు మూసేసుకోవాలన్నమాట!

తమరిది గొప్ప విమర్శ అనీ, దాన్ని అంతా గౌరవిస్తారనీ, తమరి చేత ఎగతాళి చేయించుకున్న వ్యక్తి ఇంకా బాగా గౌరవిస్తాడనీ మీరు అత్యంత నమ్మకంతో భావించారు చూడండీ, అందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి.

“ఒక ముందు మాట – విమర్శలకు భయపడే / బాధపడే మనస్తత్వం అయితే సరిగ్గా స్పష్టత లేని విషయాల్లో సొంత అభిప్రాయాలు చేర్చకపోవడం మంచిది. వార్తలు వార్తలు గా ఉండటమే మేలు. అలాగే విమర్శించే వాళ్ళని ‘సన్నాసి’, ‘వెధవ’ లాటి low class తిట్లతో శాపాలు పెట్టవలసిన అవసరమూ లేదు. “నా తీరు మార్చుకోవలసిన అవసరం లేదు నేను వ్రాసేదంతా కరెక్టే” అని feel అయితే comments ని disable చేసి ఇష్టం వచ్చినట్లు వ్రాసుకోండి”

ఇది మీరు రెండో సారి అత్యంత దయతో చేసిన విమర్శ. తలా తోకా లేని తమరి విమర్శకి నేను భయపడడం, బాధపడడం ఒకటీను. తమరి విమర్శే లో క్లాస్ ఐనప్పుడు దానికి హై క్లాస్ సమాధానాలు ఎలా వస్తాయి చెప్పండి అయోమయంగారూ!

మీ క్లాసు కి చెందిన సన్నాసులు ఇంకా చాలామంది ఉన్నారు కదా! వారితొ ఊరేగమని నేనెప్పుడో చెప్పాను కదండీ మళ్ళీ పేరు మార్చుకుని మరీ తిట్టించుకోకుండా తమరికి గడవదా? అదే సమస్య ఐతే మీ క్లాసు వాళ్ళు దానికి పరిష్కారం చూపుతారు. మళ్ళీ ఇటేపు రాకండి.

సద్విమర్శని తప్పకుండా స్వీకరిస్తాం. పనికిమాలిన విమర్శలని ఏకి పారేస్తాం. తప్పదు మరి!

17 thoughts on “అయ్యా అయోమయం జగన్నాధం గారూ! తమరి గొప్ప విమర్శలకి సమాధానం ఇదిగో!!

 1. visekar garu,
  My lekhini is not working. Excuseme for some English. I am not a socialist/communist. I feel I keep my mind open for all arguments. But I agree with most of your opinions and analysis(marxist). The problem comes while coming to the solution part. The Marxist Utopia failed due to various reasons. I feel one of the reason could be “human nature that’s out side the realm of Marxist ideology”. With out fixing the individual elements, and fixing only the framework (Marxism) may not lead to complete solution. The framework inturn effects individuals elements. But, there are certain parts in individual elements that fall outside the influence of the structure.(As these parts predate and fall outside framework’s influence) Still, socialism is a good strategy for survival of human race under certain circumstances (especially when resources are limited and serve the human race well when shared among ourselves). Pls see my post if possible : http://wp.me/pGX4s-ir
  http://wp.me/pGX4s-kN

  You might have studied/meditated a lot before forming your ideological affliations. I respect that part. But, I feel viewing things in the light of ideology may sometimes color the incidents, obscuring the reality and may render reality a color that we like.(This stops us from judging incidents/things on a case by case basis) This hinders Truth and objectivity. Few people could keep their ideology spectacles away when not required(I feel your spects are showing you right..in the recession case). Living and conducting our lives according to the existing system,sometimes we loose the right to criticise that system, since we ourselves are not in a position to follow our own ideology.

 2. బొందలపాటి గారు,

  మీ వ్యాఖ్యలో మొదటి పేరా పోస్ట్-మోడర్నిజంతో దాదాపుగా (పూర్తిగా కాదు) సరిపోలుతుంది. దాని గురించి ఇంకెప్పుడయినా చర్చించడానికి ప్రయత్నిస్తాను. మీ చర్చకి సమాధానం ఇస్తాను.

  ‘మానవ స్వభావంలో మార్క్సిజం లో ఇమడని లక్షణాలు ఉన్నాయని’, ‘మార్క్సిజం లో ఖాళీలున్నాయనీ”, “మార్క్సు చూడనిది మానవ స్వభావంలో ఏదో ఉందని” ఇలాంటి భావాలు మానవ హక్కుల సంఘం నేత బాలగోపాల్ గారు ఒక ధీసిస్ లాంటిది రాశారు. అప్పటివరకూ ఆయన పౌరహక్కుల సంఘం నాయకుడుగా ఉంటూ పీపుల్స్ వార్ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారు. దానినుండి బైటికి వచ్చి ఆయన మానవ హక్కుల సంఘం పెట్టారు. “పౌర హక్కుల…” నుండి “మానవ హక్కుల…” అనే కాన్సెప్ట్ కి మారడం వెనక ఆయన మారిన అవగాహన ఉంది. అదొక సంగతి.

  బాల గోపాల్ గారు రాసిన ధీసిస్ పైన రంగనాయకమ్మ గారు విమర్శ లేదా మార్క్సిస్టు దృక్పధంతో సమాధానం రాశారు. ఆవిడ రాసిన పుస్తకం పేరు “కొండను తవ్వి ఎలకను కూడా పట్టనట్లు. “బాలగోపాల్ గారు మార్క్సిజంలో తాను కనిపెట్టానని రాసిన ఖాళీలు నిజానికి ఎప్పుడో చర్చించబడ్డ అంశాలేననీ, వాటినే కొత్తగా బాలగోపాల్ తెచ్చారనీ సవివరంగా చర్చించి ఆయన వాదనలోని ఖాళితనాన్ని ఆవిడ తన పుస్తకంలో రుజువు చేశారు. దానికి బాలగోపాల్ గారు సమాధానం ఇవ్వలేదు. ఇవ్వడానికి కూడా ప్రయత్నించలేదు. నేను ఒకసారి ఓ చోట కలిసినపుడు (పరిచయం లేదు లెండి) రంగనాయకమ్మగారి విమర్శకి సమాధానం రాస్తున్నారా అని అడిగాను. దానికాయన “ఎందుకు లెండి. నేను రాస్తే ఆవిడ ఇంకొకటి రాస్తుంది. ఎందుకదంతా?” అని కొట్టిపారేశారు. మార్క్సిజంలో ఆయన కనిపెట్టిన ఖాళీల ఖాళీతనం అలా ఉంది. బాలగోపాల్ గారు తనకు తట్టింది అలా పుస్తకాలుగా రాయడం, దానిపైన విమర్శలు రావడం, విమర్శలకు ఆయన జవాబులు ఇవ్వకపోవడం అప్పట్లో మామూలు సంగతి.

  ఒక ధీసిస్ లాంటిది ఆయన రాసి పడేశాక దానిపైన విమర్శలు వస్తే సమాధానం తప్పనిసరిగా ఇవ్వలని ఆయన భావించకపోవడం విచిత్రం. ధీసిస్ లాంటిది అని ఎందుకంటున్నానంటే, మార్క్సిజం గురించి పైపైన తెలిసినవారికి, లేదా పూర్తిగా అవగాహన లేక పోయినా బాగా తెలుసు అనుకుంటున్నవారికి అది ధీసిస్ లాగా కనిపిస్తుంది. కాని మార్క్సిజం ని సరిగ్గా అర్ధం చేసుకున్నవారికి అది ధీసిస్ కాదని, తలా తోకా లేని ఆలోచనల కలబోత అని అర్ధం అవుతుంది. లేదా ఆ విమర్శలో మార్క్సిజంలోనే సమాధానం ఉందన్న విషయం అర్ధం అవుతుంది. నేను గతంలో రాసినట్లు మార్క్సిజం తమకు తెలుసునని భావిస్తూ నిజానికి దానిగురించి సరైన అవగాహన లేనివారు చాలామంది ఉన్నారు. వారికి బాలగోపాల్ వాదనలు గొప్ప ధీసిస్ లాగా అనిపించేవి. మార్క్సిజాన్ని సరిగా అర్ధం చేసుకోవడంలో వైఫల్యం జరిగినపుడు సహజంగానే అందులో ఏదో ఖాళీ ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ ఖాళీని ఖాళీ కాదని చూపిస్తూ, మార్క్సిజం మాటల్లొ చెప్పినపుడు దానికి తిరిగి సమాధానం రాయాల్సిన బాధ్యత బాలగోపాల్ పైన ఉన్నా ఆయనా పనికి పూనుకోలేదు.

  మార్క్సిస్టు ఐడియాలజీ గురించి మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు దాదాపు అలాంటివేనని చెబుతున్నందుకు అన్యదా భావించవలదని కోరుతున్నాను.

  మార్క్సిజం అద్దాలతో సమాజాన్ని, అందులోని సమస్యలను చూడడం అంటే ఏమిటి? ఏది ముందు? ఏది వెనక?

  సమాజాలు మారుతూ వచ్చాయి. విఫ్లవాల ద్వారా ఆ మార్పులు జరుగుతూ వచ్చాయి. మరోపక్క శాస్ర సాంకేతిక రంగంలో… జివ శాస్త్రంలో డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం, భౌతిక శాస్త్రంలొ శక్తి నిత్యత్వ సూత్రం, సామాజిక శాస్త్రంలొ ఫ్రెంచి ఫ్యూయర్ బా సోషలిస్టు భావాలు, తత్వ శాస్త్రంలో జర్మన్ హెగెల్ గతి తర్కం… ఇవన్నీ అప్పటికీ అభివృద్ధి చెంది ఉన్నాయి. వీటిలో వేటినీ మార్క్సు కనిపెట్టలేదు. కాని అవన్నీ మార్క్సిజానికి ప్రాణవాయువులుగా ఉపయోగపడ్దాయి. ఎంతగా ఉపయోగపడ్డాయంటే అవి లేకుండా మార్క్సిజం లేదు. ఏంగెల్స్ మార్క్సిజం పుట్టుకను గురించి వ్యాఖ్యానిస్తూ ‘కాలం గర్భంతో ఉండి మార్క్సుని కన్నది” అని అంటాడు. అంటే అప్పటికి మార్క్సిజం పుట్టడానికి కావలసిన పరిస్ధితులన్నీ మానవ సమాజంలో ఏర్పడి ఉన్నాయని అర్ధం. ఆ పరిస్ధితులు ఏర్పడకపోయినట్లయితే మార్క్స్ మిగతా మనుషుల్లాగే పుట్టి గిట్టేవాడు. కాకపోతే తత్వ శాస్త్రంలో మరొక పుస్తకం రాసి ఉండేవాడు కాని మార్క్సిజం పుట్టి ఉండేది కాదు.

  (మిగిలింది తర్వాత వ్యాఖ్యలొ)

 3. ఊసుపోక రాసుకోవడం పొద్దుపోక చదువుకోవడం తప్ప, పనికొచ్చే సమాచారం/విషయ పరిఙానం కలిగించే అతికొద్ది తెలుగు బ్లాగుల్లో మీ బ్లాగు కూడా ఒకటని నా అభిప్రాయం. క్లిష్టమైన అంతర్జాతీయ ఆర్థిక విషయాల్ని అత్యంత సులభతరంగా మీరు అందిస్తున్న తీరు అద్భుతం. అట్లే వివిధ రాజకీయ,సామాజిక అంశాల మీద మీ అభిప్రాయం చాలా పరిణితిగా,సమతూకంగా ఉందనిపిస్తుంది.
  Thanks for all the valuable info and pls keep going.

  *They tries to pull you down, when they cant reach up to you*

 4. నేనిక్కడ చెప్పదలుచుకున్నది మార్క్సిజం, మార్క్సిజం కోసమో లేక అప్పటికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కనుక తానూ ఒక సిద్ధాంతం సృష్టించాలని మార్క్స్ కి ఉన్న ఉబలాటం వల్లనో పుట్టలేదు. మార్క్సిజం జన్మించడానికి అప్పటికి ఒక చారిత్రక అవసరం ఏర్పడి ఉంది. ఆదిమ కమ్యూనిస్టు వ్యవస్ధ, బానిస వ్యవస్ధగానూ, బానిస వ్యవస్ధ ఫ్యూడల్ వ్యవస్ధగానూ, ఫ్యూడల్ వ్యవస్ధ పెట్టుబడిదారీ వ్యవస్ధగానూ అభివృద్ధి చెందింది. పెట్టుబడిదారీ వ్యవస్ధ లో వైరుధ్యాలు తీవ్రమై సంఘర్షణ జరుగుతున్న కాలం అది. అటువంటి ఒక సంఘర్షణ ఫలితంగా పారిస్ కమ్యూన్ పుట్టింది (పారిస్ ని కార్మికులు సాయుధంగా వశం చేసుకుని రెండు నెలలకు పైగా తమను తాము పాలించుకున్నారు. అది పారిస్ కమ్యూన్ గా చరిత్రలో రికార్డయ్యింది). పారిస్ కమ్యూన్ కూడా మార్క్సిజం లోని ఒక అంశాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడింది.

  అంటే మార్క్సిజం అనేది కేవల కారల్ మార్క్స్ బుర్రలో మాత్రమే పుట్టింది కాదు. అది అప్పటి సమాజంలో పరిపక్వానికి వచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్ధితులనుండి పుట్టింది. అప్పటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్ధితుల ఉమ్మడి ప్రభావం, కారల్ మార్క్స్ మెదడు లో ప్రతిబింబించి మార్క్సిజంగా జనించింది. (భావాలు ఎలా పుడతాయి? అని ప్రశ్నించుకుంటే, మనిషి చుట్టూ ఉన్న సామాజిక పరిస్ధితుల ప్రతిబింబాలే మెదడులో భావాలుగా జనిస్తాయి అని సమాధానం చెప్పుకుంటాము. అదే నేనిక్కడ చెబుతున్నాను. నా సొంత సిద్ధాంతం కాదిది.) కానీ మార్క్స్ కే ఎందుకు తట్టింది? మరో పుల్లయ్యకి ఎందుకు తట్టలేదు? ఎందుకంటే, కారల్ మార్క్స్ అప్పటికి తత్వశాస్త్ర పరంగా హెగెల్ అనుచరుడుగా ఉన్నాడు. హెగెల్ నిజానికి భావవాది. కాని మార్క్సు ఫ్యూయర్ బా నుండి సోషలిస్టు భావాజాలం అందిపుచ్చుకున్నాక హెగెల్ తత్వంలోని గతి తర్కాన్ని దానికి జోడించగలిగాడు. హెగెల్ తత్వ శాస్త్రం లేనట్లయితే మార్క్సుకి ఫ్యూయర్ బా భౌతిక వాద సోషలిజం అందినా వృధా అయి ఉండేది. పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే మార్క్సు హెగెల్ కి శిష్యుడు. తన చుట్టూ అభివృద్ధి చెందిన వివిధ శాస్త్రాల సిద్ధాంతాలను ఫ్యూయర్ బా భౌతికవాదానికి అన్వయించినపుడు హెగెల్ గతి తర్కం తలకిందులుగా ఉన్న అంశాన్ని మార్క్సు గ్రహించాడు. ఈ గమనింపు అత్యంత ముఖ్యమైనది. తలకిందులుగా ఉన్న హెగెల్ గతి తర్కాన్ని యధాస్ధానానికి తెచ్చి ఫ్యూయర్ బా బౌతికవాదానికి అన్వయించి, అప్పటికి అభివృద్ధి చెందిన శక్తి నిత్యత్వ సూత్రమూ, డార్విన్ పరిణామ సిద్ధాంతమూ తదితర శాస్త్ర ఆవిష్కరణలను, తన చుట్టూ ఉన్న సామాజికార్ధిక రాజకీయ పరిస్ధితుల వెలుగులో పరిశీలించిన మార్క్సు గతితార్కిక భౌతికవాద తత్వ శాస్త్రాన్ని ఆవిష్కరించాడు.

  ఈ ఆవిష్కరణ జరిగాక మార్క్సు ఇక ఎంత మాత్రమూ హెగెల్ శిష్యుడిగా లేడు. పైగా హెగెల్స్ తత్వ శాస్త్రానికి పూర్తిగా భిన్న ధృవమైన అత్యంత మౌలికమైన, ఆధునిక తత్వ శాస్త్రానికి పరమ మూలమైన గతితార్కిక భౌతిక వాద తత్వ శాస్త్రానికి సృష్టికర్తగా నిలిచాడు. గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాన్ని సామాజిక పరిణామాలకి అన్వయించి చారిత్రక భౌతికవాద సిద్దాంతాన్ని ఆవిష్కరించాడు. తన తాత్విక చింతనను ఆర్ధిక వ్యవస్ధ పునాదులకి అన్వయించి “దాస్ కేపిటల్” రచించాడు. దాస్ కేపిటల్ రచించడానికి మార్క్సుకి తోడ్పడిన ముఖ్యమైన అంశం మరొకటుంది. అది బ్రిటన్ పెట్టుబడిదారీ విధానం. బ్రిటన్‌లో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందకపోయినట్లయితే కారల్ మార్క్స్ చేతి నుండి “దాస్ కేపిటల్” మనకి అంది ఉండేది కాదు. దాస్ కేపిటల్ లో కారల్ మార్క్సు కనిపెట్టిన అతి ముఖ్యమైన అంశం ‘అదనపు విలువ’. పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇలా ఉంది ఇతర ఆర్ధికవేత్తలు కూడా కొంత తేడాలతో చెప్పినా, మార్క్స్ దర్శించిన అదనపు విలువను మిగిలిన వారు చూడలేకపోయారు. ఎందుకంటే వారికి గతితార్కిక భౌతికవాద తాత్విక భూమిక లేదు గనక.

  అప్పటివరకూ తత్వవేత్తలు తత్వశాస్త్రాన్ని పండితులకే పరిమితమైన శాస్త్రంగా భావించేవారు. జీవిత కాలమంతా కాచివడపోసి ఉన్న మహా పండితులు మాత్రమే చర్చించుకునే శాస్త్రంగా భావించేవారు. కాని కారల్ మార్క్సు ఆ తత్వ శాస్త్రం మెడపట్టి లాక్కొచ్చి కార్మికవర్గానికి పాదాక్రాంతం చేశాడు. ఈ వాక్యాలు రాస్తుంటేనే ఒళ్లంతా పులకరిస్తూ, ఒక విధమైన ఉద్విగ్నత మదినిండా నిండిపోయింది నాకు. తత్వ శాస్త్రాన్ని కార్మిక వర్గానికి పాదాక్రాంతం చేయడం అంటే మాటలు కాదు. సమాజంలో తొంభైతొమ్మిది మందికి అర్ధం కాని శాస్త్రంగా, పడక్కుర్చీ పండితులకే పరిమితమైన శాస్త్రంగా మన్ననలందుకుంటున్న తత్వ శాస్త్రాన్ని అసలు ఉపయోగపెట్టవలసింది తొంభైతొమ్మిది మంది కష్టించి పనిచేసే వారి కోసమని కారల్ మార్క్స్ నిర్ద్వంద్వంగా నిరూపించాడు. తత్వశాస్త్రానికి ఉన్న పండిత, మేధో బంధనాలని ఒక్క ఉదుటున తెంచి కార్మిక వర్గ కాళ్ళపై పడవేసిన కారల్ మార్క్స్ బహుధా అభినందనీయుడు. సర్వకాల సర్వావస్ధలందు కూడా స్మరణీయుడు. మానవ సమాజం ఉన్నంత కాలం మనిషి శ్రమ చేయవలసిందే. శ్రమ చేయకుండా ఈ ప్రపంచంలో ఒక్క పూచిక పుల్ల కూడా నడిచిరాదు. అటువంటి శ్రామికులని ఈసడించుకుంటూ, శాస్త్రాల పరిజ్ఞానాన్ని తమ సొత్తుగా భావిస్తూ వచ్చిన కులీన వర్గ పండితుల విశ్వాసాలను మార్క్సు బదాబదులు చేస్తూ శ్రమకి అగ్రపీఠాన్ని అందించాడు.

  మధ్య యుగాలలొ కులవ్యవస్ధ బలిష్టంగా ఉన్న కాలంలో మెడకు ముంత, మొలకు తాటాకు కడితే తప్ప రోడ్డు మీదకి పంచములని రానీయని వ్యవస్ధ ఉన్న కాలంలో ఒక పంచముడికి, దేశ దేశాల రాజులు వశం చేసుకోవాలని పోటీపడుతున్న ఒక అందమైన సుకుమారమైన బ్రాహ్మణ యువతిని (దురుద్దేశం ధ్వనిస్తే అది నాది కాదని విన్నవించుకుంటున్నాను) ఇచ్చి పెళ్ళి చేయడం సాధ్యమవుతుందేమో ఒక్క సారి ఊహించండి! అటు సూర్యుడు ఇటు పొడవచ్చు గాక! మన్నూ మిన్నూ ఏకం కావచ్చుగాక! సాగరములన్నియు ఏకము కావచ్చును గాక! అది మాత్రం సాధ్యం అయి ఉండేది కాదు. కానీ కారల్ మార్క్సు దాన్ని సుసాధ్యం చేశాడు. కులీనుల పడక్కుర్చీ మేధావుల చర్చలలో ఓలలాడే తత్వశాస్త్ర సామ్రాజ్యానికి కార్మికవర్గాన్ని పట్టాభిషిక్తుడిని చేయడం దానితో సమానంగా భావించవలసి ఉంది.

  సరే, ఈ క్రమాన్ని బట్టి మనకు అర్ధమవుతున్నదేమిటి? కారల్ మార్క్స్ తన సిద్ధాంతాన్ని ప్రకటించేనాటికి సామాజిక, ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధ లో ఉన్న పరిస్ధుతులనుండే మార్క్సిజం పుట్టింది. ఇక్కడ ఏది ముందు? సమాజం ముందు. దాని తర్వాతే మార్క్సిజం. కారల్ మార్క్సు ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని ఊహించుకుని దానికి అనుగుణంగా తన సిద్దాంతాన్ని తయారు చేయలేదు. సామాజిక వ్యవస్ధల పరిణామాన్ని ఆయన పరిశీలించాడు. ఒక వ్యవస్ధ నుండి మరొక వ్యవస్ధ మారిన క్రమాన్ని పరిశీలించాడు వ్యవస్ధలు విప్లవాల ద్వారా మారుతున్న క్రమాన్ని పరిశీలించాడు. ఏయే విప్లవాలకు ఏయే ఆర్ధిక వర్గాలు నాయకత్వం వహించాయో, ఏయే ఆర్ధిక వర్గాలు వారికి సహకరించాయో పరిశీలించాడు. విప్లవాల అనంతరం ఏర్పడిన నూతన సమాజాల గతిని పరిశీలించాడు. ఆ గతి వెళ్తున్న మార్గాన్ని గమనించాడు. వ్యవస్ధలను పైపైన మాత్రమే చూడకుండా వ్యవస్ధ నిలబడడానికి మూలకారకులైన వర్గాలెవరో గమనించాడు. వ్యవస్ధ నిలబడడానికి మూలమైన వర్గాల పరిస్ధితినీ, మూలంగా లేకపోయినా వ్యవస్ధనంతటినీ గుప్పెట్లో పెట్టుకున్న వర్గాలేవిటో గ్రహించాడు. విప్లవాలలో వారి పాత్రను చూశాడు. బానిస వ్యవస్ధల నుండి పారిస్ కమ్యూన్ వరకూ ప్రతి విప్లవాన్నీ, ప్రతి సామాజిక పరిణామానికి ఆద్యులెవరో, చివరికి పై స్ధానానికి చేరిందెవరూ చూశాడు. ఈ పరిణామాలన్నింటిలోనూ దండలో దారంలాగా ఒక క్రమాన్ని గమనించాడు కారల్ మార్క్సు. అ క్రమంలోనే తానున్న వ్యవస్ధ తదుపరి ఏ రూపంలోకి మారుతుందో అంచనా వేశాడు. అలా వేసిన అంచనాయే సామ్యవాద వ్యవస్ధ.

  ముందు వెళ్ళినవారు ఎటువైపు వెళ్లారో కనుక్కొవడానికి వెనక వచ్చేవారు ఏం చేస్తారు? వారి కాలి జాడలను చూస్తారు. అవి ఏదిక్కుకి వెళుతున్నాయో చూస్తారు. ఆ దిక్కువైపే వెళ్ళి ముందు వెళ్ళినవారితో కలుస్తారు. కారల్ మార్క్స్ చేసిందిదే. ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి పెట్టుబడిదారి వ్యవస్ధ వరకూ జరిగిన పరిణామక్రమాన్నీ, ఆ పరిణామాల క్రమాన్ని శాస్త్ర బద్ధంగా, జీవ, బౌతిక, రసాయన, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, శాస్త్రాల ఆధారంగా గత సమాజాల అడుగుజాడల్ని పసిగట్టాడు. ఆ అడుగుజాడల ఆధారంగా సామాజిక పయనాన్ని గమనించి దాని భవిష్యత్తు గమనాన్ని చూశాడు కారల్ మార్క్సు. ఊహాలతో కాదు సుమా! పెట్టుబడిదారీ వ్యవస్ధ అభివృద్ధి క్రమంలోనే దాని తదుపరి వ్యవస్ధల తీరుతెన్నులను కూడా చూశాడు. తదుపరి వ్యవస్ధ మూలాలు పెట్టుబడిదారీ వ్యవస్ధలోనే ఉన్నాయని ఎత్తి చూపించి, దాని ప్రకారమే సామ్యవాద వ్యవస్ధ ఏర్పడుతుందని నిరూపించాడు.

  అంటే సామ్యవాద వ్యవస్ధ యుటోపియా ఎంత మాత్రమూ కాదు. సామ్యవాద యుటోపియా కారల్ మార్క్స్ పుట్టక ముందరి సంగతి. దానికీ కారల్ మార్క్స్ నిరూపించిన సామ్యవాద వ్యవస్ధకే పొంతనే లేదు. సామ్యవాదం అనగానే మార్క్సుకి ముందరి యుటోపియా భావజాలాన్ని గుర్తు తెచ్చుకుని అదొక ఆదర్శవంతమైన సమాజం. అది ఊహలలోనిదే అని ఆలోచనలను అంతటితో ముగించడం మార్క్సిజం కాదు. మార్క్సిజం చెప్పిన సామ్యవాద వ్యవస్ధ, సామాజిక వ్యవస్ధలు తాము నడుస్తున్న దారిలో పయనమై వెళుతూ ఉన్న క్రమంలో ఏర్పడే అనివార్య సామాజిక పరిణామం. దానికి ఒకరి ఇష్టాఇష్టాలతో సంబంధం లేదు. ఒకరి ఊహలు ఆదర్శాలతో సంబంధం లేదు. ఒకరి చావు పుట్టుకలతో సంబంధం లేదు. మరొకరి సిద్ధాంత రాద్ధాంతాలతో అసలే సంబంధం లేదు. తూర్పున పొడిచే సూర్యుడు ఎటు అసమిస్తాడు? ప్రతి రోజూ లేచి ఈరోజు ఉత్తరాన అస్తమిస్తాడా, దక్షిణాన అస్తమిస్తాడా, లేక ఎప్పటిలా పడమట అస్తమిస్తాడా అని చర్చిస్తూ కూచుంటే, ఆ చర్చల ఫలితం కోసం సూర్యాస్తమయం ఆగదు. అది తన దారిన తాను పోతుంది.

  హాలీవుడ్ దర్శకుడొకరు ఊహించి ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్’ అని సినిమా తీశాడు. ముసలోడిగా పుట్టి పసివాడిగా చనిపోయినట్లు ఊహిస్తాడు. అది చూసి ఏ జంటయినా అదెలాగొ ఉంటుందో చూద్దామను కుంటే సాధ్యమేనా? పెట్టుబడిదారీ వ్యవస్ధ శాశ్వతమని భావించడం అలాంటిదే. వ్యవస్ధలో సమస్యలు, వైరుధ్యాలన్నీ పరిష్కారం అయ్యేంతవరకూ అది ముందుకు పోతూ ఉంటుంది. ఆ గమనంలో కొన్ని సార్లు వెనకడుగులుండవచ్చు, మానవ సమాజం గనక. కాని అవి తాత్కాలికమే.

  మనం ధరించే ఫ్యాంట్ ఎన్ని రూపాలు మార్చుకుందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం! నా చిన్నతనంలో మా నాన్నగారు ధరించిన ఫ్యాంట్ బాగా గుర్తు. బాగా narrow గా ఉండేది. కాలికి అంటుకు పోయినట్లుండేది. తను ఫ్యాంట్ విడవాలంటే నేను కింద కూర్చుని చివర్ల పట్టుకుని లాగే వాడిని. అది అసౌకర్యంగా తోచింది. కిందినుండి తేలికగా విడవడానికి వీలు కలిగేటట్లుగా రూపం మార్చుకుని బెల్ బాటమ్ అయింది. నేను హైస్కూలు విద్యాభ్యాసంలో ఉండగా ఈ బెల్ బాటం విస్తృతంగా వాడకంలో ఉండేది. కానీ అది కూడా అసౌకర్యంగా మారింది. వెడల్పైన బెల్ బాటం నేలమీదికి రాసుకుని చినిగిపోయి అసహ్యంగా ఉండేవి. మళ్ళీ narrow వైపుకి మార్పు జరిగింది. ఈ సారి నా చిన్నతనం నాటి narrow కాకుండా మరికొంత సౌకర్యవంతంగా మారింది పైన లూజుగా, కిందికి వచ్చేసరికి పాదాలలో సగం వరకు ఉండేలా మారింది. అంటే పాత నేరో లోని అసౌకర్యాన్ని తొలగించుకుని బెల్ బాటంగా మారిన సౌకర్యాన్ని నిలుపుకుంది. కానీ అదీ తర్వాత అసౌకర్యంగా మారి మొత్తం లూజుగా ఉండేలా పార్లల్ వచ్చింది. అది గొట్టం ఫ్యాంటులా ఉండేసరికి అది కొద్ది కాలం మాత్రమే మనగలిగింది. ఇప్పుడది బ్యాగీగా స్ధిరపడింది. పైనుండి కిందివరకూ ఏ స్ధానంలో ఎంత లూజు ఉండాలో అంతే ఉండేలా దర్జీలు ఫ్యాంటులు కుడుతున్నారు. ఈ పయనానికి ఎవరు మార్గదర్శకం? ఎవరిది పధకరచన? ఏ ఒక్కరిదీ కాదు. వస్త్రధారణకి ఒక వ్యవస్ధ మనకి తెలియకుండానే ఏర్పడిపోయింది. అది comfortability వైపుగా రూపం మార్చుకుంటూ వచ్చింది. సౌకర్యవంతంగా ఉండేలా రూపం మార్చుకుంటూ వచ్చింది. ఏ వ్యవస్ధకి సంబంధించిన పరిణామ క్రమాన్నైనా చూడండి మనకొక క్రమం కనిపిస్తుంది. అది సౌకర్యవంత మైన స్ధితికి దారితీస్తూ ఉంటుంది. మన హెయిర్ స్టైల్ కూడా ఇలాగే మారుతూ వచ్చిన క్రమాన్ని మనం గమనించవచ్చు.

  మానవ సమాజం కూడా అంతే. సౌకర్యవంతమైన వ్యవస్ధ స్ధిరపడేదాకా వ్యవస్ధ మారుతూ ఉంటుంది. మానవ సమాజానికి సౌకర్యవంతమైనది ఏమిటి? వైరుధ్యాలు లేకపోవడమే సౌకర్యవంతం. పేద, ధనిక వ్యత్యాసాలు, పాలకుడు పాలితుదు వ్యత్యాసాలు, పట్టణం గ్రామం వ్యత్యాసాలు, శారీరక శ్రమకూ, మేధో శ్రమకీ వ్యత్యాసాలూ, మతం, కులం, ప్రాంతం, ఇలా సమస్య వ్యత్యాసాలు పరిష్కరించబడే వరకూ సమాజం మారుతూనె ఉంటుంది. కారల్ మార్క్సు ఈ మార్పులను శాస్త్ర బద్దం చేశాడు. అది మార్క్సు రచించాడు కనక మార్క్సిజం అయ్యింది. పుల్లయ్య గమనించి రచించినట్లయితే పుల్లయ్యిజం అయి ఉండేది. మార్క్సిజం అనగానే జర్మనీకి చెందిన ఒక గడ్డపాయన రాస్తే, ఎక్కడో రష్యాలో, చైనాలో విప్లవాలు వస్తే, వారిని చూసి భారతీయులు అనుకరించేది కాదు. ధామస్ ఎడిసన్ బల్బు కనిపిడితే అమెరికా వాడు విదేశీయుడు కనిపెట్టాడని వాడడం మానేస్తున్నామా? శాస్త్ర బద్ద ఆవిష్కరణ ఎవరు చేసిన ప్రపంచం అంతా దానిని వినియోగిస్తుంది. మార్క్సిజం అంతే. సామాజిక, రాజకీయ, ఆర్ధిక వ్యవస్ధ పరిణామ క్రమానికి చెందిన నియమాల సమాహారమే మార్క్సిజం. ఒక క్రమంలో పెట్టిన విజ్ఞానం శాస్త్రంగా మారుతుంది. అలా మారిన సామాజికార్దిక రాజకీయ శాస్త్రమే మార్క్సిజం. ఆయన కాలంలో సామ్రాజ్యవాదం అభివృద్ధి చెందలేదు. అందుకని మొదటి విప్లవం బ్రిటన్ లో వస్తుందని మార్క్సు ఊహించాడు. ప్రపంచంలో పరిపక్వ దశకు వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ బ్రిటన్ లోనే ఉంది గనక అక్కడే మొదటిసారి సోషలిస్టు విప్లవం సంభవిస్తుందని ఆయన భావించాడు. కాని అలా జరగలేదు. కారణం?

  మార్క్సు కాలంనాటికి పూర్తిగా అభివృద్ధి చెందని సామ్రాజ్యవాద వ్యవస్ధ (ఫైనాన్సియల్ పెట్టుబడిని ఎగుమతి చేసి దానిపై పట్టుద్వారా మూడవ ప్రపంచ దేశాలని అదుపులో పెట్టుకోవడం) లెనిన్ కాలానికి అభివృద్ధి చెందింది. ప్రపంచంలో ఉన్న సామ్రాజ్యవాద దేశాలు ఒకరినొకరు సహకరించుకుంటూ గొలుసుకట్టుగా ఏర్పడ్డారనీ, ఆ గొలుసుకట్టులో ఎక్కడ లింకు బలహీనంగా ఉంటే అక్కడ మొదట సోషలిస్టు విప్లవం సంభవిస్తుందని లెనిన్ సూత్రీకరించాడు. ఆయన చెప్పినట్లే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా సామ్రాజ్యవాదం బలహీనపడి అక్కడ విప్లవం బద్దలైంది. చైనాకి వచ్చేసరికి అక్కడ కార్మికవర్గం సరిగా అభివృద్ధి చెందలేదు. రైతాంగం ప్రధానంగా ఉండి భూములు వారి చేతిలో కాక భూస్వాముల చేతిలో కేంద్రీకరించబడి రైతులపై దోపిడీ సాగింది. కార్మికవర్గం అభివృద్ధి చెందని వ్యవసాయక దేశాల్లో కార్మికులు రైతులు ఉమ్మడిగా నూతన ప్రజాస్వామిక విప్లవం తేవాలని మావో సూత్రీకరించి ఆ మేరకు కృషి చేసి విజయం సాదించాడు.

  అంటే మార్క్సిజం మార్క్సు సూత్రీకరణల దగ్గరే ఆగిపోలేదు. వ్యవస్ధలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందింది. మార్క్సిజం, మార్క్సిజం-లెనినిజం అయ్యింది. అది మార్క్సిజం-లెనినిజం-మావో ధాట్ గా అభివృద్ధి చెందింది. మార్క్సిజం పిడివాదం అనేవారికి ఇది సమాధానం.

  కనుక మార్క్సిస్టు సూత్రాలు సామాజిక పరిణామక్రమాలనుండి గ్రహించిన క్రమానుగత నియమాల సారాంశం. ఎవరు ఏ యిస్టు లైనా, ఈ సామాజిక నియమాలకి కట్టుబడి ఉండవలసిందే. నేనుండను అన్నా అది ఆచరణలో వీలు కాదు. హోళీ పండగరోజే రంగులు చల్లడానికి జనం పరిచయం లేకపోయినా అనుమతిస్తారు. కాని రోజు వచ్చి నేనీరోజు హోళీ జరుపుకుంటున్నా, రంగులు జల్లుతా అంటే జనం నాలుగిచ్చుకుంటారు. అంటే సామాజిక నియమాలకు ఒకరి ఇష్టాఇస్టాలతో నిమిత్తం లేదు. అవి జరిగిపోతుంటాయి. అయితే మనిషి చేయగల పని ఏమిటి? ఆ నియమాలను కనుగొని, పరిణామాలు ముందుకు సాగే క్రమంలో వాటిని వేగవంతం చేయడానికి తగిన చర్యలను మనిషి తీసుకోగలడు. ఏమిటా చర్యలు? విప్లవ సిద్ధికి ఒక వ్యవస్ధను ఏర్పరుచుకుని అందుకోసం కృషి చేయడం. ఆ కృషే కమ్యూనిస్టు పార్టీల ఏర్పాటు. ఆందోళనలు, ప్రజల సమీకరణ, వారి సహకారంతో సామాజిక మార్పుకు కృషి చేయడం. చేయకపోతే? ఆ పరిస్ధితి ఉండదు. మనిషి చేస్తాడు. ఎంతటి నిరాశామయ పరిస్ధితిలోనయినా మనిషి ప్రయత్నిస్తూనే ఉంటాడు. లేకుంటే సౌకర్యవంతమైన స్ధితి రాదు.

  ఇప్పటి సామాజిక మార్పులు ఒక జీవిత కాలంలో సాద్యం కాకపోవచ్చు. ఇపుడున్నవారు తమ కృషితాము చేస్తే తరువాతివారు అక్కడినుండి కృషిని అందుకుంటారు. ప్రజలు పూనుకోవడానికి కొన్ని సామాజిక పరిస్ధితులు కూడ అవసరమే. ఇప్పటి పరిస్ధితులు అందుకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని మార్క్సిస్టు లెనినిస్టులు భావిస్తున్నారు. కాని స్వీయాత్మక పరిస్ధితులు సిద్ధంగా లేవు. అంటే మార్పుని తలపెట్టాల్సిన కార్మికులు, రైతులు ఇంకా ఒకటి కాలేదు. పెట్టుబడిదారీ వర్గం వారు ఒకటికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నందున అవి దూరం జరుగుతున్నాయి. కాని మనిషి అది తలపెడతాడు. ఎప్పుడన్నదే సమస్య తప్ప వస్తుందాలేదా అన్నది సమస్య కాదు.

  చివరిగా చెప్పేది మానవ స్వభావం అనేది తనంతట తానే ఎక్కడా ఉండదు. మనిషి చుట్టూ ఉన్న సామాజిక పరిస్ధితుల భావాలు మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుపై ప్రతిబింబించినప్పుడు పుట్టేవే భావాలు. సమాజం నుండి పుట్టే భావాలు సామాజిక సూత్రాలకు అతీతంగా ఉంటాయనడం సరైంది కాదు. రాముడి కాలంలో పుష్పక విమానం అంటే ఆర్టిస్టులు ఎలా గీస్తారు? బోయింగ్ విమానం బొమ్మని గీయరు. నాలుగు స్తంభాలు గల మందిరం గీసి రెక్కలు తొడుగుతారు. రాముడి కాలానికి మనిషి ఊహించగల విమానం అదే. గాల్లొ ఎగిరేవాటికి రెక్కలుండాలి. రాజులు ప్రయాణించేది కనుక రాజమందిరం ఊహించి దానికి రెక్కలు తొడిగారు. మనిషి మెదడుకి తమ చుట్టూ ఉన్న పరిస్ధితులకు అతీతంగా ఊహలు, భావాలు సాధ్యం కాదని చెప్పడానికి ఇది. అలాగే ఒక మనిషి ఇస్టా ఇష్టాలు, అతని భావాలు, ఊహలు, ఆశలు అన్నీ సమాజ పరిదులకి లోబడే ఉండాలి ఉంటాయి కూడా. మనిషి భౌతిక పరిస్ధితికి అతీతంగా అతని ఊహలు, భావాలు ఉంటాయని భావిస్తే చాలా శాస్త్రాలని తిరగరాయాల్సి ఉంటుంది.

  అందువలన మనిషి స్వభావం ఊహాతీతంగా, సామాజిక నియామలకు అతీతంతా ఉండదని గ్రహించాలి. అది గ్రహించాక ఇతర అనుమానాలన్నీ దూదిపింజల్లా తేలిపోవలసిందే.

  బొందలపాటిగారు దీనితో సమాధాన పడగలరని నేను భావించడం లేదు. కానీ చర్చ మొదలైంది కదా, అది శుభ సూచకం.

 5. శేఖర్ గారు,
  మీ సుదీర్ఘమైన సమాధానానికి ధన్య వాదాలు. మీ సమాధానం వలన మార్క్సిజం గురించి నాకున్న నాలెడ్జ్ కొంత పెరిగిందని ఒప్పుకోక తప్పదు. ముఖ్యం గా ఇది ఒక యుటోపియా కాదనే దాని గురించి.
  మనిషి స్వభావం లో సమాజం పరిధి లో లేని అంశాలు కొన్ని ఉంటాయి (అన్నీ కాదు). కొన్ని బయాలజీ లో మూలాలు ఉన్న అంశాలు (ఉదా: వ్యక్తిగతమైన అధికారం కోసం తపన), కొన్ని మైండ్ యొక్క బయో కెమిస్ట్రీ కి సంబంధించిన విషయాలు (కొత్త వాటిని కోరుకోవటం, పాతవి బోర్ కొట్టటం). భండారు శ్రీనివాస రావు గారు రష్యా లో కమ్యూనిజం నుంచీ కాపిటలిజం కి మారిన కాలం లో ఉన్నారు. వారు తన అనుభవాల గురించి రాసిన వ్యాస పరంపర ఇక్కడ ఉంది.
  http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_07.html

  ఆయన గమనించిందేమంటే, కమ్యూనిస్ట్ రష్యా లో ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలూ ఉన్నా, వారి లో “బయటి ప్రపంచం ఏదో ముందుకు వెళ్ళిపోతోందనే” అసంతృప్తి ఉండేదనీ, (లోకమంతా డీవీడీ లు ఉపయోగిస్తుంటే తాము బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తున్నాం), అలానే, వ్యక్తిగతమైన పరమార్ధ సాధన ఏదో తమ జీవితాలలో మిస్ అయిందనే భావన కూడా ఉంటుందనీ రాశారు. వీలయితే ఆ సెరీస్ ఒక సారి చదవండి.

 6. శేఖర్ గారు,

  మీరు చెప్పే విషయాలతో నేను పూర్తిగా ఏకీభవించలేక పోవచ్చు. కాని మర్క్సిజం మీద మీకున్న కమిట్‌మెంటుకు, సాధికారతకు, విషయాన్ని వివరించి చెప్పడంలో మీకున్న నేర్పు, ఓపికను మెచ్చుకోకుండా వుండలేక పోతున్నాను. ముఖ్యంగా ప్యాంట్ అనాలజీ, మానవస్వభావాల గురించి చక్కగా వివరించారు.

 7. నాగ మురళి గారు, మీ కధ ధోరణి చూశాకే మీ ఈ మొదటి కామెంటే ప్రచురించకూడదని భావించాను. కాని ఎక్కడో ఓ మూల నమ్మకం నన్నా పని చేయనీయ లేదు. మీ వాదనకు సమర్ధనగా మీవద్ద పాయింట్లేమీ లేవంటూనే మీరు చెప్పదలుచు కున్నది చెప్పాలనుకోవడం, చెప్పేసి వదిలించుకోవడం… బాగుంది. దానిలో మీకు సహజంగానే తప్పులేవీ కనిపించవు. సమర్దనకు పాయింట్లేమీ లేకుండానె మీరు నమ్మదలచుకున్నది నమ్మే హక్కు మీకుంది.
  కాని నా సైట్ నుండి అర్ధం లేని మీ కధకు లింక్ అందించడం నాకు ఇష్టం లేదు. మీ మొదటి కామెంటు కూడా తొలగిస్తున్నాను. అన్యధా భావించొద్దు. నాకు తెలుసు మీరు భావించరని.
  ఆల్ ది బెస్ట్!

 8. విశేఖర్ గారూ! మీ రుణ సంక్షోభం టపా సంగతేమో కానీ, ఈ సందర్భంగా మార్క్సిజం గురించి మీరు వివరించిన వ్యాఖ్య చాలా చక్కగా ఉంది.

  విషయం తెలిసివుండటం వేరు. దాన్ని స్పష్టంగా వివరించగలగటం వేరు. మీరు వివరించిన విధానానికి నూటికి నూరు మార్కులు వేయొచ్చు. దీన్ని ప్రత్యేకంగా టపాగా ఇవ్వండి. బాగుంటుంది!

 9. మీరింకా రాలేదేంటా అని ఎదురుచూస్తున్నాను వేణు గారు. నా ఎదురుచూపు వృధా కాలేదు చూడండి. బహుశా మీరు సూచిస్తారని ముందే ఊహించానేమో, ఇప్పుడే దాన్ని టపాగా మార్చాను. సమాధానంగా రాసిన కొన్ని సందర్భాలను టపాకి అనుగుణంగా కొద్దిగా మార్చి రాశాను. ఈ సందర్భంగా బొందలపాటిగారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది.

  బొందలపాటిగారూ, మీకు కృతజ్ఞతలు. మీకు సవివరంగా సమాధానం ఇవ్వాలని అనిపించింది గనక మరో కొత్త టపా పుట్టింది.

 10. Visekhar garu,
  i appreciate your knowledge on Marxism . Thanks for giving such a detail explanation .
  Here one more article which supports your article ( found in palavelli Blog)

  Marx was right; capitalism can destroy itself: Roubini

  Nouriel Roubini cited an even more controversial economist than himself this week when explaining the state of the world’s turbulent economy.

  “Karl Marx got it right, at some point capitalism can destroy itself,” said Mr. Roubini, in an interview with the Wall Street Journal. “We thought markets worked. They’re not working.”

  Mr. Roubini also said there is more than a 50% chance the world will plunge into another global recession and the next two to three months will reveal the economy’s direction.

  “We are at stall speed right now, and we do not know if we are going to go up, or down,” he said.
  Known as Dr. Doom for his prediction of the 2008 financial crisis among other dire forecasts, the economist said more monetary policy is needed from central banks to avoid another meltdown.

  “There could be QE3, QE4, QE5 in the long-haul,” in the United States, he said.
  But monetary policy alone will not be enough, and business and governments are not helping.
  Developed economies such as the United States and countries in the eurozone are implementing austerity programs to try to fix their debt-ridden economies, when they should be introducing more monetary stimulus, he said.
  And by slashing labour costs and sitting on capital, U.S. businesses have created a “catch-22.”
  “Because you cannot keep shifting income from labour to capital without not having excess capacity and lack of aggregate demand. And that’s what’s happening,” the economist said.
  In the wide-ranging interview, Mr. Roubini said it is possible that Italy or Spain could choose to leave the eurozone within five years. He also didn’t disagree with the premise of Standard & Poor’s controversial downgrade that the United States was on a unsustainable fiscal path, made worse by Washington’s gridlock.

  Roubini says he’s putting his money in cash, with U.S. Treasurys a smart bet. “Now is not the time for risky assets,” he said.

 11. ఎన్.ఆర్.బాబు గారు,
  నౌరుబి, జోసెఫ్ స్టిగ్లిట్జ్ లు ఇద్దరూ అమెరికా ప్రభుత్వలు, కార్పొరేట్లు అనుసరిస్తున్న విధానాలు సరైనవి కాదని అవి మరింత సంక్షోభానికి దారి తీస్తాయని సంక్షోభం ముందునుండీ చెబుతున్నా వాళ్ళు వినిపించుకోవడం లేదు. నౌరుబి అన్నట్లు పెట్టుబడిదారీ వ్యవస్ధ తనని తాను నాశనం చేసుకోవడంలో భాగమే ఇది. కాని కార్మికవర్గ విప్లవాలకు దారి తీయగల పరిస్ధితులు ఏవీ లేకపోవడం, ఆ పరిస్ధితులు తేగల వారు అత్యంత బలహీనంగా ఉండడం నేటి దౌర్భాగ్యం. వారే ఉన్నట్లయితే పరిస్ధితి ఆశాజనకంగా ఉండేది. నౌరుబి చెప్పిన విషయాలు అమెరికా పరిస్ధితికి బాగా అద్దం పడుతున్నాయి. ఆ సమాచారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

 12. సందర్భవశాత్తు, సందర్బోచితంగా నా పేరు, నా బ్లాగు ప్రస్తావన తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు – భండారు శ్రీనివాసరావు,హైదరాబాదు

 13. Visekhar Garu,
  mee prayatnam amogam. Evaro mimmalni, edo ante feel avvadu. Enduku ante, mee lanti valla vislesana eee busy life people ki kavali. Don’t get dispointed at any stage, at any time. Vimarsa perutho vetakaramga titte vallaki ikkada chotu ledu ani cheppandi. Memu andaram me venka unnamu.

  Keep the things like this.

  Cheers,
  Subhas

 14. సుభాష్ గారూ చాలా ధాంక్సండీ, ఇలాంటి వ్యాఖ్యలతొ నాలాంటివారికి వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. కొన్ని సార్లు అనవసరం అనుకుంటూనే స్పందిస్తుంటాను. వాటిని కట్టెపెట్టాడానికి ప్రయత్నిస్తాను. నిజానికి రోజూ ఎవరొకరూ దూషిస్తూ రాస్తున్నారు. అన్నీ భరిస్తూ ఒక్కోసారి బరస్ట్ అవుతున్నా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s