అమెరికా క్రెడిట్ రేటింగ్ ప్రభావం నుండి తేరుకుని మంగళవారం అమెరికా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు లాభాలు చవి చూశాయి. కాని ఆ ఆనందం బుధవారానికి అవిరైపోయింది. యూరోజోన్లో రెండవ శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్ధ కలిగి ఉన్న ఫ్రాన్సు కూడా యూరప్ అప్పు సంక్షొభం బారిన పడనుందని అనుమానాలు బలంగా వ్యాపించాయి. దానితో యూరప్, అమెరికా ల షేర్ మార్కెట్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు గురైనాయి. రుణ సంక్షోభం దరిమిలా ఫ్రాన్సు క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గిపోతుందన్న భయాలు వ్యాపించాయి. ఫ్రాన్సు యూరోజోన్ లోనే కాకుండా, యూరప్ లోనూ, ప్రపంచంలోనూ అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటి. ఆఫ్రికా పలు దేశాలను నయా వలసలుగా మార్చుకున్న ఫ్రాన్సు క్రెడిట్ రేటింగ్ తగ్గడం అంటే అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గుదల ప్రభావం తర్వాత అంత ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడుతుంది.
బుధవారం ప్రారంభంలో యూరోపియన్ షేర్లు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రభావం వలన కలిగిన నష్టాలను కొంత పూడ్చుకున్నాయి. కాని అమెరికా తర్వాత క్రెడిట్ రేటింగ్ తగ్గిపోయే తదుపరి దేశం ఫ్రాన్సు అని నివేదికలు వెలువడడంతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఉదయం సాధించిన లాభాలను అధిగమిస్తూ దాదాపు 5 శాతం వరకూ మార్కెట్లు పతనం అయ్యాయి. ప్రధానంగా బ్యాంకింగ్ సూచిలు తీవ్రంగా నష్టపోయి ఇతర షేర్లను గూడా కిందికి లాగాయి.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ఇప్పుడు జంట రుణ సంక్షోభాల ముంగిట ఉంది. ఒకటి యూరప్ రుణ సంక్షోభం కాగా, మరొకటి అమెరికా రుణ సంక్షోభం. ఇవి రెండూ పెట్టుబడిదారీ వ్యవస్ధ అందించే సుఖభోగాలకు కాణాచిగా పేరెన్నిక గన్న అభివృద్ధి చెందిన దేశాలే. అయినా సంక్షోభాలకు వీరి వద్ద పరిష్కారాలు లేవు. సంక్షోభాలు సంభవించినపుడు కార్మిక వర్గంపై మరింతగా దోపిడీ తీవ్రత పెంచడమే తప్ప తమవైపు నుండి ఏ పరిష్కారం చూపలేని పెట్టుబడిదారీ వ్యవస్ధ గుప్పెట్లొ యూరప్, అమెరికాలు ఉన్నాయి. జంట రుణ సంక్షోభాలు ప్రపంచాన్ని మరోసారి “ది గ్రేట్ రిసెషన్” వైపుకి తీసుకెళ్తాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. లేమాన్ బ్రదర్స్ దివాలా తీసిన నాటి పరిస్ధితులు ఏర్పడతాయని వారు భయాందోళనలకు గురయ్యారు.
షేర్లలో పెట్టుబడులు ఉంటాయో, ఊడతాయో అన్న భయాలతో షేర్లు అమ్మేసి ఇన్వెస్టర్లు బంగారం కొనేస్తున్నారు. బంగారంలో పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయన్న భరోసాతో వారు షేర్లనుండి పెట్టుబడులు ఉపసంహరించి బంగారంలో పెడుతున్నారు. దానితో షేర్ మార్కెట్లు పతనమవుతుండగా, బంగారం ధరలు మిన్నంటుతున్నాయి. యూరో కరెన్సీ విలువ రెండు అమెరికన్ సెంట్ల మేరకు పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధినేత బెర్నాంక్ తమ వడ్డీ రేటుని 2013 వరకూ లేదని ప్రకటించడంతో జర్మనీ షేర్ల సూచి డి.ఎ.ఎక్స్ ప్రారంభంలో లాభపడింది. స్పెయిన్, ఇటలీలతో పాటు ఇతర సంక్షుభిత దేశాల బాండ్లను యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కొనుగోలు చేయడం వలన కూడా షేర్ల సూచి ప్రారంభంలో లాభపడింది.
మధ్యాహ్నానికల్లా ఫ్రాన్సు క్రెడిట్ రేటింగ్ తగ్గనున్నదన్న సమాచారం వెల్లడయ్యింది. టాప్ రేటింగ్ AAA కోల్పోయిన అమెరికా, న్యూజీలాండ్, బెల్జియం దేశాల సరసన ఫ్రాన్సు చేరుతుందని వార్తలు వ్యాపించాయి. దానితో జర్మనీ సూచి డి.ఎ.ఎక్స్ 5.13 శాతం నష్టపోయి 5613.42 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బ్రిటన్ సూచి ‘ఎఫ్.టి.ఎస్.ఇ 100’ 3.1 శాతం నష్టపోయి 5007.16 వద్ద క్లోజయ్యింది. స్పెయిన్ సూచి ‘ఇడెక్స్-35’ 5.49 శాతం పతనమై 7966 వద్ద క్లోజయ్యింది. ఇటలీ సూచి ‘ఎఫ్.టి.ఎస్.ఇ ఎం.ఐ.బి’ 6.7 శాతం నష్టపోయింది.
ఫ్రాన్సు ప్రభుత్వం ఇతర దేశాల లాగానే తమ క్రెడిట్ రేటింగ్ తగ్గుతుందని చెప్పడం పూర్తిగా ఊహాగానాలే నని తెలిపింది. ఐతే ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజీ సెలవుల్ని రద్దు చేసుకుని పారిస్లొ అత్యవసర కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం తోనే అసలు పరిస్ధితి వెల్లడవుతోంది. మీటింగ్ తర్వాత సర్కోజి, తమ ప్రభుత్వం బడ్జెట్ లోటు తగ్గించడానికి అన్ని చర్యలనూ తీసుకుంటోందనీ, ఆగస్ఠు 24 తేదీన తాజాగా పొదుపు చర్యల బిల్లుని ప్రతిపాదిస్తామని ప్రకటించాడు. అయినప్పటికీ ఫ్రాన్సు షేర్ల సూచి సి.ఎ.సి 5.5 శాతం పడిపోయి 3331 వద్ద క్లోజయ్యింది. ఫ్రాన్సు, ఇటలీల బ్యాంకులు పతనానికి నాయకత్వం వహించాయి. ఫ్రాన్సులో రెండవ పెద్ద బ్యాంకు ‘సొసైటె జనరల్’ షేరు, ఘోరంగా 22.5 శాతం పడిపోగా, బి.ఎన్.పి పరిబాస్ బ్యాంక్ షేరు 14 శాతం పడిపోయింది.
ఫ్రాన్సు జులై 21 న కుదిరిన యూరోపియన్ ఒప్పందం మేరకు రుణాలన్నీ రద్దు చేస్తుందన్న భయం మదుపుదారులలో వ్యాపించింది. గ్రీసు దేశ రుణాలను రీ షేడ్యూల్ (రీ స్ట్రక్చర్) చేయడం వలన సొసైటె జనరల్ బ్యాంకు 534 మిలియన్ యూరోల మేరకు నష్టపోనున్నది.
సంక్షోభాలు సంభవించినపుడు పామరుల లెక్కన నోటి కొచ్చిన కారణాలు పరిష్కారాలు చెప్పడం తప్ప పెట్టుబడిదారీ సంక్షోభాలు రాకుండా ఉండడానికి ఫలనా చెయ్యాలి అని ఒక్కడంటే ఒక్క ఆర్ధిక సిద్ధాంతకారుడు కూడా చెప్పలేదు. చెప్పలేరు కూడా. ఎందుకంటే సంక్షోభాలు పెట్టుబడిదారీ వ్యవస్ధల లక్షణాలు. అవి పుట్టుకతోనే వైరుధ్యాలమయం. విపరీతమైన ఆదాయాల అంతరాలు వాటి సొంతం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే సకల సుఖ భోగాలు ఒకవైపూ, రోజుల తరబడి తిండికి లేక పస్తులుండే కోట్లాది శ్రమజీవుల బాధల గాధలు మరోవైపు చాలా సహజంగా కనిపించే వ్యవస్ధ పెట్టుబడిదారీ వ్యవస్ధ. లాభాపేక్షతో కరుడు కట్టిన పెట్టుబడిదారుడు కరువు, దుర్భిక్షాలను సృష్టిస్తాడే కానీ మానవత్వాన్ని దరిచేయనీయడు.

సగం తెలిసి సగం తెలీని (అంటే మిడి మిడి జ్ఞానం అన్న మాట) వ్రాతలతో ఏదో నెట్టు కొచ్చేస్తున్నారు. కానీండి.
సన్నాసీ! నీ కేమైనా తెలిసుంటే చెప్పు లేదా తప్పులుంటే ఎంచు! చదివి తరిస్తాం. నిరంతరం పేర్లు మార్చుకుంటూ ఎందుకు నీ బతుకు? అసహ్యంగా?
తమరితో నాకసలు పరిచయమే లేదు. అయినా వ్యక్తిగతంగా దూషించడానికి ప్రత్యేకంగా బ్లాగే పెట్టేశావు. అయినా తృప్తిలేదా దరిద్రుడా? నిలువెల్లా ద్వేషం నింపుకుంటే అంతే. ఎన్ని వెధవ్వేషాలేసిన తృప్తి దొరకదు. నీ ఖర్మ! అనుభవించు.
తమ్మడు నీకు తెలిసి రాశావు అందులో తప్ప్ఉ లెదు వెదవల మాటలు పట్టించుకోకు
కృతజ్ఞతలు రాజుగారూ. మీలాంటి వారి మద్దతు బ్లాగర్లకు చాలా అవసరం.
గత నాలుగైదు నెలల్నుండి వీళ్ళది ఇదే వరస. చెత్తబుట్టలోకి నెట్టేస్తున్నా వీరి వెధవతనానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది.
మీరు చెబుతున్న పెట్టుబడి దారీ వ్యవస్థల సహజ లక్షణాలను గురించి, కీన్స్ నుంచి నేటిదాకా సంక్షోభాల పరిణామ క్రమాలను వివరిస్తూ ఈ సందర్భంగా వివరంగా రాయండి. 1997 నుంచే ఈ తరంలోనే మూడు నాలుగు సంక్షోభాలను కళ్లారా చూశాం కాబట్టి అవి వ్యవస్థకు సహజ లక్షణమా కాదా అనే సందేహానికి తావేలేదు. పుట్టంధువులు మాత్రమే వాస్తవాలను చూడటానికి నిరాకరిస్తారు.
మీకు చిన్న అభ్యర్థన. అవతలివాళ్లు దూషణ భూషణలకు దిగుతున్నారని మనం కూడా మన భాషను పాడు చేసుకోవలసిన పనిలేదు. మీరు నమ్ముతున్న దాన్ని నిజాయితీగా వ్యక్తీకరించండి చాలు. ఎవరేమన్నా మీరు సంయమనం కోల్పోవద్దు. ఉబుసుపోక వ్యాఖ్యలను లెక్క చేయవద్దు. నిబద్ధంగా మీరు రాస్తున్న రచనలను అంతే నిబద్ధంగా చదువుతున్నవాళ్లు మహానగరాలనుంచి మహారణ్యాల వరకు చాలామందే ఉన్నారు. మీ శక్తిని వారికోసం కేటాయించండి.
మీవైపు నుంచి ప్రతిదూషణలకు, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు చోటు ఇవ్వవద్దని మనవి. తెలుగులో సైద్ధాంతిక దృక్పథంతో కొనసాగుతున్న కొద్ది బ్లాగుల్లో మీది ఒకటి. ప్రపంచంలో గుడ్డి ద్వేషం అనేది ఎప్పట్నుంచో ఉంటోంది. దాని రెచ్చగొట్టే ధోరణులకు మీరెందుకు ప్రభావితం అవుతారు?
పెట్టుబడిదారీ సంక్షోభాల మూల కారణాలను కూడా తేలిక భాషలో వీలైనంత వివరంగా మరోసారి రాయండి. ప్రతి పదేళ్లకూ, ఇరవయ్యేళ్లకూ తెలుగువాళ్లకు పాత విషయాలనే మళ్లీ మళ్లీ గుర్తు చేయవలసిన అవసరం ఉందని కొడవటి కుటుంబరావు గారు చాలా కాలం క్రితమే అన్నారు.
నా చందమామ బ్లాగులో AP Media kaburlu అనే విభాగంలో మీ బ్లాగును చేర్చాను. -blaagu.com/chandamamalu-
మంచి విషయాలను సైద్ధాంతిక దృక్పథంతో తెలియజేస్తున్నారు. మీకు అభినందనలు.
ఒక ముందు మాట – విమర్శలకు భయపడే / బాధపడే మనస్తత్వం అయితే సరిగ్గా స్పష్టత లేని విషయాల్లో సొంత అభిప్రాయాలు చేర్చకపోవడం మంచిది. వార్తలు వార్తలు గా ఉండటమే మేలు. “నా తీరు మార్చుకోవలసిన అవసరం లేదు నేను వ్రాసేదంతా కరెక్టే” అని feel అయితే comments ని disable చేసి ఇష్టం వచ్చినట్లు వ్రాసుకోండి.
తప్పులెంచమని చెప్పారుగా. మచ్చుకి ఈ excerpt చూడండి:
>> ఇవి రెండూ పెట్టుబడిదారీ వ్యవస్ధ అందించే సుఖభోగాలకు కాణాచిగా పేరెన్నిక గన్న అభివృద్ధి చెందిన దేశాలే. అయినా సంక్షోభాలకు వీరి వద్ద పరిష్కారాలు లేవు. సంక్షోభాలు సంభవించినపుడు కార్మిక వర్గంపై మరింతగా దోపిడీ తీవ్రత పెంచడమే తప్ప తమవైపు నుండి ఏ పరిష్కారం చూపలేని పెట్టుబడిదారీ వ్యవస్ధ గుప్పెట్లొ యూరప్, అమెరికాలు ఉన్నాయి. జంట రుణ సంక్షోభాలు ప్రపంచాన్ని మరోసారి “ది గ్రేట్ రిసెషన్” వైపుకి తీసుకెళ్తాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
సంక్షోభానికి పరిష్కారం లేదని మీరు ఎలా decide చేసేసారు? పెట్టుబడిదారి వ్యవస్థ ని చీల్చి చెండాడడమే వ్యాపకం గా పెట్టుకున్నట్లు ఈ blog post ని చూస్తుంటే అనిపిస్తోంది (చివరి పేరా కి అర్ధం పర్ధం లేదు ఆవేశం తప్ప). ఆ వ్యవస్థ వల్ల ఆయా దేశాలు ఎలా లబ్ది పొందాయో మీకు తెలీదా? ఇంకో విషయం – European countries కి US కి సహస్రం తేడా వుంది countries ఎలా operate అనే విషయం లో. రెంటిని ఒకే గాటన కట్టడం సముచితం కాదు. చివరిగా “ది గ్రేట్ రిసెషన్” కాదు “ది గ్రేట్ డిప్రెషన్” ఏమో? అన్నం వుడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మెతుకుని పట్టుకుంటే ఎలా సరిపోతుందో, తెలిసి తెలియని వ్రాతలు విషయం కూడా అంతే.