
అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను రాహుల్ శర్మను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాహుల్ శర్మ రాజ్ కోట్ కేంద్రంగా ఉన్న సాయుధ యూనిట్లకు డి.ఐ.జి గా పని చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా అధికార రహస్యాలను గుజరాత్ నరమేధంపై విచారణ జరుపుతున్న నానావతి కమిషన్ కు సి.డి రూపంలో అందించినందుకు గానూ రాహుల్ సస్పెన్షన్ కి గురయ్యాడు. త్వరలో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం ఛార్జిషీటు దాఖలు చేయనుంది.
2002లో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలపై నరమేధం సాగించిన కాలంలో రాహుల్ శర్మ, భావనగర్ జిల్లా సూపర్ఇన్‌టెండెంట్ గా పని చేస్తున్నాడు. రాహుల్ శర్మ హిందూ మతోన్మాదుల దుశ్చర్యలను గట్టిగా నిలువరించడంతో ఆ జిల్లాలో ముస్లింలకు గండ తప్పింది. భావనగర్ పట్టణంతో పాటు ఆ జిల్లాలోని ఏ ప్రాంతంలో కూడా ముస్లింలపై దాడులు జరగకుండా రాహుల్ గట్టి చర్యలు తీసుకున్నాడు. దానితో ఆయనని అత్యవసరంగా అహ్మదాబాద్ లోని పోలీస్ కంట్రోల్ రూంకి రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. మే 2002 నెలలో అహ్మదాబాద్ లోని నరోద్ పాటియా ముస్లింలపై జరిగిన హత్యాకాండ కేసులో విచారణకు సహాయం చేయవలసిందిగా రాహుల్ శర్మని నియమించారు.
తనకు అప్పజెప్పిన బాధ్యతలో భాగంగా రాహుల్ శర్మ, హత్యాకండ కాలంలో ముఖ్యమైన ఫోన్ నెంబర్లకు సంబంధించిన కాల్స్ వివరాలను సేకరించాడు. దానితో అక్కడినుండి కూడా రాహుల్ ని బదిలీ చేశారు. ఆయన సేకరించిన ఫోన్ సంభాషణల వివరాలు, హత్యాకాండలో పాల్గొన్న కీలకమైన నాయకులకు సంబంధించినవి కావడంతో నేరాల రుజువుకి అవి కీలక సాక్ష్యంగా మారాయి. రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ ఉన్నత స్ధానాల్లో ఉన్న అధికారులతో పాటు, పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు కూడా రాహుల్ సేకరించిన వివరాల్లో ఉన్నాయి.
ఈ సంభాషణల రికార్డులు, వాటి విశ్లేషణలతో, ప్రత్యక్ష సాక్షుల కధనాలు సరిపోలడంతో సుప్రీం కోర్టు నియమించిన “స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీం” ముఖ్యమైన నేరస్ధులను 2009లో అరెస్టు చేయగలిగింది. రాహుల్ సంపాదించిన వివరాల ద్వారా అరెస్టయిన వారిలో మాజీ మంత్రి మాయా కొడ్నాని, విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ జయదీప్ పటేల్ లు కూడా ఉన్నారు. నానావతి కమిషన్, రాహుల్ ని హాజరు కావలసిందిగా సమన్లు జారీ చేసినపుడు ఆయన తాను సేకరించిన వివరాలను సి.డిలలో కమిషన్ కి అందించాడు. గత ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా వివరాల సి.డిని నానావతి కమిషన్ కి ఇచ్చినందుకు చర్య ఎందుకు తీసుకోకూడదో వివరించాలని ఆ నోటీసులో ప్రభుత్వం కోరింది.
రాహుల్ శర్మ, సంజీవ్ భట్ లాంటివారిపై కేసులు నమోదు చేయడం ద్వారా ఇతర అధికారులెవ్వరూ గుజరాత్ అల్లర్లకు సంబంధించి నిజాలను బైటపెట్టకుండా చూడాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి భావిస్తున్నట్టు ఉంది. ముస్లింలపై వీరు వ్యక్తం చేసే ద్వేషం, వారిపై సాగించే మారణకాండలు అలాంటి చర్యలకు చప్పట్లు కొట్టేవారున్నంతవరకే. సమావేశాల్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేశాక రాజ్యాంగ సంస్ధలు అలా ఎందుకు మాట్లాడరని అడిగితే ‘తాము మాట్లాడింది నిజమే’ అని అంగీకరించగల ధైర్యం వీరికి ఉండదు. మారణకాండను ప్రత్యక్షంగా పర్యవేక్షించడమే కాక నరోద్ పాటియా లో స్వయంగా తన తుపాకితో పలువురిని కాల్చి చంపిన మాయా కొద్నాని, కోర్టునుండి సమన్లు అందుకున్నాక నెలరోజుల పాటు ఇంటికి రాకుండా తప్పించుకు తిరిగింది. ముందస్తు బెయిల్ ని రద్దు చేసేదాకా ఆమె కోర్టులో లొంగిపోలేదు.
వీళ్ళ అగ్రనాయకుడు లాల్ క్రిష్ట అద్వానీ అయితే అనేక సార్లు తాను చేసినదాన్ని చేయలేదనీ, చెయ్యనిదాన్ని చేశానని పచ్చి అబద్ధాలు అడిన చరిత్ర ఉంది. 1940ల చివరిలో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సాయుధులై నిజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని అందరికీ తెలిసిన విషయం. ప్రజలపై రజాకార్లు సాగించిన అకృత్యాలపై కమ్యూనిస్టు పార్టీ ప్రజలతోనే తిరుగుబాటు చేయించింది. ప్రజలు చేతికి అందిన ఆయుధం పట్టుకుని నిజాం నవాబు ప్రవేటు సైన్యం రజాకార్లపై పోరాడితే వారికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు నాయకత్వం వహించారు. కాని ఎల్.కె అద్వాని దృష్టిలో కమ్యూనిస్టు పార్టీ రజాకార్లతో కుమ్మక్కు అయ్యింది. 1990 ల చివరిలో ఆయన ఓ సారి ఎ.పి వచ్చి తెలంగాణ జిల్లాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ రజాకార్లతో కుమ్మక్కైందని ప్రకటించి నవ్వులపాలైనారు.
బాబ్రీ మసీదు ని కూల్చి రాముడికి గుడి కట్టాలని రధ యాత్ర చేసిన వ్యక్తి ఎల్.కె అద్వానీ. రధయాత్ర మార్గంలో మతకల్లోలను రెచ్చగొట్టి మానవహననానికి కారణమైన వ్యక్తి అద్వానీ. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అక్కడే ఉండి “ఔర్ ఎక్ ధక్కా…” అంటూ ప్రోత్సహీంచిన వ్యక్తి ఎల్.కె.అద్వానీ. ఆ వివరాలను పత్రికలు రికార్డు చేశాయి. కానీ మసీదు కూల్చివేతపై లిబర్‌హాన్ కమిషన్ ముందు సాక్ష్యం ఇవ్వమనేసరికి “నాకు తెలియదు” అన్నాడు. తానసలు అక్కడ లేనని చెప్పాడు. కూల్చివేత జరగకుండా ఉండాల్సిందనీ, తానక్కడ ఉంటే నివారించే వాడిననీ కూడా అన్నాడు. అలా అని వి.హెచ్.పి, ఆర్.ఎస్.ఎస్ ల ఆగ్రహానికి కూడా అద్వాని గురయ్యాడు.
వీరందరిదీ ఒక ఎత్తయితే నరేంద్రమోడి ఒక్కరే ఒక ఎత్తు. “హిందువులు ప్రతీకారాన్ని కోరుకుంటున్నారు” అని బహిరంగంగా ప్రకటించి గోధ్రా అనంతర హత్యాకాండను ప్రోత్సహించిన నరేంద్ర మోడి అవన్నీ పరీక్షకు నిలవాల్సి వచ్చేసరికి గజ గజ వణుకుతున్నాడు. ముస్లింలు గోధ్రా రైలు దహనానికి పాల్పడడంతో హిందువులు ప్రతీకారం తీర్చుకుంటున్నారని సమర్ధించిన నరేంద్ర మోడి అదే విషయాన్ని కోర్టులో ధైర్యంగా చెప్పి తనవంటూ చెప్పే సిద్ధాంతాలపై నిలబడి ఉన్నానని చెప్పగలిగితే అందరూ కాకపోయినా కొందరి దృష్టిలో అయినా హీరో అయిఉండేవాడు. కాని గుజరాత్ ముస్లింల మారణకాండ ను ప్రస్తావిస్తేనే నరేంద్ర మోడికి చెమటలు పడుతున్నాయి. లేకుంటే చట్టబద్ధంగా ఏర్పడిన నానావతి కమిషన్ కి హత్యాకాండ సాక్ష్యాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకిచ్చావని అడగడం ఎక్కడన్నా చూశామా?
కోర్టులు ఈ ప్రభుత్వాల అక్రమాలు, అన్యాయలు ప్రశ్నిస్తున్నకొద్దీ రాజకీయ పార్టీలకు రాజ్యాంగం, రాజ్యాంగ సూత్రాలూ గుర్తుకొస్తున్నాయి. విదేశాల్లో దాచిన నల్లడబ్బుని వెనక్కి తేవడానికి స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీం ని సుప్రీం కోర్టు నియమిస్తే, ప్రభుత్వ ఆర్ధిక విధానాలలో జోక్యం చేసుకునే హక్కు కోర్టులకు లేదని వాదిస్తూ కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం ఆ కోవలోనిదే. బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన కార్పొరేట్ ప్రముఖులు పేర్లు చెప్పమంటే దేశ భద్రతకు ముప్పు అని పార్లమెంటులోనే ప్రకటిస్తారు. మంత్రులు, అధికారులు, న్యాయవ్యవస్ధ అవినీతిపై లోక్ పాల్ ని నియమించడానికి నలభై ఏళ్ళనుండి వీరికి తీరిక దొరకలేదు. కోరలు పీకిన పనికి రాని బిల్లుని తెచ్చి లోక్ పాల్ చట్టం తెస్తున్నాం అంటున్న వీరు నరేంద్రమోడి దారుణాలకంటే తక్కువేమీ తినలేదు. నరేంద్రమోడి ప్రత్యక్షంగా మారణకాండకు పాల్పడితే ఇతరులు తమ ఆర్ధిక విధానాల ద్వారా అంతకంటే ఎక్కువే మారణకాండకి, కరువు దుర్భిక్షాలకీ కారణమవుతున్నారు.

గోధ్రా రైలు దుర్ఘటన చాలా చిన్న సంఘటన .హన్నా!ఈ చాలా చాలా చిన్న సంఘటనను అడ్డు పెట్టుకుని హింత పని చేస్తావా నరేంద్రమోడీ!
విజయమోహన్ గారూ మీ అభిప్రాయం నేరుగా చెప్పి ఉంటే బాగుండేది.
గోధ్రా రైలు ఘటన వెనుక దుర్మార్గం స్ధాయిని నరేంద్రమోడి స్వయంగా ప్రతీకారం పేరుతో తక్కువ (చిన్నది కాదు) చేశాడన్న సంగతిని గుర్తించాలి. పెద్ద, చిన్న అనేవి వాటికవే ఉనికిలో ఉండ లేవు. అవి సాపేక్షికమైనవి. పక్కన చిన్నదొకటి ఉంటేనే ఏదైనా పెద్దదిగా పరిగణించబడుతుంది.
కానీ గోధ్రా ఘటన, ముస్లింల మారణ కాండ అలా పోల్చ దగ్గవి కావు. అవి రెండూ దుర్మార్గాలే. కానీ గోధ్రా దుర్మార్గం గురించి ప్రజలు చర్చించుకునే అవకాశం, చర్చించుకుని బాధపడే అవకాశం, బాధితులకు మానసికంగానైనా తోడు నిలవగల అవకాశం భారత ప్రజలకు లేకుండా ఎందుకు పోయింది? గోధ్రా ఘోరం జరిగాక ప్రజలు నిర్ఘాంతపోయారు. ఆ నిర్ఘాంతతనుండి, షాక్ నుండి ప్రజలు తేరుకొనే లోగానే అత్యంత నీచంగా ప్రభుత్వం పూనుకుని ఒక మతం వారిని కేవలం మతం పిచ్చతో ఊచకోత కోయడం ఏ నాగరికుడు/రాలు సమర్ధించ కూడని విషయం.
కనపడిన మహిళలను యధేచ్ఛగా రేప్ చేసి, మర్మాంగాల్లో కర్రలూ తదితరాలు గుచ్చి. గర్భిణి పొట్టని దారుణంగా కత్తితో చీల్చి, పారిపోతున్న ముస్లింలను పోలీసులు ఆపి హిందూ మతం పేరుతో చెలరేగుతున్న మూకలున్న వైపుకే పంపి, ఒక ఎం.పి ఇంటిపైకే దాడి చేసి కుటుంబాన్నంతా తలుపులు వేసి బంధించి మరీ సజీవ దహనం చేసి… ఇవన్నీ ఎలా సాధ్యం? ఎక్కడ సాధ్యం? ఎప్పుడు సాధ్యం? మద్యయుగాల్లో ఇవి జరిగాయని ప్రాధమిక తరగుతుల్లో చెబుతుంటే, విని భయవిహ్వలురైన వాళ్ళు తమ కళ్ళెదుటే నాగరిక యుగంలో కూడా జరుగుతుంటే… నమ్మలేని పరిస్ధితి.
ప్రతీకారంగా ముస్లింలపై ఊచకోత జరగకుండా ఉన్నట్లయితే దేశం అంతా గోధ్రా దుర్మార్గాన్నే తలచు కుంటూ ఉండేది. గోధ్రా దోషులకు శిక్ష పడాలని కోరుకుంటూ ఉండేది. గోధ్రా బాధితులకు అన్ని విధాలా సాయం చేయాలని తపన పడుతూ ఉండేది. కాని నరేంద్ర మోడి అనే ఒక పచ్చి నరరూప రాక్షసుడు భారత దేశానికి అటువంటి అవకాశం లేకుండా చేశాడు. గుర్తించగలరా ఆ విషయాన్ని?
ఇదంతా జరిగాక కూడా నరేంద్రమోడిలో గొప్ప నాయకుడ్ని చూస్తున్న భావ దారిద్రం ఇకనైనా అంతం కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా, విజయ మోహన్ గారూ!
గోధ్రా రైలు దహనం అత్యంత హేయమైన చర్య అనేదాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. దానికి బాధ్యులు ఎవరైనా సరే వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిందే.
కాని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, చర్య-ప్రతిచర్య సిద్ధాంతాలతో ఓ మతస్థుల మీదికి అల్లరిమూకల్ని ఉసిగొల్పి కొన్ని వేల మంది చావుకు కారణమవడం మాత్రం అత్యంత దారుణం. అదేం కలికాలమో కానీ, మతం మత్తులో కళ్ళు మూసుకుపోయి కొందరు ఇతన్ని వెనకేసుకొస్తున్నారు. అలనాడు హిట్లర్ ని కూడా, తమని కాపాడడానికి దేవుడే దిగివచ్చాడన్నట్లుగా కీర్తించారు చాలా మంది నాజీలు. యుద్ధం ముగిశాక కానీ అర్థం అవలేదు అతని వల్ల తమ జాతిపై ,ఆ మాటకొస్తే మొత్తం మానవ జాతిపై పడ్డ రక్తపు మరకలు. మోడీకి కూడా అదే గతి పడుతుంది. దేవుడు 100 తప్పులు చేసే వరకు శిశుపాలుడ్ని వదిలేసినట్లుగా, ప్రస్తుతానికి ఇతని హవా నడుస్తుంది.. సత్యమేవ జయతే.
విశేఖర్ గారూ, గోద్రా అల్లర్ల ముందూ, అల్లర్లు జరిగిన తర్వాత గుజరాత్ పరిస్థితిని కూడా మీరు సమీక్షిస్తే బావుండేది. మనిషికి నచ్చజెప్పడానికి ఒక మాధ్యమం వుంటుంది, జంతువులకి నచ్చజెప్పడానికి ఒక మాధ్యమం వుంటుంది. వేరే మతాల వాళ్ళకి చీమ కుట్టినా తాండవాలు చేసే కుహునా లౌకిక వాదులు సొంత మతం వాళ్ళు తగలబడి పోతున్నా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోడం అమానుషం. ‘వార్తలు ‘ అని చెప్పేటప్పుడు UNBIASED గా వుండాలని నా అభిప్రాయం. మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే, ‘ఇది నా అభిప్రాయం’ అని చెప్పండి కానీ మీ అభిప్రాయాన్నే ఒక వార్త లా ప్రచారం చెయ్యడం ఎంతవరకూ సమంజసమో, విజ్ఞులు, మీకే తెలియాలి.
విజ్ఞులైన యజ్ఞ గారికి
వేరే మతం, సొంత మతం అని మీరంటున్నారు గానీ, ఒక సారి నరేంద్ర మోడీ, ‘క్రైస్తవుడని’ మాజీ ఎన్నికల అధికారి లింగ్డోని ఎత్తి చూపుతూ అందుకె సోనియాకి అనుకూలంగా వ్యవహరిస్తూన్నాడని విమర్శ చేసాడు. దానికి లింగ్డో ఇచ్చిన సమాధానం “ఇలాంటి వాళ్లకి అయితే ఈ మతం లేదా ఆ మతం అని భావిస్తారు తప్ప, మతాలకి అతీతంగా కూడా కొన్ని ఆరోగ్యకరమైన భావాలుంటాయని వీరికి తెలియదు. ఊహించను కూడా లేరు” అని.
నిమ్మకు నీరెత్తినట్లు కూచోకుండా, అవతలి మతం వాళ్ళని జంతువులుగా ఎంచి ఊచకోత కోయమని బహుశా హిందూమతం కూడా చెప్పదనుకుంటా కదండీ!
మీకు సాధ్యమేమో కానండీ, నాకస్సలు సాధ్యం కాదు. నేను చిన్నపట్నుండీ ముస్లింలను చూస్తున్నాను. వాళ్ళు భారతీయులుగా కంటే భిన్నంగా నాకెప్పుడూ కనపడలేదు. నేను ఏ క్లాసు చదివినా, ఎక్కడ చదివినా, ఒకటో క్లాసు నుండి నా చివరి చదువుదాకా అనేక మంది ముస్లింలు నాకు క్లాస్ మేట్లు. వాళ్ళు నాకు క్లాస్ మేట్లుగా, మిత్రులుగా, కొన్ని విశ్వాసాలున్న మనుషులుగా, అందరిలాగే వారూ కష్ట, సుఖాలు, భక్తీ, రక్తీ అనుభవించే వారిగానే నాకు కనిపించారు తప్ప జంతువులుగా నాకు ఒక్క క్షణం కూడా అనిపించలేదు.
ఇంకా చెప్పాలంటే… నేను ఆరో తరగతిలో ఓ సారి కూలికి వెళ్లాను మా క్లాస్ మేట్ పొలానికే. తను అగ్ర కులస్ధుడు. నేను కింది కులస్ధుడను. అక్కడ మా క్లాస్ మేట్ వాళ్ల తల్లిదండ్రులు నాతో ప్రవర్తించిన తీరు మీరు చెప్పినట్లు జంతువుల్ని తలపించింది. అయినా నేను వాళ్ళని జంతువులా చూడలేదు.
నాతోటి ఉద్యోగం చేసే కొలీగ్ ఇల్లు సగభాగం అద్దెకి ఇస్తున్నాడని తెలిసి వెళ్లాను ఇల్లు చూద్దామని. ఇల్లు చూపించమంటే ఆయన చూపించలేదు. వేరే వారికి ఇచ్చేసా అన్నాడు. అయితేనేం. కొలీగ్ ఇల్లు కదా చూద్దామని చూపించండన్నాను. చూపించలేదు. వేరే కొలీగ్ తో చెపితే అతను చెప్పాడు. అతను అగ్ర కులస్ధుడనన్న అహంభావం అనీ, కింది కులంవారికి ఇల్లు అద్దెకి ఇవ్వడనీ. పోనీ చూపించొచ్చు గదా అంటే, ఇల్లు మైల పడుతుందని చూపించడట! జంతువు కూడా ఇది పాటించదు కదా అనిపించింది. కానీ ఆయన్ని యధావిధిగా మనిషిగానే గౌరవించడం కొనసాగించాను గానీ జంతువు లెక్క చూడలేదు.
నేను ఇంటి కోసం వెతుకుతుండగా ఇంకా కొద్దిమంది నేరుగా కులమే అడిగారు. చెప్పాను. మొఖం మీదే తలుపేశారు. ఇదేంటి జంతువులాగా, అని అనుకోకుండా ఉండలేకపోయాను. కానీ జంతువుని చూసినట్లు వారిని చూడలేకపోయాను, నేను చూడబడ్డాను గానీ.
మా తమ్ముడు బ్యాంక్ మేనేజర్. వేరే టౌన్ నుండి నేనుండే టౌన్ కి ట్రాన్స్ ఫర్ అయ్యాడు. ఇంటికోసం నేనే వెతికాను. మా తమ్ముడు చాలా మంది కంటె అద్దె ఎక్కువ చెల్లించగల స్తోమత గలవాడు. ఒక బ్రోకర్ ద్వారా ఒక ఇంటికి వెళ్ళాను. ఆయనా కులం అడిగాడు. చెప్పాను. అప్పుడేమీ అనలేదు. ఇవ్వనని కూడా చెప్పలేదు. తర్వాత బ్రోకర్ వచ్చి చెప్పాడు ఇవ్వడట అని. కారణం, ఆయన ఇంటికి అద్దెకి వచ్చేవారు అందంగా చూడబుద్ధి అయ్యేటట్లు ఉండాలనీ, కింది కులంవారు అలా ఉండరు గనక ఇవ్వను అని చెప్పాడట! బ్రోకర్ గారు, ఆ ఇంటాయనా ఒకే కులం. ఇంటాయన కుల భక్తిని బ్రోకర్ గారు కూడ ఈసడించుకున్నాడు. నాకు ఇంటాయన ప్రవృత్తి జంతు ప్రవృత్తిలా ఉందే అనుకోబోయి, బ్రోకర్ గారు గుర్తొచ్చి ఆగిపోయాను. ఇంటాయనని మళ్ళీ కలవడం తటస్ధపడలేదు. బ్రోకర్ గారు ఇప్పటికీ ఎదురైతే హల్లో అని అప్యాయంగా పలకరిస్తారు. ఇంకా ఎవరికైనా ఇల్లు కావాలంటే నాకు చెప్పండి క్షణాల్లొ చూసిపెడతాను అని చెబుతుంటారు. విషయం ఏంటంటే నా తమ్ముడూ, అతని భార్యా అందంగా ఉంటారు.
ఇవేవీ నేను ముస్లింల వద్ద ఎదుర్కొనలేదు యజ్ఞగారూ. ఎన్నడూ.
ఇప్పుడు చెప్పండి. నా మతం ఏది? నా సొంత మతం ఏది? పరాయి మతం ఏది?
మనిషిని మనిషిగా చూడగలితే ఏ వికారాలు ఉండవని నేను చూసి తెలుసుకున్న విషయం.
పోతే, ఒకసారి “బ్లాగ్ గురించి” చూడండి దయచేసి. వార్తలలో అంతర్లీనంగా నా విశ్లేషణ కూడా ఉంటుందని విన్నవించుకున్నాను.
విశేఖర్ గారూ,
ముందుగా, నా వ్యాఖ్యకి స్పందించినందుకు ధన్యవాదాలు.
నేను కొన్ని సంవత్సరాలనుంచి గుజరాత్ లో వుంటున్నాను. గోద్రా అల్లర్లకి ముందు గుజరాత్ ని చూశాను, తరవాతి గుజరాత్ ని చూస్తున్నాను. నా స్వానుభవంలో తెలుసుకున్నది నేను రాశానే తప్ప, జనరలైజ్ చేసి రాయలేదని విజ్ఞప్తి.
కులాల ముసుగులో వ్యక్తుల్ని ద్వేషించడం, మతాల పేరు చెప్పి ద్వేషించడం కన్నా తక్కువేం కాదని నా అభిప్రాయం.
ఇహ అసలు విషయానికి వస్తే, ఇప్పుడు కేకలేస్తున్న ఈ పోలీసు ఆఫీసర్లు అందరూ అల్లర్లు జరిగేటప్పుడు నిద్ర పోతున్నారా? దేనికి, ఎవడికి భయపడి అప్పుడు నోర్లు మూసుకుని కూర్చున్నారు? ఇప్పుడు ఏ తాయిలాలకి లొంగి ‘State government confidential information’ ని leak చేస్తున్నారు?
వీళ్ళకి ఐపీయస్ ట్రైనింగ్ లో చెప్పింది ఇదేనా, ఏదైనా అమానుషం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని విచారణ సమయంలో మొరగమనా?
సొంతలాభాలకోసం ఎంతకైనా తెగించే ఈ సంజీవ్ భట్ అనే మానవ మ్రుగాన్ని మీరు ‘నీతికీ, నిజానికీ కట్టుబడ్డ పోలీసు అధికార్ల’ అనేసరకి, నిజాలు కొంతవరకైనా తెలిసిన వాడ్ని కాబట్టి స్పందించా. సమయం దొరికితే సంజీవ్ భట్ గురించి నిజాలతో ఒక పోస్ట్ వేస్తారని ఆశిస్తున్నా.
నొప్పిస్తే మన్నించండి.
యజ్ఞ గారూ,
మీరన్నట్లు సంజీఫ్ భట్ స్వార్ధ ప్రయోజనాల కోసం ఎంతకైన తెగించే వ్యక్తి అయితే ఆయనకి నా పోస్ట్ టైటిల్ వర్తించదు. కాని, నరేంద్ర మోడి వ్యవహారాన్ని బైటపెట్టినందుకు ఆయన అభినందనీయుడు. రెండవ అధికారి రాహుల్ శర్మ అకృత్యాలు జరిగినప్పుడు తన జిల్లా పరిధిలో అవి జరగకుండా చూశాడనీ, అందువలనే ఆయన పదే పదే బదిలీ అయ్యాడనీ చదివాను. కనుక ఆయన మీ వర్ణన పరిధిలోకి రాడు. నా పోస్టు టైటిల్ పరిధిలోకి వస్తాడు.
అది, రాష్ట్ర ప్రభుత్వ రహస్య సమాచారం ఎలా అవుతుంది? పట్టపగలే ముస్లిం వారిపైన సాగించిన అకృత్యాలు అందరికీ తెలియలేదు. వాటిని వారు తెలియజేస్తున్నారు. అది రహస్య సమాచారం వెల్లడించడం కిందికి రాదని నా అవగాహన. పైగా రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ కి షో కాజ్ నోటీసు ఇచ్చి, ఏ గ్రౌండ్స్ మీద ఆధారపడి తనకు నోటీస్ ఇచ్చారో చెప్పమంటే చెప్పడానికి నిరాకరిస్తున్నారు. దానిపైన ఆయన ఆర్.టి.ఐ చట్టం కింద పిటిషన్ దాఖలు చేశాడు. ఒక వ్యక్తి పైన ఆరోపణలు చేసినప్పుడు ఎవరైనా ఆ ఆరోపణల పునాదిని తప్పని సరిగా వివరించాలి. అది చేయకపోగా, అడిగినప్పుడు కూడా చెప్పక పోవడం దేని కిందికి వస్తుంది? వాళ్ళనేరాలని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కాదా ఇది?
సంజీవ్ భట్ గురించి మీరు చెబుతున్న నిజాలు నాకు తెలియదు. మీరు మీ వ్యాఖ్యలో రాసి ఉంటేబాగుండేది. లేదా మీ బ్లాగు ఉంటే అక్కడైనా రాయండి నేనూ తెలుసుకుంటాను.
రాజకీయ నాయకులైనా, అధికారులైనా ప్రజలకే అంతిమంగా బాధ్యులు. అన్ని చట్టాలు, నిబంధనలు ఉన్నా అవన్నీ ప్రజల అధికారానికి లోబడి ఉండవలసిందే. ఇప్పటి చట్టాలు అనేకం పాలకుల నేరాలు ప్రజలకు సమాచారం తెలియకుండా దాచిపెడుతున్నాయి. అటువంటి చట్టాలను ఉల్లంఘించయినా ప్రజల ప్రయోజనాలు నెరవేర్చాలనీ, అందులో తప్పేమీ లేదనీ నా అభిప్రాయం.
మీరు నొప్పించారని కాదండీ. మీ వ్యాఖ్యని బట్టి స్పందించాను తప్ప, మీరు నొప్పించారని కాదు. మీ దగ్గర సమాచారాన్ని నాకు చెప్పడానికి ప్రయత్నించారు. అందుకు కృతజ్ఞతలు.